సాహిత్యలోజీవహింస
గొల్లపూడి మారుతీరావు
ప్రపంచంలో చాలామందికి పెద్ద వ్యసనం - క్రాస్ వర్డ్ పజిల్. మరో పెద్ద వ్యసనం - డిటెక్టివ్ సాహిత్యం.చాలా గొప్ప గొప్ప వ్యక్తులు, రచయితలు -డిటెక్టివ్ నవల చదవందీ నిద్రపోని సందర్భాలున్నాయి. అలవాటు కారణంగా 'గొప్పవారి ' జాబితాలో చేరడం దొంగదారి కాదనుకుంటే - నాకూ ఈ రెండు వ్యసనాలూ ఉన్నాయి.క్రాస్ వర్డ్ పజిలు లేని ఆదివారం వస్తే - విలవిలలాడుతాను. స్టానీ గార్డనర్, అగాధా క్రిస్టీ, కోనన్ డాయిల్, ఎడ్గార్ వాలెస్, పీటర్ చీనీ - ఇలా ఒకసారి కాదు, నాలుగయిదుసార్లు చదివిన నవలలున్నాయి.
ఏమిటి వీటి రుచి? కథలో దాచి పెట్టిన రహస్యాన్ని విప్పడానికి, రచయిత గడుసుదనాన్ని ఛేదించడానికి చేసే ప్రయత్నం, మనకి దొరకకుండా చివరిదాకా రచయిత అల్లే ఉచ్చులు - ఇవి తెలివితేటల్ని కితకితలు పెట్టే ఆట. నాలుగోసారి అదే నవల చదువుతున్నప్పుడు (ఉదా:అగాధా క్రిస్టీ 'ది మర్డర్ ఆఫ్ ఆర్ధర్ ఆక్రాయిడ్') ఎక్కడ రచయిత్రి మనల్ని దారి తప్పిస్తోందో, ఎలా ఆమె దింపే ముగ్గులోకి మనం నడుస్తున్నామో, ఏ రెండు వాక్యాలు రహస్యాని దాచడానికి కీలకమో - గుర్తుపడుతూ ఆనందపడుతూంటాను.
పరోక్షంగా అందించే 'ఆధారాలు' పట్టుకుని గళ్ళ నుడికట్టులో అసలు పదాన్ని పట్టుకున్నప్పటి ఆనందం - అంతా ఇంతా కాదు. ఆ పదం దొరికినప్పుడు మెదడు వికసించి. ఆనందంతో మెలికలు తిరిగిపోయాయి - ఎవరితోనయినా నా అధ్భుతమైన పరిశోధనని - నుడికట్టు ఆధారాన్ని ఎలా ఛేదించానో చెపప్డానికి పరుగులు తీసాను. ఇది 'తెలివితేటలతో ' ముడిపడిన వినోదం. అందుకే ప్రపంచ సాహిత్య లో డిటెక్టివ్ నవలకి పెద్ద పీట ఉంది.
నేను ఇంగ్లండుకి ఈ పాటికి పదిసార్లయినా వెళ్ళి ఉంటాను. కనీసం ఎనిమిది సార్లు నాటకాలు చూడడానికే వెళ్ళాను. కనీసం రెండు సార్లు ఒక్క 'మౌస్ ట్రాప్ ' నాటకాన్ని చూడడానికే వెళ్ళాను. రెండు సార్లు ఎందుకు? మొదటి సారి - తీరా టికెట్లు కొన్నాక 250 మైళ్ళ దూరంలో వేల్స్ లో ఏక్సిడెంటయి కదలలేని పరిస్థితిలో పడుకుని ఉండడం. అటు తర్వాత 18,1333వ ప్రదర్శనని చూశాను. ఇంత వివరంగా గుర్తుంచుకోవడానికి కారణం - 'మౌస్ ట్రాప్ ' నాటకం గత 58 సంవత్సరాలుగా సెంట్ మార్టిన్ థియేటర్లో ప్రదర్శింపబడడం. ధియేటర్ వరండాలో ఒక బోర్డు మీద అది ఎన్నవ ప్రదర్శనో సంఖ్య వేస్తారు. దాని ముందు ఫోటో తీయించుకున్నాను. ఇప్పటికి 24 వేల పై చిలుకు ప్రదర్శనలు జరిగాయి.

ప్రతి రోజూ నాటక ప్రదర్శన అయిన తర్వాత ప్రయోక్త వేదిక ముందుకు వచ్చి ప్రేక్షకుల్ని అభినందించి "దయచేసి ఈ నాటకం ముగింపుని ఎవరికీ చెప్పవద్దు" అని విజ్నప్తిని చేస్తాడు. సంప్రదాయానీ, పెద్దమనిషితనాన్నీ గౌరవించే సభ్య సమాజం ప్రయోక్తకిచ్చిన మాటని 58 సంవత్సరాలపాటు, 24 వేల సార్లు నిలబెట్టుకుంటూ వస్తోంది.
కాని కంప్యూటర్ లో వికీపీడియా నెట్ వర్క్ మొదటిసారిగా ఒక దుర్మార్గాన్ని చేసింది. తన వెబ్ సైట్ లో ఈ నాటకంలో హంతకుడెవరో చెప్పేసింది. దయచేసి చెప్పవద్దని రచయిత్రి కుటుంబం, ఎందరో అభిమానులు విజ్నప్తి చేశారు. మొరపెట్టుకున్నారు. కాని వికీపీడియా వారి మాటని చెవిని పెట్టలేదు. నీతి తప్పింది. ప్రపంచంలో చరిత్రని సృష్టించిన ఓ కళాఖండంలో 'రుచి'ని శాశ్వతంగా చంపేసింది.
ఇది భౄణ హత్యకన్న మహాపాపమనీ, సాహితీ ప్రపంచంలో జీవహింసలాంటిదని నేనంటాను. విలువలకీ, సాహిత్యంలో సత్సంప్రదాయానికీ తిలోదకాలిచ్చి - కేవలం డబ్బు చేసుకోవడం, ఓ 'వెర్రి'ని కల్పించడమో పరమావధిగా పెట్టుకునే అమెరికా వ్యాపారశైలికీ, నీతి బాహ్యతకీ ఇది క్రూరమయిన నిదర్శనం అంటాను.
డిటెక్టివ్ నవల సుతారమైన సాహితీ ప్రక్రియ. చివరలో ఉత్కర్ష రచయిత దిషణకీ, ప్రేక్షకుడి ఆసక్తికీ మధ్య చెలగాటం. పైగా 58 సంవత్సరాలు ఓ గొప్ప ఉద్యమంగా చేసిన సందర్భమిది. దాన్ని బహిరంగం చేయడం - ఆలోచనలో ముతకతనానికీ, వ్యాపారంలో ముష్కరత్వానికీ సంకేతం.
పెద్దల ముందు సిగరెట్టు కాల్చకూడదు. ఎవరు చెప్పారు? అదొక మర్యాద. మర్యాదకి ఆంక్షలుండవు. విలువలే ఉంటాయి. ఎవరూ చెప్పనక్కరలేదు. కాలిస్తే - ఆ పెద్దాయన గుండెకినొప్పి రాదు. ఈ చిన్నవాడికి పద్మశ్రీ రాదు. పెద్దవాడు క్రుంగిపోడు. చిన్నవాడికి ఉరిశిక్ష వెయ్యరు. కాని ఏం జరుగుతుంది? ఓ గొప్ప విలువ చచ్చిపోతుంది. ఆంక్షలక్కరలేని మర్యాదనే 'విలువ' అంటాం. ఓ గొప్ప సంప్రదాయం మంటగలుస్తుంది.
'మౌస్ ట్రాప్ ' ముగింపుని వికీపీడియా బట్ట బయలు చేసి విప్పేయడం అలాంటి దుర్మార్గమని నేను నమ్ముతాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి