1, జనవరి 2011, శనివారం

అద్దె అమ్మల కోసం దళారుల వేట

సిలికాన్‌ సిటీ బెంగళూరులో అద్దె అమ్మలకు గిరాకీ పెరుగుతోంది. దీనిని సరోక్రసీ (సంతానం లేని వారికి గర్భాన్ని అద్దెకివ్వడం) అంటూ ఆంగ్లంలో ఉన్న అందమైన పేరుతో ఇక్కడ పిలుచుకుంటున్నారు. ఇప్పటి వరకూ బెంగళూరులో 300 మంది ఈ విధంగా సంతానం పొందారు. ప్రధానంగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్న దంపతులు ఒత్తిడి జీవితం కారణంగా వంధ్యత్వానికి గురవుతున్నారు. దీంతో అమ్మదనాన్ని అద్దెకు తీసుకుని తాము తల్లిదండ్రులవుతున్నారు. అద్దెకు అమ్మదనం కావాలనుకుంటున్న దంపతులకు ఓ స్వచ్ఛంద సంస్థ సహకరిస్తోంది. ఇందుకు భారీగా డబ్బు వసూలు చేస్తోంది. ఈ సంస్థ తన చిరునామాను ఎక్కడా ప్రకటించకపోయినా, ఆ నోటా ఈ నోటా పడి అవసరార్థుల నోళ్లలో నానుతోంది. అమ్మదనాన్ని అద్దెకు ఇచ్చే మహిళలు రూ. 50 వేల నుంచి రెండు లక్షల రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ మొత్తం సదరు జంటతో సంబంధం లేకుండానే నడుస్తోంది. గర్భం ధరించే మహిళల ఆరోగ్య, ఇతర నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఈ స్వచ్ఛంద సంస్థ 20 శాతం కమీవన్‌ వసూలు చేస్తున్నది. అదికాక దంపతుల నుంచి అధికమొత్తం వసూలు చేసుకుని అందులో కొంత మొత్తాన్ని నొక్కేస్తోంది. అమ్మలకు కోత వేసి అద్దె చెల్లిస్తోంది. ఈ వ్యవహారం హైదరాబాదులోనూ జోరుగా సాగుతోంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా గిరిజన మహిళలను దళారులు మోసపుచ్చి సొమ్ముచేసుకుంటున్నారు. ఏడాది పాటు తమతో ఉండి బిడ్డను కంటే రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి తీరా కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. దళారులకు భద్రాచలం కేంద్రంగా సాగుతోంది.

ముప్పొద్దులా తినమన్న నందీశ్వరుడు!

గోపూజ హిందూ జీవన విధానంలో ఓ భాగం. పుణ్యక్షేత్రదర్శనంలోనూ, శుక్రవారాల్లోనూ గోవుల్ని విశేషంగా పూజిస్తారు. ఇక పంటల పండుగ సంక్రాంతి మరునాడు కనుమపండుగ అంటూ పశువుల్ని పూజిస్తారు. 

అందునా ఆరోజు ఆవుల్నీ, ఎద్దుల్నీ ముఖంగాక తోకని పూజిస్తారు. పశు సంతతి వృద్ధిని కోరుతూ, అలా పూజిస్తారని ఒక వాదన ఉంది. దీని గురించి మరో ఆసక్తికరమైన కధొకటి ఉంది. 

అదేమిటంటే - 

అప్పటికి మనుష్యులు ఇంకా వ్యవసాయం నేర్చుకోలేదట. అస్థిర నివాసులై, ప్రకృతిలో దొరికినవి తింటూ కాలం వెళ్ళబుచ్చుకున్నారట.

అప్పుడోరోజు... మహాశివుడు నందీశ్వరుణ్ణి పిలిచి, "నందీ! భూలోకానికి వెళ్ళి మానవులకి, ముప్పొద్దులా స్నానం చెయ్యమనీ, ఒక పొద్దు తిండి తిన మనీ’ చెప్పిరా!" అన్నాడట. 

నందీశ్వరుడు అలాగే వెళ్ళొచ్చాడు. తిరిగి వచ్చిన నందీశ్వరుణ్ణి మహాశివుడు "నందీ! చెప్పి వచ్చావా?" అనడిగాడు. 

"చెప్పాను స్వామీ!" అన్నాడు నంది. 

"ఏం చెప్పావు?" అన్నాడు స్వామి. 

" ‘ముప్పొద్దులా తినండి. ఒకపొద్దు స్నానించండి’ అని చెప్పాను స్వామీ" అన్నాడు నందీశ్వరుడు.

"ఏడ్చినట్లుంది! మూడు పొద్దులా తింటే తిండెక్కడ సరిపోతుంది?" అన్నాడు స్వామి. 

నంది నాలుక్కరుచుకొని "పొరపాటయ్యింది స్వామీ" అన్నాడు. 

"నువ్వే ఆ పొరపాటు దిద్దుదువు గాక! ఇక నుండీ... నీవు, భార్యా పుత్ర పుత్రీ సమేతంగా, భూలోకానికి పో! నీవూ, నీ పుత్రులూ దుక్కి దున్నటం దగ్గర నుండి పంట పండించీ, నీ భార్యాపుత్రికలు పాలిచ్చీ, మానవుల కడుపులు నింపండి, పొండి" అన్నాడట శివుడు. 

ఆనాటి నుండి ఆవులూ, ఎద్దులూ మన కడుపులు నింపుతుండగా... మహాశివుడు, మనుష్యులకి వాటి ఆలనా పాలనా చూడవలసిన విధిని నిర్ణయించాడట. 

కొన్నాళ్ళ తర్వాత, మనిషి పశుగణాల పరిరక్షణ సరిగా చేస్తున్నాడో లేదో తెలుసుకుందామని, అవుల్నీ, ఎద్దుల్నీ "మనిషి మిమ్మల్ని బాగా మేపుతున్నాడా?" అని మహాశివుడు అడిగితే, అవి లేదన్నట్లు తల అడ్డంగా ఊపి అబద్దం చెప్పాయట. అయితే తోకలని నిలువుగా ఊపి నిజం చెప్పాయట. 

అప్పటి నుండీ మనుష్యులు, అబద్దం చెప్పిన ఆవు శిరస్సు కంటే, తోకని మరింత శ్రద్దగా పూజిస్తారని జానపద కథ. 

28, డిసెంబర్ 2010, మంగళవారం

యూపీఏ ప్రభుత్వం కార్పొరేట్లకు దాసోహం

ఏఐసీసీ 83వ ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ చేసిన ప్రసంగాలు వింటే సామాన్యులకెవరికైనా వారి మాటల పట్ల అమితమైన అభిమానం కలుగుతుంది. ఈ దేశంలో సామాన్యుల జీవితాలను మెరుగుపరిచేందుకు, అవినీతిని రూపు మాపేందుకు వారెంతో తపన చెందుతున్నారన్న అభిప్రాయం కలుగుతుంది.
యూపీఏ ప్రభుత్వం కార్పొరేట్లకు దాసోహమవుతూ సామాన్యులకు దూరమవుతున్నదని, ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అవినీతి తాండవిస్తున్నదని వెల్లువెత్తిన ఆరోపణలు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కంపించి వేశాయనడానికి ఈ సమావేశంలో నేతల ప్రసంగాలే నిదర్శనం. ఆకాశాన్నంటిన ధరలు, ఆకలి చావులు, నిర్వాసిత ప్రజల ఆక్రందనలు, గిరిజనుల వలసలు, అతలాకుతలమైన రైతు జీవితాలు, వడ్డీల చక్రబంధంలో చిక్కుకున్న గ్రామీణుల ఆత్మహత్యలు ఒకవైపు, వేల కోట్ల రూపాయల కుంభకోణాలు మరో వైపు మీడియాకు ఎక్కుతున్నాయి.
సామాన్యుడు కూటికి కటకటలాడుతుంటే, కొందరు కోట్ల రూపాయలు అడ్వాన్స్ పన్నులే కడుతున్నారు. ఐపిీఎల్, కామన్‌వెల్త్ , స్పెక్ట్రమ్ 2 జి కుంభ కోణాలలో లక్షల కోట్ల ప్రజాధనం నష్టపోవడం, వేల కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక మండలాలు, విల్లాలు, గోల్ఫ్ కోర్టులు, అక్రమ మైనింగ్, అటవీ సంపద కొల్లకొట్టడం, ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయల స్కాంలు, ఇవన్నీ దేశ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. రైతులు, గిరిజనులు, దళితులు, అణగారిన వర్గాలు, సామాన్య మధ్యతరగతి వర్గాల్లో ప్రభుత్వం, అధికార పార్టీ పట్ల అసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఏఐసీసీ ప్లీనరీలో సోనియా, రాహుల్ గాంధీలు ఈ అసంతృప్తికి పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేశారనడంలో అతిశయోక్తి లేదు.
అవినీతి ఒక అంటువ్యాధిలా ప్రబలిపోయిందని, దానిపై పోరాటాన్ని తీవ్రతరం చేయాలని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అంటే అవినీతిపరులను కఠినంగా శిక్షించాలని రాహుల్ గాంధీ అన్నారు. అవినీతిపరులు ఎంతటి శక్తివంతులైనా, రాజకీయ నాయకులైనా, అధికారులైనా వదిలిపెట్టబోమని ప్రధాని స్పష్టం చేశారు. అవినీతి నివారణకు సోనియా ప్రధానంగా అయిదారు సూచనలు చేశారు.
ఇందు లో మొదటిది ప్రజాప్రతినిధులకు సంబంధించింది. ఎన్నికల్లో సామాన్యుడు పోటీ చేయలేని పరిస్థితిని రాజకీయ పార్టీలే కల్పించాయి. టిక్కెట్లను అమ్ముకోవడం, ఎన్నికల్లో గెలిచేందుకు వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి రావడం, గెలిచిన తర్వాత వాటిని రాబట్టుకునేందుకు అవినీతికి పాల్పడడం ఒక చక్రంలా జరుగుతోంది.
అందువల్ల అభ్యర్థుల ఎన్నికల ప్రచారం, ఇతర వ్యయాలను ప్రభుత్వాలే భరించే విధానాన్ని సోనియా ప్రతిపాదించారు. సోనియా చేసిన రెండో ప్రతిపాదన- ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులపై వచ్చిన ఆరోపణలను వేగంగా విచారించి వారికి సాధ్యమైనంత త్వరలో శిక్ష పడేలా చూడడం. ఈ దేశంలో ఎక్కడో మధుకోడా లాంటి వారుతప్ప రాజకీయ నాయకులు అవినీతి ఆరోపణలపై కటకటాలు లెక్కపెట్టిన సందర్భాలు చాలా తక్కువ.
జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్‌లాంటి వారిపై కొన్నేళ్ళుగా కేసులు కొనసాగుతున్నాయి. సోనియా చేసిన ప్రతిపాదనల్లో మూడవది ప్రభుత్వ ప్రాజెక్టులు, కాంట్రాక్టులకు సంబంధించి పారదర్శక విధానాలను నిబంధనలను పాటించడం. వాటిని ఆయా ప్రభుత్వాలు తమ అవసరాలకు అనుగుణంగా మార్చకుండా చూడాలి.
కాంగ్రెస్ అధ్యక్షురాలు చేసిన నాల్గవ ప్రతిపాదన కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రులు, ముఖ్యమంత్రులు ఎడాపెడా భూముల్ని, ఇతర వనరులను అస్మదీయులకు కేటాయించే తమ విచక్షణాధికారాల్ని వదులుకోవడం. వైఎస్ఆర్ హయాంలో సహజవనరులను కేటాయించడం ద్వారా కొత్త సంపన్నులు తలెత్తారు. రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసి అధిష్ఠానాన్ని ధిక్కరించే స్థాయికి ఎదగడం గుణపాఠంగా నిలిచింది.
సహజ వనరులను ఉపయోగించడంలో, కేటాయించడంలో పారదర్శకమైన వ్యవస్థ ఉండాలని, గిరిజనులను, ఇతర సామాన్యుల జీవితాలతో చెలగాటమాటకూడదని సోనియా చెప్పడంలో కూడా ఆంతర్యం ఇదే. నిజానికి రాహుల్ చేసిన ప్రసంగంలో కూడా వ్యవస్థకూ, సామాన్యుడికీ మధ్య తెగిపోయిన సంబంధాన్ని ప్రస్తావించారు.
ఈ దేశంలో కష్టించి చెమటోడ్చేవారికి, దళితులకు, గిరిజనులకు, విద్యావంతులకు, ప్రతిభ కలవారికి, నిజాయితీ కల వ్యాపారులకు సరైన అవకాశాలు లభించకపోవడం, ధనబలం, రాజకీయ బలం, కండబలం కలవారికే వ్యవస్థలో ఆదరణ లభించడం గురించి రాహుల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రతిభ గలవారు వెనుకబడకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సాధారణ ప్రమాణాలతో చూస్తే ఈ ప్రసంగాలతో సోనియా, రాహుల్, మన్మోహన్‌ల పట్ల సదభిప్రాయం కలిగే అవకాశం ఉన్నది. కాని కాంగ్రెస్ పార్టీలో నేతలు చేస్తున్న వ్యవహారాలకూ, జరుగుతున్న పరిణామాలకూ వారి మాటలకూ పొంతనే లేదు. సోనియా ప్రసంగించిన ఏఐసిీసీ ప్లీనరీలోనే బీహార్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ ముసుగును బట్టబయలు చేశారు.
ప్లీనరీ దృశ్యాలు ప్రదర్శించిన స్క్రీన్‌పైనే బీహార్‌లో టిక్కెట్లు అమ్ముకున్న పార్టీ కేంద్ర నేతలు ముకుల్ వాస్నిక్, సాగర్ రాయికా, ఇమ్రాన్ కిద్వాయ్‌లపై చర్య తీసుకోవాలని, వారి ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసే పోస్టర్‌లను ప్రదర్శించారు. సోనియా, మన్మోహన్ సింగ్‌ల ముందే వారు తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ నేతలపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇది తొలిసారి కాదు. ప్రతి స్థాయిలోనూ, ప్రతి ఎన్నికల్లోనూ, ప్రతి నియామకంలోనూ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అవినీతి సాగుతూనే ఉంటుంది. తాను మంత్రి పదవి కోసం ఢిల్లీలో నేతలకు కొన్ని కోట్లు ఇచ్చేందుకు వచ్చానని తెలిసిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ తనను పిలిచి తిట్టారని ఒక మంత్రి స్వయంగా ఒక పత్రికలో రాసుకున్నారు.
ఢిల్లీలో ఎప్పుడూ కేంద్ర నేతలతో వివిధ రాష్ట్రాలకు చెందిన నేతల పదవుల బేరసారాలు సాగుతూనే ఉంటాయి. ఫలానా వ్యక్తి ఫలానా కేంద్ర మంత్రి కుమారుడికో, ఫలానా సలహాదారు కుమార్తెకో, ఫలానా ప్రధాన కార్యదర్శికో ఢిల్లీలోనో, లండన్‌లోనో నజరానాలు ఇచ్చినందు వల్లనే ఫలానా వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి దక్కిందన్న ప్రచారాలు వినపడుతూనే ఉంటాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో నరనరాల్లో పేరుకుపోయిన అవినీతిని నిర్మూలించకుండా సోనియా తమ ప్రభుత్వాల్లో మార్పు తేలేరు.
రెండవది... పార్టీలో ఉన్న మంత్రులు, ప్రజా ప్రతినిధుల్లో అత్యధికులు వ్యాపారాల్లో ఉన్నవారో, లేక బడా వ్యాపార సంస్థల తరఫున పనిచేసిన వారే కావడం. పార్లమెంట్‌లో ఏ ప్రశ్న వేయించాలో, ఏ ప్రశ్న వేయకుండా చూడాలో, ఏ చర్చను ఎవరు ప్రారంభించాలో కూడా కార్పొరేట్ సంస్థలు నిర్ణయిస్తున్నాయని నీరా రాడియా వంటి పిఆర్ సంస్థల అధిపతుల సంభాషణల్లో వ్యక్తమైంది.
ఇంతకూ సోనియా, మన్మోహన్, రాహుల్‌లు కార్పొరేట్ అవినీతిని ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.

యూపీఏ బురద - బీజేపీ మౌనం

మొదటి అయిదేళ్లనూ ఏ గొడవా లేకుండా సులభంగా దాటేసిన యూపీఏ... రెండోసారి అధికారంలోకొచ్చిన ఏడాదికల్లా కుంభకోణాల్లో చిక్కుకుంది. కామన్వెల్త్, ఆదర్శ్, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాలు ఒకదాని తర్వాత మరోటి తెరమీదికొచ్చి యూపీఏకు ఊపిరి సలపనీయడం లేదు. వీటన్నిటిలోనూ 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం అతి పెద్దది. విధానాలకు వక్రభాష్యం చెప్పి తనకు నచ్చిన కంపెనీలకు 2జీ స్పెక్ట్రమ్ లెసైన్స్లు సంత ర్పణ చేసిన టెలికాం మంత్రి రాజా దేశ ఖజానాకు దాదాపు లక్షా 76 వేల కోట్ల రూపాయల నష్టం తెచ్చారు. కుంభకోణం సాగుతున్న దశలోనే మీడియా దీన్ని వెల్లడించినా యూపీఏ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. తన చర్యలకు ప్రధాని ఆమోదం ఉందని మంత్రి ప్రకటించినా నోరెత్తలేని దయనీయ స్థితిలో మన్మోహన్ ఉండిపోయారు. చివరకు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణకు చేపట్టి సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నాక, కాగ్ తన నివేదిక ద్వారా బయటపెట్టాక గత్యంతరం లేక డీఎంకేను బతిమాలి రాజాను మంత్రి పదవి నుంచి తప్పించారు. ఈ కుంభకోణంపై జేపీసీ వేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు శీతాకాల సమావేశాలను పూర్తిగా స్తంభింపజేశాయి.

ఇక కార్గిల్ మృత వీరుల కుటుంబాల కోసం ముంబై లోని కొలాబాలో నిర్మించిన 31 అంతస్తుల ఆదర్శ్ హౌసింగ్ కాంప్లెక్స్లో అవినీతి కొలువుదీరడం మరింత షాకిచ్చింది. 2003లో నిర్మించిన ఈ కాంప్లెక్స్లో ఇప్పటి మార్కెట్ రేటును బట్టి ఒక్కో ఫ్లాట్ విలువ రూ. 6.5 నుంచి 8.5 కోట్ల రూపాయలు. కార్గిల్ అమరవీరుల కోసం కదా అని సైన్యం తన అధీనంలోని స్థలాన్ని సొసైటీకి లీజుకిచ్చింది. తొలుత ఆరంతస్తుల అపార్ట్మెంట్గా ప్రారంభమైన భవంతి అవినీతి రాజకీయ నేతల కన్నుపడేసరికి పెరుగుతూ పోయి వంద మీటర్ల ఎత్తయిన కాంప్లెక్స్గా మారింది. రాజకీయ నాయకులు, ఆర్మీబాస్లు అడ్డగోలుగా ఇందులో ఫ్లాట్లు దక్కించుకున్నారు. ఆర్మీ చీఫ్లుగా పనిచేసిన దీపక్ కపూర్, ఎన్సీ విజ్, నావికాదళ మాజీ వైస్ చీఫ్ శంతను చౌధరిలకు ఇందులో ఫ్లాట్లు ఉన్నాయంటే అందరూ ఆశ్చర్యపోయారు. తీరా బయటపడ్డాక అది కార్గిల్ వీరపత్నుల కోసమని తమకు తెలియదని ఈ పెద్దలు లెంపలేసుకుని వెనక్కి ఇచ్చేశారు. పరువు కాపాడుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ను కాంగ్రెస్ రాజీనామా చేయించింది. విచారణకు కమిషన్నూ ఏర్పాటు చేసింది. 

కామన్వెల్త్ క్రీడల ప్రారంభానికి ముందే అందులో అవినీతి గుప్పుమని అంతర్జాతీయంగా పరువుతీసింది. కామన్వెల్త్ గ్రామ నిర్మాణం దగ్గర్నుంచి, క్రీడాకారులు ఉపయోగించే చిన్నాచితకా వస్తువుల వరకూ అన్నింటిలోనూ కుంభకోణం జాడలే. ఈ కుంభకోణంలో ఆరోపణలనెదుర్కొన్న భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కల్మాడీ ఇంటిపైనా, ఆయన సన్నిహితుల ఇళ్లపైనా సీబీఐ దాడులు చేసింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి బాధ్యతల నుంచి కల్మాడీ వైదొలిగారు. చిత్రమేమంటే, ఈ స్కాములన్నింటిలో బీజేపీ పెద్దల పేర్లూ వినబడ్డాయి. కామన్వెల్త్ క్రీడల అవినీతిలో బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్కు అత్యంత సన్నిహితుడు, ఢిల్లీ బీజేపీ నేత సుధాంశు మిట్టల్ పేరు వెల్లడైంది. ఆయన డెరైక్టర్గా ఉన్న సంస్థకు దక్కిన రూ. 230 కోట్ల కాంట్రాక్టులో అవినీతి జరిగిందంటూ ఐటీ దాడులు జరిగాయి. ఆదర్శ్ కాంప్లెక్స్లో ఫ్లాట్ దక్కించుకున్న ఒకరు బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీకి సన్నిహితుడని, నిజానికి అతన్ని బినామీగా పెట్టి గడ్కారీయే దాన్ని పొందారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. 

ఇక రాడియా టేపుల్లో బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని దత్త పుత్రిక భర్త రంజన్ భట్టాచార్య నడిపిన వ్యవహారాలూ బయటికొచ్చాయి. మొత్తం మీద కాంగ్రెస్కు అంటిన బురదను ఎత్తిచూపి లబ్ధిపొందేంత స్థితి బీజేపీకి లేకుండా పోయింది. మరోపక్క కర్ణాటకలో బయటపడిన భూకుంభకోణాలు కూడా బీజేపీకి తలవంపులు తెచ్చాయి. కర్ణాటక ఐటీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు, ఆయన కుమారుడు జగదీష్ ఫోర్జరీ డాక్యుమెంట్లతో తమకు చెందని భూమికి కర్ణాటక పారిశ్రామికాభివృద్ధి సంస్థ నుంచి పరిహారం పొందారని ఆరోపణ లొచ్చాయి. దీనిపై సుబ్రమణ్యంనాయుడు రాజీనామా చేయాల్సి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా తన కుమారులిద్దరికీ సీఎం యడ్యూరప్ప నివాస స్థలాలు కేటాయించడం, షిమోగాలోని నివాసప్రాంతంలో ఓ కుమారుడికున్న 17 ఎకరాల భూమిని వాణిజ్యపరమైన ప్రయోజనాలకు వినియోగించుకునేలా అనుమతించడంలాంటి చర్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. దీనిపై వెనక్కి తగ్గిన యడ్యూరప్ప తన పిల్లల్ని అధికార నివాసం నుంచి పంపించేశారు. అయితే, ఆయనతో రాజీనామా చేయించడానికి బీజేపీ కేంద్ర నాయకత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు

26, డిసెంబర్ 2010, ఆదివారం