18, నవంబర్ 2010, గురువారం

తెనుగు సాహిత్యోద్ధారకుడు సీపీ బ్రౌన్ మహాశయుడు

తెనుగు సాహిత్యోద్ధారకుడు సీపీ బ్రౌన్ మహాశయుడు

నేడు బ్రౌన్‌ 212వ జయంతి
1786 జూన్‌ 13న తెల్లదొరల పిల్లల కోసం ఏర్పాటు చేసిన శరణాలయానికి ఇంగ్లండు నుంచి ఉద్యోగరీత్యా సీపీ బ్రౌన్ తల్లిదండ్రులు మనదేశానికి వచ్చారు. రెవరెండ్‌ డేవిడ్‌ బ్రౌన్‌, కాలే దంపతులకు రెండో కుమారుడు సిపి బ్రౌన్‌. బ్రౌన్‌ 1798, నవంబరు 10న కోల్‌కత్తాలో జన్మించారు. సిపి బ్రౌన్‌ పూర్తి పేరు చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. 1812లో డేవిడ్‌ బ్రౌన్‌ మృతి చెందడంతో సిపిబ్రౌన్‌ తన కుటుంబంతో 14వ యేట ఇంగ్లాండుకు వెళ్లిపోయారు. ఇండియా పాలనలో పనిచేస్తూ మరణించిన వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంతో 1817లో తన 22వ యేట సిపిబ్రౌన్‌ చెన్న పట్టణoలో అడుగు పెట్టారు. వెలగపూడి కోదండరామ దంపతుల వద్ద బ్రౌన్‌ తెలుగు అక్షరాభ్యాసం చేశారు.  1820లో కడప కలెక్టర్‌ సహాయకుడిగా ఉద్యోగం ప్రారంభమైంది. అప్పటి  కడప కలెక్టర్‌ హన్‌బరీ  తెలుగులో మాట్లాడేవారు. అయనను స్ఫూర్తిగా తీసుకున్న బ్రౌన్‌ అనతి కాలంలోనే తెలుగును అనర్గళంగా మాట్లాడటం నేర్చుకున్నారు. 1821లో రెండు పాఠశాలలు ఏర్పాటు చేశారు. పాఠశా లలో  తెలుగు‌ భాష నేర్పిం చారు. 1822 అక్టోబరులో మచిలీపట్నం జిల్లా రిజిష్ట్రార్‌గా వెళ్లారు. అక్కడ సైతం తెలుగును అభివృద్ధి చేసేందుకు రెండు పాఠశా లలు ఏర్పాటు చేశారు.  1824లో వెంకటశాస్ర్తి సాయంతో వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించిన ఘనత సిపిబ్రౌన్‌కు దక్కింది. అనంతరం 1826లో కడప రిజిష్ట్రార్‌గా మళ్లీ కడపకు బదిలీపై వచ్చారు. గ్రంథాల ఆవిష్కరణ, శుద్ధ ప్రతుల తయారుచేసేందుకు అనువుగా పెద్ద బంగ్లా, ఆహ్లాదకరమైన తోటను వెయ్యి వరహాలు ఇచ్చి కొన్నారు. అక్కడి నుంచి 1829 మే నాటికి 16వేల పదాల నిఘంటువును తయారు చేశారు. నిఘంటువును అచ్చువేసేందుకు బోర్డుకు పంపారు.  బోర్డు ఈ నిఘంటువును అచ్చువేయించడానికి తిరస్కరించింది. అనంతరం 1832లో  బదిలీపై మచిలీపట్నం వెళ్లారు. అక్కడ ప్రింటింగ్‌ ప్రెస్‌ స్థాపించి నిఘంటువులను అచ్చు వేయించారు. 1834లో కంపెనీ బోర్డు బ్రౌన్‌ను తొలగించింది. ఉద్యోగాన్ని పోగొట్టుకున్న బ్రౌన్‌ లండన్‌ కోర్టు ఆఫ్‌ డైరెక్టర్‌కు అప్పీలు చేసి మూడు సంవత్సరాల జీతాన్ని పొందారు. ఉద్యోగం పోయిన సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను తయారు చేసిన ఇంగ్లీష్‌ నిఘంటువులను అమ్ముకుని లండన్‌ వెళ్లి పోయారు. 1841లో చెన్న పట్టణ  పోస్టు మాస్టర్‌ జనరల్‌గా, తరువాత మదరాసు  విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యునిగా, గ్రంథాలయ క్యూరేటర్‌గా పని చేశారు. 1846లో తన గ్రంథాలయం నుంచి దేశభాషలలోని 2,440 రాత ప్రతులను చెన్నై లిటరసీ సొసైటికి బహూకరించారు. తెలుగుభాషా సాహిత్యాల సముద్ధరణకు నడుంబిగించిన తెలుగు బిడ్డకు 1853లో పక్ష వాతం జబ్బు వచ్చింది. దీంతో ఆయన సెలవు పెట్టి నీలగిరి కొండలకు, 1855లో లండన్‌కు వెళ్లిపోయారు. 1865లో తెలుగు ఆచార్యుడిగా చేరారు. అప్పట్లోనే  చందస్సును అచ్చు వేయించారు.  ఆంధ్ర సాహిత్యాన్ని ప్రజ్వలింపజేసిన బ్రౌన్‌ చిరస్మరణీయుడు. 1884 డిసెoబరు 12న సిపిబ్రౌన్‌ తుదిశ్వాస వదిలారు .

పాతా నేతలేండి! కొంగ్రొత్త పార్టీ, రాండి… రాండి!!

పాతా నేతలేండి! కొంగ్రొత్త పార్టీ, రాండి… రాండి!!


దుడ్డుకు ప్రధానంగా రెండు లక్షణాలు.
1. చేతిలో పడగానే తొలుత తనను ఖర్చుచేయమంటూ ఒకటే గోలపెట్టుద్ది.
2. అది పోగుబడిందో ఆధిపత్యం కోరుద్ది.
జగన్మోహన్‌రెడ్డి ఖజానాలో పోగుబడిన లక్ష కోట్ల రూపాయలు రాజశేఖరరెడ్డి మరణాంతరం అదే పోరు ప్రారంభించింది. ఆధిపత్యం కోసం అర్రులు చాస్తోంది.
బ్రహ్మవిష్ణురుద్రాదులు అడ్డొచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో రేపో, మాపో కొంగ్రొత్త రాజకీయ ముఠాకి జగన్మోహనరెడ్డి తెరతీస్తాడంతే.
అదే రాహూల్‌గాంధీ మారుమనసు పొందితే తప్ప వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీ ఆవిర్భవించి తీరుద్ది. ఆ ముఠా పతాకానికి ముదురు నీలం రంగు పడుద్ది.
కొంగ్రొత్త రాజకీయ ముఠా ఆవిర్భవిస్తే అదెంతమాత్రమూ జగన్మోహనరెడ్డితప్పు కానేకాదు సుమా. ఆ తప్పంతా మనం డబ్బు అనే, కర్నాటకలో దుడ్డు అనే మనీ లక్షణానిది.
కొంగ్రొత్త రాజకీయ ముఠాకు ప్రాణం పోయాలన్న కోరిక ప్రకాశంలోనే పొటమరించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సరిగ్గా జల్‌ తుపాను బలపడుతుందనుకుంటున్న సమయంలోనే పూర్తి స్థాయిలో బలపడింది.
ఇక ముహోర్త0 పెట్టటమే మిగిలి ఉంది.
అది ఎప్పుడన్నది … కాంగ్రెసు పైనే ఆధారపడి ఉందంటే అతిశయోక్తికాదు. అదెందుంటే తెలుగోళ్ల బలహీనత వలనే. అదేందంటారా? ఏమీ లేదండీ. ఎంత తప్పుడోడన్నా కావచ్చు, ఎంతి నికృష్టుడయినా అవచ్చు, అవినీతి చక్రవర్తి అయినా, ప్రజల పీకల్ని పరాపరా కోసిపారేసిన కర్కోటకుడ్నయినా సరే ఇబ్బందులు పెడతన్నారని తెలుగోడికి అన్పించిందా, ఇంకేముందివాడి చుట్టూచేరతారు. వాడికి దండలు వేస్తారు. వాడికి మద్దతు పలుకుతారు. ఆకలయితే తాము మానుకునయినా వాడి నోట్లో కుక్కి కడుపు మంట చల్లారుస్తారు. ఆవలించగానే తాము కింద పడి వాడికి పరుపవుతారు. రాజకీయాల్లో చేరితే ఓట్లు ఒకటేమయిన గుద్దేసి వాడికి గద్దెను ఇచ్చేస్తారు.అది నీదే ఏలుకోమని నిక్కచ్చిగా చెబుతారు. తమని దోచుకోమంటూ దార్లు చూపుతారు. అదీ తెలుగు వాడి. ఆ బలహీనతను ఎవడో బుర్రున్నవాడు జగన్మోహనరెడ్డి చెవిలో వేసేశాడు. చిన్న వైఎస్‌ దాన్ని ఒడిసిపట్టాడు. ఇప్పుడిక అధిష్టానాన్ని రెచ్చగొట్టి, వారిని అపర విశ్రామిత్రులనుచేసి, వాళ్లను పురికొల్పి తననూ తన పరివారాన్నీ కాంగ్రెసు నుంచి గెంటేయించుకునేందుకు ప్రయత్నాల్ని ప్రారంభించాడు చిన్న వైఎస్‌. దానిలో భాగమే నెల్లూరులో వందిమాగధుల మధ్య ఆదివారం నిర్వహించిన ఓదార్పు ముగింపు సభ. ఇప్పటిదాకా ఏమి చేయాలో తెలియక దిక్కులు చూస్తోన్న రోజా రొట్టె ఈ సభతో విరిగి నేతిలో పడింది. ముగింపు సభకు ప్రత్యేక ఆహ్వానం ఆమె దక్కించుకుని చెంగున చెంగున నెల్లూరులో వాలి కాంగ్రెసు అధిష్టానికి ఖబడ్దార్‌ చెప్పింది. జగన్‌ అభిమన్యుడు కాదని గొంతెత్తి గోల చేసింది. అర్జునుడని అరిచి మరీ చెప్పింది. అయితే ఇక్కడ అర్జునుడి గురించి ఒకటిరెండు విషయాలు గుర్తుచేసుకుందామా! అర్జునుడికి బోలెడంతమంది భార్యలున్నారు. ఆఖరుకు నల్లమడ అడవుల్లో తిరుగుతూ మన చెంచులోళ్లమ్మాయి చెంచితను కూడా వివాహమాడాడుగదా. చెంచితలాంటోళ్లు ఇంకెంతోమంది అర్జునుడికి. దీనికితోడు అర్జునుడు ఎప్పుడూ ముందు పీఠిన నిలిచిన పాపాన పోలేదు. ధర్మరాజు రాజ్యమేలితే ఆయన వెనక నిలబడ్డాడు. ఇక మిగతా విషయాలన్నింటా కృష్ణుడు తోడులేందే ఒక్కడుగూ వేసినవాడు కాదు. జగన్మోహనరెడ్డి అలాంటివాడనేనా రోజా పోలిక. కొంగ్త్రొత్తపార్టీలో తగు స్థానం దక్కుతుందని పగటి కలలు కంటూ బాలయ్య బాబుని రాజధానిలోనే మూసీనదిలో కలిపేసి, ఓదార్పు ముగింపులో తగుదునమ్మా అంటూ అడుగుపెట్టి మా జగనుబాబు … మా జగనుబాబు అంటూ పిచ్చికూతలు, కారుకూతలు, పిల్లికూతలు కూసిన నందమూరి లక్ష్మీపార్వతికి వచ్చేదేమీ లేదు, పోయేదేమీ లేదు. రామారావు భార్యఅని కొందరికున్న అట్టడుగు సానుభూతి కూడా పోగొట్టుకోవటం తప్ప. అతలసుతలవితల తలాతల, పాతాళ లోకానికి లచ్చుమమ్మ అతితెలివి చేరిపోయిందంతే.
ఇక ఇప్పటికే చిన్న వైఎస్‌ కంపు గుంపులో చేరిపోయిన అవినీతిపరులు, అక్రమార్కులు ఆయన్ని దినందినం, క్షణం, క్షణం అహో, ఒహో అంటూ రెచ్చగొట్టి వదిలేశారు. రెచ్చిపోయిన వైఎస్‌, చెలరేగిన వైఎస్‌ ఇక ఊరుకుంటాడా? చకచకా ఓదార్పు చేసేస్తూ, గబగబా ఎక్కడోకక్కడ కాంగ్రెసు పార్టీకి నిట్టనిలువుగా బొక్కకొడతాడు. కొంగ్రొత్తపార్టీకి అడ్డంగా ఉన్న పలుచటి తెరను చించేస్తాడు. అదీ సంగతి. ఇదంతా ఇప్పటికిప్పుడే కాదు. తెలుగు యవనికమీద అప్పుడు కొంత అప్పుడు  కొంత తిలకించాల్సిన తిక్క సినిమా

కార్పొరేట్ ఆ(కా)సుపత్రి!


కార్పొరేట్ ఆ(కా)సుపత్రి!

మేలిమి రంగు తో మిడిసిపడే కార్పొరేటు ఆసుపత్రుల పొట్టవిప్పి చూస్తే..
 
ఆగండి! ఈ ఆవరణలో జాగ్రత్తగా అడుగులు వేయండి.

భళ్ళుమని మృత్యు ఘోషలన్నీ అసరిగమల్తో మీ మీద దాడి చేస్తాయి.

ఎవరెవరో ఈ గోడల్లోంచి గుండెలు బాదుకుంటున్నారు.

ముక్కు మూసుకోండి. ఈ తెల్లని గోడల్లోంచి చావు కంపు కొడుతోంది.

డాక్టర్లు చావు కబుర్లని మెళ్ళో వేసుకుని అటూ ఇటూ పరిగెడుతున్నారు.

యిటు జరగండి.

స్ట్రెచర్లోంచి యెవరో బిగ్గరగా అరుస్తూ చేతులు చాస్తున్నారు.

సెలైన్ బాటిల్లోంచి రాలే వొక్కో బొట్టూ

చావు లోకాలకి ఒక్కో మెట్టూ కడుతోంది.

రిసెప్షన్ లో క్యాష్ కౌంటర్ రాకాసి నాలుకల్ని చాస్తోంది.

పరుపులపై పరచిన దుప్పట్ల మీద జీవితాలు

మరకలుగా మారుతున్నాయ్.

మీరు యేమీ అడక్కండి.

కన్సల్టెంట్ డాక్టర్ ఖర్మ యోగం అప్పచెబుతాడు.మీరు మాట్లాడరాదంటాడు.

రౌండ్స్ కొచ్చిన ప్రతీ ట్రెయినీ డాక్టరూ పెదవి విరుస్తున్నాడు.

నర్సులు ఒకరికొకరు ఎదురుపడినప్పుడల్లా నవ్వుల్ని అతికించుకుంటున్నారు.

కౌంటర్లో నిలబెట్టి ఒంట్లోని ఒక్కో కండనీ కోసి బిల్లులుగా చెల్లేసి ముఖాన కొడుతున్నారు.

పడక మంచాలన్నీ పాడెలాగ మూల్గుతున్నాయ్ .

ఇక్కడ దీనులు మూకుమ్మడిగా దాడి చేసే అపనమ్మకాల్ని కన్నీటి ఆసిడ్లతో కడిగేసికుంటున్నారు.

ఆర్తనాదాలనన్నిటినీ కడుపులో దిగమింగుకుంటున్నారు..

పరామర్శకుల హృదయాలు బిక్కుమంటో నరాల్ని దారాలుగా ముడేసుకుంటున్నాయి.

పంటి బిగువున గట్టిగా బిగపట్టిన ఆనవాళ్లు యేవో అలలు అలలుగా తేలుతున్నాయ్.

యిప్పుడు ప్రార్థన చేయండి.

యిక్కడ మనిషికీ నమ్మకానికీ యెప్పుడూ యుద్దమే !

మహ్మదూ-యేసూ-రాముడూ-

మెయిన్ గేటు దగ్గిరే ఆగిపోయారు.

పిలవరేం!

అప్పుడప్పుడూ పరామర్శలు కొన్ని క్షణాల్ని బ్రతికిస్తున్నాయ్ .

అయ్యో! యేం చేస్తున్నారేం! ?

యెవరినీ కదపకండి.

యిక్కడి దుఖమంతా లుంగలు చుట్టుకుని

మీ నరాల్లోకి ఎగబాకి మీ నిద్రారాత్రులన్నీ అల్లకల్లోలమవుతాయ్.

వుండండి! ఎఱ్ఱబల్బు వెలిగింది.

హుష్ ! సైలెన్స్

. . .

. . .

స్కానింగ్ అయిపోయింది .

సారీ గుండె ఆగిపోయింది.

బిల్లులు కట్టండి.

బిచాణా ఎత్తేయండి.

పేషెంట్....నెక్స్ట్