6, అక్టోబర్ 2012, శనివారం

అదే కాంచనమాల రికార్డ్!

అదే కాంచనమాల రికార్డ్!

కాంచనమాల
మనోహరమైన రూపం ... మధురమైన స్వరం ... మరిచిపోలేని అభినయం ... ఈ మూడూ కలగలిసిన కమనీయ సౌందర్యమే కాంచనమాల.తెనాలిలో జన్మించిన కాంచనమాల 1935 లో 'శ్రీకృష్ణ తులాభారం' చిత్రంలో శ్రీ కృష్ణుడి అష్ట భార్యలలో ఒకరైన మిత్రవిందగా నటించింది. ఈ సినిమాతో తన ఉనికిని చాటుకున్న కాంచనమాల, ఆ మరుసటి ఏడాది 'వీరాభిమన్యు' చిత్రంలో ప్రధాన పాత్రను పోషించింది.ఈ సినిమాలో ఆమె సుందర సుకుమారమైన రూపం ... సుమధురమైన స్వరం ... నవరసాలను అమాంతంగా కురిపించగల విశాలమైన కళ్ళు చూసి ప్రేక్షకులు మంత్ర ముగ్దులై పోయారు.

ఇక 1937 లో వచ్చిన 'విప్రనారాయణ' చిత్రంలో దేవదేవిగా ఆమె ప్రదర్శించిన సహజ సౌదర్యం ..., 'గృహలక్ష్మి' చిత్రంలో వేశ్యగా ఆమె ఆవిష్కరించిన హావభావాలు కాంచనమాల స్థానాన్ని సుస్థిరం చేశాయి. అలాంటి పరిస్థితుల్లో గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన 'మాలపిల్ల' చిత్రం కాంచనమాల ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. వాడవాడలా ఆమె పేరు మారుమోగి పోయింది ... ఆమె పేరుతో చీరలు - రవికెలు విక్రయించేంతటి పాప్యులారిటీని ఆమె సొంతం చేసుకుంది. వడ్ల బస్తా 3 రూపాయలు అమ్మే ఆ రోజుల్లో ఆమె ఒక్కో సినిమాకి 10 వేల రూపాయల పారితోషికాన్ని తీసుకుంది. దానిని కాంచనమాల సాధించిన రికార్డుగా ఇప్పటికీ చెప్పుకుంటారు.

ఆ తరువాత కాంచనమాల ఒకటి రెండు సినిమాలు చేసినా జెమినీ వారి 'బాలనాగమ్మ' సినిమా ఆమెను కథానాయికగా అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్ళింది. అయితే ఈ సినిమానే ఆమెను కోలుకొని దెబ్బ తీసింది. ఈ సినిమా నిర్మాణ సమయంలో కుటిలమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న వాసన్ తో ఆమె గొడవ పడింది. ఆ వివాదం న్యాయస్థానం వరకూ వెళ్లడంతో కాంచనమాల మతి స్థిమితాన్ని కోల్పోయింది ... ఆమె భ్యవిష్యత్తు అలా మసకబారి పోయింది.

ఘనమైన మనసున్న ఘంటసాల



ఘంటసాల
ఘంటసాల ... తెలుగు పాటతో పరిచయమున్న ప్రతి ఒక్కరికి ఈ పేరంటే ప్రాణం. మధురమైన స్వరం పై మక్కువ చూపేవారికి ఆయనంటే అంతులేని అభిమానం ... అమితమైన ఆరాధన. మధురమైన స్వరంతోనే కాదు ... మంచులాంటి మనసుతో కూడా ఆయన ఎందరినో ఆకట్టుకున్నారు. అందుకు నిదర్శనంగా అప్పట్లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ కథానాయకుడుగా చేసిన 'భలే తమ్ముడు' చిత్రానికి గాను పాటల రికార్డింగ్ జరుగుతోన్న రోజులవి. ఈ సినిమా నిర్మాత అయిన పుండరీ కాక్షయ్య కొత్తదనం కోసం పాటలను మహమ్మద్ రఫీ తో పాడించాలనుకుని, బొంబాయి నుంచి ఆయనని పిలిపించారు.

మద్రాసులో అడుగు పెడుతూనే ఆయన ఘంటసాలను కలిసి, ఆయన వంటి మహాగాయకుడు ఉండగా తెలుగులో తాను పాడకూడదని అన్నాడట. అలాంటివేమీ మనసులో పెట్టుకోవద్దనీ ... తనకి ఇచ్చేదానికన్నా ఎక్కువే ఇస్తారు కాబట్టి లాభం పొందమంటూ ఘంటసాల ప్రోత్సాహించారు. ఘంటసాల ఆ విషయాన్ని అంత తేలికగా తీసుకోవడంతో, ఆయన పెద్ద మనసుకి రఫీ ఆశ్చర్య పోయారట.

ఆ తరువాత 'సువర్ణ సుందరి' సినిమాను హిందీలో తీస్తుండగా, ''హాయి హాయిగా ఆమని సాగే'' అనే పాటను హిందీలో పాడటానికి లతా మంగేష్కర్ - రఫీ మద్రాసుకి వచ్చారు. అయితే ఈ పాట రిహార్సల్ జరుగుతుండగా వరుస కుదరక రఫీ ఇబ్బంది పడిపోతున్నాడు. అదే సమయంలో వేరే సినిమా పాటల రికార్డింగ్ కోసమని అక్కడికి వెళ్లిన ఘంటసాలను లతా మంగేష్కర్ చూసి, తనతో కలిసి ఆ పాటను పాడమని ఒత్తిడి చేశారు. అలా చేస్తే రఫీని కించపరిచినట్టు ఔతుందని భావించిన ఘంటసాల, ఆమెకి ఏదో కుంటి సాకు చెప్పి అక్కడి నుంచి బయట పడ్డారట.