6, అక్టోబర్ 2012, శనివారం

ఘనమైన మనసున్న ఘంటసాల



ఘంటసాల
ఘంటసాల ... తెలుగు పాటతో పరిచయమున్న ప్రతి ఒక్కరికి ఈ పేరంటే ప్రాణం. మధురమైన స్వరం పై మక్కువ చూపేవారికి ఆయనంటే అంతులేని అభిమానం ... అమితమైన ఆరాధన. మధురమైన స్వరంతోనే కాదు ... మంచులాంటి మనసుతో కూడా ఆయన ఎందరినో ఆకట్టుకున్నారు. అందుకు నిదర్శనంగా అప్పట్లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ కథానాయకుడుగా చేసిన 'భలే తమ్ముడు' చిత్రానికి గాను పాటల రికార్డింగ్ జరుగుతోన్న రోజులవి. ఈ సినిమా నిర్మాత అయిన పుండరీ కాక్షయ్య కొత్తదనం కోసం పాటలను మహమ్మద్ రఫీ తో పాడించాలనుకుని, బొంబాయి నుంచి ఆయనని పిలిపించారు.

మద్రాసులో అడుగు పెడుతూనే ఆయన ఘంటసాలను కలిసి, ఆయన వంటి మహాగాయకుడు ఉండగా తెలుగులో తాను పాడకూడదని అన్నాడట. అలాంటివేమీ మనసులో పెట్టుకోవద్దనీ ... తనకి ఇచ్చేదానికన్నా ఎక్కువే ఇస్తారు కాబట్టి లాభం పొందమంటూ ఘంటసాల ప్రోత్సాహించారు. ఘంటసాల ఆ విషయాన్ని అంత తేలికగా తీసుకోవడంతో, ఆయన పెద్ద మనసుకి రఫీ ఆశ్చర్య పోయారట.

ఆ తరువాత 'సువర్ణ సుందరి' సినిమాను హిందీలో తీస్తుండగా, ''హాయి హాయిగా ఆమని సాగే'' అనే పాటను హిందీలో పాడటానికి లతా మంగేష్కర్ - రఫీ మద్రాసుకి వచ్చారు. అయితే ఈ పాట రిహార్సల్ జరుగుతుండగా వరుస కుదరక రఫీ ఇబ్బంది పడిపోతున్నాడు. అదే సమయంలో వేరే సినిమా పాటల రికార్డింగ్ కోసమని అక్కడికి వెళ్లిన ఘంటసాలను లతా మంగేష్కర్ చూసి, తనతో కలిసి ఆ పాటను పాడమని ఒత్తిడి చేశారు. అలా చేస్తే రఫీని కించపరిచినట్టు ఔతుందని భావించిన ఘంటసాల, ఆమెకి ఏదో కుంటి సాకు చెప్పి అక్కడి నుంచి బయట పడ్డారట.         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి