19, ఏప్రిల్ 2011, మంగళవారం

మన "అభివృద్ధి" ఎటువైపు?





ప్రపంచం అంతా అభివృద్ధి పధంలోనడుస్తున్న కాలంలో బానిస బ్రతుకుల నుంచి విముక్తికై బ్రిటీష్ వారితో పోరాడటానికే మన కాలం, శక్తీ అంతా సరిపోయింది. గర్వంగా ఏదో సాధించేశామని దాదాపు అర్ధ శతాబ్ధం ప్రపంచం పట్టనట్టు కళ్ళుమూసుకుని, ఇప్పుడిప్పుడే అబ్జివృద్ధి చెందుతున్న దేశాలనుంచి మంచీ. చెడూ రెండూ తీసుకుని, ఆ...మేమూ అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకుంటూ మురిసిపోతున్నాం. అమెరికా లాంటి అగ్ర దేశం సైతం- ఇండియా రాబోయే తరాలకి, అభివృద్ధి చెందిన దేశాలకీ పెద్ద పోటీ అంటూ రోజూ ఎన్నోసందర్భాల్లో చెబుతూనే ఉంది.

మనం నిజమైన అభివృద్ధి పధం వైపు అడుగులు వేస్తున్నామా? లేదా, పై పై మెరుగులు చూసి మురిసిపోతున్నామా? అభివృద్ధి అంటే దేశంలో పెద్ద నగరాల్లో వెలుస్తున్న ఆధునిక కట్టడాలు, విదేశీ సంస్థలు నెలకొల్పుతున్న వ్యపారాల్లో పని చేసి బాగానే సంపాదిస్తున్నాం అనుకోవటం మాత్రమేనా?

ప్రపంచంలో ఇంకా జీవనకోటి కి నాగరికత కూడా తెలియని కాలంలో మన దేశం నాగరీకంగా ఎంతో ముందుంది అని మన చరిత్ర చాటుతూనే ఉంది. కానీ ఈనాడు మనమున్న దుస్థితి చూసుకుని మన చరిత్ర చూసి గర్వపడాలో, అది నాశనం చేసుకుంటున్న మనల్ని చూసి నవ్వుకోవాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాం.

మన తెలుగుజాతి గర్వించేలా ఎన్నో రంగాల్లో ఎంతో కృషి చేసిన ఎందరో మహనీయులని మనం ఎప్పుడో మరచిపోయాం. నేటి తరానికి వారి పేర్లు కూడా సరిగా తెలియవు, రాబోయే తరాలకి "హ్యారీ పాటర్" తెలిసినంతగా మహా భారతమూ, రామాయణమూ తెలియవు అనటంలో సందేహమే లేదు. అలాంటి మరుగున పడుతున్న మన తెలుగు చరిత్రని తిరిగి గర్వంగా నిలబెట్టే ప్రయత్నం చేయటమే కాదు, అందులో సఫలం అయిన మహనీయులు శ్రీ యన్.టి.రామారావు. ఆనాడు ఆయన రూపుదిద్దిన హైదరాబాద్ నగరంలో ఎందరినో ఆహ్లాద పరచిన మన "ట్యాంక్ బండ్" పై  అనాగరిక ఘట్టం మన అభివృద్ధికి ప్రశ్నార్థకంగా ఉంది.

ఇదేనా మన అభివృద్ధి? అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధీటుగా మనం పోటీ పడగలమా? ఎందులో? ఈ 21 వ శతాబ్ధంలోనూ కుల, మత, ప్రాంతీయ, భాషా బేధాలతో నిత్యం రగిలిపోతూ, మన చరిత్రని మనమే కూల్చుకుని ఏదో జయించాం, సాధించాం అని సంబరపడుతూ, పిచ్చిగా చిందులు వేస్తూ చేసే ప్రవర్తన అభివృద్ధికి చిహ్నమా?

రాయిలో సైతం దైవం చూసుకుని చేతులెత్తి దణ్ణం పెట్టగలిగే గొప్పతనం ప్రపంచంలో కేవలం మన దేశంలోనే ఉంది. దేశ ఉన్నతికి పాటుపడిన మహనీయులతో సమకాలీకులుగా పుట్టలేక పోవటం దురదృష్టం. కనీసం వారు పోయాక వారి చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ ప్రాణం లేని విగ్రహాలలోనైన వారిని సజీవంగా చూసుకునే భాగ్యం కలగటం అదృష్టం. అలాంటి పవిత్ర మూర్తుల విగ్రహాలని ఈనాడు కూల్చినది రాజ్యాలు కబళించి సంపద దోచుకుపోతూ పట్టుకు పోలేక కూల్చి సంబర పడ్డ ఏ పరదేశీయులో కాదు, మనమే. అభివృద్ధి చెందిన దేశాలతో అక్కడి పౌరులతో సైతం పోటీ పడగలం అని గర్వంగ చెప్పుకు తిరిగే మన తెలుగు జాతీయులమే. మన చరిత్రని మనమే కూల్చుకుంటున్నాం. నాగరికత చుట్టూ ఉన్న పరిసరాల్లో లేదు, ఆ పరిసరాల్లో కలసి జీవిచే పౌరులలో ఉంది. అభివృద్ధి జీవంలేని కట్టడాల్లో లేదు, జీవమున్న మన ప్రవర్తనలోనే ఉంది.

"దేశమంటే మట్టికాదోయ్...దేశమంటే మనుషులోయ్..." అన్న గురజాడ గారి మాటల్లో ఎంతటి సత్యముందో నిన్నటి మన "ట్యాంక్ బండ్ ఘట్టం" నిరూపించింది.

ఇన్నేళ్ళూ జరుగుతున్న అభివృద్ధినీ, తెలుగుజాతి ఎదుగుదలనీ చూసి సంబరపడుతూ నగరం నడిబొడ్డున కొలువై ఒకప్పుడు జీవంలేని ఆ జలాశయానికి జీవం తెచ్చి ఎందరినో ఆహ్లాద పరుస్తూ కళ కళ లాడిన తెలుగు మహనీయులు ఇక మా తెలుగువారి అభివృద్ధిని చూడలేం అంటూ వారి చేతుల్లోనే నేలకొరిగి నేడు నిజంగా అమరులయ్యారు.

"If you admire kings and Emperors for historical constructions like Golkonda and Charminar in Hyderabad, you should also admire NTR for bringing in monuments of Great Telugu Personalities on the TankBund."

"దేవుడా రక్షించు నా దేశాన్ని. ఈసారి శతృనేతల బారినుంచి కాదు, నా దేశ పౌరుల దాడి నుంచే"