20, అక్టోబర్ 2010, బుధవారం

మేం హిందువులం.

బుధవారం 20 అక్టోబర్ 2010

మేం హిందువులం...

మేం హిందువులం.
మా మతం చాలా గొప్పది

మాకు వేదాలూ వద్దు ఉపనిషత్తులూ వద్దు
ఆగమాలూ నిగమాలూ వద్దు
ఆచారాలూ వద్దు విచారాలూ వద్దు
వాటిలో ఏముందో అసలే వద్దు
అయినా మేం హిందువులం

షడ్దర్శనాల పేర్లే మాకు తెలీదు
వాటికి కర్తలెవరో మాకనవసరం
మా ఋషులెవరో మాకు తెలీదు
వారేం చెప్పారో మాకసలే వద్దు
అయినా మేం హిందువులం

వేదాలు వేదాంగాలు పురాణేతిహాసాలు
యోగ తంత్రాది పరమేశ్వర ప్రోక్తాలు
ఇవన్నీ క్షుద్రపూజలు మాకొద్దు
ఇమాం భుకారీలు జాకీర్ నాయక్ లు మా గురువులు
మదర్ తెరెసా మా దైవం
మేం అసలైన హిందువులం

వారంలో ఒక్కరోజు గుడికెళ్ళొస్తాం
అక్కడ మా కోర్కెల చిట్టా చదివి వినిపిస్తాం
బేరం మాట్లాడుకుంటాం
వాడికిచ్చావ్ గా నాకెందుకివ్వవ్ అని బెదిరిస్తాం
ఇవ్వకపోతే దేవుణ్ణే మార్చేస్తాం
మేం నిజమైన హిందువులం

ఏడాదికోసారి విచిత్రవేషాలేస్తాం
దీక్షలు తీస్కుంటాం
మైకులు పెట్టి వికృత అరుపులతో
పూజలు చేస్తాం
ఆ నలభై రోజులూ ఇంట్లో ఆడాళ్లని
నానా హింసా పెడతాం
రోడ్ల పక్కన భోజనాలుచేస్తాం
ఆ ఖర్చులకోసం అందరినీ బెదిరించి
చందాలు వసూలు చేస్తాం
ఇదే మా హిందూమతం

పరాయి రాష్ట్రాల దేవుళ్ళను తెచ్చుకుంటాం
మా వార్షిక వ్యాపారానికి వాడుకుంటాం
మాల వేస్తే ఇంత తీస్తే ఇంత
డ్రస్సుకింత డప్పుకింత
బస్సుకింత బసకింత అని
బేరాలు కుదుర్చుకుంటాం
దీక్ష ఎప్పుడైపోతుందా అని వేచి చూస్తుంటాం
మాల తీసిన రోజే బారు షాపులకు పరిగెడతాంమా వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ
ఇలాగే చెయ్యమని వ్రాసుంది.

జీవితమంతా మాచే చీదరించుకోబడ్డ బిచ్చగాడు
ఇప్పుడు అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు
ఎంగిలి సిగిరెట్లు తాగటం మానుకోలేనివాడు
ఎంతో గొప్ప సద్గురువు
మేం చెప్పినదే వేదం, ఇదే అసలైన హిందూ మతం
మేం హిందూమతోధ్ధారకులం.
ఇదే మా వ్యాపారం.

ఎవరైనా మీ అసలైన మతం
ఇది కాదురా బాబూ అని చెప్పబోతే
వాణ్ణో మాంత్రికుడని ముద్రవేస్తాం
వెకిలి కామెంట్లతో వేధిస్తాం బెదిరిస్తామ్
వాడేం చెబుతున్నాడో అస్సలు వినం
మాకు శ్రధ్ధా సబూరీలు చాలా ఎక్కువ
రౌడీయిజం మా గురువు చెప్పిన వేదం
మేం డాబా మీద నేర్చుకున్న మంత్రం

జీసస్ ని శిలువేసిందే మేము
మీరాని రాళ్లతో కొట్టిందే మేము
చైతన్యుణ్ణి చంపిందీ మేమే
మన్సూర్ తల నరికిందీ మేమే
సమ్మద్ ను, కోపర్నికస్ ను
జునాయడ్ ను, రబియానూ,
గురుగోవింద్ నూ, కబీర్ నూ
అంతం చేసింది మేమే
ఏ ప్రవక్తనైనా ముందు తిడతాం చంపుతాం
తర్వాత పూజిస్తాం, మా కోరికలకోసం
మేం గొప్ప అభ్యుదయ వాదులం

మేమే అసలైన హిందువులం
ఇదే అసలైన హిందూమతం
మా మతం చాలా గొప్పది.
అదేం చెప్పిందో మాకస్సలు తెలీదు
అది వేరే విషయం.

అయినా సరే
మేం హిందువులం.
మా మతం చాలా గొప్పది.
ఒప్పుకోకపోయావో నీ సంగతి చూస్తాం.

తాడూ-బొంగరం లేదని ఎవడన్నాడు

తాడూ-బొంగరం లేదని ఎవడన్నాడు?





 చాలా మంది తాడూ-బొంగరం లేని ఎదవ అని వెక్కిరిస్తూ వుంటారు కదా! తాడూ-బొంగరం లేదని చాలా తక్కువగా కూడా చూస్తారు. కొంత మంది అయితే తాడూ-బొంగరం లేని వాడు కదా అని పిల్లని కూడా ఇవ్వట్లేదట. అలాంటి మనుషులకు అవకాశం ఇవ్వకూడదని ఈ తాడూ-బొంగరం ఒకటి మొన్న భారత దేశం నించి తెప్పించా.( అడగ్గానే ఈ బొంగరం పంపిన నా బాల్య మిత్రుడుకి ధన్యవాదాలు ఈ బ్లాగ్గు ద్వారా).

కామెడీ పాయింట్ పక్కన పెడితే, ఈ బొమ్మలో వున్న అందమైన బొంగరం- దానికి కట్టి వున్నతాడు ఎలా వున్నాయి? నేను చిన్నప్పుడు వీధుల్లో బొంగరాల ఆట ఆడేవాడిని. అదేమీ ఆషా-మాషీ ఎవ్వారం కాదు. ఆ బొంగరాలు దీనికంటే బరువు ఉండేవి, పైగా కొంచెం పెద్దగా ఉండేవి.  వాటికి ఇంచుమించు మేకు లాంటి AXIS వుండేది. ఆ బొంగరానికి తాడు చుట్టడంలో చాలా జాగ్రత్త వహించాలి. AXIS పైన భాగం దగ్గర తాడు ఒక కొసతో మొదలు పెట్టి పై వరకూ ఏ మాత్రం గ్యాప్ లేకుండా బిగుతుగా కట్టి, చిటికిన వేలు మరియు ఉంగరం వేలు మధ్యలో రెండో కొస పట్టుకుని వదలాలి. వదిలే టప్పుడు చాలా ఒడుపుగా దాని AXIS కింద వైపు పడేలా తాడుని విసిరి లాగేసినట్టు ఒదలాలి. అప్పుడు బొంగరం గిర్రు- గిర్రున తిరుగుతూ వుంటుంది చాలా సేపు.
 అలా తిరిగే బొంగరాన్ని ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళు ప్రదేశాన్ని ఎంచుకుని తిప్పుతూ ఆనందించవచ్చు. మన దర్శకుడు రాఘవేంద్ర రావు గారు అయితే సినిమా హీరోయిన్ బొడ్డు మీద, పిల్లలు అయితే  పుస్తకాల మీద, అర చేతిలోనూ - వాళ్ళ ఇష్టం అన్న మాట.  
మనిషి కనిపెట్టిన ఆట వొస్తువులలో అతి పురాతనమైన ఆట వొస్తువుగా ఈ బొంగరాన్ని గుర్తించారు.  మీ పిల్లలని ఇలాంటి వాటితో ఆడించాలంటే మీరే ఒకటి తయారు చేసుకోవొచ్చు. మేము చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం. మన ఇన్జక్షన్  సీసా రబ్బర్ మూత వుంటుంది కదా, అది ఒకటి వుంటే చాలు. దానికి మధ్యలో ఒక సన్న మేకు తోటి గుచ్చి కన్నం పెట్టి అందులోంచి ఒక అగ్గిపుల్ల దూరిస్తే చాలు. ఏ మాత్రం ఖర్చు లేకుండా మీరు బొంగరం తయారు చేసారన్నమాట. మీకు రాఘవేంద్ర రావు టైపు కోరికలు వుంటే ఒక అందమైన అమ్మాయిని అడిగి ఒప్పుకుంటే బొడ్డు మీద తిప్పి ఫోటో తీసి నాకు పంపండి. గూబ పగిలితే నాకు చెప్పకండి, కానీ మీరు రాఘవేంద్ర రావు అంత గొప్ప డైరెక్టర్ అవ్వాలంటే ఇలాంటివి తప్పవని adjust అయిపోయి, ఇంకొకళ్ళని వెతుక్కోండి. 
అన్నట్లు చెప్పండం మరిచా, ఈ బొంగరం పిచ్చి చాలా చోట్లే ఉంది ప్రపంచంలో. ఇలాంటి వాటికి పోటీలు కూడా జరుగుతూ వుంటాయి. బొంగరాన్ని హిందీ లో లట్టు, స్పానిష్ లో త్రోమ్పో, లాటిన్ లో turbo , ఇటాలియన్ లో trottola , ఫ్రెంచ్ లో la toupie , జర్మన్ లో kriesel , గ్రీక్ లో strombos మరియు ఇంగ్లీష్ లో టాప్ అని అంటారు.
ఇంత చెప్పాక, ఫోటో తీసి బ్లాగ్గు రాసి మరీ జత చేసాక, నన్ను "తాడు-బొంగరం లేని ఎదవ." అనే దమ్ము ఎవరికుంటుంది చెప్పండి. ఒక వేళ అన్నా, మీరు మటుకు ఎందుకు నమ్ముతారు.  ఇంకా కాదంటే మనం ఊరుకుంటామా? అన్న వాళ్ళ బొడ్డు మీద బొంగరం తిప్పెయ్యమూ?  

గమనిక: కామెడీ కోసం మాత్రమే రాసాను. నేనేమీ రాఘవేంద్ర రావు టైపు కలలు కనలేదు, ఎవ్వరిని అడగలేదు, నన్నెవ్వరూ  గూబ పగలకొట్టలేదు.  ఏదో నా బొంగరం నేను తిప్పుకున్నానంతే.