8, డిసెంబర్ 2010, బుధవారం

నిజాయితీతో అడుగేస్తే జగన్‌కు మంచి భవిష్యత్తుంది

జగన్‌ ఆలోచించి అడుగేస్తే మంచి భవిష్యత్తు ఉంది. మాఘలో పుట్టి పుబ్బలో అస్తమించిన పార్టీల మాదిరిగా కాకుండా విలువలతో కూడిన రాజకీయాలను ప్రవేశపెట్టాలి. అంటే మనరాష్ట్రంలో సాధ్యమా అంటే సాధ్యమవుతాయి. డబ్బు, దర్పం, అవినీతి, బంధుప్రీతి, స్వార్థం అనే వాటికి దూరంగా ఉండాలి. సాధ్యమా ? కాదా? నిర్ణయించుకోవాలి. కాంగ్రెస్‌ పార్టీని ఎదిరించి పార్టీ పెట్టిన వారంతా గొప్ప నాయకులే అయ్యారు. మహారాష్ట్రలో షరత్‌పవార్‌, పచ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జి లాంటి వారు వారి రాష్ట్రాల్లో ఎదిగారు. కాని వారంతా రాజకీయ విలువలకు కట్టుబడి లేనందున రాష్ట్ర రాజకీయాలను శాసించలేక పోయారు. అయితే గుర్తింపు పొందడానికి నేటివిటీ కూడా ఉపయోగపడుతుంది. వచ్చిన చిక్కంతా ఒకటే రాజకీయాలు డబ్బు, కులం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ రెండింటినీ ఎలా మేనేజ్‌ చేస్తారనేది చూడాలి. తెలంగాణా సాధన పేరుతో డాక్టర్‌ మర్రిచెన్నారెడ్డి స్థాపించిన తెలంగాణా ప్రజాసమితి నుంచి ఇటీవల సామాజిక న్యాయం పేరుతో వచ్చిన ప్రజారాజ్యం వరకు చూస్తే ఒక్క టిడిపి మాత్రమే సక్సెస్‌ అయ్యింది. తెలుగు వారి ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్‌ను గడగడలాండించారు ఎన్‌టి రామారావు. కాని ప్రస్తుతం రాష్ట్రంలో ఆపరిస్థితి లేదు. ఎన్‌టిరామారావుకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీలకతీతంగా సినిమా అభిమానులున్నారు. జగన్‌కు తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు, ఆయన సంపాదించిన డబ్బు తండ్రి పేరు కాంగ్రెస్‌వల్ల వచ్చింది. కాంగ్రెస్‌కు జగన్‌కు రాజీనామా చేయడం వల్ల సగానికి పైగా కాంగ్రెస్‌లోనే రాజశేఖర్‌రెడ్డికి ఉన్న కీర్తి పోయింది. ఇప్పుడు జగన్‌కు కొద్దిపాటి సానుభూతి మాత్రమే ఉంది. ఆసానుభూతికి కాంగ్రెస్‌, టిడిపి ఇతర పార్టీలనుంచి వచ్చే వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలి. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళనలు చేస్తున్నారు. తెలంగాణాలో జగన్‌కు వ్యతిరేకతనే ఎక్కువ. నూతన ఆర్థిక విధానాల పుణ్యమాని రాష్ట్రంలో సంపన్నులు మరింత సంపన్నులయ్యారు. పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడ్డారు. చెప్పాలంటే ఇంకా అనేక సమస్యలున్నాయి. కులాల వారీగా ప్రజల ఐక్యత దెబ్బతిన్నది. మతోన్మాదుల సంగతి చెప్పనవసరం లేదు. వేర్పాటు వాద ఉద్యమాలున్నాయి. ఐక్యంగా ఉందామని ఒక్క సిపిఎం మాత్రమే ధైర్యంగా చెబుతుంది. మిగతా పార్టీలన్నీ గోడమీది పిల్లి వాటంగా ఉన్నాయి. వీటన్నింటినీ భేరీజు వేసుకునే శక్తి సామర్థ్యాలు కావాలి. పార్టీకి కొన్ని కొన్ని సిద్ధాంతాలుండాలి. వాటిని అమలు చేయగల మొక్కవోని ధైర్యముండాలి. ఈ దేశానికి సైనికుల్లాంటి సేవాభావం ఉన్న నాయకత్వం కావాలి. ఒకరినొకరు దోచుకునే వ్యవస్థను ప్రశ్నించాలి. అప్పుడే జగన్‌ పెట్టే కొత్త పార్టీ హిట్టు అవుతుంది.లేదంటే ఫట్టే...!

పెద్ద పెద్ద విప్లవాలొద్దు, మనలో ఒక చిన్న మార్పు చాలు

మన రాజకీయాల్లోనూ, వ్యవస్థలోనూ ఉన్న ఎన్నో సమస్యలూ వైవిధ్యాల గురించి అలోచనలూ భావ సంఘర్షణలూ రోజూ ఎదురవుతూనే వుంటాయి మనకు. అవినీతి, అవగాహనా రాహిత్యం, రకరకాల వివక్షలూ, అతిగా ఊహించుకుని చూసే ఆభిజాత్యాలూ ఇంకా ఇంకా ఎన్నో ఎన్నెన్నో..

నా దృష్టిలో అనేక సమస్యలకు కారణాలుగా కనిపిస్తూ, పరిష్కారాలకు అడ్డంకిగా అనిపిస్తున్న అతి ముఖ్యమైన విషయాలుగా కనిపించేవి:
  1. రాజకీయ అవినీతి
  2. సమాజంలో నాయకత్వ లోపం
  3. రాజకీయాలకీ, వ్యవస్థకీ ప్రజలు వీలైనంత దూరంగా ఉండడం
  4. మన వ్యవస్థ పనితీరులో పారదర్శకత లోపించడం
  5. ఇంతపెద్ద వ్యవస్థలో మార్పు మనవల్ల అయ్యే పనేనా అనే నిస్పృహ
ఇవేకాకుండా ఇంకా అనేక సమస్యలు ఉనాయి. అయితే పరిష్కారాలు మాత్రం ఎదో అలా కొంతమంది మేధావులు చెప్పే చిట్కాల్లా సులువుగా ఉండవు. అసలు నాదృష్టిలో సులువుగా కనిపించే మార్గం అంత నమ్మదగినదిగా అనిపించదు. అనేకనేక సమస్యలకి పైన మనం చెప్పుకున్న సమస్యలు మూలకారణాలైవుంటాయి. వీటన్నింటి పరిష్కారానికి చాలా వరకు దోహద పడగలిగే మార్పులేవైనా వుంటే వాటిని ముందుగా చేసుకొంటే వ్యవస్థలో మార్పు కొంత వేగంగా జరిగె అవకాశం ఉంది.

నా దృష్టిలో స్థానిక ప్రభుత్వాలని (Local Governments ) బలోపేతం చేయడం అటువంటి మార్గాలలో అతి ముఖ్యమైనది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఈ దిశగా అవసరమైన చర్యలు మొదలు పెట్టాం గానీ అనుకున్నంత పురొగతి సాధించలేదు. అందుకే రాజ్యాంగం నిర్దేశించినట్టు మొత్తం 29 అంశాల మీదా నిధులూ, విధులూ, అధికారాలు స్థానిక ప్రభుత్వాలకి నిజంగా అప్పగించే ఎటువంటి ప్రయత్నాన్నైనా సమర్ధించడం చాలా అవసరం.
     
మనమొక్కళ్ళమే ఇంత పెద్ద వ్యవస్థని మార్చగలమా అనే సందేహాల్ని కాసేపు పక్కనబెడితే, మన పరిధిలో వీలైనంత వరకూ స్థానిక ప్రభుత్వాల బలోపేతానికి కృషిచేసే ప్రయత్నాలకు మద్దత్తు నివ్వడం, స్థానిక ప్రభుత్వాల పని తీరులో వీలయినంత పార్టిసిపేషన్ చెయ్యడం చేస్తే భావితరాలు ఖచ్చితంగా మెరుగైన భారత దేశాన్ని చూడగలుగుతారు.  ప్చ్ .. డౌటే అంటారా? బానే వుంది చూద్దాం అంటారా? 

పారిశ్రామిక మర మనిషి



ర మనిషి (రోబో) ఈ పేరు వినగానే రజనీకాంత్‌ సినిమా గుర్తుకు వస్తుంది. దానిలో మర మనిషి అనేక విన్యాసాలు చేస్తుంది. అలాగే టివిలో వచ్చే కార్ల, కంప్యూటర్ల ప్రకటనల్లో కూడా మర మనిషిని చూస్తున్నాము. అవి మనల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
భారీ పరిశ్రమల్లో అతి క్లిష్టమైన పనులను చేయడానికి 50 సంవత్సరాల క్రిందటే మర మనిషిని వాడేవారు. అయితే మనిషి రూపంలో మర మనిషి వుండకపోవచ్చు. మనిషి కూడా చేయలేని పనులను కూడా సునాయాసంగా ఈ మర మనిషి చేయగలుగుతున్నాడు. ప్రస్తుతం భారీ పరిశ్రమల్లో రోబోట్లు వాడకం సర్వసామాన్యమైంది.
1960లో జార్జ్‌ ఛార్లెస్‌ డేవోల్‌ (జూనియర్‌) అనే శాస్త్రవేత్త మొట్ట మొదట ఈ పారిశ్రామిక మర మనిషిని డిజైన్‌ చేసి రూపొందించాడు. ఎంజెల్‌ బెర్జర్‌ సహకారంతో డేవోల్‌ తయారు చేసిన మొట్ట మొదటి రాబోట్‌ను జనరల్‌ మోటార్స్‌కు విక్రయించారు. 1961లో డేవోల్‌ ఫ్యాక్టరీ నుండి 'యునిమేట్‌' అనే పేరుతో తొలి పారిశ్రామిక మర మనిషిని తయారుచేశారు. దానిని న్యూజెర్సీలోని జనరల్‌ మోటారు ఫ్యాక్టరీలో ఇన్‌స్టాల్‌ చేశారు. దానితో ఫ్యాక్టరీలో ఆటోమేషన్‌కు తెర తీయడం జరిగింది. ఆ తరువాత అనేక పరిశోధనలు చేసి డిజైన్‌లో వున్న లోపాలను సరిచేసిన మరింత మెరుగుపర్చి 1966 నుండి డేవోల్‌ పూర్తిస్థాయి రోబోలను ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు.
న్యూజెర్సీలో ఇన్‌స్టాల్‌ చేయబడిన తొలి రోబోను డై-కాస్టింగ్‌ మెషిన్‌ నుంచి ఎర్రగా కాల్చిన ఇనుప ప్లేట్లన తీసి దొంతరగా పేర్చడానికి వినియోగించారు.

దేశాన్ని కాపాడే రంగం ఏది

చట్ట సభలు.. కార్య నిర్వాహక వ్యవస్థ.. న్యాయ వ్యవస్థ.. పత్రికా రంగం.. ఈ నాలుగు భారత ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలు..
చట్ట సభలు.. కార్య నిర్వాహక వ్యవస్థలపై ఎప్పుడో నమ్మకం పోయాయి..
16 మంది సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులలో 8 మంది.. అవినీతిపరులేనని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ చేసిన ఆరోపణలు.. భూ కుంభకోణంలో చిక్కుకుని బదిలీ అయిన కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి దినకరన్ నిర్వాకంతో న్యాయ వ్యవస్థ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయింది..
2జీ స్పెక్ట్రం కుంభకోణంలో లాబీయిస్టు నీరా రాడియాతో ప్రముఖ జర్నలిస్టులు జరిపిన సంభాషణల టేపులు బయటపడడంతో.. పత్రికా వ్యవస్థపై కూడా నమ్మకం, విశ్వాసం పోయింది..
వ్యవస్థలన్నీ కుళ్లి కృశించుకు పోతుంటే ఇక దేశాన్ని కాపాడే రంగం ఏది?

5, డిసెంబర్ 2010, ఆదివారం

సింహస్వప్నంగా వికీలీక్స్

సింహస్వప్నంగా వికీలీక్స్

అమెరికా దాని మిత్ర దేశాలకు వికీలీక్స్ సింహస్వప్నంగా మారింది. ప్రపంచ దేశాల దౌత్య సంబంధాల్లో నెలకొన్న కుట్రలు, కుయుక్తులు, అమానవీయ కార్యకలాపాలు, హక్కుల హననాలు బహిరంగమవుతుండడంతో అమెరికాతోసహా పలు పాశ్చాత్య ప్రజాస్వామిక దేశాల ప్రజాస్వామ్య స్వభావం ప్రపంచానికి అర్థమవుతోంది. రహస్య పత్రాలను వికీలీక్స్ ప్రచురించడం ఒక గొప్ప సమాచార విప్లవంగా ప్రపంచ ప్రజాస్వామికవాదులు కీర్తిస్తున్నారు. ఇరాక్, అఫ్ఘానిస్థాన్ యుద్ధాలలో అమెరికా అనుసరించిన కుట్రపూరిత, దుర్మార్గ విధానాలను ధృవపరచే పత్రాలను బయటపెట్టడంతోపాటుగా ఆ దేశ విదేశ వ్యవహారాలలోని లొసుగులు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎంతో కాలంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం 'తనకు తానుగా చంకలు గుద్దుకుంటూ ముందుకొస్తున్న ఆశావహ దేశం'గా విదేశాంగ మంత్రి హిల్లరి క్లింటన్ మన దేశంపై చేసిన వ్యాఖ్యానాలను వెల్లడించే పత్రాలను సైతం వికీలీక్స్ ప్రచురించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా మన దేశాన్ని గొప్పగా కీర్తించారు.
అంతర్జాతీయంగా భారత్ మరిన్ని బాధ్యతలను స్వీకరించాలని ఆయన మన దేశ ప్రతిపాదనకు అనుకూలంగా స్పందించడం పైపై మెరమెచ్చులేనని అ పత్రాల ద్వారా అర్థమవుతోంది. అలాగే తాలిబాన్ అణచివేత కోసం పాకిస్థాన్‌కు అమెరికా అందిస్తున్న ఆర్థికసహాయం భారత్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలకు, తాలిబన్లకు చేరుతోందని అమెరికా సైనిక, అధికార వర్గాలు భావిస్తున్న కీలక పత్రాలను సైతం వికీ విడుదల చేసింది.
'ప్రభుత్వాలను బహిరంగం చేస్తాం' అన్న నినాదంతో పనిచేస్తున్న లాభాపేక్షలేని ఒక స్పచ్ఛంద సంస్థ వికీలీక్స్. అందరికీ అందుబాటులోలేని ప్రభుత్వ పత్రాలను సేకరించి, స్వీకరించి అ సంస్థ ప్రచురిస్తుంది. 2006లో ఆస్ట్రేలియాకు చెందిన జూలియన్ అస్సాంజ్ సారథ్యంలో సన్‌షైన్ ప్రెస్ ఆ వెబ్‌సైట్ ను ప్రారంభించింది. తైవాన్, యూరప్, ఆస్ట్రేలి యా, దక్షిణాఫ్రికాలకు చెందిన సాంకేతిక నిపుణులు, రాజకీయాశ్రయం పొందిన చైనీయులు, జర్నలిస్టులు, గణితశాస్త్రవేత్తలు ఈ వెబ్‌సైట్‌ను నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఆసియా ఖండంలోని, మాజీ సోవియట్ కూటమిలోని దేశాలు, ఆఫ్రికా ఖండం, మధ్యప్రాచ్యంలోని నిరంకుశ రాజ్యాలు చేస్తున్న నిరంకుశ కార్యకలాపాలను, అణచివేత చర్యలను ప్రపంచ ప్రజలకు బహిర్గత పర చాలన్న ప్రాథమిక లక్ష్యంతో వికీలీక్స్ ఏర్పడింది.
తమ ప్రభుత్వాల, కార్పొరేట్ సంస్థల అనైతిక ప్రవర్తన గురించి ఏ ప్రాంత ప్రజలు అందజేసిన పత్రాలను కూడా ఈ వెబ్‌సైట్ ప్రచురిస్తుంది. మొదటగా 'చట్టాలకతీతమైన సంహారాలు, అదృశ్యాలు' అని కెన్యా 'జాతీయ మానవ హక్కుల కమిషన్' నివేదికను వికీలీక్స్ ప్రచురించింది. ఇరాక్‌లో అమెరికా సైన్యం దాదాపు లక్షన్నర మంది అమాయక పౌరులను ఊచకోత కోసింది. 2007లో అమెరికా సైన్యం చేస్తున్న అమానుష మారణకాండకు సంబంధించిన దృశ్యాలను 'కొల్లేటరల్ మర్డర్' పేరుతో 2010లో వికీలీక్స్ వెబ్‌సైట్‌లో పెట్టారు. దాంతో పాటు 'ఇరాక్ వార్ లాగ్స్' అని 4 లక్షల డాక్యుమెంట్లను కూడా వికీ ప్రచురించింది.
ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి సోవియట్ సోషలిస్టు స్వప్నం ఆవిరవడంతో అమెరికా ప్రపంచ సంరక్షకుడుగా, ప్రపంచ పోలీసుగా అవతరించింది. సహజ వనరులను, మాన వ వనరులను వినియోగించుకునేందుకు ప్రపంచ దేశాల్లో అమెరికా సకల దుర్మార్గాలకు పాల్పడింది. ప్రపంచంలో ఎక్కడ మానవ హక్కుల హరణం, హననం జరిగినా అమెరి కా పాత్ర ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఉన్నట్లు ఈ పత్రాలు రుజువు చేస్తున్నాయి. దాంతో వికీలీక్స్ గురి అంతిమంగా అమెరికా వైపుకు మళ్ళక తప్పలేదు. ఇరాక్ దుర్రాకమణ యుద్ధంలో, ఆఫ్ఘానిస్తాన్‌లో, క్యూబా సరిహద్దులలోని గ్వాంటినామా జైలులో అమెరికా అమానుషాలను తెలిపే పత్రాలను వికీలీక్స్ ధైర్యంగా ప్రచురించింది.
లాటిన్ అమెరికా మార్కెట్లను గుప్పిట్లో పెట్టుకునేందుకు, అమెరికా ప్రభుత్వం, సీఐఏ, దాని కార్పొరేట్ సంస్థలు ఆయా దేశాల ప్రజా ప్రభుత్వాలను కూల్చేందుకు పన్నిన పన్నాగా లు, కుట్రలకు సంబంధించిన పత్రాలను లక్షల సంఖ్యలో ప్రచురించింది. వెనిజులా, క్యూబా దేశాధినేతలను హత్య చేసేందుకు జరిగిన కుట్ర రహస్యాలు వెల్లడయ్యాయి. ఉత్తర కొరియాను నియంత్రించే విషయంలో అమెరికా, చైనాల మధ్య కుదిరిన రహస్య ఒప్పంద పత్రాలను, చివరికి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్, ఆయన సిబ్బందిపైన అమెరికా ప్రభుత్వం గూఢ చర్యానికి పాల్పడింది.
వికీలీక్స్ చేతికి అధికారిక రహస్య పత్రాలు చిక్కిన దేశాల ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు ఆ వెబ్‌సైట్‌కు వ్యతిరేకంగా తీవ్రంగా విరుచుకుపడ్డాయి అవన్నీ అసత్యాలని అరచి గగ్గోలు పెట్టాయి. కెనడా ప్రభుత్వ మాజీ సలహాదారు సాంజ్‌ను హత్య చేయాల ని పిలుపిచ్చాడు. విక్కీలీక్స్ కార్యకలాపాలను ఇరాన్ తీవ్రంగా దుయ్యబట్టింది. అమెరి కా విదేశాంగ విధాన ప్రయోజనానికేగాక, అంతర్జాతీయ సమాజానికి, చాలామంది ప్రాణాలకు వికీలీక్స్ వల్ల ప్రమాదం వాటిల్లుతుందని హిల్లరీ క్లింటన్ వాఖ్యనించారు. రిపబ్లికన్ నాయకురాలు సారా పాలిన్ వికీలీక్స్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అమెరికాలోని ఇరు పార్టీలు వికీలీక్స్‌ను వ్యతిరేకించడం చూస్తే అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలోని డొల్లతనం అర్థమవుతుంది.
సమాచార హక్కు చట్టాలను తీసుకురావాలని ప్రపంచ దేశాలను ఒత్తిడి చేసిన అమెరికాలో ప్రజాస్వామ్యం ఎంత బూటకమో వికీలీక్స్ బయటపెట్టింది. బయటకు వెల్లడైన దుర్మార్గాల పట్ల పశ్చాత్తాపం ప్రకటించి, వాటిని విడనాడడం మాని, గూఢచర్య రహస్యాలను బహిర్గతం చేసిన నేరంపై కేసులు పెట్టేందుకు అమెరికా సిద్ధపడింది. శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడినట్లు అమెరికా పరిస్థితి తయారయింది.
అమెరికా దౌత్యనీతిలోని కుటిలత్వాన్ని, అమానవీయ కార్యకలాపాల్ని ధృవీకరించే పత్రాలను ప్రచురించి సంచలనం సృష్టించిన వికీలీక్స్ సంపాదకుడు జూలియన్ అస్సాంజ్‌పై ఇంటర్‌పోల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. అత్యాచారం కేసు న మోదు చేసింది. అమెరికా మీడియా ప్రతినిధులు, దాని మిత్రదేశాలు అస్సాంజ్‌ను అపఖ్యాతిపాలు చేసి వేధిస్తున్నాయి. వికీలీక్స్ వెబ్‌సైట్ సర్వెర్‌ను అమెరికా నిషేధించింది. అమెరి కా నిషేధాన్ని ధిక్కరిస్తూ 'వికీలీక్స్ డాట్ సీహెచ్' అన్న వెబ్‌సైట్ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది.

న్యాయానికి సమాధి

న్యాయానికి సమాధి

ప్రపంచ పారిశ్రామిక చరిత్రలో అదో ఘోర కలి.. దారుణంగా వేల మంది ప్రాణాలను బలిగొన్న విధ్వంసం.. లక్షల మందిని జీవచ్ఛవాలుగా మార్చి వేసిన దుర్ఘటన.. వేల పశు పక్ష్యాదుల ఉసురు తీసిన విలయం.. శుభ్ర జలాలను గరళంగా మార్చిన ఉత్పాతం.. అదే భోపాల్ విష వాయువు దుర్ఘటన.. ఆ మహా విషాదానికి నేటికి సరిగ్గా 26 ఏళ్లు..
అంతటి మహా పాతకానికి అసలు కారణం.... స్వార్థ పరుల ధనదాహం.. భ్రష్ట రాజకీయ నాయకుల దుష్ట నీతి.. సగటు భారతీయుడి ప్రాణాలంటే విలువ లేని కర్కశత్వం.. ఎవ్వరేమి చేస్తారులేనన్న విశృంకలత్వం..
25 ఏళ్ల తరవాత వెలువడిన తీర్పు.. న్యాయానికి సమాధి కట్టింది.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచింది.. అమాయకుల ప్రాణాలను అపహాస్యం పాలు చేసింది.. చట్టాలను సట్టు బండలుగా చేసింది.. పాలకుల దుర్నీతికి.. దుర్రాజకీయాలకు పరాకష్టగా మిగిలింది.. ఈ దేశంలో సామాన్య ప్రజల మాన ప్రాణ రక్షణలకు ఉన్న విలువలేపాటివో తేల్చి చెప్పిన సందర్భం..

1984 డిసెంబర్ 2వ తేది అర్థరాత్రి సమయంలో జరిగిన సంఘటనలో..
వేల శవాలను నర్మదా నదిలో పడవేశారు.
నోరు లేని మూగ జీవాలు ఎన్నో బలయ్యాయి.
2 వేల గేదెలు, గొర్రెలు, ఇతర జంతువులు విగతజీవులయ్యాయి.
పచ్చని చెట్లు మోడువారాయి.
భూగర్భ జలాలు పనికిరాకుండా పోయాయి.
ఈ ప్రమాదం 5.20 లక్షల మందిపై ప్రభావం చూపింది.
వీరిలో 2 లక్షల మంది చిన్నరులే.
3వేల మంది గర్భిణులు వున్నారు.
దాదాపు 2 లక్షల మంది శాశ్వతంగా గాయాలపాలయ్యారు.

కేవలం 713 కోట్ల పరిహారానికి కార్బైతో ఒప్పందం చేసుకోవడం ఒక దారుణమనుకుంటే.. ఇప్పటికీ 17 వేల మంది పరిహారం కోసం ఎదురు చూస్తూ ఉండటం.. బాధితులుగా గుర్తించమని 1000 మంది నేటికీ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉండడం నాయకుల గుండె తడి లోపించిన బండతనాన్ని నిరూపిస్తున్నాయి.

67 ఎకరాల కార్బైద్ ఆవరణలో భూస్థాపితం చేసిన టన్నుల కొద్దీ విష రసాయనాలు భూగర్భ జలాల్లోకి ఇంకి ప్రజారోగ్యాన్ని మరింతగా హరిస్తూ అకాల మృత్యువుకు చేరువచేస్తున్నా.. వాటి తొలగింపుకు అవసరమైన 100 కొట్లను కార్బైద్ లేదా దానిని కొన్న వారి ముక్కు పిండి వసూలు చేయలేని నిర్వీర్యులం మనం.