5, డిసెంబర్ 2010, ఆదివారం

సింహస్వప్నంగా వికీలీక్స్

సింహస్వప్నంగా వికీలీక్స్

అమెరికా దాని మిత్ర దేశాలకు వికీలీక్స్ సింహస్వప్నంగా మారింది. ప్రపంచ దేశాల దౌత్య సంబంధాల్లో నెలకొన్న కుట్రలు, కుయుక్తులు, అమానవీయ కార్యకలాపాలు, హక్కుల హననాలు బహిరంగమవుతుండడంతో అమెరికాతోసహా పలు పాశ్చాత్య ప్రజాస్వామిక దేశాల ప్రజాస్వామ్య స్వభావం ప్రపంచానికి అర్థమవుతోంది. రహస్య పత్రాలను వికీలీక్స్ ప్రచురించడం ఒక గొప్ప సమాచార విప్లవంగా ప్రపంచ ప్రజాస్వామికవాదులు కీర్తిస్తున్నారు. ఇరాక్, అఫ్ఘానిస్థాన్ యుద్ధాలలో అమెరికా అనుసరించిన కుట్రపూరిత, దుర్మార్గ విధానాలను ధృవపరచే పత్రాలను బయటపెట్టడంతోపాటుగా ఆ దేశ విదేశ వ్యవహారాలలోని లొసుగులు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎంతో కాలంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం 'తనకు తానుగా చంకలు గుద్దుకుంటూ ముందుకొస్తున్న ఆశావహ దేశం'గా విదేశాంగ మంత్రి హిల్లరి క్లింటన్ మన దేశంపై చేసిన వ్యాఖ్యానాలను వెల్లడించే పత్రాలను సైతం వికీలీక్స్ ప్రచురించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా మన దేశాన్ని గొప్పగా కీర్తించారు.
అంతర్జాతీయంగా భారత్ మరిన్ని బాధ్యతలను స్వీకరించాలని ఆయన మన దేశ ప్రతిపాదనకు అనుకూలంగా స్పందించడం పైపై మెరమెచ్చులేనని అ పత్రాల ద్వారా అర్థమవుతోంది. అలాగే తాలిబాన్ అణచివేత కోసం పాకిస్థాన్‌కు అమెరికా అందిస్తున్న ఆర్థికసహాయం భారత్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలకు, తాలిబన్లకు చేరుతోందని అమెరికా సైనిక, అధికార వర్గాలు భావిస్తున్న కీలక పత్రాలను సైతం వికీ విడుదల చేసింది.
'ప్రభుత్వాలను బహిరంగం చేస్తాం' అన్న నినాదంతో పనిచేస్తున్న లాభాపేక్షలేని ఒక స్పచ్ఛంద సంస్థ వికీలీక్స్. అందరికీ అందుబాటులోలేని ప్రభుత్వ పత్రాలను సేకరించి, స్వీకరించి అ సంస్థ ప్రచురిస్తుంది. 2006లో ఆస్ట్రేలియాకు చెందిన జూలియన్ అస్సాంజ్ సారథ్యంలో సన్‌షైన్ ప్రెస్ ఆ వెబ్‌సైట్ ను ప్రారంభించింది. తైవాన్, యూరప్, ఆస్ట్రేలి యా, దక్షిణాఫ్రికాలకు చెందిన సాంకేతిక నిపుణులు, రాజకీయాశ్రయం పొందిన చైనీయులు, జర్నలిస్టులు, గణితశాస్త్రవేత్తలు ఈ వెబ్‌సైట్‌ను నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఆసియా ఖండంలోని, మాజీ సోవియట్ కూటమిలోని దేశాలు, ఆఫ్రికా ఖండం, మధ్యప్రాచ్యంలోని నిరంకుశ రాజ్యాలు చేస్తున్న నిరంకుశ కార్యకలాపాలను, అణచివేత చర్యలను ప్రపంచ ప్రజలకు బహిర్గత పర చాలన్న ప్రాథమిక లక్ష్యంతో వికీలీక్స్ ఏర్పడింది.
తమ ప్రభుత్వాల, కార్పొరేట్ సంస్థల అనైతిక ప్రవర్తన గురించి ఏ ప్రాంత ప్రజలు అందజేసిన పత్రాలను కూడా ఈ వెబ్‌సైట్ ప్రచురిస్తుంది. మొదటగా 'చట్టాలకతీతమైన సంహారాలు, అదృశ్యాలు' అని కెన్యా 'జాతీయ మానవ హక్కుల కమిషన్' నివేదికను వికీలీక్స్ ప్రచురించింది. ఇరాక్‌లో అమెరికా సైన్యం దాదాపు లక్షన్నర మంది అమాయక పౌరులను ఊచకోత కోసింది. 2007లో అమెరికా సైన్యం చేస్తున్న అమానుష మారణకాండకు సంబంధించిన దృశ్యాలను 'కొల్లేటరల్ మర్డర్' పేరుతో 2010లో వికీలీక్స్ వెబ్‌సైట్‌లో పెట్టారు. దాంతో పాటు 'ఇరాక్ వార్ లాగ్స్' అని 4 లక్షల డాక్యుమెంట్లను కూడా వికీ ప్రచురించింది.
ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి సోవియట్ సోషలిస్టు స్వప్నం ఆవిరవడంతో అమెరికా ప్రపంచ సంరక్షకుడుగా, ప్రపంచ పోలీసుగా అవతరించింది. సహజ వనరులను, మాన వ వనరులను వినియోగించుకునేందుకు ప్రపంచ దేశాల్లో అమెరికా సకల దుర్మార్గాలకు పాల్పడింది. ప్రపంచంలో ఎక్కడ మానవ హక్కుల హరణం, హననం జరిగినా అమెరి కా పాత్ర ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఉన్నట్లు ఈ పత్రాలు రుజువు చేస్తున్నాయి. దాంతో వికీలీక్స్ గురి అంతిమంగా అమెరికా వైపుకు మళ్ళక తప్పలేదు. ఇరాక్ దుర్రాకమణ యుద్ధంలో, ఆఫ్ఘానిస్తాన్‌లో, క్యూబా సరిహద్దులలోని గ్వాంటినామా జైలులో అమెరికా అమానుషాలను తెలిపే పత్రాలను వికీలీక్స్ ధైర్యంగా ప్రచురించింది.
లాటిన్ అమెరికా మార్కెట్లను గుప్పిట్లో పెట్టుకునేందుకు, అమెరికా ప్రభుత్వం, సీఐఏ, దాని కార్పొరేట్ సంస్థలు ఆయా దేశాల ప్రజా ప్రభుత్వాలను కూల్చేందుకు పన్నిన పన్నాగా లు, కుట్రలకు సంబంధించిన పత్రాలను లక్షల సంఖ్యలో ప్రచురించింది. వెనిజులా, క్యూబా దేశాధినేతలను హత్య చేసేందుకు జరిగిన కుట్ర రహస్యాలు వెల్లడయ్యాయి. ఉత్తర కొరియాను నియంత్రించే విషయంలో అమెరికా, చైనాల మధ్య కుదిరిన రహస్య ఒప్పంద పత్రాలను, చివరికి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్, ఆయన సిబ్బందిపైన అమెరికా ప్రభుత్వం గూఢ చర్యానికి పాల్పడింది.
వికీలీక్స్ చేతికి అధికారిక రహస్య పత్రాలు చిక్కిన దేశాల ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు ఆ వెబ్‌సైట్‌కు వ్యతిరేకంగా తీవ్రంగా విరుచుకుపడ్డాయి అవన్నీ అసత్యాలని అరచి గగ్గోలు పెట్టాయి. కెనడా ప్రభుత్వ మాజీ సలహాదారు సాంజ్‌ను హత్య చేయాల ని పిలుపిచ్చాడు. విక్కీలీక్స్ కార్యకలాపాలను ఇరాన్ తీవ్రంగా దుయ్యబట్టింది. అమెరి కా విదేశాంగ విధాన ప్రయోజనానికేగాక, అంతర్జాతీయ సమాజానికి, చాలామంది ప్రాణాలకు వికీలీక్స్ వల్ల ప్రమాదం వాటిల్లుతుందని హిల్లరీ క్లింటన్ వాఖ్యనించారు. రిపబ్లికన్ నాయకురాలు సారా పాలిన్ వికీలీక్స్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అమెరికాలోని ఇరు పార్టీలు వికీలీక్స్‌ను వ్యతిరేకించడం చూస్తే అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలోని డొల్లతనం అర్థమవుతుంది.
సమాచార హక్కు చట్టాలను తీసుకురావాలని ప్రపంచ దేశాలను ఒత్తిడి చేసిన అమెరికాలో ప్రజాస్వామ్యం ఎంత బూటకమో వికీలీక్స్ బయటపెట్టింది. బయటకు వెల్లడైన దుర్మార్గాల పట్ల పశ్చాత్తాపం ప్రకటించి, వాటిని విడనాడడం మాని, గూఢచర్య రహస్యాలను బహిర్గతం చేసిన నేరంపై కేసులు పెట్టేందుకు అమెరికా సిద్ధపడింది. శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడినట్లు అమెరికా పరిస్థితి తయారయింది.
అమెరికా దౌత్యనీతిలోని కుటిలత్వాన్ని, అమానవీయ కార్యకలాపాల్ని ధృవీకరించే పత్రాలను ప్రచురించి సంచలనం సృష్టించిన వికీలీక్స్ సంపాదకుడు జూలియన్ అస్సాంజ్‌పై ఇంటర్‌పోల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. అత్యాచారం కేసు న మోదు చేసింది. అమెరికా మీడియా ప్రతినిధులు, దాని మిత్రదేశాలు అస్సాంజ్‌ను అపఖ్యాతిపాలు చేసి వేధిస్తున్నాయి. వికీలీక్స్ వెబ్‌సైట్ సర్వెర్‌ను అమెరికా నిషేధించింది. అమెరి కా నిషేధాన్ని ధిక్కరిస్తూ 'వికీలీక్స్ డాట్ సీహెచ్' అన్న వెబ్‌సైట్ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది.