5, డిసెంబర్ 2010, ఆదివారం

న్యాయానికి సమాధి

న్యాయానికి సమాధి

ప్రపంచ పారిశ్రామిక చరిత్రలో అదో ఘోర కలి.. దారుణంగా వేల మంది ప్రాణాలను బలిగొన్న విధ్వంసం.. లక్షల మందిని జీవచ్ఛవాలుగా మార్చి వేసిన దుర్ఘటన.. వేల పశు పక్ష్యాదుల ఉసురు తీసిన విలయం.. శుభ్ర జలాలను గరళంగా మార్చిన ఉత్పాతం.. అదే భోపాల్ విష వాయువు దుర్ఘటన.. ఆ మహా విషాదానికి నేటికి సరిగ్గా 26 ఏళ్లు..
అంతటి మహా పాతకానికి అసలు కారణం.... స్వార్థ పరుల ధనదాహం.. భ్రష్ట రాజకీయ నాయకుల దుష్ట నీతి.. సగటు భారతీయుడి ప్రాణాలంటే విలువ లేని కర్కశత్వం.. ఎవ్వరేమి చేస్తారులేనన్న విశృంకలత్వం..
25 ఏళ్ల తరవాత వెలువడిన తీర్పు.. న్యాయానికి సమాధి కట్టింది.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచింది.. అమాయకుల ప్రాణాలను అపహాస్యం పాలు చేసింది.. చట్టాలను సట్టు బండలుగా చేసింది.. పాలకుల దుర్నీతికి.. దుర్రాజకీయాలకు పరాకష్టగా మిగిలింది.. ఈ దేశంలో సామాన్య ప్రజల మాన ప్రాణ రక్షణలకు ఉన్న విలువలేపాటివో తేల్చి చెప్పిన సందర్భం..

1984 డిసెంబర్ 2వ తేది అర్థరాత్రి సమయంలో జరిగిన సంఘటనలో..
వేల శవాలను నర్మదా నదిలో పడవేశారు.
నోరు లేని మూగ జీవాలు ఎన్నో బలయ్యాయి.
2 వేల గేదెలు, గొర్రెలు, ఇతర జంతువులు విగతజీవులయ్యాయి.
పచ్చని చెట్లు మోడువారాయి.
భూగర్భ జలాలు పనికిరాకుండా పోయాయి.
ఈ ప్రమాదం 5.20 లక్షల మందిపై ప్రభావం చూపింది.
వీరిలో 2 లక్షల మంది చిన్నరులే.
3వేల మంది గర్భిణులు వున్నారు.
దాదాపు 2 లక్షల మంది శాశ్వతంగా గాయాలపాలయ్యారు.

కేవలం 713 కోట్ల పరిహారానికి కార్బైతో ఒప్పందం చేసుకోవడం ఒక దారుణమనుకుంటే.. ఇప్పటికీ 17 వేల మంది పరిహారం కోసం ఎదురు చూస్తూ ఉండటం.. బాధితులుగా గుర్తించమని 1000 మంది నేటికీ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉండడం నాయకుల గుండె తడి లోపించిన బండతనాన్ని నిరూపిస్తున్నాయి.

67 ఎకరాల కార్బైద్ ఆవరణలో భూస్థాపితం చేసిన టన్నుల కొద్దీ విష రసాయనాలు భూగర్భ జలాల్లోకి ఇంకి ప్రజారోగ్యాన్ని మరింతగా హరిస్తూ అకాల మృత్యువుకు చేరువచేస్తున్నా.. వాటి తొలగింపుకు అవసరమైన 100 కొట్లను కార్బైద్ లేదా దానిని కొన్న వారి ముక్కు పిండి వసూలు చేయలేని నిర్వీర్యులం మనం.