8, డిసెంబర్ 2010, బుధవారం

పెద్ద పెద్ద విప్లవాలొద్దు, మనలో ఒక చిన్న మార్పు చాలు

మన రాజకీయాల్లోనూ, వ్యవస్థలోనూ ఉన్న ఎన్నో సమస్యలూ వైవిధ్యాల గురించి అలోచనలూ భావ సంఘర్షణలూ రోజూ ఎదురవుతూనే వుంటాయి మనకు. అవినీతి, అవగాహనా రాహిత్యం, రకరకాల వివక్షలూ, అతిగా ఊహించుకుని చూసే ఆభిజాత్యాలూ ఇంకా ఇంకా ఎన్నో ఎన్నెన్నో..

నా దృష్టిలో అనేక సమస్యలకు కారణాలుగా కనిపిస్తూ, పరిష్కారాలకు అడ్డంకిగా అనిపిస్తున్న అతి ముఖ్యమైన విషయాలుగా కనిపించేవి:
  1. రాజకీయ అవినీతి
  2. సమాజంలో నాయకత్వ లోపం
  3. రాజకీయాలకీ, వ్యవస్థకీ ప్రజలు వీలైనంత దూరంగా ఉండడం
  4. మన వ్యవస్థ పనితీరులో పారదర్శకత లోపించడం
  5. ఇంతపెద్ద వ్యవస్థలో మార్పు మనవల్ల అయ్యే పనేనా అనే నిస్పృహ
ఇవేకాకుండా ఇంకా అనేక సమస్యలు ఉనాయి. అయితే పరిష్కారాలు మాత్రం ఎదో అలా కొంతమంది మేధావులు చెప్పే చిట్కాల్లా సులువుగా ఉండవు. అసలు నాదృష్టిలో సులువుగా కనిపించే మార్గం అంత నమ్మదగినదిగా అనిపించదు. అనేకనేక సమస్యలకి పైన మనం చెప్పుకున్న సమస్యలు మూలకారణాలైవుంటాయి. వీటన్నింటి పరిష్కారానికి చాలా వరకు దోహద పడగలిగే మార్పులేవైనా వుంటే వాటిని ముందుగా చేసుకొంటే వ్యవస్థలో మార్పు కొంత వేగంగా జరిగె అవకాశం ఉంది.

నా దృష్టిలో స్థానిక ప్రభుత్వాలని (Local Governments ) బలోపేతం చేయడం అటువంటి మార్గాలలో అతి ముఖ్యమైనది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఈ దిశగా అవసరమైన చర్యలు మొదలు పెట్టాం గానీ అనుకున్నంత పురొగతి సాధించలేదు. అందుకే రాజ్యాంగం నిర్దేశించినట్టు మొత్తం 29 అంశాల మీదా నిధులూ, విధులూ, అధికారాలు స్థానిక ప్రభుత్వాలకి నిజంగా అప్పగించే ఎటువంటి ప్రయత్నాన్నైనా సమర్ధించడం చాలా అవసరం.
     
మనమొక్కళ్ళమే ఇంత పెద్ద వ్యవస్థని మార్చగలమా అనే సందేహాల్ని కాసేపు పక్కనబెడితే, మన పరిధిలో వీలైనంత వరకూ స్థానిక ప్రభుత్వాల బలోపేతానికి కృషిచేసే ప్రయత్నాలకు మద్దత్తు నివ్వడం, స్థానిక ప్రభుత్వాల పని తీరులో వీలయినంత పార్టిసిపేషన్ చెయ్యడం చేస్తే భావితరాలు ఖచ్చితంగా మెరుగైన భారత దేశాన్ని చూడగలుగుతారు.  ప్చ్ .. డౌటే అంటారా? బానే వుంది చూద్దాం అంటారా?