28, డిసెంబర్ 2010, మంగళవారం

యూపీఏ ప్రభుత్వం కార్పొరేట్లకు దాసోహం

ఏఐసీసీ 83వ ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ చేసిన ప్రసంగాలు వింటే సామాన్యులకెవరికైనా వారి మాటల పట్ల అమితమైన అభిమానం కలుగుతుంది. ఈ దేశంలో సామాన్యుల జీవితాలను మెరుగుపరిచేందుకు, అవినీతిని రూపు మాపేందుకు వారెంతో తపన చెందుతున్నారన్న అభిప్రాయం కలుగుతుంది.
యూపీఏ ప్రభుత్వం కార్పొరేట్లకు దాసోహమవుతూ సామాన్యులకు దూరమవుతున్నదని, ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అవినీతి తాండవిస్తున్నదని వెల్లువెత్తిన ఆరోపణలు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కంపించి వేశాయనడానికి ఈ సమావేశంలో నేతల ప్రసంగాలే నిదర్శనం. ఆకాశాన్నంటిన ధరలు, ఆకలి చావులు, నిర్వాసిత ప్రజల ఆక్రందనలు, గిరిజనుల వలసలు, అతలాకుతలమైన రైతు జీవితాలు, వడ్డీల చక్రబంధంలో చిక్కుకున్న గ్రామీణుల ఆత్మహత్యలు ఒకవైపు, వేల కోట్ల రూపాయల కుంభకోణాలు మరో వైపు మీడియాకు ఎక్కుతున్నాయి.
సామాన్యుడు కూటికి కటకటలాడుతుంటే, కొందరు కోట్ల రూపాయలు అడ్వాన్స్ పన్నులే కడుతున్నారు. ఐపిీఎల్, కామన్‌వెల్త్ , స్పెక్ట్రమ్ 2 జి కుంభ కోణాలలో లక్షల కోట్ల ప్రజాధనం నష్టపోవడం, వేల కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక మండలాలు, విల్లాలు, గోల్ఫ్ కోర్టులు, అక్రమ మైనింగ్, అటవీ సంపద కొల్లకొట్టడం, ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయల స్కాంలు, ఇవన్నీ దేశ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. రైతులు, గిరిజనులు, దళితులు, అణగారిన వర్గాలు, సామాన్య మధ్యతరగతి వర్గాల్లో ప్రభుత్వం, అధికార పార్టీ పట్ల అసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఏఐసీసీ ప్లీనరీలో సోనియా, రాహుల్ గాంధీలు ఈ అసంతృప్తికి పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేశారనడంలో అతిశయోక్తి లేదు.
అవినీతి ఒక అంటువ్యాధిలా ప్రబలిపోయిందని, దానిపై పోరాటాన్ని తీవ్రతరం చేయాలని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అంటే అవినీతిపరులను కఠినంగా శిక్షించాలని రాహుల్ గాంధీ అన్నారు. అవినీతిపరులు ఎంతటి శక్తివంతులైనా, రాజకీయ నాయకులైనా, అధికారులైనా వదిలిపెట్టబోమని ప్రధాని స్పష్టం చేశారు. అవినీతి నివారణకు సోనియా ప్రధానంగా అయిదారు సూచనలు చేశారు.
ఇందు లో మొదటిది ప్రజాప్రతినిధులకు సంబంధించింది. ఎన్నికల్లో సామాన్యుడు పోటీ చేయలేని పరిస్థితిని రాజకీయ పార్టీలే కల్పించాయి. టిక్కెట్లను అమ్ముకోవడం, ఎన్నికల్లో గెలిచేందుకు వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి రావడం, గెలిచిన తర్వాత వాటిని రాబట్టుకునేందుకు అవినీతికి పాల్పడడం ఒక చక్రంలా జరుగుతోంది.
అందువల్ల అభ్యర్థుల ఎన్నికల ప్రచారం, ఇతర వ్యయాలను ప్రభుత్వాలే భరించే విధానాన్ని సోనియా ప్రతిపాదించారు. సోనియా చేసిన రెండో ప్రతిపాదన- ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులపై వచ్చిన ఆరోపణలను వేగంగా విచారించి వారికి సాధ్యమైనంత త్వరలో శిక్ష పడేలా చూడడం. ఈ దేశంలో ఎక్కడో మధుకోడా లాంటి వారుతప్ప రాజకీయ నాయకులు అవినీతి ఆరోపణలపై కటకటాలు లెక్కపెట్టిన సందర్భాలు చాలా తక్కువ.
జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్‌లాంటి వారిపై కొన్నేళ్ళుగా కేసులు కొనసాగుతున్నాయి. సోనియా చేసిన ప్రతిపాదనల్లో మూడవది ప్రభుత్వ ప్రాజెక్టులు, కాంట్రాక్టులకు సంబంధించి పారదర్శక విధానాలను నిబంధనలను పాటించడం. వాటిని ఆయా ప్రభుత్వాలు తమ అవసరాలకు అనుగుణంగా మార్చకుండా చూడాలి.
కాంగ్రెస్ అధ్యక్షురాలు చేసిన నాల్గవ ప్రతిపాదన కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రులు, ముఖ్యమంత్రులు ఎడాపెడా భూముల్ని, ఇతర వనరులను అస్మదీయులకు కేటాయించే తమ విచక్షణాధికారాల్ని వదులుకోవడం. వైఎస్ఆర్ హయాంలో సహజవనరులను కేటాయించడం ద్వారా కొత్త సంపన్నులు తలెత్తారు. రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసి అధిష్ఠానాన్ని ధిక్కరించే స్థాయికి ఎదగడం గుణపాఠంగా నిలిచింది.
సహజ వనరులను ఉపయోగించడంలో, కేటాయించడంలో పారదర్శకమైన వ్యవస్థ ఉండాలని, గిరిజనులను, ఇతర సామాన్యుల జీవితాలతో చెలగాటమాటకూడదని సోనియా చెప్పడంలో కూడా ఆంతర్యం ఇదే. నిజానికి రాహుల్ చేసిన ప్రసంగంలో కూడా వ్యవస్థకూ, సామాన్యుడికీ మధ్య తెగిపోయిన సంబంధాన్ని ప్రస్తావించారు.
ఈ దేశంలో కష్టించి చెమటోడ్చేవారికి, దళితులకు, గిరిజనులకు, విద్యావంతులకు, ప్రతిభ కలవారికి, నిజాయితీ కల వ్యాపారులకు సరైన అవకాశాలు లభించకపోవడం, ధనబలం, రాజకీయ బలం, కండబలం కలవారికే వ్యవస్థలో ఆదరణ లభించడం గురించి రాహుల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రతిభ గలవారు వెనుకబడకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సాధారణ ప్రమాణాలతో చూస్తే ఈ ప్రసంగాలతో సోనియా, రాహుల్, మన్మోహన్‌ల పట్ల సదభిప్రాయం కలిగే అవకాశం ఉన్నది. కాని కాంగ్రెస్ పార్టీలో నేతలు చేస్తున్న వ్యవహారాలకూ, జరుగుతున్న పరిణామాలకూ వారి మాటలకూ పొంతనే లేదు. సోనియా ప్రసంగించిన ఏఐసిీసీ ప్లీనరీలోనే బీహార్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ ముసుగును బట్టబయలు చేశారు.
ప్లీనరీ దృశ్యాలు ప్రదర్శించిన స్క్రీన్‌పైనే బీహార్‌లో టిక్కెట్లు అమ్ముకున్న పార్టీ కేంద్ర నేతలు ముకుల్ వాస్నిక్, సాగర్ రాయికా, ఇమ్రాన్ కిద్వాయ్‌లపై చర్య తీసుకోవాలని, వారి ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసే పోస్టర్‌లను ప్రదర్శించారు. సోనియా, మన్మోహన్ సింగ్‌ల ముందే వారు తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ నేతలపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇది తొలిసారి కాదు. ప్రతి స్థాయిలోనూ, ప్రతి ఎన్నికల్లోనూ, ప్రతి నియామకంలోనూ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అవినీతి సాగుతూనే ఉంటుంది. తాను మంత్రి పదవి కోసం ఢిల్లీలో నేతలకు కొన్ని కోట్లు ఇచ్చేందుకు వచ్చానని తెలిసిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ తనను పిలిచి తిట్టారని ఒక మంత్రి స్వయంగా ఒక పత్రికలో రాసుకున్నారు.
ఢిల్లీలో ఎప్పుడూ కేంద్ర నేతలతో వివిధ రాష్ట్రాలకు చెందిన నేతల పదవుల బేరసారాలు సాగుతూనే ఉంటాయి. ఫలానా వ్యక్తి ఫలానా కేంద్ర మంత్రి కుమారుడికో, ఫలానా సలహాదారు కుమార్తెకో, ఫలానా ప్రధాన కార్యదర్శికో ఢిల్లీలోనో, లండన్‌లోనో నజరానాలు ఇచ్చినందు వల్లనే ఫలానా వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి దక్కిందన్న ప్రచారాలు వినపడుతూనే ఉంటాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో నరనరాల్లో పేరుకుపోయిన అవినీతిని నిర్మూలించకుండా సోనియా తమ ప్రభుత్వాల్లో మార్పు తేలేరు.
రెండవది... పార్టీలో ఉన్న మంత్రులు, ప్రజా ప్రతినిధుల్లో అత్యధికులు వ్యాపారాల్లో ఉన్నవారో, లేక బడా వ్యాపార సంస్థల తరఫున పనిచేసిన వారే కావడం. పార్లమెంట్‌లో ఏ ప్రశ్న వేయించాలో, ఏ ప్రశ్న వేయకుండా చూడాలో, ఏ చర్చను ఎవరు ప్రారంభించాలో కూడా కార్పొరేట్ సంస్థలు నిర్ణయిస్తున్నాయని నీరా రాడియా వంటి పిఆర్ సంస్థల అధిపతుల సంభాషణల్లో వ్యక్తమైంది.
ఇంతకూ సోనియా, మన్మోహన్, రాహుల్‌లు కార్పొరేట్ అవినీతిని ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.

యూపీఏ బురద - బీజేపీ మౌనం

మొదటి అయిదేళ్లనూ ఏ గొడవా లేకుండా సులభంగా దాటేసిన యూపీఏ... రెండోసారి అధికారంలోకొచ్చిన ఏడాదికల్లా కుంభకోణాల్లో చిక్కుకుంది. కామన్వెల్త్, ఆదర్శ్, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాలు ఒకదాని తర్వాత మరోటి తెరమీదికొచ్చి యూపీఏకు ఊపిరి సలపనీయడం లేదు. వీటన్నిటిలోనూ 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం అతి పెద్దది. విధానాలకు వక్రభాష్యం చెప్పి తనకు నచ్చిన కంపెనీలకు 2జీ స్పెక్ట్రమ్ లెసైన్స్లు సంత ర్పణ చేసిన టెలికాం మంత్రి రాజా దేశ ఖజానాకు దాదాపు లక్షా 76 వేల కోట్ల రూపాయల నష్టం తెచ్చారు. కుంభకోణం సాగుతున్న దశలోనే మీడియా దీన్ని వెల్లడించినా యూపీఏ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. తన చర్యలకు ప్రధాని ఆమోదం ఉందని మంత్రి ప్రకటించినా నోరెత్తలేని దయనీయ స్థితిలో మన్మోహన్ ఉండిపోయారు. చివరకు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణకు చేపట్టి సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నాక, కాగ్ తన నివేదిక ద్వారా బయటపెట్టాక గత్యంతరం లేక డీఎంకేను బతిమాలి రాజాను మంత్రి పదవి నుంచి తప్పించారు. ఈ కుంభకోణంపై జేపీసీ వేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు శీతాకాల సమావేశాలను పూర్తిగా స్తంభింపజేశాయి.

ఇక కార్గిల్ మృత వీరుల కుటుంబాల కోసం ముంబై లోని కొలాబాలో నిర్మించిన 31 అంతస్తుల ఆదర్శ్ హౌసింగ్ కాంప్లెక్స్లో అవినీతి కొలువుదీరడం మరింత షాకిచ్చింది. 2003లో నిర్మించిన ఈ కాంప్లెక్స్లో ఇప్పటి మార్కెట్ రేటును బట్టి ఒక్కో ఫ్లాట్ విలువ రూ. 6.5 నుంచి 8.5 కోట్ల రూపాయలు. కార్గిల్ అమరవీరుల కోసం కదా అని సైన్యం తన అధీనంలోని స్థలాన్ని సొసైటీకి లీజుకిచ్చింది. తొలుత ఆరంతస్తుల అపార్ట్మెంట్గా ప్రారంభమైన భవంతి అవినీతి రాజకీయ నేతల కన్నుపడేసరికి పెరుగుతూ పోయి వంద మీటర్ల ఎత్తయిన కాంప్లెక్స్గా మారింది. రాజకీయ నాయకులు, ఆర్మీబాస్లు అడ్డగోలుగా ఇందులో ఫ్లాట్లు దక్కించుకున్నారు. ఆర్మీ చీఫ్లుగా పనిచేసిన దీపక్ కపూర్, ఎన్సీ విజ్, నావికాదళ మాజీ వైస్ చీఫ్ శంతను చౌధరిలకు ఇందులో ఫ్లాట్లు ఉన్నాయంటే అందరూ ఆశ్చర్యపోయారు. తీరా బయటపడ్డాక అది కార్గిల్ వీరపత్నుల కోసమని తమకు తెలియదని ఈ పెద్దలు లెంపలేసుకుని వెనక్కి ఇచ్చేశారు. పరువు కాపాడుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ను కాంగ్రెస్ రాజీనామా చేయించింది. విచారణకు కమిషన్నూ ఏర్పాటు చేసింది. 

కామన్వెల్త్ క్రీడల ప్రారంభానికి ముందే అందులో అవినీతి గుప్పుమని అంతర్జాతీయంగా పరువుతీసింది. కామన్వెల్త్ గ్రామ నిర్మాణం దగ్గర్నుంచి, క్రీడాకారులు ఉపయోగించే చిన్నాచితకా వస్తువుల వరకూ అన్నింటిలోనూ కుంభకోణం జాడలే. ఈ కుంభకోణంలో ఆరోపణలనెదుర్కొన్న భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కల్మాడీ ఇంటిపైనా, ఆయన సన్నిహితుల ఇళ్లపైనా సీబీఐ దాడులు చేసింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి బాధ్యతల నుంచి కల్మాడీ వైదొలిగారు. చిత్రమేమంటే, ఈ స్కాములన్నింటిలో బీజేపీ పెద్దల పేర్లూ వినబడ్డాయి. కామన్వెల్త్ క్రీడల అవినీతిలో బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్కు అత్యంత సన్నిహితుడు, ఢిల్లీ బీజేపీ నేత సుధాంశు మిట్టల్ పేరు వెల్లడైంది. ఆయన డెరైక్టర్గా ఉన్న సంస్థకు దక్కిన రూ. 230 కోట్ల కాంట్రాక్టులో అవినీతి జరిగిందంటూ ఐటీ దాడులు జరిగాయి. ఆదర్శ్ కాంప్లెక్స్లో ఫ్లాట్ దక్కించుకున్న ఒకరు బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీకి సన్నిహితుడని, నిజానికి అతన్ని బినామీగా పెట్టి గడ్కారీయే దాన్ని పొందారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. 

ఇక రాడియా టేపుల్లో బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని దత్త పుత్రిక భర్త రంజన్ భట్టాచార్య నడిపిన వ్యవహారాలూ బయటికొచ్చాయి. మొత్తం మీద కాంగ్రెస్కు అంటిన బురదను ఎత్తిచూపి లబ్ధిపొందేంత స్థితి బీజేపీకి లేకుండా పోయింది. మరోపక్క కర్ణాటకలో బయటపడిన భూకుంభకోణాలు కూడా బీజేపీకి తలవంపులు తెచ్చాయి. కర్ణాటక ఐటీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు, ఆయన కుమారుడు జగదీష్ ఫోర్జరీ డాక్యుమెంట్లతో తమకు చెందని భూమికి కర్ణాటక పారిశ్రామికాభివృద్ధి సంస్థ నుంచి పరిహారం పొందారని ఆరోపణ లొచ్చాయి. దీనిపై సుబ్రమణ్యంనాయుడు రాజీనామా చేయాల్సి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా తన కుమారులిద్దరికీ సీఎం యడ్యూరప్ప నివాస స్థలాలు కేటాయించడం, షిమోగాలోని నివాసప్రాంతంలో ఓ కుమారుడికున్న 17 ఎకరాల భూమిని వాణిజ్యపరమైన ప్రయోజనాలకు వినియోగించుకునేలా అనుమతించడంలాంటి చర్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. దీనిపై వెనక్కి తగ్గిన యడ్యూరప్ప తన పిల్లల్ని అధికార నివాసం నుంచి పంపించేశారు. అయితే, ఆయనతో రాజీనామా చేయించడానికి బీజేపీ కేంద్ర నాయకత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు

26, డిసెంబర్ 2010, ఆదివారం

23, డిసెంబర్ 2010, గురువారం

సోనియా, సావిత్రి కంటే మహానటి లాగుంది

[అవినీతిని సహించం – కాంగ్రెస్ ప్లీనరిలో పార్టీకి సోనియా దిశా నిర్దేశం – ఈనాడు (20 డిసెంబరు, 2010) వార్త.

ధరలను దించాల్సిందే – యూపీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ సూచన – సాక్షి (21 డిసెంబరు, 2010) వార్తల నేపధ్యంలో! ]

సుబ్బలష్షిమి:
బావా! కాంగ్రెస్ ప్లీనరీలో అవినీతిని సహించమంటూ సోనియా పార్టీకి దిశానిర్దేశం చేసిందట తెలుసా?

సుబ్బారావు:
అందుకే కదా మరదలా, పార్టీ నియమావళి మార్చేసి మరీ, అధ్యక్షురాలి పదవీ కాలాన్ని మూడు నుండి అయిదేళ్ళకు పెంచేస్తూ ఏకగ్రీవంగా నిర్ణయించారు!

సుబ్బలష్షిమి:
పైగా ధరలను దించాల్సిందేనంటూ యూపీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచించిందట బావా! నాకు అర్ధంగాక అడుగుతానూ, యూపీఏ లో ప్రధాన పార్టీ కాంగ్రెస్సే కదా! కేంద్రంలో అధికారంలో ఉన్న మంత్రుల్లో అత్యధికులు కాంగ్రెస్ వాళ్ళే కదా! ప్రధాన మంత్రీ కాంగ్రెస్సే కదా! మరి యూపీఏ కి సూచించిన కాంగ్రెస్ అంటే అర్ధం ఏమిటి? తమకి తామే సూచించుకున్నారా? ఇదేం రెడ్ టేపిజమ్?

సుబ్బారావు:
అసలుకే… సోనియా, మన్మోహన్ గట్రా ప్రస్తుత కాంగ్రెస్ బృందం, రెడ్ టేపిజానికి మహారాజ పోషకులు మరదలా! ఆపైన ఇలాంటి లిటిగేషన్ మాటలతో, చేతలతో దాన్ని మరింత కొత్త పుంతలు తొక్కిస్తుంటారు. అంతే!

సుబ్బలష్షిమి:
అంతే కాదు బావా! నిత్యావసరాల ధరలు తగ్గించేందుకూ, నల్ల బజారును అరికట్టేందుకు రాష్ట్రాలు సహకరించటం లేదని నిందిస్తున్నారు కూడా!

సుబ్బారావు:
ఏ రాష్ట్రమో ఎందుకు మరదలా! ఆంధ్రప్రదేశ్ లోనే నల్లబజారులో సరుకులను దాచిన గిడ్డంగులను ఎర్రపార్టీ నేత చికెన్ నారాయణ ఎన్నో సార్లు తాళాలు బద్దలు కొట్టి మరీ చూపించాడు. అధికారులు కూడా ఎన్నోసార్లు దాడులు చేసి పట్టుకున్నారు. ఆ తరువాత కేసులు ఎటుపోయాయో ఎవరికీ తెలియదు. యథాప్రకారం నల్లబజారు నడుస్తూనే ఉంది. ఇంకేం చెబుతాడు ఈ ప్రధాని?

సుబ్బలష్షిమి:
మరి, పార్టీలకతీతంగా రాజకీయులు ఎన్నికల్లో నిలబడాలంటే టిక్కెట్లు కొనుక్కోవాలి. గెలవాలంటే ఓట్లతో సహా చాలా కొనుక్కోవాలి. డబ్బు బాగా ఖర్చు పెట్టాలి. గెలిచాక మంత్రిపదవులు కొనుక్కోవాలి. కీలక శాఖలు కావాలంటే మరింత ఖర్చు తప్పదు. మంత్రులయ్యాక దోచిన దాంట్లో పైకి వాటాలు పంపించాలి. అలాంటప్పుడు నిత్యావసరాలు దగ్గర నుండి అన్నిట్లోనూ నల్లబజార్లతో సహా అన్ని రకాల దోపిడిలూ చేస్తారు కదా!

అవేవీ ఆపకుండా, తమ వాటాలూ మానకుండా, మాటలకి మాత్రం ‘నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి, నల్లబజారు నియంత్రణకి రాష్ట్రాలు సహకరించటం లేదు’ అనటం, ‘అవినీతిని సహించం’ అనటం, కేవలం నటన బావా!

సుబ్బారావు:
చూడబోతే సోనియా, సావిత్రి కంటే మహానటి లాగుంది మరదలా!

ఇది ప్రసిద్ధ రాజకవి అయిన శ్రీకృష్ణదేవరాయలు రచించిన ‘ఆముక్తమాల్యద’ అనే కావ్యంలోని పద్యం.

చ. కలమపుటెండుగు ల్ద్రవిడకన్యలు ముంగిటఁ గాచుచుండి, త
     జ్జలరుహనాభగేహ రురుశాబము సారెకు బొక్కులాడఁ, గొం
     డెలపయి కమ్మ, గ్రామ్యతరుణీతతి డించిన వేఁప గంపలం
     దల మగుచున్న చెంగలువ దండలఁ దోలుదు రప్పురంబున్
ఇది ప్రసిద్ధ రాజకవి అయిన శ్రీకృష్ణదేవరాయలు రచించిన ‘ఆముక్తమాల్యద’ అనే కావ్యంలోని పద్యం. శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్ది ప్రారంభంలో, దక్షిణ భారతదేశంలోని ఎక్కువ భూభాగాన్ని ఏకచ్ఛత్రంగా పరిపాలించిన చక్రవర్తి. యుద్ధాలు చేసి, శతృరాజులను జయించి రాజకీయంగా ఎంత పేరు తెచ్చుకున్నాడో, అంతకన్నా గొప్ప పేరు వివిధ భాషల కవి పండితులను ఆదరించి, కళలని పోషించి సంపాదించాడు. తాను స్వయంగా మంచి కవీ, పండితుడు. ఆయన వ్రాసిన ఆముక్తమాల్యద ఒక గొప్ప కావ్యం. తెలుగుకు సంబంధించినంతవరకూ తన ఆస్థానంలో అష్ట దిగ్గజాలనే గొప్పకవులకు స్థానమిచ్చి వారి చేత గొప్ప గొప్ప కావ్యాలు వ్రాయించి, కొన్నింటిని కృతి అందుకొన్నాడు. తెలుగు సాహిత్యంలోని గొప్ప కావ్యాలైన మను చరిత్రము, పారిజాతాపహరణము, కాళహస్తి మహత్మ్యము, పాండురంగ మహత్మ్యము, మొదలైనవి ఆయన కాలంలో వెలువడినవే.
తన జైత్రయాత్రల సందర్భంగా కృష్ణా తీరంలోని శ్రీకాకుళం అనే వూరిలో ఒక రాత్రి ఉండగా, ఆ వూరి గుడి లోని శ్రీ ఆంధ్రమహావిష్ణువు కలలో కనిపించి ఆముక్తమాల్యద వ్రాయమని ఆదేశించినట్లు ఆయనే ఆ కావ్యంలో చెప్పుకున్నాడు. చెప్పినది తెలుగుదేశం లోని గుళ్ళో దేవుడు. వ్రాసినది కర్నాటక చక్రవర్తి. కథ జరిగినది తమిళ దేశంలో - ఎంత మంచి సన్నివేశమో గమనించండి.
ఆముక్తమాల్యద చాలా ప్రౌఢమైన కావ్యం. అందమైన భావాలూ, వర్ణనలూ పుష్కలంగా వున్న కావ్యం. శ్రీవిల్లిపుత్తూరు దేవాలయ పూజారి కూతురు శ్రీరంగం లోని రంగనాధ స్వామిని పెండ్లి చేసుకోవడం -”అప్పిన్నది రంగమందైన పెండిలి” గురించి చెప్పుకోవడం ప్రధానమైన కథ. దానితో పాటు మాల దాసరి కథా, ఖాండిక్య కేశిధ్వజులనే వారి కథా, యమునాచార్యుని కథా లాంటి ప్రక్క కథలూ ఉన్నాయి. కథ కన్నా ముఖ్యంగా రాయలవారు చేసిన వర్ణనలూ, రూపు కట్టించిన దృశ్యాలూ, రోజువారీ కనిపించే సామాన్యమైన దృశ్యాలను స్వభావరమ్యంగా రూపు కట్టించి వాటికి కావ్యగౌరవం కల్పించిన తీరూ, అపురూపమైన ఉత్ప్రేక్షలూ - ఇవన్నీ ఎంతో అందంగా, ఆలోచించే కొద్దీ మరీ ఎక్కువ అందంగా కనిపిస్తాయి. ఆయన మహారాజు అయినా, అంతఃపురంలోనూ, రాజభవనాల్లోనూ మాత్రమే తన జీవితాన్ని ఇరికించుకున్నట్లు లేదు. దేశమంతా పర్యటించే వాడు కాబోలు, సామాజిక జీవనం లోని అతి సాధారణ సన్నివేశాలను బాగా దగ్గరగా గమనించేవాడు. చూసినదాన్ని చూసినట్లు వర్ణించాడు. ఆ కాలపు జన జీవితం ఆముక్తమాల్యదలో ప్రతిఫలించినట్లుగా బాగా పేరున్న ఆ కాలపు ఇతర కావ్యాలు వేటిలోనూ కనిపించదు.
రాయలవారి ఊహలు చాలా అపురూపంగా ఉంటాయి. ప్రొద్దున్నే బ్రాహ్మణులు ఊరి బయట కాల్వల్లో స్నానం చేసి పైగుడ్డలు తడిపి పిండి ఒడ్డున పెట్టుకోవడమూ, కాలువల పక్కన బాతులు రెక్కల్లో తల జొనుపుకొని కదలకుండా కూర్చోడమూ, గ్రామ్య వనితలు పొయ్యి రాజేసుకొనే నిప్పు కోసం ఇల్లిల్లూ తిరగడమూ, కొబ్బరి బొండాలని చల్లదనం కోసం నదీ తీరాన ఇసుకలో నిక్షేపించడమూ, చేపల కూర తిన్నందున వచ్చే కనరు త్రేపులు తగ్గడానికి ఆ కొబ్బరి బొండాల నీళ్ళు త్రాగడమూ, అరవ బ్రాహ్మణ కన్యలు దేవుడి అభిషేకానికి బిందెల్లో నీళ్ళు నింపుకుని, ఒకటీ రెండు తామర పూలను ఆ బిందెలో వేసుకొని, చంకలో బిందెతో - ద్రవిడ ప్రబంధాలను గొణుక్కుంటూ కోనేటినుంచి రావడమూ, మంచి నీటి నడ బావుల్లో కనిపించే చేపల కోసం ఉండుండి లకుముకి పిట్టలు నీళ్ళల్లో మూతి పెట్టడమూ - ఇలాంటి సహజ సన్నివేశాలను ఎంతో అపురూపంగా ఛందోబద్ధం కావించాడు రాయలు. పైన చెప్పుకున్న పద్యం అలాంటిదే.
కళ్ళంలోనో, వాన పడటం వల్లనో వడ్లు తడిశాయి. ఇంటి ముందు చాప వేసి ఆ వడ్లను ఎండబెట్టారు. ఆ ఇంటి కన్య ఆ వడ్లను గొడ్లు తినిపోకుండా కాపలాగా బయట కూర్చున్నది. గొడ్లు రావడంలేదు కానీ ఒక జింక పిల్ల వచ్చి సారె సారెకూ వడ్లు బొక్కిపోతున్నది. “జలరుహనాభగేహ రురుశాబము” దేవాలయపు జింక పిల్ల. ఎద్దులో, గేదెలో అయితే కర్రతో ఒక దెబ్బ వేయవచ్చు. కానీ అది సున్నితమైన జింక పిల్లాయె, పైగా దేవాలయపు జింక పిల్లాయె, ఊరి మీద పడి గింజలు తినే హక్కు దానికున్నదాయె! కర్రతో దానిని కొట్టడానికి చేయి రాదు. సరిగ్గా ఆ సమయానికి చెంగల్వ దండలను వేపగంపలో పెట్టుకొని, అమ్ముకోడానికి పల్లెటూరినుంచి వచ్చిన స్త్రీలు గంపను ఆ ఇంటి ముందు దించారు. ఆ అమ్మాయి, గంపలోని చెంగల్వ పూదండను తీసుకొని దానితో ఆ జింక పిల్లను అదిలిస్తున్నదట - అదీ ఈ పద్య భావం.
తడి వడ్లు ఇంటి బయట ఎండబోసుకోవడమూ, ఆడపిల్లలు గొడ్లు రాకుండా కాచి వుండటమూ, పల్లెటూరి స్త్రీలు పూదండలు అమ్మరావడమూ, దేవాలయపు జింక పిల్ల వడ్లు బొక్కడమూ - ఇవన్నీ ఎంతో సాధారణమైన విషయాలు. ఇవన్నీ ఎప్పుడు చూశాడో ఆ మహారాజు, ఎంతో చక్కగా బొమ్మ కట్టాడు. సున్నితమైన పదాలు వేసి పద్యంలో ఒక ధార సాధించడం కన్నా, చెప్పే విషయం యొక్క అపురూపత మీదనే ఎక్కువ దృష్టి, రాయలకు. ఆయన వ్రాసిన చాలా పద్యాలు అలానే వుంటాయి. ఈ పద్యమూ అంతే. పదాలను కొత్తగా వాడటం ఆయనకు బాగా ఇష్టం. ‘కలమపుటెండుగల్’ అలాంటి ఓ పదం. పదిహేనో శతాబ్దం ఆఖరిభాగంలోనూ, పదహారో శతాబ్దపు ప్రారంభంలోను ప్రవర్తిల్లిన పాండ్యదేశపు సామాజిక జీవితం ఇంత అందంగా తీర్చి దిద్దిన ఈ పద్యం ఎవరికి నచ్చదు?

ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము

(1910 - భారతి మాసపత్రిక , సాధారణ సంవత్సరాది సంచికనుండి)
[కొమర్రాజు వేంకటలక్ష్మణరావు గారు కృష్ణాజిల్లా నందిగామ తాలూకా పెనుగంచిప్రోలు లో 1877 లో జన్మించారు. భువనగిరి, నాగపూర్లలో విద్యాభ్యాసం. సంస్కృతం, ఇంగ్లీషు, మరాఠీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. చరిత్ర పరిశోధకులుగా ప్రసిద్ధికెక్కారు. మహమ్మదీయ మహాయుగం, హిందూమహాయుగం, శివాజి, హైందవ చక్రవర్తులు అన్న గ్రంథాలు రాశారు. విజ్ఞాన చంద్రికా గ్రంథమాల స్థాపించి, భౌతిక శాస్త్రం, దేశ చరిత్రలపై పుస్తకాలు ప్రకటించారు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం పేరుతో తెలుగులో మొట్టమొదటి ఎన్‌సైక్లోపీడియా మూడు సంపుటాలు ముద్రించారు.
ఔరంగజేబు తనగురువుకి రాసిన ఉత్తరం ఆయన 1910 లో పారశీకంనుంచి తెనిగించారు. ఆ అనువాదం దిగువన తెలుగులోవిద్యాబోధనపై ఆకాలంలో ఆయన అభిప్రాయాలు చదవచ్చు. 1910 తరువాత తెలుగు మాధ్యమంగా విద్యాబోధనలో వచ్చిన మార్పులు ఈమాట పాఠకులు గుర్తించగలరు. లక్ష్మణరావు గారు 1923 లో మరణించారు — సం]
ఔరంగజేబునెడల నెన్ని దుర్గుణములున్నను అతడు గొప్ప విద్వాంసుడని చెప్పక తప్పదు. అతనికి భాషా పాండిత్యమును, లౌకికవ్యవహార జ్ఞానమును, దూరదృష్టియు గలవు. అతని యక్షరములు ముత్తియములవలె ముద్దులమూట గట్టుచుండెను. తనయొద్దకు బంపబడిన ముఖ్యమైన యర్జీల కన్నిటికిని, అతడు స్వహస్తముతో బ్రత్యుత్తరములు వ్రాయుచుండెను. అతనికి చిన్ననాడు చదువు చెప్పిన ముల్లా సాలె అనునతడొకప్పుడు తనకు గొప్పయుడ్యోగ మీయుమని యర్జీ పంపగా, అందుకు బాదుషహా ఈ క్రింది విధమున బ్రత్యుత్తర మంపెను.
” మీరు నాకు అనావశ్యక మైనట్టి అరబ్బీభాష నేర్పుటయందు పెక్కు సంవత్సరములు నిరర్థకముగ గడిపి కోమలమైన నా బుద్ధిని, తీక్ష్ణమైనట్టి నా స్మరణశక్తిని వ్యర్థపుచ్చితిరి. జీవితమునందెన్నడును ఉపయోగపడని భాష రాజపుత్రులకు నేర్పుటకు పది పన్నెండు వత్సరములు వెచ్చించుటయు, ఆభాషయందు నన్ను వైయాకరిణిగను, ధర్మశాస్త్ర జ్ఞు నిగను చేయ యత్నించుటయు నెంత హాస్యాస్పదములు. ఉపయోగమైన విద్యలును, జ్ఞానమును బాలకులకు వారి వారి బుద్ధిననుసరించి చిన్ననాడు నేర్పుటయందు కాలము గడుపుటకు మాఱుగా మా గురువులవారగు మీరు మా బాల్యమును వ్యర్థపుచ్చితిరిగదా! అయ్యో! భూగోళజ్ఞానమా ఏమియును లేదు. పోర్చుగలు, హాలండు, ఇంగ్లండు మొదలగు దేశములు కొన్ని కలవనియు, అవి ఆయా స్థలము లందు కలవనియు, నాకు నేర్పితిరా? ఆ దేశములు ద్వీపములా, ద్వీపకల్పములా, సమభూమియందున్నవా, లేక ఎత్తుస్థలములందున్నవా యన్న సంగతులు నాకు తెలియ వలదా? చీనా, పారసీకము, పెరు, తార్తారి మొదలైనదేశముల రాజులు హిందూదేసపు బాదుషహా పేరువిని గజగజ వణికెదరని నా ఎదుట మీరు చేసిన ముఖస్తుతి వలననే దేశ దేశ చరిత్రములన్నియు నాకు తెలిసినవనుకొంటిరా? ఈ జగత్తుమీదనున్న వేరువేరు రాజ్యములెవ్వి? అందలి ఆచారవిచారములు, రాజ్యవ్యవహారములు, మతములు నెట్టివి? ఆ యా రాజ్యములను గల సంపత్తులును, విపత్తులును, ఆ యాదేశము సంపద్విపత్తులలో, ఆ దేశస్థు ల యొక్క ఏ యే గుణావగుణములవలన ఎట్టి యెట్టి మార్పులు గలిగినదియు, ఎట్టి మహత్కారణములచే గొప్పరాజ్యములు తలక్రిందగునదియు అను మహద్విషయములు చరిత్రాధ్యయనములేకయే మా కెట్టుల తెలియ గలవు? ఈ విషయములు మాకు నేర్పితిరా?
రాజపుత్రులు పైని వర్ణింపబడినట్టి యత్యంతావశ్కములగు వివిధ విషయములను నేర్చుకొని జ్ఞానసంపన్నులై తమ బుద్ధిని వికసింపజేయవలయును. కావున రాజపుత్రులయొక్క జ్ఞార్జనకాలమగు బాల్యదశయందలి యొక్కొక్క క్షణము మిక్కిలి విలువ గలదియని యెఱింగి నా బాల్యదశను మీరు చక్కగ వినియోగపఱచితిరా? మీరు నాకు లేనిపోనట్టియు, బుద్ధినిభ్రమింపజేయునట్టియు లౌకికవ్యవహారమునకు నిరుపయోగకరమైనట్టియు పరభాషాజ్ఞానము గఱపుటయందే కృతకృత్యులమైతిమని తలంపలేదా? మొదట పరకీయ భాషనొకదానిని నేర్పి దాని మూలముగా శాస్త్రములు, ధర్మవివేచనము, న్యాయనీతి మొదలైన యావశ్యకములైన విద్యలనేర్పుట సులభమని తలంచితిరా? ఈయావశ్యకములగు విద్యలన్నియు మీరు నాకు నామాతృభాషలోనే నేర్పియుండకూడదా? “నేను ఔరంగజేబునకు తత్త్వజ్ఞానశాస్త్రమును నేర్పెదను” అని మీరు నా తండ్రియగు శహజహాను బాదుషహా గారితో వొకప్పుడనియుంటిరి. మీ రనేకసంవత్సరములకు బ్రహ్మ, ఆకాశము, ఖటపటములు, మొదలైన నీరస శబ్దములచే నేదోయొక విషయము నాకు బోధింప యత్నించినట్లు నాకు జ్ఞాపకమున్నది. ఆ విషయమును గ్రహింపవలయునని నేను పెక్కు పర్యాయములు యత్నించితిని. కాని యందువలన నా జ్ఞాన భాండారమునకును, రాజ్యకర్తృత్వమునకును, ఏమి లాభము కలిగినది? మీరి తేప తేప యుచ్చరించుచున్నందున నీరసములును, పలుకుటకు కఠినములును అగు ఖటపటాది పదములు కొన్ని నాకు జ్ఞాపకమున్నవి. కాని వానితోసంబంధించిన, విషయచర్చ మాత్రము నేను ఎప్పటిదప్పుడు మర చిపోవుచుంటినని మీఱెరుగరా? నేడు ఆవిషయచర్చ జ్ఞాపకమున్నను దాని వలన నాకు ప్రయోజనమేమి? ఇట్లు మీరు కోమలమైనటువంటి నా బుద్ధిని, చురుకుదనమును, వ్యర్థము చేసితిరిగాదే?
నిజముగా నిరుపయోగములైనను మీరు ఆవశ్యకములని తలచిన ఈ విషయములు మీరు నాకు నేర్పినందున మీకు మాత్రమొక లాభము కలిగినది. మూఢులును, అజ్ఞానులును అగు మావంటివారికి మీరు సర్వజ్ఞులనియు, సర్వశాస్త్రపారంగతులనియు, అత్యంతపూజ్యగురువర్యులనియు, నిరథకగౌరవభావమును కొంతకాలమువఱకు పుట్టింపగలిగితిరి. అందువలన పెక్కుదినములవఱకు మీ మాటను మేము మన్నించుట తటస్థించెను. రాజులను వ్యర్థముగా స్థుతించుట, సత్యమును తలక్రిందు చేయుట, నక్కవినయములు నటించుట యను గుణములు మాత్రము మీయందు చక్కగ వసించుచున్నవి. మిమ్ముల నేను నారాజసభయందు, ఒక సరదారునిగ నియమింపవలయునని మీరు కోరితిరిగదా. మీ యొక్క ఏ గుణమును జూచి నేను మీకాపదవినొసగవలయును? మీరు నాకు రాజకీయ, సైనిక, వ్యావహారికవిద్యలలో నేవిద్య నేర్పితిరని మిమ్ములను నేను గౌరవింతును? నన్ను నావశ్యకములైన విద్యలలో బారంగతునిజేసి యుండిన యెడల సికందరు (అలెగ్జాండరు) బాదుషహాకు పరమపూజ్యగురువర్యుడగు మహావిద్వాంసుడైన అరిస్టాటుల్‌ ఎడలగల పూజ్య భావమునే చూపియుందును. అట్టి యుపయోగకరములగు శిక్షణ గాని లాభకరములగు విద్యలనుగాని నేను మీవలన బడయలేదు. కావున మీ విషయమై గౌరవముగాని, పూజ్యభావముగాని నాకు లేదు. మీరు వచ్చిన త్రోవనే వెళ్ళుడు. మీ పల్లెటూరిలోనే దేవుని స్మరణ చేసికొనుచు కాలము గడుపుడు. మీరు నారాజసభలో ప్రవేసింపకూడదనియు, మీరెవరో ఇచ్చటివారెవరికిని తెలియకూడదనియు నా యభిప్రాయము.”
ప్రస్తుతకాలమందు బాలబాలికా విద్యను గుఱించియు, జాతీయవిద్యను గుఱించియు మనదేశమందు కొంత యత్నము జరుగుచున్నది. ఇందును గుఱించి పాటుపడుతున్న మహనీయులకీ యుత్తరములోని రెండుమూడు సంగతులాదరణియములు. బాలబాలికలకు బోధింపబడు విషయములు వారికి, వారి జీవితకాలములో నుపయోగకరముగానుండవలయును. కేవలము పాండిత్యము జూపుటకై అనుపయోగకరములగు విషయములు వారికి నేర్పి గుడ్డిపాఠముచేయించి కాలము వ్యర్థపుచ్చుట, వారికిని, దేశమునకును హానిప్రదము. బాలురకు శాస్త్రములన్నియు వారి మాతృభాషలోనే నేర్పవలయునుగాని పరభాషలో నేర్పుట కేవలము ద్రావిడప్రాణాయామమని ఔరంగజేబు ఉత్తరము వలన మనవారు ముఖ్యముగా నేర్చుకొనవలయును. మొదట పరభాషనభ్యసించుటకు బాలుర కాలమెంతయో వ్యర్థమగును. అట్లు పరభాషవచ్చిన తరువాత, ఆభాషలో శాస్త్రములనభ్యసించుటకంటె మొదటనుండియు స్వభాషలోనే శాస్త్రాధ్యయనము చేసిన యెడల బాలురకెంతయో కాలము, శ్రమయు కలిసివచ్చును కదా? తెలివిగల పిల్లవానికి ఇంగ్లీషుభాష చక్కగ నభ్యసించుటకు సుమారు ఆరేడు సంవత్సరములు పట్టును. అప్పటికా బాలునకు ఇంగ్లీషులో గ్రంథావలోకనము చేయుటకును, శాస్త్రాభ్యాసము చేయుటకును అధికారము కల్గును. ఇట్లు పరభాషాధ్యయనమునకై ఏడెనిమిది సంవత్సరములు వ్యర్థమగుచున్నవి. దేశ భాషలలో శాస్త్రములు జెప్పిన యెడల నీ ఏడెనిమిది సంవత్సరములలో నెన్నియో విద్యలలో పారంగతుడు కావచ్చును. ఇప్పుడు మనదేశమందు ఇంగ్లీషువారి ప్రభుత్వమున్నందునను, ఇంగ్లీషుభాషలో గ్రంథభాండార మసంఖ్యముగ నున్నందునను ధనము గలవారు కొందఱా భాషనభ్యసించుట యావశ్యకమే. మేము వలదనము. కాని సకల శాస్త్రజ్ఞానమును, ఇంగ్లీషుభాషయను గదిలోబెట్టి తాళమువైచి, ఏ.బి.సి.డి. అను తాళపుచెవిని సంపాదించుటకు ఎనిమిది సంవత్సరములు ముక్కు పట్టుకొని తపస్సు చేయనివారలకు జ్ఞానభాండారములోని సొత్తును కొల్లగొట్టునధికారము లేదనియు, విద్యామహిమయు మాతృభాషాప్రభావమును తెలియని దూరదృష్టి విహీనులు తప్ప మరెవ్వరును చెప్పజాలరు.
జ్ఞానార్జనమార్గము లన్నియు పరభాషయొక్క యధీనమునందుండిట కంటె దేసము పాలించి మూర్తీభవించిన యజ్ఞానాంధకారము మఱొకటి కలదా? కావున స్వభాష మూలముననే జ్ఞానార్జనము చేయవలయునని ఔరంగజేబు నుత్తరములో నున్న విషయమును నా జాతీయపాఠశాలాధ్యక్షులు గమనింపవలెను. అట్లు చేయక వారు ఇంగ్లీషుభాషనే జ్ఞానసాధనముగా బెట్టిరేని ఔరంగజేబు తన గురువును నిందించినట్లు రాబోవుతరమునందలి విద్యార్థులు తమ యాయుష్యములోని పది సంవత్సరములు పాడుచేసినందులకు మనలను నిందింపక మానరు.

19, డిసెంబర్ 2010, ఆదివారం

హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు

ప్రతి కళాకారుడికీ ఒక శైలి ఉంటుంది. సాహిత్యంలోనూ సంగీతం, చిత్రలేఖనం మొదలైన లలిత కళల్లోనూ ఇది ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. ఇందులో వ్యక్తిగత వైఖరి కొంతవరకూ ఉన్నప్పటికీ గురువువద్ద, లేదా శిక్షణాలయంలో నేర్చుకున్న పద్ధతీ, ఆకళించుకున్న మెళుకువలూ కళాకారుల శైలిని ప్రభావితం చేస్తాయన్నది తెలిసినదే. భారతీయ శాస్త్రీయసంగీతంలో దీన్ని దక్షిణాదిన బాణీ అనీ, ఉత్తరాదిన ఘరానా సంప్రదాయమనీ అంటారు. ఘరానా అనే మాట ఇక్కడ “గొప్ప” అనే అర్థంలో కాక ఘర్, లేక గృహం అనే హిందీ అర్థంలో వాడబడుతుంది. అంటే సంగీతశైలి ఒక “ఇంటి”, లేదా కుటుంబపు సంప్రదాయంగా అనుకోవచ్చు. గురువు పాటించిన శైలిని అతని శిష్యులు అనుసరించడం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు కర్ణాటక సంగీతంలో ద్వారం వెంకటస్వామినాయుడుగారి ప్రభావం ఆయన కుమార్తె మంగతాయారు, శిష్యుడు మారెళ్ళ కేశవరావు తదితరుల వయొలిన్ పద్ధతిలో కనిపిస్తుంది. అలాగే ఈమని శంకరశాస్త్రిగారి శైలి ఆయన శిష్యుడైన చిట్టిబాబు వీణలో కనబడేది. హిందూస్తానీ పద్ధతుల్లో ఒక్కొక్క గురువూ తన బంధువులకూ, శిష్యవర్గానికీ తన ఘరానా పద్ధతులన్నిటినీ నేర్పి, అవి కొనసాగేలా చూడడం పరిపాటి.
ఉత్తర భారతదేశంలో ముగల్ తదితర రాజాస్థానాల ప్రాభవం తగ్గుముఖం పట్టాక కళాకారులకు సంస్థానాలలో లభిస్తూ వచ్చిన ఆదరణ తగ్గసాగింది. పంతొమ్మిదో శతాబ్దం వచ్చేనాటికి సంగీతకారులు తమ శైలిని ఘరానాల పేరుతో సంరక్షించుకోవడం మొదలుపెట్టారు. ధనార్జన కోసమని వీరంతా పెద్ద పట్టణాలకు తరలి తమ సంప్రదాయాలకు ఆయా ఊళ్ళ పేర్లను ఉపయోగించుకోవడం ప్రారంభించారు. అందువల్లనే జైపూర్ ఘరానా అనీ, ఆగ్రా ఘరానా అనీ పేర్లు వినబడుతూ ఉంటాయి.
కొన్ని సంప్రదాయాలకు తరతరాలనుంచీ చారిత్రకంగా ప్రాధాన్యత ఉంటే కొన్ని ఘరానాలు గొప్ప ప్రవీణులైన ఒకరిద్దరు కళాకారులతో ప్రారంభమైన ఉదంతాలుకూడా ఉన్నాయి. ఎలా ఆరంభమైనప్పటికీ ఇరవయ్యో శతాబ్దం మొదలయేనాటికి హిందూస్తానీ సంగీతంలో అనేక సంప్రదాయాలు పేరు సంపాదించుకున్నాయి. వీటిలో శైలినిబట్టి ఒక్కొక్కదానికీ ఒక్కో రకం ప్రత్యేకత ఏర్పడింది. ఇది కచేరీ చేసే పద్ధతిలోనేకాక నేర్పే పద్ధతిలోనూ, సాధన చేసే పద్ధతుల్లోనూ కూడా కనబడేది. శాస్త్రీయ రాగాలనూ, కృతులనూ అవగాహన చేసుకునే శైలిలోనూ, ఆవాహన చేసే పద్ధతిలోనూ, గమకాలనూ, సంగతులనూ, స్వరాలనూ పలికించే విధానంలోనూ సంప్రదాయాల మధ్య తేడాలు కనబడతాయి. ఆ కారణంగా దక్షిణభారతదేశంకన్నా వైశాల్యంలో ఎక్కువ ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో వివిధ శైలులమధ్య భిన్నత్వమూ, వ్యత్యాసాలూ స్పష్టంగా కనబడతాయి. గుజరాత్ నుంచి అస్సాం దాకానూ, కశ్మీరునుంచి ఉత్తరకన్నడ ప్రాంతందాకానూ ప్రాచుర్యంలో ఉన్న హిందూస్తానీ సంగీతంలో స్థానిక లక్షణాలు ఎక్కువగా కనబడటంలో ఆశ్చర్యం లేదు. ఈ రోజుల్లో హిందూస్తానీ సంగీతం అంటే ప్రధానంగా ఖయాల్ గానం అనే అభిప్రాయం ఉంది. ఘరానాల పద్ధతి ఖయాల్ గాత్రానికే కాక ఉపశాస్త్రీయ సంగీతంలోని భాగాలైన ఠుమ్రీ, తరానా, టప్పా మొదలైన గానవిశేషాలకూ, వాయిద్యాల శైలులకీ కూడా వర్తిస్తుంది. ఇప్పుడు కొన్ని ప్రసిద్ధమైన ఘరానా గాత్ర శైలుల వివరాలనూ, ఉదాహరణలనూ చూద్దాం. ఈ వ్యాసంలో ప్రతి ఘరానాలోనూ గాయకుడి పేరుతో సహా వివరాలన్నిటినీ ఇవ్వడం అసాధ్యమైన పని. దీన్ని ఘరానాల సమగ్రమైన చరిత్రగా కాకుండా ఒక్కొక్క శైలినీ వివిధ కళాకారులు ఎలా అనుసరించారో ఉదాహరణలను ఇచ్చే రచనగా మాత్రమే పరిగణించాలి.

గ్వాలియర్ ఘరానా

ఘరానాల్లో పాతదీ, ఎక్కువ పేరు పొందినదీ గ్వాలియర్ ఘరానా. మధ్యప్రదేశ్ ఉత్తరప్రాంతపు గ్వాలియర్ నగరం తాన్‌సేన్ జన్మస్థలంగా చారిత్రకమైనది. అక్బర్ ఆదరించిన మహాగాయకుడు తాన్‌సేన్ ధ్రుపద్ (ధ్రువపద) శైలికి ప్రాచుర్యం కల్పించాడని అంటారు. ఎంతో శ్రుతిశుద్ధతతో, అతి నింపాదిగా సాగే ఈ శైలిలో గాత్రం, రుద్రవీణా వాదనం ఎక్కువగా జరిగేవి. ఈ పద్ధతిలో కృతి మూల రచనకు విధేయత ఎక్కువగానూ, మనోధర్మశైలిలో చేసే కల్పన తక్కువగానూ అనిపించేది. పద్ధెనిమిదో శతాబ్దం మధ్యకాలంలో రాగాన్ని ఖయాల్ పద్ధతిలో పాడడం మొదలయింది. ఖయాల్ అంటే ఊహ, లేక భావన అనుకోవచ్చు. ఒక రాగంలో, ఒక తాళంలో స్వరరచన చేసిన కృతిని గాయకులు తమకు “తోచినట్టుగా” (అక్షరాలా) పాడే పద్ధతి ఇది. దీన్ని రమారమిగా మనవాళ్ళు పద్యాలు పాడే విధానంతో పోల్చవచ్చు. ట్యూన్ ఒకటే అయినప్పటికీ ఎవరి ధోరణినిబట్టి వారు ఒక్కొక్కచోట సాగదీస్తూ ఉంటారు.

[గ్వాలియర్ చెత్తకుప్పల మధ్య
హద్దూఖాన్, హస్సూఖాన్ ల సమాధి]
గ్వాలియర్ ఘరానావారు ఖయాల్ పాడే పద్ధతిని ప్రామాణికమైనదిగా గుర్తించి, తక్కిన గాత్ర శైలులను దానితో పోల్చడం పరిపాటి. అంతేకాక తక్కిన పద్ధతులన్నీ దాని నుంచే పుట్టాయని కూడా అంటారు. లక్నోకి చెందిన నత్థన్ పీర్‌బక్ష్ అనే గాయకుడు గ్వాలియర్‌కు వచ్చి స్థిరపడ్డాడనీ, అతని మనమలు హద్దూఖాన్, హస్సూఖాన్ అనే ఇద్దరూ గ్వాలియర్ గాత్రశైలిని ప్రారంభించారనీ తెలుస్తోంది. (వీరి సమాధి ప్రస్తుతం చెత్తకుప్పల మధ్య “అలరారుతోందని” గౌరీ రాంనారాయణ్ అనే విలేకరి ఫోటోతో సహా ప్రచురించింది!)
బడే మహమ్మద్ ఖాన్ అనే మరొక లక్నో గాయకుడు గ్వాలియర్ గాత్రంలో తాన్ (”అ”కారంతో వేగంగా స్వరాలను పలికించడం) పాడే పద్ధతిని ప్రవేశపెట్టాడట. ఈ శైలికి మరొక వ్యవస్థాపకుడు నత్థూఖాన్. గ్వాలియర్ ఘరానా ముఖ్యలక్షణాల్లో సరళత్వం, శ్రోతలను తికమకపెట్టకుండా రాగాన్ని వీలైనంత స్పష్టంగా పలికించడం, కృతి(రచన)ని ప్రధానమైనదిగా పరిగణించి, రాగలక్షణాలను దాని ద్వారా ప్రకటించడం మొదలైనవి ఉంటాయి. హద్దూఖాన్ రెండో కుమారుడు రహమత్ ఖాన్ (1852-1922) గాయకుడుగా పేరు పొండడమే కాక, అంతకుముందు గ్వాలియర్ గాత్రశైలిలో కనబడని భావోద్వేగాన్ని ప్రవేశపెట్టాడు. (కిరానా సంప్రదాయానికి ఆద్యుడైన అబ్దుల్ కరీంఖాన్ ఇతని పాట విని తన శైలిని మృదువుగా మార్చుకున్నాడట.) హద్దూఖాన్ పెద్దకొడుకు మహమద్ ఖాన్ అనే అతనివద్ద బాలకృష్ణబువా ఇచ్ఛల్‌ కరంజీకర్ (1849-1927) అనే గాయకుడు శిష్యరికం చేసి, గ్వాలియర్ శైలిని మహారాష్ట్ర ప్రాంతాలకు పరిచయం చేశాడు. అలాగే నత్థూఖాన్ కుమారుడు నిసార్ హుసేన్ ఖాన్ (ఇదే పేరుగల మరొక తరవాతి తరం గాయకుడు సహస్వాన్ ఘరానాకు చెందినవాడు) రామకృష్ణబువా వజే (1871-1945) అనే మహారాష్ట్ర గాయకుడికి గురువు. తొలితరం ఉస్తాద్ ల మరొక శిష్యుడయిన శంకర్ పండిత్ అనే ఆయన వద్ద ఆయన కొడుకు కృష్ణారావు (1893-1989) నేర్చుకున్నాడు. ఈ విధంగా శిష్యప్రశిష్యుల ద్వారా గ్వాలియర్ గాత్రం త్వరలోనే ప్రాచుర్యం పొందసాగింది.
బాలకృష్ణబువా శిష్యులలో విష్ణు దిగంబర్ పలూస్కర్ (1872-1931) ప్రసిద్ధుడు. నేటికీ వేల కొద్దీ విద్యార్థులకు హిందూస్తానీ సంగీతశిక్షణనిచ్చే గాంధర్వ మహావిద్యాలయానికి ఈయనే వ్యవస్థాపకుడు. ఈయన ఒక స్వరసంకేత రచనాపద్ధతిని కూడా ప్రవేశపెట్టాడు. పేదరికం, కష్టాల మధ్య కొనసాగిన ఈయన జీవితానికి తరవాతి దశలో అంధత్వంకూడా తోడయింది. అయితే ఉప్పు సత్యాగ్రహ సందర్భంలో “రఘుపతి రాఘవ” గీతాన్నీ, కాంగ్రెస్ మహాసభల్లో “వందేమాతరం” గీతాన్నీ స్వరపరిచి పాడినవాడుగా ఈయనకు పేరుండేది. ఈయన శిష్యుల్లో పేరు మోసినవారు వినాయక్‌రావు పట్వర్ధన్, ఓంకార్‌నాథ్ ఠాకూర్, బి.ఆర్.దేవ్‌ధర్, నారాయణరావువ్యాస్, తదితరులుండేవారు. వీరంతా ఎంతో మంది శిష్యులను తయారుచెయ్యడంతో గ్వాలియర్ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. రామకృష్ణ బువావజే శిష్యుడు దీనానాథ్ మంగేశ్కర్ (1900-1942) (లతా తండ్రి) మరాఠీ నాటకాల్లో నట గాయకుడుగా అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు.
విష్ణు దిగంబర్ పలూస్కర్ ఏకైకపుత్రుడు డి.వి.పలూస్కర్ (1921-1955) ఎక్కువకాలం జీవించనప్పటికీ ఎంతో మంచి సంగీతాన్ని అందించాడు. నౌషాద్స్వరపరిచిన బైజూబావ్రా సినిమాలో బైజూ పాత్రకు పాడినది ఇతనే. గ్వాలియర్ సంప్రదాయంలోని సుగుణాలన్నీ ఈయన గాత్రంలో వినవచ్చు. శ్రావ్యమైన గొంతూ, స్పష్టమైన ఉచ్చారణా, భేషజంలేని వైఖరీ, సమగ్రమైన అవగాహనా డి.వి. పలూస్కర్ పాటలో వినబడతాయి. హిందూస్తానీ రాగాల పరిచయం చేసుకోవడానికి ఈయన పాడిన పాత రికార్డులు చాలా ఉపయోగకరం. నారాయణరావువ్యాస్ కుమారుడు విద్యాధర్ వ్యాస్ కూడా డి.వి. పలూస్కర్ శైలిలోనే పాడతాడు. ముంబాయి విశ్వవిద్యాలయం సంగీత విభాగానికి అధిపతిగా పదవీ విరమణ చేసిన విద్యాధర్ వివిధభారతి రేడియోలో “సంగీత్ సరితా” కార్యక్రమం ద్వారా శాస్త్రీయ సంగీతాన్ని శ్రోతలకు పరిచయం చేసేవాడు.

గ్వాలియర్ ఘరానా
1. రామకృష్ణ బువా వజే, 2. నారాయణరావు వ్యాస్, 3. రహమత్ ఖాన్, 4. కృష్ణారావు శంకర్ పండిత్, 5. విష్ణు ది. పలూస్కర్, 6. ఓంకార్‌నాథ్ ఠాకూర్, 7. వినాయక్‌రావు పట్వర్ధన్, 8. డి.వి. పలూస్కర్, 9. విద్యాధర్ వ్యాస్, 10. బి.ఆర్.దేవ్‌ధర్
ఒకే సంప్రదాయానికి చెందిన సంగీతాన్ని ఎంతమంది గాయకులు ఎన్ని విభిన్న రాగాల్లో వినిపించినా వారి ధోరణుల్లో పోలికలు కనిపిస్తాయి. ఎంతో అరుదైన రహమత్ ఖాన్ యమన్ రికార్డింగు లభించడం మన అదృష్టమే. గ్వాలియర్ ఘరానాకు పేరు తెచ్చిన డి.వి. పలూస్కర్ పాడిన గౌడసారంగ్ రాగం, నారాయణరావువ్యాస్ పాడినఖంబావతి రాగం, రామకృష్ణ బువా పాడిన ఖమాచ్ రాగం, వినాయక్‌రావు పట్వర్ధన్ పాడిన జోగ్ రాగం, ఓంకార్‌నాథ్ ఠాకూర్ ప్రధానంగా బృందావనీసారంగ్ రాగంలో పాడిన మీరా భజన్, విద్యాధర్ వ్యాస్ కేదార్ రాగంలో పాడిన రచనా అన్నీ గ్వాలియర్ శైలికి చెందినవేనని వినగానే తెలుస్తూ ఉంటుంది. ఏనాడో ఒకరిద్దరు మొదలుపెట్టిన గాత్రశైలి ఎన్ని తరాలు గడిచినప్పటికీ ఎంత చక్కగా కొనసాగుతోందో తెలుసుకోవడానికి ఇటువంటి ఆడియో లింకులు ఉపయోగపడతాయి.

కిరానా సంప్రదాయం

మరొక ప్రసిద్ధమైన ఘరానా కిరానా సంప్రదాయం. దీన్ని నెలకొల్పినవారు అబ్దుల్ కరీమ్ ఖాన్, ఆయన దగ్గరి బంధువు అబ్దుల్ వహీద్ ఖాన్. (వహీద్ ఖాన్ మరొక గాయకుడు అమీర్ ఖాన్ కు ప్రేరణనిచ్చిన విద్వాంసుడు). కిరానా ఘరానా ఖయాల్‌, ఠుమ్రీలు పాడే పద్ధతులలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. తక్కిన శైలులకు భిన్నంగా సంగీతాన్ని ఆహ్లాదకరంగా, ఒక చల్లని ఉద్యానవనంలో శ్రోతలు విహరిస్తున్న భావనను కలిగించేదిగా, హృద్యంగా, తాదత్మ్యత కలిగిస్తూ ఉండేది ఈ గాయనపద్ధతి. సుఖంగా, భావస్ఫోరకంగా, కరుణరసం ఉట్టిపడేలా సాగే రాగ విస్తారానికి ఈ సంప్రదాయం పెట్టింది పేరు. కరీమ్‌ఖాన్‌ పాడుతూంటే ఆయన అంతరాత్మలోని ఉత్తమ గుణాలన్నీ శబ్దరూపంలో ద్యోతకమయేవి. శ్రోతలు ఆనందాశ్రువులు రాల్చే రాగభావమూ, సున్నితమైన గమకాలూ, ఆర్తీ, ఆవేదనా ఆయన పాడిన అనేక రికార్డులలో మనం వినవచ్చు. ఆయన శిష్యవర్గంలో ప్రసిద్ధులైన ఆయన కుమారుడు సురేశ్‌బాబూ మానే, కుమార్తె హీరాబాయి బడోదేకర్‌, ఆమె చెల్లెలు సరస్వతీ రాణే, వారివద్ద శిక్షణ పొందిన ప్రభా అత్రేతదితరులూ ఉన్నారు.

[కిరానా ఘరానా]
1. కరీమ్‌ఖాన్‌, 2. సవాయీ గంధర్వ, 3. సురేశ్‌బాబూ మానే, 4. హీరాబాయి బడోదేకర్‌, 5. రోషనారా బేగం, 6. భీమ్ సేన్ జోషీ, 7. బసవరాజ్ రాజ్ గురు, 8. గంగూబాయి హంగళ్, 9. ప్రభా అత్రే, 10. ఫిరోజ్‌ దస్తూర్‌
బెహెరేబువా, బాలకృష్ణబువా కపిలేశ్వరి, దశరథ్‌బువా ముళే ఆయనకు శిష్యులు. రోషనారా బేగం (కరీం ఖాన్ తమ్ముడు అబ్దుల్‌హక్‌ కుమార్తె) కూడా ఒక శిష్యురాలు. కరీంఖాన్ శిష్యుడైన సవాయీ గంధర్వవద్ద గంగూబాయి హంగళ్, బసవరాజ్‌ రాజ్‌గురు, ఫిరోజ్‌ దస్తూర్‌, భీమ్‌సేన్‌ జోషీవంటి దిగ్గజాలు సంగీతం నేర్చుకున్నారు. వీరుకాక ఈ శిష్యవర్గంలో జితేంద్ర అభిషేకీ, రసిక్‌లాల్‌ అంధారియా, కృష్ణా హంగళ్, మాధవగుడి తదితరులున్నారు. గ్వాలియర్‌ శైలిలోనూ, తక్కిన సంప్రదాయాల్లోనూ సాహిత్యానికీ, లయకూ, స్వరాలకూ సమాన హోదా ఉంటుంది కాని కిరానా ఘరానాలో స్వరమే ముఖ్యం. “తాల్‌ గయాతో బాల్‌ గయా. సుర్‌ గయాతో సర్‌ గయా” (తాళం తప్పితే వెంట్రుక రాలిందనుకోవచ్చు. స్వరం తప్పితే తల తెగినట్టే) అనే ఛలోక్తి కరీమ్‌ఖాన్‌దే నంటారు.
కరీమ్‌ఖాన్‌ పాడిన లలిత్ రాగంసురేశ్‌బాబూ మానే పాడిన ఖమాచ్ రాగం, సవాయీ గంధర్వ పాడిన కోమల్ రిషభ్ అసావరీ రాగం, హీరాబాయి పాడిన రామ్ కలీ రాగం, నిస్సందేహంగా ఒకే శైలికి ప్రతీకలు. సవాయీ గంధర్వకు శిష్యరికం చేసిన బసవరాజ్ రాజ్ గురు (బసంత్ ముఖారి ), భీమ్ సేన్ జోషీ (జోగియా ) తదితరు లందరూ కిరానా శైలికి వారసులే. తక్కిన ఘరానాల్లాగే ఈ శైలిలో శిక్షణ పొందినవారు కిరానా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. వారి పేర్లన్నీ ఇక్కడ ఉదహరించడం చాలా కష్టం.

ఆగ్రా ఘరానా

కిరానా ఘరానా మృదుత్వానికి పేరుపొందినది కాగా ఆగ్రా ఘరానా గానం బలవత్తరంగా, దూకుడుగా, రూక్షంగా ఉంటుంది. ఖంగుమని మోగే గొంతుతో ఎలుగెత్తి పాడుతున్న గాయకుడి బలమైన గమకాల విన్యాసాలతో సాగే పాటకు ఇది అనువైన శైలి. ఈ సంప్రదాయంలో గ్వాలియర్ పోకడలు కొన్ని మిగిలి ఉండడంతో కృతికి కొంత ప్రాధాన్యత ఉంటుంది. లయలోని గతులపై (లయకారీ) శ్రద్ధ పెట్టడం కూడా కనిపిస్తుంది. అందుచేత “అ”కారంలో కాకుండా, కృతిలోని సాహిత్యాన్నే లయబద్ధంగా మార్చి పాడడం ఈ శైలిలోని ప్రత్యేకత.
తమతమ ఘరానాల గురించి ఎంతో ప్రాచీన చరిత్ర ఉన్నట్టుగా చెప్పుకోవడం కొందరు సంగీతజ్ఞుల రివాజు. ఆగ్రా ఘరానా పధ్నాలుగో శతాబ్దంలోనే మొదలైందని కొందరంటారు. మొదట్లో వీరంతా ధ్రుపద్ ధమార్ పద్ధతిలో “నోం తోం” ఆలాపనలతో పాడేవారు. ఘగ్గే ఖుదాబక్ష్ అనే గాయకుడు (1790-1880) ఆగ్రా ఘరానాలో ఖయాల్ పద్ధతిని ప్రవేశపెట్టాడట. దీని ఫలితమేమిటంటే ఒక్క ఆగ్రా ఘరానా గాయకులు మాత్రమే ధ్రుపద్ ధమార్, ఖయాల్, ఠుమ్రీ, తరానా (తిల్లానా), టప్పా మొదలైన గాత్ర పద్ధతులన్నిటిలోనూ నేటికీ పాడుతూ ఉంటారు. ఇది ఎందుకు ప్రత్యేకమంటే హిందూస్తానీలో కొద్దిమంది మాత్రమే ధ్రుపద్ ధమార్ పాడతారు; అయితే వారు సామాన్యంగా ఖయాల్, తదితర శైలుల్లో పాడరు.

[ఆగ్రా ఘరానా]
1. ఫైయాజ్ ఖాన్, 2. విలాయత్ హుసేన్ ఖాన్, 3. ఖాదిం హుసేన్ ఖాన్, 4. లటాఫట్ హుసేన్ ఖాన్, 5. షరాఫత్ హుసేన్ ఖాన్, 6. దినకర్ కైకిణీ, 7. లలిత్ రావు, 8. జగన్నాథబువా పురోహిత్
ఎంతో పేరు పొంది, అభిమానులు విశేషంగా సన్మానించిన ఫైయాజ్ ఖాన్ (1880-1950) ఈ శైలిలోని అత్యుత్తమ గాయకుడు. ఆఫ్తాబే మూసీకీ (సంగీత మార్తాండుడు) అని బిరుదును పొందిన ఈ మహాగాయకుణ్ణి శ్రోతలు ఎంతో అభిమానించేవారు. ప్రఖ్యాత నటగాయకుడు కె. ఎల్. సైగల్, సాలూరు రాజేశ్వరరావువంటి గొప్ప కళాకారులు కొంతకాలంపాటు ఈయనకు శిష్యరికం చేశారు. ఈయన గానం మంద్రస్థాయిలో “మగరాయుడి” వైఖరితో సాగేది. అందుకు ఉదాహరణ ఫైయాజ్, విలాయత్ హుసేన్ కలిసి పాడిన దర్బారీ రికార్డు. ఇందులో సాహిత్యాన్ని లయబద్ధంగా విరిచే ‘బోల్ తాన్’ ప్రయోగాలున్నాయి.
మత విభేదాలకు అతీతంగా ఈ మహావిద్వాంసుడు ‘వందే నందకుమారం’ అనికాఫీ రాగంలో ఠుమ్రీ రచించి పాడిన సంగతి ఈనాడు ఎవరికీ తెలియకపోవచ్చు.
జరిగినదేమిటంటే గుజరాత్ హింసాకాండలో భాగంగా 2002 ఏప్రిల్ మూడో తేదీన “హిందుత్వ” పేరుతో వడోదరాలోని ఫైయాజ్ ఖాన్ సమాధిని దుండగులు పాడుచేసి, ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అన్ని రకాల విలువలూ పతనమౌతున్నాయనేందుకు ఇది సాక్ష్యం.
ఆగ్రా ఘరానా గాత్రానికి పేరు పొందినవారిలో విలాయత్ హుసేన్ ఖాన్ (1897-1962), ఖాదిం హుసేన్ ఖాన్, లటాఫట్ హుసేన్ ఖాన్, షరాఫత్ హుసేన్ ఖాన్ (1930-1985), జగన్నాథబువా పురోహిత్ (గుణిదాస్), దినకర్ కైకిణీ, లలిత్ రావు తదితరులున్నారు. ఖాదిం హుసేన్ (సింధు) భైరవి రాగంలో పాడినబాబుల్ మోరా ఈ బాణీలో కొంత సాధన చేసిన సైగల్ పాటను తలపిస్తుంది.
దినకర్ కైకిణీ పాడిన భైరవి రాగంలోకూడా ఆగ్రా ఘరానా పోకడలు కనిపిస్తాయి. షరాఫత్ హుసేన్ పాడిన రామ్ కలీ రాగం (ఫైయాజ్ రచన) తాన్ ల వేగాన్ని చూపుతుంది. లలిత్ రావు కేదార్ వల్ల ఈ “మగ” శైలిలో స్త్రీలు పాడే పద్ధతి తెలుస్తుంది. మొత్తంమీద ఇవన్నీ వింటే ఆగ్రా ఘరానా ఎటువంటిదో అర్థమౌతుంది.

జైపూర్ ఘరానా

రాజస్థాన్ చరిత్రలో ప్రసిద్ధికెక్కిన జైపూర్ ఎన్నో కళలకు పుట్టినిల్లు. అందుచేత జైపూర్ ఘరానా పేరుతో సంగీతంలోనే కాక కథక్ నాట్యశైలిలో కూడా ఒకటి ఉందంటే ఆశ్చర్యం లెదు. అలాగే వైణికుల జైపూర్ బీన్‌కార్ ఘరానాకూడా ఒకటుంది. దానికి వారసులైన కొందరు సితార్ కళాకారులూ ఉన్నారు. ప్రస్తుతం గాత్ర పద్ధతి విశేషాలు చూద్దాం. దీన్ని జైపూర్ అత్రౌలీ ఘరానా అని కూడా అంటారు.
జైపూర్ అత్రౌలీ ఘరానాలో సంక్లిష్టమైన “తాన్”లు పాడే ఆనవాయితీ ఉంటుంది. అలాగే అపరిచితమైనవీ, మిశ్రమ రాగాలూ పాడుతూ ఉంటారు. ఈ గాత్రశైలికి ఆద్యుడు అల్లాదియా ఖాన్ (1855-1946). నిడుపైన విగ్రహంతో ఠీవిగా కనిపించే ఈ గాయకుణ్ణి ప్రతివారూ చూడగానే గౌరవించేవారట. అప్పట్లో మహారాష్ట్రలో బాలకృష్ణబువా గ్వాలియర్ పద్ధతిలోనూ, నత్థన్ ఖాన్ ఆగ్రా శైలిలోనూ ఖయాల్ గాయకులుగా పేరు సంపాదించారు. గ్వాలియర్ శైలిలోని సాదా ధోరణికీ, ఆగ్రావారి తాళవైచిత్రికీ భిన్నంగా అల్లాదియా తన శైలిని పెంపొందించుకుని సంగతుల్లోనూ, రాగప్రస్తారంలోనూ కొత్త పోకడలను మొదలుపెట్టాడు. అల్లాదియా ముస్లింపద్ధతిలో కాకుండా మహారాష్ట్రులలాగా తలపాగా, పంచెకట్టుతో తిరిగేవాడు. ఈయన కొడుకులుకూడా తలపాగాలు కట్టుకునేవారు. ఈయన వద్ద కొంత నేర్చుకున్న భాస్కరబువా బఖలే (1869-1922) గాయకుడుగా, సంగీతనాటక స్వర రచయితగా ఆ రోజుల్లో చాలా గొప్ప పేరు గడించాడు. భాస్కరబువా శిష్యుల్లో ఎంతో పేరుపొందిన ఇద్దరు మరాఠీ నటగాయకులు బాలగంధర్వ, మాస్టర్ కృష్ణారావు ఫులంబ్రీకర్. భాస్కరబువా అభిమానుల్లో లోకమాన్య తిలక్ కూడా ఒకరు.

[1918 నాటి భాస్కరబువా కచేరీ
1. బాలగంధర్వ, 2. భాస్కరబువా బఖలే, 3. తిలక్]
అల్లాదియా శిష్యురాళ్ళలో కేసర్‌బాయీ కేర్కర్ (1892-1977), మోగూబాయీ కుర్డీకర్ (1904-2001) (ఈమె కుమార్తె నేటి ప్రముఖ గాయని కిశోరీ ఆమోణ్‌కర్) ప్రసిద్ధికెక్కారు. అల్లాదియాలాగే ఆయన కుమారులు మంజీఖాన్ (1888-1937), బుర్జీఖాన్ (1890-1950) కూడా సంగీతం నేర్పారు. మంజీఖాన్ శిష్యుల్లో మల్లికార్జున్ మన్సూర్ (1910-1992) ప్రసిద్ధ గాయకుడు. వామనరావు సడోలీకర్, పద్మావతీ శాలిగ్రాంలదీ ఇదే శైలి.

[జైపూర్ అత్రౌలీ ఘరానా ]
1. అల్లాదియా ఖాన్, 2. భాస్కరబువా బఖలే, 3. పద్మావతీ శాలిగ్రాం, 4. కేసర్‌బాయీ కేర్కర్, 5. మోగూబాయీ కుర్డీకర్, 6. మల్లికార్జున్ మన్సూర్ , 7. కిశోరీ ఆమోణ్‌కర్, 8. బుర్జీఖాన్, 9. మంజీఖాన్
కేసర్ బాయీ, మల్లికార్జున్పాడిన మారు బిహాగ్, మోగూబాయి యమన్ రాగంలో పాడిన తరానా, కిశోరీ సవివరంగా పాడిన జౌన్ పురీ రాగం, మొదలైనవన్నీ జైపూర్ శైలికి అద్దం పడతాయి.

పటియాలా ఘరానా

హిందుస్తానీ సంగీతానికి ఎల్లలు మనదేశపు ప్రస్తుత సరిహద్దులను మించినవి. ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న పశ్చిమ పంజాబ్ ప్రాంతమే కాక అఫ్ఘానిస్తాన్‌లోకూడా నిన్న మొన్నటిదాకా మహమ్మద్ ఖాన్ సహారంగ్ వంటి గాయకులుండేవారు. పశ్చిమ పంజాబ్ లోని లాహోర్ పట్టణం ఒక పెద్ద సాంస్కృతిక కేంద్రం. శాస్త్రీయ సంగీతంలో పంజాబుకు చెందిన ఒక ప్రసిద్ధమైన గాయకశైలి పటియాలా ఘరానా. ఇతర గురువులే కాక హద్దూ, హస్సూ ఖాన్ ద్వయంవద్ద శిక్షణ పొందిన అలీబక్ష్ జర్నయిల్, ఫతేఅలీ అనే ఇద్దరు గాయకులు తమ బాణీని పటియాలా శైలిగా రూపొందించుకున్నారు. వీరి శిష్యులలో కాలేఖాన్ , అలీబక్ష్ అనే సోదరులుండేవారు. పంతొమ్మిదో శతాబ్దంలో పటియాలా సంస్థానంలో మొదలైన ఈ సంప్రదాయం బడేగులాం పెత్తండ్రి కాలేఖాన్, తండ్రి అలీబక్ష్‌ల కాలానికి పేరు సంపాదించుకుంది. అయితే పటియాలా ఘరానాకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిన ముఖ్య ప్రతినిధి అలీబక్ష్ కుమారుడైన బడేగులాంఅలీఖాన్. “అనర్గళం, అనితరసాధ్యం” అనిపించే శక్తులు కలిగిన ఈ గాయకుడు తాను పాడినన్నాళ్ళూ మకుటంలేని మహారాజులా జీవించాడు (1901-1968).

పటియాలా ఘరానా
1. బడేగులాంఅలీఖాన్, 2. బర్కత్ అలీఖాన్, 3. బర్కత్ అలీతో కరామత్ అలీ, మునవ్వర్ అలీ, 4. అజయ్ చక్రవర్తి, 5. గులాంఅలీ
అద్భుతమైన శ్రావ్యగానం, పంజాబీ పోకడలూ, విద్యుత్తు వేగంతో తిరిగే గమకాలతో ఖయాల్, ఠుమ్రీల విన్యాసాలకు ఈ శైలి ప్రసిద్ధికెక్కింది. బడేగులాం గొంతు మంద్రస్థాయిలో అతి గంభీరంగానూ, తారస్థాయికి వెళ్ళినకొద్దీ అతి మధురంగానూ వినబడేది. సంగీతస్వరాలతో ఆయనలాగా గాఢమైన పరిచయం ఉన్న గాయకులు ఎవరూ కనబడరు. ఖయాల్ పాడినా, ఠుమ్రీ పాడినా ఆయనకు సాటి రాగలిగినవారెవరూ ఉండేవారుకారు. ఆయన తమ్ముడు బర్కత్ అలీఖాన్ (1905-1963), రెండో కుమారుడు మునవ్వర్ అలీ, అతని కొడుకు రజా అలీ, ఈ శైలిలో శిక్షణ పొందినఅజయ్ చక్రవర్తి తదితరులు ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు.
1921లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారతదేశం వచ్చినప్పుడు, బడేగులాం ఢిల్లీలో కచేరీ చేశాడు. ఆ తరవాత ఆయన చాలా కాలం లాహోర్ ప్రాంతంలోనే ఉండిపోయి, 1939లో కలకత్తాలో కచేరీ చేసిన తరవాతనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకోసాగాడు. ఆయన తమ్ముడు బర్కత్ అలీ తన తండ్రివద్దా, బడేగులాంవద్దా సంగీతం నేర్చుకుని, బడేగులాంలాగా భారతదేశంలో స్థిరపడకుండా పాకిస్తాన్‌కు వెళిపోయాడు. అక్కడ ఆయన ప్రధానంగా ఠుమ్రీ, గజల్ గానానికి పేరుపొందాడు. నేటి ప్రఖ్యాత గజల్ గాయకుడు గులాంఅలీ ఆయన వద్దనే నేర్చుకున్నాడు. బడేగులాం పెద్ద కుమారుడు కరామత్ అలీఖాన్ కొడుకులు ఉపశాస్త్రీయ సంగీతకారులుగా కెనడాలో స్థిరపడ్డారు. బడేగులాం సబ్‌రంగ్ అనే కలం పేరుతో ఎన్నో రచనలు చేశాడు. అవన్నీ ప్రధానంగా హిందూ దేవతల గురించినవే కావడంతోనో ఏమో ఆయనకు పాకిస్తాన్‌లో స్థిరపడడం నచ్చక బొంబాయిలోనూ, కలకత్తాలోనూ, చివరికి హైదరాబాద్‌లోనూ నివసించాడు.
బడేగులాం పాడిన గుజరీతోడీ, భైరవి రాగాల కచేరీ అరుదైన వీడియో, ఆడియో ఇంటర్వ్యూ, అదే సైట్ లో ఇతర వీడియోలూ ఈ తరంవారికి ఆయనను పరిచయం చేస్తాయి.
బడేగులాం (వంతపాట మునవ్వరలీ), బర్కత్ అలీలిద్దరూ పాడిన ఖమాజ్ ఠుమ్రీలు వింటే పోలికలూ, వ్యత్యాసాలూ కూడా తెలుస్తాయి. మునవ్వరలీ పాడినబిహాగ్, అజయ్ చక్రవర్తి పాడిన గుజరీతోడీ, పటియాలా శైలికి నమూనాలు.

రాంపుర్ సహస్వాన్ ఘరానా

గ్వాలియర్ ఘరానా దాదాపుగా తక్కిన అన్ని శైలులకూ జన్మనిచ్చిందని చెప్పవచ్చు. వీటిలో రాంపుర్ సహస్వాన్ ఘరానా కూడా ఒకటి. ఉత్తర్ ప్రదేశ్ ఉత్తర ప్రాంతానికి చెందిన ఈ శైలికి ఆద్యుడు ఇనాయత్ హుసేన్ ఖాన్ (1849-1919). ఇతను గ్వాలియర్ మూలస్తంభం హద్దూఖాన్‌కు స్వయానా అల్లుడు. రాంపుర్, సహస్వాన్‌లు ధ్రుపద్ సంప్రదాయానికి పేరుపొందిన ప్రదేశాలు కావడంతో ఈయన గాత్రంమీద హద్దూఖాన్ నేర్పిన గ్వాలియర్ పద్ధతితోబాటు ధ్రుపద్ ప్రభావంకూడా ఉండేది. ఆలాపనలో రాగస్వరూపాన్ని స్పష్టంగా చూపడం, కృతిలోని సాహిత్యాన్ని పూర్తిగా ఒత్తి పలుకుతూ అర్థాన్ని తెలియజెయ్యడం మొదలైనవన్నీ ఈ ఘరానా లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ శైలిలో రకరకాలైన తాన్ ప్రస్తారాలు బలంగా, తరుచుగా పాడడం పరిపాటి. ఇనాయత్ హుసేన్ శిష్యుల్లో ఆయన అల్లుళ్ళు నిసార్ హుసేన్ ఖాన్ (1912-1993), ముష్తాక్ హుసేన్ ఖాన్ (1874-1964) ప్రసిద్ధులు. వీరిద్దరి వద్దా నేర్చుకున్న హఫీజ్ అహ్మద్ ఖాన్, ఇనాయత్ హుసేన్ మనమడు గులాంముస్తఫాఖాన్ (ఇతను గజల్ గాయకుడైన హరిహరన్‌కు గురువు), రషీద్‌ఖాన్, ముష్తాక్ హుసేన్ శిష్యురాలు సులోచనా బృహస్పతి తదితరులు ఈ శైలికి వారసులు. నిసార్ హుసేన్‌కు మనమడి వరస అయిన రషీద్‌ఖాన్ ఆయన శిష్యుడు కూడా. ఈ శైలిలో నిసార్ హుసేన్ తరానాలు పాడడాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేశాడు. ఇది పాడడానికి అతి వేగంగా నోరు తిరగాలి. మొత్తంమీద వీరందరూ ఒకే బంధువర్గానికి చెందినవారు. కనీసం నాలుగు తరాలుగా బలపడుతూ వస్తున్న ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

రాంపుర్ సహస్వాన్ ఘరానా
1. ముష్తాక్ హుసేన్ ఖాన్, 2. నిసార్ హుసేన్ ఖాన్, 3. రషీద్‌ఖాన్, 4. సులోచనా బృహస్పతి, 5. గులాంముస్తఫాఖాన్, 6. హఫీజ్ అహ్మద్ ఖాన్
బిహాగ్ రాగంలో ముష్తాక్ హుసేన్ పాడిన ఖయాల్, నిసార్ హుసేన్ యువవయసులో పాడినతరానా ఈ ఘరానా లక్షణాలను విశదం చేస్తాయి. హఫీజ్ అహ్మద్ నింపాదిగా పాడినజైత్ రాగం, గులాంముస్తఫా పాడిన నాయకీ కానడా రాంపూర్ సహస్వాన్ ఘరానాకు మచ్చుతునకలు. ఈనాటి యువగాయకుడు రషీద్ పాడిన పూరియా రాగంలో ఈ శైలిని కొనసాగించడం చూడవచ్చు.

ఇతర ఘరానాలు

నిపుణుడైన గాయకుడు తన బాణీకి పేరు తెచ్చిపెట్టగలడు. ప్రముఖ గాయకుడు జస్‌రాజ్ ద్వారానే మేవతీ ఘరానా పేరుపొందింది. జస్‌రాజ్ పాడిన అడాణా రాగం, అతని శిష్యుడు సంజీవ్ అభయంకర్ పాడిన లలిత్ రాగం ఒకే శైలికి అద్దం పడతాయి.
పాకిస్తాన్‌లో గొప్ప గాయకులుగా సంచలనం కలిగించిన సోదరద్వయం నజాకత్, సలామత్ అలీ ఖాన్ ల కారణంగా షం చౌరాసీ ఘరానా ప్రసిద్ధమైంది. ఇలా చిన్నా పెద్ద ఘరానాలు అనేకం ఉన్నాయి. పెద్ద ఘరానాకి చెందిన తక్కువరకం గాయకులూ, పెద్దగా పేరు పొందని ఘరానాలో గొప్ప గాయకులూ కూడా అక్కడక్కడా కనిపిస్తారు.

షం చౌరాసీ ఘరానా
1. జస్‌రాజ్, 2. నజాకత్, సలామత్ అలీ ఖాన్, 3. సంజీవ్ అభయంకర్, 4. కుమార్ గంధర్వ
కొందరి లెక్కన ఘరానా పద్ధతి అంత సబబైనది కాదు. ఎవరో ఒక గాయకుడు తన శక్తి యుక్తులకు అనువుగా తాను పాడే శైలిని మలుచుకోవచ్చు. అంతమాత్రం చేత అది అతని వారసులకూ, శిష్యులకూ అందరికీ అదే స్థాయిలో పనికొస్తుందన్న నమ్మకం లేదు. ఇది ఒక్కొక్కప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్టుగా ఉంటుంది. అయితే తనది “ఘరానేదార్ గాయకీ” అనే మెప్పు పొందాలని ప్రతి గాయకుడూ ఆశిస్తాడు. పేరున్న గురువువద్ద నేర్చుకోనివారూ, వీరిదీ, వారిదీ విని నేర్చుకున్నామని చెప్పుకోవడం నచ్చనివారూ తమ తండ్రి దగ్గర నేర్చుకున్నామని చెప్పుకోవడం మామూలు. శాస్త్రీయ సంగీతరంగంలో ఇటువంటి భేషజాలు ఎక్కువ. ఏది ఏమైనా గత నూరేళ్ళుగా వివిధ రాగాల పార్శ్వాలన్నిటినీ సమర్థవంతంగా అభివృద్ధి చేసి, గాయకపద్ధతుల్లో చక్కని వైవిధ్యం ఏర్పడటానికి ఘరానా పద్ధతి బాగా తోడ్పడింది. గురువుల బాణీపట్ల విధేయత కనబరుస్తూనే నిపుణులైన గాయకులందరూ తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ వచ్చారు. కిరానా సంప్రదాయానికి చెందినప్పటికీ భీంసేన్ జోషీ ఆ బాణీ పోకడలకి తన వ్యక్తిగత ప్రతిభను జోడించి పేరు తెచ్చుకున్నాడు. కొందరు మాత్రం ఘరానా పద్ధతికి దూరంగా ఉండికూడా పేరు పొందారు.
తాను ప్రత్యక్షంగా నేర్చుకోకపోయినా అమీర్ ఖాన్ కిరానా మూలపురుషుల్లో ఒకడైన అబ్దుల్ వహీద్ ఖాన్ పాటను చాటుగా విని తన శైలికి రూపుదిద్దుకున్నాడట. అయితే ఘరానా పేరు చెప్పుకోకపోవడం ‘అవమానకరం’గా అనిపించడంతో అమీర్ ఖాన్ పాడే పద్ధతి ఇందోర్ ఘరానాగా చెప్పబడుతోంది. గ్వాలియర్ బాణీలో దేవ్‌ధర్ వద్ద నేర్చుకున్నప్పటికీ కుమార్ గంధర్వ (1924-1992) (ఈయన అసలు పేరు శివపుత్ర సిద్ధరామయ్య కోమ్ కలీ) ఒక రెబెల్ గాయకుడుగా పేరు పొందాడు. ఉత్తర కర్ణాటకకు చెందిన ఈయన పసివయసులోనే అద్భుతంగా పాడేవాడు. తరవాత మధ్యప్రదేశ్‌లో స్థిరపడి, అక్కడి జానపద సంగీతాన్ని కూడా అధ్యయనం చేసి తన స్వంతబాణీ ఒకటి ఏర్పరుచుకున్నాడు. తనకు ఘరానా పద్ధతిలో విశ్వాసం లేదని చెప్పాడు కూడా. కుమార్ గంధర్వ శంకరా రాగంలో చేసిన స్వీయరచనలోనూ, జానపద ధోరణిలో పాడిన తత్వగీతాల్లోనూ ఆయన అసమాన ప్రతిభ కనబడుతుంది. ఒకే ఊపిరితిత్తి కలిగినప్పటికీ ఈయన గానం అద్భుతమే.
ఘరానాలది మూస పద్ధతి అనీ, ప్రతి బాణీలోనూ గొప్ప సంగీతజ్ఞులున్నారు కనక అందరిదీ విని మంచి అంశాలను స్వీకరించే ధోరణి ఉండాలనీ కొందరు ఆధునికుల ఉద్దేశం. ఘరానాలను విమర్శించకపోయినప్పటికీ మంచి గాయకులందరూ చేస్తూ వస్తున్నది ఈ పనే అనిపిస్తుంది. కొందరు సందర్భాన్ని బట్టీ, వ్యక్తిగత కారణాల వల్లనూ వివిధ ఘరానాల గురువుల వద్ద నేర్చుకుని మిశ్రమ శైలిని అవలంబించిన ఉదాహరణలూ కనిపిస్తాయి. మొత్తం మీద పాట బావుండాలే కాని ఘరానా ఏదైతేనేం అని శ్రోతలెవరైనా భావిస్తే దాన్ని కాదనడమూ కష్టమే.

[1948 నాటి రాష్ట్రపతితో హిందూస్తానీ సంగీత విద్వాంసుల తారామండలం]
మొదటి వరస:(ఎడమ నుంచి కుడికి) 1. తెలియదు, 2. నిసార్ హుసేన్ ఖాన్ (గాత్రం), 3. అహ్మద్ జాన్ థిరక్వా (తబలా), 4. హాఫిజ్ అలీఖాన్ (సరోద్), 5. ముష్తాక్ హుసేన్ ఖాన్ (గాత్రం), 6. ఓంకార్‌నాథ్ ఠాకూర్ (గాత్రం), 7. రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, 8. కేసర్‌బాయి కేర్కర్ (గాత్రం), 9.అల్లాఉద్దీన్ ఖాన్ (సరోద్), 10. కంఠే మహారాజ్ (తబలా), 11. గోవిందరావు భరణ్‌పూర్‌కర్ (పఖవాజ్), 12. కృష్ణారావు శంకర్ పండిత్ (గాత్రం), 13. మనోహర్ జోషీ (గాత్రం)
రెండో వరస: 1. గులాం ముస్తఫా ఖాన్ (గాత్రం), 2. అల్తాఫ్ హుసేన్ ఖాన్ (తంబురా), 3. తెలియదు,
4. కరామత్ ఖాన్ (తబలా), 5. రాధికామోహన్ మైత్రా (సరోద్), 6. ఇల్యాస్ ఖాన్ (సితార్), 7. బిస్మిల్లా ఖాన్ (షెహనాయి), 8. కిషన్ మహారాజ్ (తబలా), 9. అతాఫ్ హుసేన్ ఖాన్ (గాత్రం), 10. రవిశంకర్ (సితార్), 11. అలీఅక్బర్ ఖాన్ (సరోద్), 12. విలాయత్ ఖాన్ (సితార్), 13. నారాయణరావు వ్యాస్ (గాత్రం), 14. వినాయకరావు పట్వర్ధన్ (గాత్రం), 15. డి.వి.పలూస్కర్ (గాత్రం)
మూడో వరస: 1 నుంచి 5 బిస్మిల్లాఖాన్ బృందంవారు, 6. బి.ఆర్. దేవ్‌ధర్, 7. జ్ఞాన్ ప్రకాశ్ ఘోష్ (తబలా), 9. రాజాధ్యక్ష (గాత్రం), 9,10. తెలియదు, 11. నీంకర్ బువా
నాలుగో వరస: ఎడమ నుంచి రెండో వ్యక్తి వినయ్ చంద్ర (తక్కిన పేర్లు తెలియవు)
(హిందుస్తానీ గాత్రంలో ప్రాచుర్యంలో ఉన్న వివిధ పద్ధతులను వివరించడమే ఈ వ్యాసం ఉద్దేశం. ఇందులో వినిపించే గాత్రసంగీతం అంతా అందరికీ నచ్చకపోవచ్చు. ఇది కేవలం పోలికలూ, వ్యత్యాసాలూ తెలిపేందుకు ఉద్దేశించినదే. అందువల్ల ఒకే బాణీకి చెందిన వేరువేరు గాయనీ గాయకులు దాన్ని అనుసరించే విధానాలను ఆడియో ఉదాహరణల్లో గమనించవచ్చు. ఈ ఒక్క వ్యాసం ద్వారా వందలూ, వేల సంఖ్యలో ఉన్న సంగీతజ్ఞులందరి శైలులనూ పరిచయం చెయ్యడం అసంభవమే. ఇది చదివి ఆసక్తి పెంచుకున్నవారికి ఈ విషయాల గురించి మరింతగా తెలుసుకునేందుకు ప్రేరణ కలగవచ్చు. ఇంటర్నెట్‌లో లెక్కలేనన్ని ఆడియో ఫైల్స్ కనిపిస్తాయి. విని ఆనందించదలుచుకున్నవారికి బోలెడంత కాలక్షేపం

సర్వోత్తమ సితార్ విద్వాంసుడు ఉస్తాద్ విలాయత్‌ఖాన్

‌ప్రపంచమంతటా సామాన్యంగా సితార్ అనగానే రవిశంకర్ పేరును తలుచుకుంటారు. ఒక భారతీయ శాస్త్రీయసంగీతజ్ఞుడు ఎంతటి ఖ్యాతిని పొందవచ్చునో నిరూపించిన మేధావి రవిశంకర్ అనడంలో సందేహమేమీ లేదు. అయితే ప్రతి అర్జునుడికీ సరితూగే ఒక కర్ణుడు ఉంటాడనుకుంటే అందుకు సరిగ్గా సరిపోయే వ్యక్తి ఉస్తాద్ విలాయత్‌ఖాన్‌. సితార్ చేత “పాడించి”, సితార్ వాయిద్యపు పరిధిని అపారంగా విస్తరింపజేసి, సితార్ శైలికే కొత్త భాష్యం చెప్పిన విలాయత్‌ఖాన్‌కు మరెవరూ సాటిరారని భావించేవారూ ఉన్నారు. మార్చ్ 2004లో ముంబాయిలో కాలం చేసిన ఈ మహావిద్వాంసుడి గురించిన కొన్ని వివరాల కోసమే ఈ వ్యాసం.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో రేడియో ఒక శక్తివంతమైన ప్రసారసాధనంగా ఉండేది. అయితే శాస్త్రీయసంగీతం వినిపించే కళాకారులకు ఆలిండియా రేడియోవారు ఇస్తున్న పారితోషికాలు మరీ అవమానకరంగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తూ కొందరు సంగీతవేత్తలు 1952లో రేడియోను బాయ్‌కాట్ చేశారు. ప్రసిద్ధ గాయకుడు పండిత్ ఓంకార్‌నాథ్ ఠాకూర్ వీరికి నాయకత్వం వహించాడు. సంతకాలు చేసినవారిలో యువ సితార్ వాయిద్యకారుడు విలాయత్‌ఖాన్‌కూడా ఉన్నాడు. ఆ తరవాత కొన్నాళ్ళకు కేంద్రమంత్రుల రాయబారాల ఫలితంగా ఠాకూర్‌తోసహా చాలామంది తమ ఫిర్యాదును ఉపసంహరించుకుని రేడియోలో కచేరీలు చెయ్యసాగారు. వారిలో రాజీ పడకుండా చివరిదాకా నిలిచినవాడు విలాయత్‌ఖానే. ఆ తరవాతి కాలంలో ఆయన 1964లో పద్మశ్రీ, 1968లో పద్మభూషణ్, 2000లో పద్మవిభూషణ్ పురస్కారాలనుకూడా నిరాకరించాడు. అతని వ్యక్తిత్వానికి ఇదొక నిదర్శనం. ఉస్తాద్ విలాయత్‌ఖాన్‌ మనస్తత్వం అర్థమవాలంటే అతని పుట్టు పూర్వోత్తరాల్లోకి వెళ్ళాలి.
ఉస్తాద్ ఇమ్‌దాద్ ఖాన్‌
విలాయత్‌ఖాన్‌ సితార్ , సుర్‌బహార్ విద్వాంసుల వంశంలో జన్మించాడు. వీరిది మొదట్లో రాజపుత్ర ఠాకుర్ వంశమనీ, ఎప్పుడో మతం మార్పిడి జరిగిందనీ అంటారు. విలాయత్‌ఖాన్‌ ముత్తాత సాహబ్‌దాద్ ఖాన్ ఆగ్రా సమీపాన ఇటావా అనే గ్రామంలో నివసిస్తూ తన ఏకైక పుత్రుడు ఇమ్‌దాద్ ఖాన్‌కు (1848-1920) సితార్ నేర్పసాగాడు. సుర్‌బహార్ అనే వాయిద్యాన్ని సాహబ్‌దాద్ స్వయంగా తయారుచేశాడట. కచ్ఛపవీణ అనబడే ప్రాచీనవాయిద్యానికి ఆయన సితార్ పద్ధతిలో దిగువ తీగలూ వగైరాలను అమర్చాడు. తన తండ్రివద్ద పన్నెండేళ్ళపాటు శిక్షణ పొందాక ఇమ్‌దాద్ మేటి విద్వాంసుడుగా తయారయాడు. విక్టోరియారాణి ఢిల్లీకి వచ్చిన సందర్భంలోనూ, మనదేశపు తొట్టతొలి గ్రామొఫోన్ రికార్డులలోనూ ఆయన సితార్ వాయించి బాగా పేరుపొందాడు. పాతతరం పద్ధతిలో ఆయన ప్రధానంగా యమన్, పూరియా రాగాలనే వాయించేవాడట. ఆయన మీది గౌరవం కొద్దీ ఆయన పాల్గొన్న సమావేశాల్లో ఇతరులెవరూ ఈ రాగాలను వినిపించేవారు కాదట. ఆయన వాయించిన యమన్ రికార్డు ద్వారా ఆయన శైలి తెలుస్తుంది.
ఇమ్‌దాద్ ఖాన్‌కు ఇనాయత్, వహీద్ అని ఇద్దరు కొడుకులు కలిగారు. వారిద్దరికీ ఆయన గాత్రం, సితార్, సుర్‌బహార్ నేర్పాడు. వారి చిన్నతనంలోనే కుటుంబమంతా కోల్‌కతాకు తరలివెళ్ళింది. అక్కడ వారి శిక్షణ ఎన్నో ఏళ్ళపాటు నిర్దుష్టమైన పద్ధతిలో కొనసాగింది. కొన్నాళ్ళకు ఇమ్‌దాద్ ఖాన్‌ తన కుటుంబాన్ని ఇందోర్‌కు తీసుకెళ్ళి, అక్కడ హోళ్కర్ మహారాజు ఆస్థానవిద్వాంసుడుగా ఉంటూ అక్కడే కాలంచేశాడు. ఇమ్‌దాద్ ఎంత శ్రద్ధగా సాధన చేసేవాడంటే తన కుమార్తె చనిపోయిందన్న వార్త విన్నాకకూడా చేస్తున్న అభ్యాసం పూర్తయేదాకా ఆయన లేవలేదట. అప్పట్లో కాలగమనాన్ని మూరెడు కొవ్వొత్తులు పూర్తిగా వెలిగే వ్యవధిని బట్టి చెప్పేవారట. ఆ లెక్కన ఇమ్‌దాద్‌గారిది నాలుగు కొవ్వొత్తుల సాధన అనేవారట. తమ వంశాన్ని గురించిన ఇటువంటి గాథలు తరవాతి తరంవా రందరిపైనా గాఢమైన ప్రభావం కలిగించాయి. ఇమ్‌దాద్ పెద్దకొడుకు ఇనాయత్ ఖాన్‌ (1894-1938) సితార్ , సుర్‌బహార్ రెండు వాయిద్యాలనూ అద్భుతంగా వాయించేవాడు.

కొడుకులతో ఇమ్‌దాద్‌ఖాన్ (మధ్య),
వహీద్‌ఖాన్ (ఎడమ), ఇనాయత్‌ఖాన్ (కుడి)‌
ఇమ్‌దాద్ తన కొడుకులిద్దరితోనూ కలిసి కచేరీ చేసిన ఫోటో చూడవచ్చు. తండ్రి చనిపోయాక ఇనాయత్ కోల్‌కతాకు వెళిపోయాడు. (ఆ తరవాత ఆయన తూర్పుబెంగాల్‌లోని గౌరీపూర్‌లో స్థిరపడ్డాడు. అందుకే ఈ బాణీని ఇటావా ఘరానా అనీ, గౌరీపూర్ఘరానా అనీకూడా అంటారు).
కాస్త బిడియస్తుడైన రెండోకొడుకు వహీద్ మటుకు సుర్‌బహార్ వాయించేవాడు. అతను 18 ఏళ్ళపాటు ఇందోర్ ఆస్థానవిద్వాంసుడుగా కొనసాగాడు. 1958లో సత్యజిత్ రాయ్ తీసిన జల్సాఘర్ అనే సంగీతప్రధానమైన సినిమాలోని ఒక సన్నివేశంలో వహీద్ ఖాన్ స్వయంగా సుర్‌బహార్ వాయిస్తూ కనిపిస్తాడు. దీనికి సంగీతదర్శకుడు విలాయత్‌ఖాన్. ఈ సన్నివేశంలో సంగీతప్రియుడైన జమీందార్ రసాస్వాదనకు దూరాన మోగే ఎలెక్ట్రిక్ పంప్ అడ్డొస్తుంది.
ఇనాయత్ ఖాన్‌ మటుకు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిని గడించి వివిధ సంగీతసమావేశాల్లో పాల్గొనసాగాడు. ఆయన వాయించిన సింధుభైరవి రికార్డువింటే ఆయన ప్రతిభ తెలుస్తుంది.
ఇనాయత్ తన పొడవైన జుట్టును కిటికీచువ్వలకు కట్టుకుని రోజూ గంటల తరబడి సాధన చేసేవాడట. కూర్చుని వాయిస్తూ ఉండగా నిద్రవచ్చినప్పుడల్లా తల ముందుకు వాలి జుట్టు బిగలాగుకుపోవడంతో మళ్ళీ మెలకువ వచ్చేదట. అటువంటి రాక్షససాధనవల్ల ఆయన తన తరంలో అద్వితీయుడని పేరు సంపాదించాడు. రవిశంకర్ ఆయనకు శిష్యుడు అవుదామనుకున్నాడటగాని టైఫాయిడ్ రావడంతో ఆ సంకల్పం వాయిదా పడింది. రవిశంకర్ తీరా జ్వరంనుంచి కోలుకునేసరికి ఉస్తాద్‌గారు కాలంచేశాడు. అందుచేతనే రవిశంకర్ అల్లాఉద్దీన్శిష్యుడయాడు.

సుర్‌బహార్‌తో ఇనాయత్‌ఖాన్
ఇనాయత్‌ఖాన్‌ తరంలో సితార్ బాగా ప్రజాదరణ పొందసాగింది. అప్పట్లో రాగాలాపనకూ, తానం వాయించడానికీ పాతకాలపు ధ్రుపద్ శైలిలో రుద్రవీణ వాయించేవారు. సుర్‌బహార్‌ను రుద్రవీణ పద్ధతిలో ధ్రుపద్ శైలికి ఉపయోగించవచ్చు. సాహిత్యం లేనటువంటి గత్ రచనలకు మాత్రం సితార్ ఉపయోగించేవారు. ఇందులో మసీత్ ఖానీ (విలంబిత్ ఖయాల్‌ను పోలినది), రజాఖానీ (ద్రుత్ ఖయాల్‌ను పోలినది) గత్‌లుండేవి. రజాఖానీ గత్ అతివేగంగా సాగేది. అందులో కుడిచేతి పనితనపు ఆర్భాటం హెచ్చుగా వినబడేది. గత్ చివరలో మెరుపువేగంతో వాయించే ఝాలా ఉండేది. వీటన్నిటిలోనూ ఇనాయత్‌ఖాన్‌ అద్వితీయుడనిపించుకున్నాడు. ఇదంతాకాక సితార్‌ మీద గాయకశైలిలో, సుదీర్ఘమైన గమకాలనూ, సులువుగా జారే స్వరాలనూ పలికించవచ్చని ఆయన నిరూపించాడు. ఆయనకు సమకాలికులైన ప్రఖ్యాత గాయకులు కరీంఖాన్, ఫైయాజ్ ఖాన్, సరోద్ నిపుణుడు హాఫిజలీఖాన్ తదితరులూ, రవీంద్రనాథఠాకూర్ వంటి ప్రతిభావంతులూ ఆయనను మెచ్చుకునేవారు.
ప్రతితరంలోనూ ఒక కొడుకు సితార్‌నూ, మరొక కొడుకు సుర్‌బహార్‌నూ చేపట్టేవారు. ఇనాయత్, వహీద్‌ల లాగే తరవాతి తరంలో విలాయత్, ఇమ్రత్‌లూ, ఇమ్రత్ కుమారుల్లో నిషాత్, ఇర్షాద్‌లూ ఈ పధతిలో అభ్యాసం చేశారు. సుర్‌బహార్ గంభీరంగా మోగే పద్ధతిని ఇమ్రత్‌ఖాన్ వీడియోలో చూడవచ్చు.
ఈ సందర్భంలో సితార్ వాయించే శైలిని కొద్దిగా ప్రస్తావించాలి. వీణ తీగలను ఒక దిశలోనే మీటుతారు. సితార్ తీగలను ది, ర అనే పద్ధతిలో రెండు వేపులకూ మీటుతారు. సితారుకూ వీణకూ తేడా ఇదే. ఇరవయ్యో శతాబ్దం మొదట్లో ఇనాయత్‌ఖాన్‌ వంటి మేటి సితార్ విద్వాంసులందరూ కుడిచేత్తో ఈ “దిరదిర” అంటూ మీటే వేగాన్ని ఎక్కువగా ప్రదర్శించేవారు. ఇదికాక ఆయన ఎడమచేత్తో అందంగా గమకాలు పలికించడం కూడా చేసేవాడు.

విలాయత్‌ఖాన్‌ తల్లి బషీరన్
ఇనాయత్‌ఖాన్‌ ఉస్తాద్ బందేహసన్ అనే గాయకుడి కుమార్తె బషీరన్ బేగమ్ ను వివాహం చేసుకున్నాడు. ముస్లిం సంప్రదాయం ప్రకారం ఆమె స్వయంగా కచేరీలు చెయ్యకపోయినా తండ్రి, భర్త, మామగార్లనుంచి ఎన్నో విషయాలను ఆకళించుకుంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు కలిగారు. పెద్దవాడు విలాయత్, రెండోవాడు ఇమ్రత్. పధ్నాలుగో ఏట పెళ్ళైన తరవాత ఆమెకు 32వ ఏట భర్త ఇనాయత్‌ఖాన్‌ మరణించాడు. ఆ తరవాత ఆమె తన కొడుకులనిద్దరినీ గొప్ప వాద్యకళాకారులుగా తయారుచెయ్యడంలో నిమగ్నం కాసాగింది. తన పుట్టింటివారి గాత్రశైలిని వాద్య సంగీతానికి చేర్చడంలో ఆమె పాత్ర చాలా ఉంది.

సితార్ వాయిస్తున్న విలాయత్ ,
ఒడిలో పిల్లలతో ఇనాయత్‌ఖాన్
విలాయత్‌ఖాన్‌ పుట్టిన సంవత్సరం 1924 అనీ, 27, 28 అనీ కూడా ప్రస్తావించబడింది. అతను తన మూడో ఏటి నుంచీ సంగీతంలో అసమానప్రతిభ కనబరిచినట్టుగా తెలుస్తోంది. “సితార్ ధున్, కళాకారుడు, విలాయత్‌ఖాన్‌, ప్రొఫెసర్ ఇనాయత్‌ఖాన్‌ కుమారుడు, వయసు 12 ఏళ్ళు” అని రాసి ఉన్న ఒక అద్భుతమైన 78 ఆర్.పి.ఎం. రికార్డు నేను చాలా ఏళ్ళ క్రితం స్వయంగా విన్నాను. అది 1936లో రిలీజయిందని అంటారు. దీన్నిబట్టి అతను 1924లో జన్మించాడని అన్నారేమో. తాను 1928లో పుట్టినట్టుగా ఆయనే చెప్పాడు.

1938లో తన ఇద్దరు శిష్యుల మధ్య ఇనాయత్‌ఖాన్
ఫోటోలో ఎడమపక్క జోషీ, వెనకాల
కూర్చున్న పిల్లలు విలాయత్, ఇమ్రత్
తండ్రినుంచి నేర్చుకున్న సంగీతమేకాక తమ ఇంటికి వచ్చిపోయే మహావిద్వాంసుల సాంగత్యమూ, తండ్రి చేసిన కచేరీలూ, ఆయన పొందిన ఆదరాభిమానాలూ అన్నీ విలాయత్‌పై గొప్ప ప్రభావాలని కలిగించాయి. 1932లో తండ్రి కచేరీ చేస్తూండగా తాను నిద్రపోయానని విలాయత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మధ్యలో కళ్ళు తెరిచినప్పుడు అంతా పసుపుపచ్చగా కనిపించిందని తండ్రితో అంటే ఆయన నవ్వి “పిచ్చివాడా అది బసంత్ రాగం రంగురా” అన్నాట్ట. మూడో క్లాసు మూడుసార్లు తప్పాక విలాయత్ స్కూలుకెళ్ళడం మానుకుని సితార్ మటుకే నేర్చుకుంటానన్నాట్ట. “సితార్ తేలుకొండివంటిది జాగ్రత్తసుమా” అని తండ్రి మొదట్లోనే హెచ్చరించాడట. ఆ తరవాత అతని సంగీతయాత్ర నిరాటంకంగా సాగింది. వాళ్ళ ఇంటికి వెంకటగిరియప్పవంటి కర్ణాటక వైణికులూ, బాలసరస్వతివంటి నాట్యకళాకారులూ కూడా వస్తూ ఉండేవారట.

డి.టి. జోషీ (1912-1993)
ఇంతలోనే, ఇమ్రత్ రెండు మూడేళ్ళవాడై ఉండగా, విలాయత్‌కు 11 ఏళ్ళ వయసు రాకమునుపే తండ్రి చనిపోయాడు. కచేరీకని అలహాబాద్ వెళ్ళినవాడు వ్యాధిగ్రస్తుడై తిరిగివచ్చి నడివయసులోనే కన్నుమూశాడట. చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకోవడం విలాయత్‌కు చాలా నష్టాన్ని కలిగించిన ట్టయింది. ఆ సమయంలో ఇనాయత్ శిష్యుడైన డి.టి. జోషీ అనే ఆయన విలాయత్‌కు చాలా మెళుకువలు నేర్పాడు.
తమ వంశమంటే గర్వం, దాని పేరు నిలబెట్టాలనే స్వాభిమానం విలాయత్‌కు చిన్నతనం నుంచీ ఉండేవి. వాయిద్యకారుడుగా ఒక్క వెలుగు వెలిగిన తండ్రి అకస్మాత్తుగా చనిపోయి, తామంతా దిక్కులేని పక్షులైపోయామనే భావనా, తమను నిర్లక్ష్యం చేస్తున్న సమాజంపై కసీ విలాయత్‌ను బాగా ప్రభావితం చేశాయి. ప్రత్యక్షంగా కాపాడేవారెవరూ లేకపోవడంతో అతను సాంప్రదాయక విలువలనే ప్రామాణికంగా భావించడం మొదలుపెట్టి, బతుకుతెరువు కోసం ఎవరి కాళ్ళూ పట్టుకోకుండా చిన్నతనంలోనే స్వశక్తి మీద మాత్రమే ఆధారపడాలనే నిర్ణయానికి వచ్చాడు. తన తండ్రి శిష్యులు కొందరు తనను కొన్ని సందర్భాల్లో ఈసడించుకోవడంతో తన మనసు గాయపడిందని ఒక వీడియోలో విలాయత్ చెప్పారు.
ఆ కారణంగా తన పదకొండో ఏట విలాయత్ ఒంటరిగా తన సితార్ చంకన పెట్టుకుని, కోల్‌కతానుంచి రైలెక్కి, టికెట్టు లేకుండా ప్రయాణిస్తూ, రైళ్ళు మారి చివరకు ఢిల్లీ చేరుకున్నాడు. అలిసి, డస్సిపోయి అక్కడున్న తన తండ్రి శిష్యుడు జఫర్‌హుసేన్‌ను కలుసుకుని తానెవరో చెప్పుకున్నాడు. రేగిన జుట్టుతో, నలిగిన బట్టలతో, స్వాభిమానం ఉట్టిపడేలా మాట్లాడిన ఆ కుర్రవాణ్ణి చూసి అతనికి ఆశ్చర్యానందాలు కలిగాయి. వెంటనే విలాయత్ ను రేడియో స్టేషన్‌కు తీసుకెళ్ళి డైరెక్టర్ జనరల్ బుఖారీకి పరిచయం చేశాడు. ‘నన్ను వెనక్కి పంపే ప్రయత్నం చెయ్యకండి; అలా చేస్తే నేను మళ్ళీ పారిపోతా’ అని వెక్కివెక్కి ఏడుస్తూ చెపుతున్న కుర్రవాణ్ణి బుఖారీ సముదాయిస్తూ ఇనాయత్‌ఖాన్‌ వారసత్వాన్ని సంరక్షించడానికి నిశ్చయించుకున్నాడు. ‘సితార్ మీద ఏమైనా వాయించగలవా?’ అని అడగగానే విలాయత్ మెరుపువేగంతో వాయించి తన ప్రతిభ కనబరిచాడు.
ఆ విధంగా విలాయత్ బస రేడియోస్టేషన్‌ సమీపంలోని బుఖారీ కారుషెడ్డులో ఏర్పాటయింది. నెలకు పదిరూపాయల జీతంతో రేడియో ఆర్టిస్టుగా ఉద్యోగమూ దొరికింది. అతని వాయింపు విన్నవారంతా అతనిలో ఇనాయత్ ఇప్పటికీ జీవించే ఉన్నాడని అనసాగారు. అక్కడుండగానే విలాయత్‌కు గాత్రంలోనూ, వాదనంలోనూ శిక్షణ ఇవ్వడానికి మాతామహుడి కుటుంబం నుంచీ, పినతండ్రి నుంచీ ఏర్పాట్లు జరిగాయి. అందుకు వీలుగా వారిద్దరికీ నెలనెలా ఢిల్లీకి వచ్చి రేడియోలో సంగీతం వినిపించేందుకు ఆహ్వానాలు పంపేవారు. ఈ సంగతులు చెప్పిన వీడియోలో పూరియా కల్యాణ్ వాయిస్తున్న విలాయత్ పక్కన ఆయన పాతశిష్యుడు అరవింద్ పారిఖ్ కనిపిస్తాడు.
ఆ తరవాత విలాయత్ తన మాతామహుడి గాత్రసంప్రదాయాన్ని అవగతం చేసుకున్నాడు. తాను బాగా పాడగలనని తెలుసుకున్నాక ఒక దశలో విలాయత్‌ఖాన్‌ సితార్‌ను వదలి గాత్రంపై శ్రద్ధ పెట్టసాగాడు. ఖయాల్ , ఠుమ్రీ ఇలా ప్రతిదీ అతన్ని ఆకర్షించసాగింది. అప్పుడతని తల్లి అతన్ని మందలిస్తూ ‘తండ్రి చనిపోయాక నేను నా మెట్టినింటిది కాకుండా పుట్టింటి సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తున్నాననే అపవాదు రాకూడదు. నువ్విక పాడడం కట్టిపెట్టి సితార్ సాధన చెయ్యాలి’ అని బాగా కోప్పడవలసివచ్చింది. దర్బారీకానడ, దేశ్ రాగాలు వాయించిన ఒక వీడియోలో విలాయత్ ఈ సంగతులు ఉదహరించారు.
ఆ విధంగా సితార్ అభ్యాసం కొనసాగిస్తున్నప్పటికీ విలాయత్ మీద గాత్రశైలి ప్రభావం బాగా పడింది. తమ ఇంటికి వస్తూపోతూ ఉండే మహాగాయకులు కరీమ్‌ఖాన్, ఫైయాజ్‌ఖాన్‌ల అద్భుత గాత్రపటిమతోబాటుగా విలాయత్ సోదరిని వివాహం చేసుకున్న ఉస్తాద్ అమీర్‌ఖాన్ గంభీరమైన గాత్రశైలికూడా అతన్ని ముగ్ధుణ్ణి చేసింది. తరవాతి కాలంలోకూడా విలాయత్‌ఖాన్ తక్కిన గాయకులంతా ఒక ఎత్తయితే అమీర్‌ఖాన్ ఒక ఎత్తు అని అంటూ ఉండేవాడు.
విలాయత్‌ఖాన్‌ సితార్‌పై నిరంతరం కఠోరసాధన చెయ్యసాగాడు. స్వరాల ప్రతి వరసనీ వందలేసి సార్లు ఎడమచెయ్యి పైకీ కిందికీ విసురుగా కదుపుతూ వాయిస్తున్నప్పుడు వేలు తెగి రక్తపు బొట్లు పక్కనున్న గోడమీద చిందుతూ ఉండేవని ఆయన తరవాతి కాలంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తన తండ్రి తాతలనాటి శైలిలో ప్రధానంగా కుడిచేతి వేగమూ, లయపరమైన అద్భుత విన్యాసాలూ ఉండేవి. ఎడమచేత్తో ధ్రుపద్ శైలి గమకాలు పలికేవి. గాత్రాన్ని పోలిన గమకాలను మొదలుపెట్టినవాడు ఇనాయత్‌ఖాన్. దీన్ని మరింతగా విస్తృతం చేస్తూ విలాయత్ రకరకాల ప్రయోగాలు చెయ్యసాగాడు. అచ్చగా ఖయాల్ గాయకులు పాడిన పద్ధతిలో రాగవిస్తారాన్నీ, ఆవాహన చేసే విధానాన్నీ ప్రవేశపెట్టాడు. ఠుమ్రీ అందాలను మొదటగా సితార్‌మీద పలికించాడు. కొత్తలో కొందరు ఇదేమీ గొప్ప కాదనే వైఖరితో చప్పరించినప్పటికీ అతను అంతులేని ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాడు. ఎంతో నిర్దుష్టంగా తాళగతుల మీద తాన్‌లు వాయించడంలోనూ, ఎంతటి వేగంలోనైనా పొల్లుపోకుండా చెయ్యి కదపడంలోనూ అతనికెవ్వరూ సాటిరారనిపించేది. 1942లో విలాయత్ పూనాలో సంగీత విద్వాంసుల ఎదుట చేసిన ఒక అద్భుతమైన సితార్ కచేరీ తాను విన్నానని మా గురువుగారు కేళ్కర్ నాతో అన్నారు. అందులో పదహారు మాత్రల విలంబిత్ తీన్‌తాల్ గత్ మీద ఏ ‘అక్షరం’ నుంచైనా మొదలుపెట్టి, తిహాయీ (ముక్తాయింపు) వాయించి సమం మీదికి సరిగ్గా రాగలనని అతను సవాలు చేసి నిరూపించాడట. ఆ యువకళాకారుణ్ణి పెద్దలంతా భేష్ అని మెచ్చుకున్నారట.
1943లో విలాయత్‌ఖాన్ బొంబాయికి వచ్చిన కొత్తలో అహమ్మదాబాద్‌నుంచి అరవింద్ పారిఖ్ అక్కడికి చేరుకుని అతని శిష్యుడయాడు. సితార్‌లో మంచి ప్రావీణ్యం ఉన్నప్పటికీ కచేరీల ఏర్పాటు, డబ్బు వ్యవహారాలు వగైరాల్లో విలాయత్‌కు అనుభవం తక్కువ ఉండడంవల్ల అరవింద్ అతనికి అడుగడుగునా తోడ్పడేవాడు. అప్పట్లో కొన్ని కచేరీలకూ, సమావేశాలకూ సినీతారలు కూడా వచ్చేవారనీ, వారంటే అప్పట్లో విలాయత్‌కు చాలా గ్లామర్ ఉండేదనీ అరవింద్ పారిఖ్ అన్నాడు. మోతీలాల్, దిలీప్‌కుమార్ తదితరులు అతని అభిమానులు. నర్గీస్ చాలాకాలం అతనివద్ద సితార్ నేర్చుకుందట. ఆ దశలో విలాయత్‌కు విలాసాలమీద మనసుపోయింది. కార్లూ, పెర్‌ఫ్యూమ్‌లూ, మంచి బట్టలూ, బాల్‌రూమ్ డాన్సింగ్ వగైరాలమీద మోజు పెరిగింది. పొగతాగడం అలవాటయింది. గుర్రపుస్వారీ, బిలియర్డ్స్, స్నూకర్ ఆడడం వగైరాల్లో ప్రావీణ్యం సంపాదించాడు. ఆత్మవిశ్వాసం పెరిగింది. అతను దేన్ని గురించి చెప్పినా నలుగురూ వినేవారు. విలాయత్‌ఖాన్‌కు క్రమంగా పాతవీ, విలువైనవీ అయిన రకరకాల వస్తువులు సేకరించడం ఒక హాబీ అయింది.

యువకుడుగా విలాయత్‌ఖాన్
అతని ప్రధాన వ్యాపకం మాత్రం సితార్ సాధనే. దాన్ని గురించి అహర్నిశలూ యోచిస్తూ, కొత్త విషయాలు ఊహించేవాడు. విలాయత్ శైలిలో ఎడమచేత్తో ఒకే మెట్టుమీద అనేక స్వరాలను గమక భూయిష్ఠంగా పలికించడం ఉండేది. ఈ ధాటికి తట్టుకునేందుకని అతను సితార్ నిర్మాణంలో కొన్ని మార్పులను ప్రవేశపెట్టాడు. సితార్ పైపలకనూ, కాండాన్నీ మరింత బలంగా ఉండేట్టు తయారు చేయించాడు. మెట్లు కూడా మందంగా జర్మన్ సిల్వర్‌తో తయారుచేయించాడు. తీగలను మోసే బ్రిడ్జ్ మెరుగయింది. తమ సంప్రదాయంలో మంద్రస్థాయిలో మోగే సుర్‌బహార్ ఎలాగూ ఉంది కనక సితార్‌కు మామూలుగా ఉండే మంద్రస్థాయి తీగలను తొలగించి వాటి స్థానే స్టీల్ తీగలను అమర్చాడు. విలాయత్ బాణీని అనుసరించని రవిశంకర్, నిఖిల్ బెనర్జీ, హలీమ్‌జాఫర్‌ఖాన్ తదితరులు మాత్రం పాతపద్ధతిలో తీగలను అమర్చుకుంటారు. ఇందువల్ల విలాయత్ శైలిలో తయారయిన సితార్‌ను మీటగానే దానికొక ప్రత్యేక గుర్తింపు ఉన్నట్టు తెలుస్తుంది. మంద్రస్థాయి తీగల ‘రొద’ తగ్గడంతో కుడిచెయ్యి మరింత స్వేచ్ఛగా కదిలే వీలు ఏర్పడింది. తీగను మీటే పద్ధతుల్లో ఎన్నెన్నో మెళుకువలు ప్రవేశపెట్టిన విలాయత్‌ఖాన్ భావి సితార్ కళాకారులందరికీ అరాధ్యుడు అయాడు.

సితార్‌కు మారుపేరు
ఈ లోపల విలాయత్ తమ్ముడుఇమ్రత్‌ఖాన్ తన పినతండ్రివద్దనుంచి సుర్‌బహార్ వాయించడాన్నీ, తల్లిద్వారా గాత్రాన్నీ అభ్యసించి చివరకు అన్నగారివద్దనే సితార్ నేర్చుకోసాగాడు.
త్వరలోనే వారిద్దరూ కలిసి సితార్, సుర్‌బహార్ జుగల్‌బందీ కచేరీలు కూడా చెయ్యసాగారు. ఇమ్రత్‌ఖాన్ కూ, ఆయన కుమారులకూ మాత్రమే కాక విలాయత్ తన మేనల్లుడు రయీస్‌ఖాన్‌కూ, ఆ తరవాత తన పినతండ్రి మనమడు షాహిద్ పర్వేజ్ తదితరులకూ సితార్ నేర్పాడు. ఆయన బంధువర్గానికి చెందని ఇతర శిష్యులుకూడా ఉన్నారుకాని కుటుంబసంప్రదాయం ప్రధానంగా ఆయన బంధువుల ద్వారానే కొనసాగుతోంది.
కొద్దికాలంపాటు ఇమ్రత్, అంతకన్నా ఎక్కువకాలం రయీస్‌ హిందీ సినిమాల్లో సితార్ వాయించి నేపథ్య సంగీతాన్ని సుసంపన్నం చేశారు. నౌషాద్‌కు ఇమ్రత్‌ఖాన్గంగాజమునాలోనూ, 1960ల తరవాత రయీస్ తక్కిన సినిమాలన్నిటిలోనూ సితార్ వాయించారు. రయీస్ సితార్‌ను ఉపయోగించినవారిలో ఓపీ నయ్యర్, శంకర్‌జైకిషన్, మదన్‌మోహన్తదితరులున్నారు.
మొత్తంమీద ఉత్తమం అనిపించుకున్న హిందీ సినీసంగీతంలో విలాయత్ బాణీయే ఎక్కువగా వినిపిస్తూవచ్చింది. 1958లో జల్సాఘర్ తరవాత విలాయత్‌ఖాన్ మర్చంట్, ఐవరీలు తీసిన గురు అనే సినిమాకూ, షబానా ఆజ్మీ నటించిన కాదంబరీ అనే సినిమాకూ సంగీతదర్శకత్వం వహించాడు. జల్సాఘర్ సంగీతానికి జాతీయ, అంతర్జాతీయ (మాస్కో) బహుమతులు లభించాయి. విలాయత్‌ఖాన్ మనీషా అనే చదువుకున్న బెంగాలీ బ్రాహ్మణ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వారికి యమన్., జిలా అనే కుమార్తెలూ, సుజాత్ అనే కొడుకూ కలిగారు. అయితే కొన్నాళ్ళకు వారు విడాకులు తీసుకున్నారు. తరవాతి కాలంలో ఆయన జుబేదా అనే ఆమెను వివాహం చేసుకున్నాడు: వారికి హిదాయత్ అనే కుమారుడు కలిగాడు. విలాయత్ కొడుకులిద్దరూ సితార్ వాయిస్తారు. ఆయన తమ్ముడు ఇమ్రత్‌ఖాన్ కొడుకులు నలుగురూ మంచి వాద్యకారులు అయారు.
తమ వంశం గొప్పదనం గురించీ, వారసత్వం గురించీ, తన శక్తియుక్తుల గురించీ విలాయత్‌కు మొదటినుంచీ స్వాభిమానం ఎక్కువే. ఒక వీడియోలో మిశ్రఖమాజ్ రాగం వినిపిస్తూ ఆ సంగతులు ఆయనే చెప్పాడు. తన తండ్రి వాయించినంత పరిశుద్ధమైన సంగీతం తాను ఎన్నటికీ వాయించలేనని విలాయత్‌ఖాన్‌అభిప్రాయం (వీడియో).
అలాగే పాత జమీందారీ పద్ధతులూ, సంగీతపోషకులైన సంస్థానాధీశుల ఉత్తమ కళాభిరుచీ అతనికి నచ్చేవి. కొత్తగా స్వాతంత్ర్యం వచ్చిన పరిస్థితుల్లో వారి స్థానే సంస్కారం గురించి ‘ఏమీ తెలియని’ అధికారులూ, మంత్రులూ, నాయకమ్మన్యులూ రావడం, వారి ప్రాపకం కోసం పాకులాడేవారికి అధికారిక, ప్రభుత్వపరమైన గుర్తింపు లభించడం వగైరాలన్నీ అతనికి కంటగింపుగా ఉండేవి. రేడియోవారి సర్కారీ నిబంధనలనూ, అడుగులకు మడుగులొత్తేవారికే బహుమతులిచ్చే విధానాన్నీ అతను జీవితమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తూనేవచ్చాడు.

రవిశంకర్‌, ఆయన భార్య సుకన్యలతో
మరొకవంక ఉస్తాద్ అల్లాఉద్దీన్‌ఖాన్ తన ప్రియశిష్యుడు రవిశంకర్‌ను స్టేజి కళాకారుడుగా స్వయంగా తీర్చిదిద్దసాగాడు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో బాగా ఎరిగిన రవిశంకర్ సంప్రదాయపద్ధతిలో సంగీతం నేర్చుకుంటూనే త్వరగా పేరు సంపాదించుకోసాగాడు. 1950 ప్రాంతాల్లో కర్ణార్జునులు ఎదురుపడినట్టుగా ఢిల్లీలో జరిగిన ఒక కచేరీలో రవిశంకర్, విలాయత్‌ఖాన్ సితార్‌లతో తలపడ్డారు. కిషన్‌మహారాజ్ తబలా వాయించిన ఆ పోటీలో విలాయత్‌దే పైచెయ్యి అయిందట. కురువృద్ధుడివంటి అల్లాఉద్దీన్ ఆగ్రహంతో ఇద్దరినీ అందరి ఎదుటా తూలనాడినప్పుడు విలాయత్ బదులు చెప్పకుండా ఉండిపోయాడట. ఆ తరవాతికాలంలో కూడా రవిశంకర్ ‘హిప్పీ’లకు సితార్ నేర్పుతాడంటూ విలాయత్ అప్పుడప్పుడూ విమర్శలు చేస్తూనే వచ్చాడు. వయసులో పెద్దవాడైన రవిశంకర్ మటుకు వీటికి స్పందించకుండా ఉండిపోయాడు. మొత్తంమీద రవిశంకర్ ఎక్కువ విజయాలను సాధించినప్పటికీ విలాయత్‌ఖాన్ సంగీతాభిమానుల, విమర్శకుల అభిమానాన్ని ఎక్కువగా పొందా డనడంలో సందేహం లేదు. ఆయనది ఎవరికీ తలవంచని ధోరణి. ఏ సమావేశంలోనైనా బడేగులాం కచేరీ తరవాత ఒక్క విలాయత్ తప్ప మరెవరూ స్టేజీ ఎక్క సాహసించేవారు కాదట. ‘వీడికొక్కడికే ఆ ధైర్యం ఉంది’ అని పెద్దాయన విలాయత్‌ను మెచ్చుకునేవారట.
విలాయత్‌ఖాన్ ఔన్నత్యం ఎటువంటిది? ఆయన సితార్ వాయిస్తున్నప్పుడు అది గానకచేరీ పద్ధతిలోనే సాగేది. హమీర్ రాగంలో గత్ వాయిస్తున్నప్పుడూ,
దాన్ని ఖయాల్‌గా పాడి వినిపిస్తున్నప్పుడూ ఈ సంగతి గమనించవచ్చు.
ఏ వాయిద్యానికైనా సహజంగా కొన్ని పరిమితులుంటాయి. మీటిన తీగ కాసేపటికి కంపించడం మానేస్తుంది. గాత్రంలోనూ, వయొలిన్, సారంగీ, వేణువు మొదలైన వాయిద్యాల్లోనూ స్వరాన్ని ఎక్కువసేపు సాగదీయడం వీలవుతుంది. తీగ కంపనం ఎంతసేపు నిలుస్తే అన్ని సంక్లిష్టమైన గమకాలను వినిపించవచ్చు. విలాయత్‌ఖాన్ పెంపొందించిన శైలివల్ల ఒక్క మీటుతోనే స్వరాలను తెగకుండా జాలువార్చినట్టుగా పలికించడం, పాడితేతప్ప సాధ్యంకాదనిపించే గమకాలను మోగించడం వగైరాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఆయన ప్రభావం పడని ఈనాటి సితార్ వాద్యకారులను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. రాగవిస్తారంలో అంతులేని భావుకత, విద్వత్తు, తరతరాలుగా అందివస్తున్న లోతైన అవగాహన, గాంభీర్యం, నిండుతనం మొదలైనవన్నీ ఆయన కచేరీలను మరుపురానివిగా తీర్చిదిద్దాయి. గాత్రంలో ఉద్దండులైన అబ్దుల్ కరీమ్‌ఖాన్, ఫైయాజ్‌ఖాన్, బడేగులామలీఖాన్, అమీర్‌ఖాన్‌ల సుగుణాలన్నీ ఆయన తన సంగీతంలో రంగరించుకున్నాడు.
దర్బారీలో బడేగులాం రచనఅనోఖాలాడ్‌లా అనే కృతిని పాడి, గత్ రూపంలో ఆయన వాయించేవాడు. అలాగే కరీమ్‌ఖాన్ పాడిన ఝింఝోటీ రాగం అందమంతా మరొక గత్‌లో వినిపిస్తుంది. అటు జంత్రవాద్యపద్ధతిలో సాటిలేని కళాకారుడైన తన తండ్రి శైలినీ పుణికిపుచ్చుకుని చికారీ (తాళం తీగలు), ఝాలా మొదలైన కుడిచేతి విన్యాసాలనూ అద్భుతంగా కొత్తపద్ధతుల్లో పలికించి, తరవాతివారికి మార్గదర్శకుడుగా నిలిచాడు.
1950ల నుంచి ఆయన చేసిన కచేరీలు అద్భుతంగా ఉండేవి. మొదట చేపట్టిన రాగాన్ని 2 గంటలసేపు సునాయాసంగా వినిపించేవాడు. ఆలాపన, జోడ్ (తానం), ఝాలా (లయగతుల్లో తాళం తీగల విన్యాసాలతో వేగంగా సాగే ప్రక్రియ), ఆ తరవాత విలంబిత్ గత్, ద్రుత్ గత్, చివరికి తాళం మీద ఝాలా ఇలా అనేక విశేషాలతో రాగస్వరూపం పూర్తిగా బహిర్గతం అయేది. రాగం వికాసం చెందుతున్న క్రమం అద్భుతంగా ఉండేది. విరామం తరవాత ఆయన వైఖరి పూర్తిగా మారిపోయేది. ఏదో ఒక రాగంలో ఠుమ్రీ మొదలుపెట్టి, మధ్యలో కొన్ని రమ్యమైన గమకాలను పాడి వినిపిస్తూ, తన చిన్ననాటి ముచ్చట్లూ, గతకాలపు సంగీతతేజాలతో తన అనుభవాలనూ ఆత్మీయంగా వివరిస్తూ, రాగమాలికను జతచేస్తూ ఆహ్లాదకరంగా కచేరీ ముగించేవాడు. ప్రేక్షకులు కోరితే చివరకు (సింధు) భైరవి రాగం వినిపించేవాడు. కచేరీ జరుగుతున్నంతసేపూ శ్రోతలకు ఒళ్ళు పులకరించేదిగాని ఎక్కడా కేకలు పెడుతూ ప్రోత్సహించడం, వేగంగా వాయించినప్పుడు లయప్రకారం చప్పట్లు కొట్టడం వగైరా చవకబారు పనులేవీ చేసేవారుకాదు. ఆయన కచేరీలకు వెళ్ళడం ఒక విశేష అనుభవంగా అనిపించేది. రాగ మాధుర్యంలో ఓలలాడుతున్నప్పుడు ఆయన ఏ గమకం ఏ మీటుద్వారా పలికిస్తున్నాడనేది మరిచిపోయి శ్రోతలు సంగీతకారుడుగా ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి ముగ్ధులయేవారు.
ఠుమ్రీలను సితార్‌మీద పలికించడంలో ఆయన సిద్ధహస్తుడు. అందుకు కావలసిన ప్రత్యేక గమకాలను ఆయన ఎంతగానో అభివృద్ధి చేశాడు. కేవలం వాద్యనైపుణ్యమే కాక ఠుమ్రీలలోని సౌందర్యమూ, రొమాంటిక్ లక్షణాలూ ఆయన అంతరాత్మనుంచి మోగుతున్నట్టుగా అనిపించేది. తనకు నచ్చనిదీ, తన మనసుకు పట్టనిదీ ఆయనెప్పుడూ వాయించలేదు. సితార్ సృష్టికర్తగా పేరుపొందిన అమీర్ ఖుస్రో గురించీ, కవ్వాలీ, సూఫీ సంప్రదాయాల గురించీ చాలా అధ్యయనం చేశాడు.
విలాయత్‌ఖాన్‌కు అహంభావమూ ఎక్కువే. అయితే దానికి తప్పుపట్టి లాభంలేదనిపించేది. తనకుగాని, సంగీతానికిగాని ఏమాత్రం అవమానం జరిగిందనిపించినా సహించేవాడుకాడు. డబ్బు కోసమూ, పేరు కోసమూ కక్కూర్తిపడేవారంటే ఆయనకు ఏహ్యభావన ఉండేది. బొంబాయిలో ఒక సందర్భంలో నౌకాదళంవారు రవిశంకర్ సితార్ కచేరీ ఏర్పాటు చేసి, కారణాంతరాలవల్ల ఆయన రాలేకపోవడంతో ఆయనకు బదులుగా విలాయత్‌ఖాన్‌ను ఆహ్వానించారు. హాజరైన ప్రేక్షకుల్లో సంగీతం ఏమీ తెలియని నౌకాదళ సైనికులు ఎక్కువగా ఉన్నారు. ఉస్తాద్‌గారు హంసధ్వని రాగం వాయిస్తూ ఉంటే టికెట్లు కొనుక్కుని వచ్చిన నావంటి ప్రేక్షకులెంతో సంతోషించారు. మర్యాద తెలియని నావికులు మాత్రం బోరుకొట్టడంచేత చప్పట్లు కొట్టసాగారు. అంతే; ఉస్తాద్ వాయించడం మధ్యలోనే ఆపేసి దిగ్గున లేచి లోపలికెళిపోయారు. మహారాష్ట్ర గవర్నర్ అలీయావర్‌జంగ్, నౌకాదళాధిపతి కర్సెట్‌జీ తదితరులు వచ్చి సభాముఖంగా క్షమాపణలు చెప్పినా ఉపయోగం లేకపోయింది. టికెట్లు కొన్నవారందరికీ డబ్బు వాపస్ చెయ్యబడింది.
తన ప్రజాదరణకు రేడియో మీద కాస్తయినా ఆధారపడని గొప్ప విద్వాంసుడాయన. కేవలం రికార్డులు, కచేరీల మూలంగానే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారంటే అది సామాన్యమైన విషయం కాదు.
విలాయత్ వాయించిన అద్భుతమైన లాంగ్‌ప్లే రికార్డ్లు ఎన్నో ఉండేవి. యమన్, దర్బారీ రాగాల్లో తలొకటీ ఉండేవి. ఖమాజ్, పిలూ ఠుమ్రీ రికార్డుల్లో ఆయనతో సమానంగా శాంతాప్రసాద్ తబలా వినిపిస్తుంది. అలాగే పూరియా, అల్హైయా బిలావల్ రాగాల్లో కిషన్‌మహారాజ్ తబలా అమోఘంగా ఉంటుంది. అమీర్ ఖుస్రోకు నివాళిగా అతను సృష్టించిన సాజ్‌గిరీ రాగంలో ఒక రికార్డు వాయించారు. తమ్ముడు ఇమ్రత్‌తో (సుర్‌బహార్) కలిసి మియామల్హార్, చాంద్‌నీ కేదార్ రాగాల్లో వాయించారు.

(ఎడమనుంచి) తిరుచ్చి శంకరన్ (మృదంగం), లాల్గుడి జయరామన్ (వయొలిన్), విలాయత్‌ఖాన్, శాంతాప్రసాద్ (తబలా)
రవిశంకర్ ద్వారా ప్రపంచమంతా సితార్ పేరు మారుమోగింది. ఆ విధంగా సితార్ గురించి తెలుసుకున్నవారిలో కొందరు విలాయత్‌ఖాన్‌ను మరింత గొప్ప కళాకారుడుగా గుర్తించారు. పాశ్చాత్య సంగీతం జోలికి పోకుండా, మన సంగీతం గురించిన ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలని నొక్కిచెపుతూ ఆయన రాజీపడకుండా నిలిచాడు. అయితే రవిశంకర్, అలీఅక్బర్‌ఖాన్ జయప్రదంగా చేసిన జుగల్‌బందీ కచేరీలను ఆయన గుర్తించకపోలేదు. తన తమ్ముడు ఇమ్రత్‌ఖాన్‌తోనూ, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్‌తోనూ చేసిన కచేరీలే కాక, లాల్గుడి, ఎం.ఎస్. గోపాలకృష్ణన్ తదితరులతో హిందూస్తానీ, కర్ణాటక జుగల్‌బందీ కచేరీలుకూడా ఆయన వాయించాడు.

విలాయత్‌ఖాన్‌, ఇమ్రత్‌ఖాన్‌
పాప్యులారిటీ కోసం ఆయన ఎప్పుడూ తలవంచలేదు. ప్రేక్షకులకు ఉన్నతస్థాయి సంగీతాన్ని వినిపించి వారిని ‘పైకి’ తీసుకొచ్చాడు. కమర్షియల్ ధోరణులకు తలఒగ్గని ఇటువంటి ఒక ఉత్తమ కళాకారుడు ఒకడు ఇరవయ్యొకటో శతాబ్దంలో కూడా విజయాన్ని సాధిస్తున్నాడని అందరికీ గర్వంగా ఉండేది. ఆయన శైలి జగత్ప్రసిద్ధం అయింది. అందరికన్నా ఎక్కువ పారితోషికం తీసుకుంటూ కూడా కచేరీలకు ఆహ్వానాలు అందుకోవడం ఆయనకు సంతృప్తికరంగా ఉండేది.
1951నుంచి విలాయత్‌ఖాన్ అనేక విదేశీ పర్యటనలు చేసి కచేరీల ద్వారా ప్రపంచఖ్యాతిని పొందాడు. ఉన్నత సంగీతసంప్రదాయాలతో ఏ మాత్రమూ రాజీపడకుండా, పబ్లిసిటీకోసం ఎవరి వెంటా పడకుండా వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నందుకు ఆయనకు విశేషగౌరవం లభించింది. 1980ల తరవాత విలాయత్‌ఖాన్ ఎక్కువకాలం న్యూజెర్సీలో తన ఇంటో గడపసాగాడు. సంగీత ప్రపంచంలో పెరిగిపోతున్న కమర్షియల్ ధోరణులకు ఆయన విసుగుచెందాడు. 2003 డిసెంబర్‌లో బిస్మిల్లాతో ఆయన చివరి జుగల్‌బందీ కచేరీ జరిగింది. చివరకు ఆయనకు ఊపిరితిత్తుల కేన్సర్ సోకింది. మధుమేహం, రక్తపోటు సమస్యలకు ఇది తోడవడంతో మార్చ్ 2004లో బొంబాయిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశాడు. ఆయన భౌతికకాయాన్ని కోల్‌కతాలో ఖననం చేశారు.

లాల్గుడి జయరామన్,
విలాయత్‌ఖాన్
విలాయత్‌ఖాన్ కచేరీ చేస్తే ఊళ్ళో ఉన్న పెద్ద సంగీతవిద్వాంసులందరూ హాజరయేవారు. బొంబాయిలో శివకుమార్ శర్మ (సంతూర్), హలీం జాఫర్ (సితార్), అంజాద్ అలీ (సరోద్), కిశోరీ అమోణ్‌కర్ (గాత్రం) తదితరులంతా శ్రోతలుగా వచ్చి వినేవారంటే ఆయనపై వారికెంత గౌరవం ఉండేదో తెలుస్తుంది. మనవారిలో చిట్టిబాబు (వీణ) ఆయన మద్రాసుకు వచ్చినప్పుడల్లా కలుసుకుని తన గౌరవాభిమానాలు తెలుపునేవారు. విలాయత్‌ఖాన్ శైలి తనకు చాలా మ్యూజికల్‌గా అనిపిస్తుందని బాలమురళి నాతో అన్నారు. నాటి రాష్ట్రపతి ఫఖ్రుద్దీన్అలీ నుంచి ఆయనకు ఆఫ్తాబే సితార్ (సితార్ మార్తాండుడు) అనే బిరుదు లభించింది.
మొత్తంమీద విలాయత్‌ఖాన్ కారణంగా సితార్‌కు ఒక గొప్ప స్థాయి ఏర్పడింది. రవిశంకర్ దానికి దేశవిదేశాల్లో ప్రజాదరణ తీసుకురాగా విలాయత్ దానికి పాట నేర్పారు. ఏదో నాజూకుగా నేపథ్యసంగీతానికి మాత్రమే పనికొచ్చే పద్ధతిలో కాకుండా గాయకవిద్వాంసుల శైలిలో, అవసరమైతే ‘గర్జించినట్టుగా’ కూడా సితార్ వాయించవచ్చునని ఆయన నిరూపించాడు. ఇది సితార్ శైలిలో ఒక విప్లవాత్మక పరిణామాన్ని తీసుకొచ్చింది. తాను జీవించినన్నాళ్ళూ విలాయత్‌ఖాన్ ఒక సితార్ విద్వాంసుడి హోదానుంచి పైకెదిగి అత్యున్నత సంగీతశిఖరంగా సంగీతాభిమానుల మనసుల్లో శాశ్వతస్థానం పొందారు. ఆయనకు సాటి రాగల విద్వాంసులు చాలా కొద్దిమందే కనిపిస్తారు.