1, జనవరి 2011, శనివారం

ముప్పొద్దులా తినమన్న నందీశ్వరుడు!

గోపూజ హిందూ జీవన విధానంలో ఓ భాగం. పుణ్యక్షేత్రదర్శనంలోనూ, శుక్రవారాల్లోనూ గోవుల్ని విశేషంగా పూజిస్తారు. ఇక పంటల పండుగ సంక్రాంతి మరునాడు కనుమపండుగ అంటూ పశువుల్ని పూజిస్తారు. 

అందునా ఆరోజు ఆవుల్నీ, ఎద్దుల్నీ ముఖంగాక తోకని పూజిస్తారు. పశు సంతతి వృద్ధిని కోరుతూ, అలా పూజిస్తారని ఒక వాదన ఉంది. దీని గురించి మరో ఆసక్తికరమైన కధొకటి ఉంది. 

అదేమిటంటే - 

అప్పటికి మనుష్యులు ఇంకా వ్యవసాయం నేర్చుకోలేదట. అస్థిర నివాసులై, ప్రకృతిలో దొరికినవి తింటూ కాలం వెళ్ళబుచ్చుకున్నారట.

అప్పుడోరోజు... మహాశివుడు నందీశ్వరుణ్ణి పిలిచి, "నందీ! భూలోకానికి వెళ్ళి మానవులకి, ముప్పొద్దులా స్నానం చెయ్యమనీ, ఒక పొద్దు తిండి తిన మనీ’ చెప్పిరా!" అన్నాడట. 

నందీశ్వరుడు అలాగే వెళ్ళొచ్చాడు. తిరిగి వచ్చిన నందీశ్వరుణ్ణి మహాశివుడు "నందీ! చెప్పి వచ్చావా?" అనడిగాడు. 

"చెప్పాను స్వామీ!" అన్నాడు నంది. 

"ఏం చెప్పావు?" అన్నాడు స్వామి. 

" ‘ముప్పొద్దులా తినండి. ఒకపొద్దు స్నానించండి’ అని చెప్పాను స్వామీ" అన్నాడు నందీశ్వరుడు.

"ఏడ్చినట్లుంది! మూడు పొద్దులా తింటే తిండెక్కడ సరిపోతుంది?" అన్నాడు స్వామి. 

నంది నాలుక్కరుచుకొని "పొరపాటయ్యింది స్వామీ" అన్నాడు. 

"నువ్వే ఆ పొరపాటు దిద్దుదువు గాక! ఇక నుండీ... నీవు, భార్యా పుత్ర పుత్రీ సమేతంగా, భూలోకానికి పో! నీవూ, నీ పుత్రులూ దుక్కి దున్నటం దగ్గర నుండి పంట పండించీ, నీ భార్యాపుత్రికలు పాలిచ్చీ, మానవుల కడుపులు నింపండి, పొండి" అన్నాడట శివుడు. 

ఆనాటి నుండి ఆవులూ, ఎద్దులూ మన కడుపులు నింపుతుండగా... మహాశివుడు, మనుష్యులకి వాటి ఆలనా పాలనా చూడవలసిన విధిని నిర్ణయించాడట. 

కొన్నాళ్ళ తర్వాత, మనిషి పశుగణాల పరిరక్షణ సరిగా చేస్తున్నాడో లేదో తెలుసుకుందామని, అవుల్నీ, ఎద్దుల్నీ "మనిషి మిమ్మల్ని బాగా మేపుతున్నాడా?" అని మహాశివుడు అడిగితే, అవి లేదన్నట్లు తల అడ్డంగా ఊపి అబద్దం చెప్పాయట. అయితే తోకలని నిలువుగా ఊపి నిజం చెప్పాయట. 

అప్పటి నుండీ మనుష్యులు, అబద్దం చెప్పిన ఆవు శిరస్సు కంటే, తోకని మరింత శ్రద్దగా పూజిస్తారని జానపద కథ. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి