28, డిసెంబర్ 2010, మంగళవారం

యూపీఏ ప్రభుత్వం కార్పొరేట్లకు దాసోహం

ఏఐసీసీ 83వ ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ చేసిన ప్రసంగాలు వింటే సామాన్యులకెవరికైనా వారి మాటల పట్ల అమితమైన అభిమానం కలుగుతుంది. ఈ దేశంలో సామాన్యుల జీవితాలను మెరుగుపరిచేందుకు, అవినీతిని రూపు మాపేందుకు వారెంతో తపన చెందుతున్నారన్న అభిప్రాయం కలుగుతుంది.
యూపీఏ ప్రభుత్వం కార్పొరేట్లకు దాసోహమవుతూ సామాన్యులకు దూరమవుతున్నదని, ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అవినీతి తాండవిస్తున్నదని వెల్లువెత్తిన ఆరోపణలు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కంపించి వేశాయనడానికి ఈ సమావేశంలో నేతల ప్రసంగాలే నిదర్శనం. ఆకాశాన్నంటిన ధరలు, ఆకలి చావులు, నిర్వాసిత ప్రజల ఆక్రందనలు, గిరిజనుల వలసలు, అతలాకుతలమైన రైతు జీవితాలు, వడ్డీల చక్రబంధంలో చిక్కుకున్న గ్రామీణుల ఆత్మహత్యలు ఒకవైపు, వేల కోట్ల రూపాయల కుంభకోణాలు మరో వైపు మీడియాకు ఎక్కుతున్నాయి.
సామాన్యుడు కూటికి కటకటలాడుతుంటే, కొందరు కోట్ల రూపాయలు అడ్వాన్స్ పన్నులే కడుతున్నారు. ఐపిీఎల్, కామన్‌వెల్త్ , స్పెక్ట్రమ్ 2 జి కుంభ కోణాలలో లక్షల కోట్ల ప్రజాధనం నష్టపోవడం, వేల కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక మండలాలు, విల్లాలు, గోల్ఫ్ కోర్టులు, అక్రమ మైనింగ్, అటవీ సంపద కొల్లకొట్టడం, ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయల స్కాంలు, ఇవన్నీ దేశ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. రైతులు, గిరిజనులు, దళితులు, అణగారిన వర్గాలు, సామాన్య మధ్యతరగతి వర్గాల్లో ప్రభుత్వం, అధికార పార్టీ పట్ల అసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఏఐసీసీ ప్లీనరీలో సోనియా, రాహుల్ గాంధీలు ఈ అసంతృప్తికి పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేశారనడంలో అతిశయోక్తి లేదు.
అవినీతి ఒక అంటువ్యాధిలా ప్రబలిపోయిందని, దానిపై పోరాటాన్ని తీవ్రతరం చేయాలని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అంటే అవినీతిపరులను కఠినంగా శిక్షించాలని రాహుల్ గాంధీ అన్నారు. అవినీతిపరులు ఎంతటి శక్తివంతులైనా, రాజకీయ నాయకులైనా, అధికారులైనా వదిలిపెట్టబోమని ప్రధాని స్పష్టం చేశారు. అవినీతి నివారణకు సోనియా ప్రధానంగా అయిదారు సూచనలు చేశారు.
ఇందు లో మొదటిది ప్రజాప్రతినిధులకు సంబంధించింది. ఎన్నికల్లో సామాన్యుడు పోటీ చేయలేని పరిస్థితిని రాజకీయ పార్టీలే కల్పించాయి. టిక్కెట్లను అమ్ముకోవడం, ఎన్నికల్లో గెలిచేందుకు వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి రావడం, గెలిచిన తర్వాత వాటిని రాబట్టుకునేందుకు అవినీతికి పాల్పడడం ఒక చక్రంలా జరుగుతోంది.
అందువల్ల అభ్యర్థుల ఎన్నికల ప్రచారం, ఇతర వ్యయాలను ప్రభుత్వాలే భరించే విధానాన్ని సోనియా ప్రతిపాదించారు. సోనియా చేసిన రెండో ప్రతిపాదన- ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులపై వచ్చిన ఆరోపణలను వేగంగా విచారించి వారికి సాధ్యమైనంత త్వరలో శిక్ష పడేలా చూడడం. ఈ దేశంలో ఎక్కడో మధుకోడా లాంటి వారుతప్ప రాజకీయ నాయకులు అవినీతి ఆరోపణలపై కటకటాలు లెక్కపెట్టిన సందర్భాలు చాలా తక్కువ.
జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్‌లాంటి వారిపై కొన్నేళ్ళుగా కేసులు కొనసాగుతున్నాయి. సోనియా చేసిన ప్రతిపాదనల్లో మూడవది ప్రభుత్వ ప్రాజెక్టులు, కాంట్రాక్టులకు సంబంధించి పారదర్శక విధానాలను నిబంధనలను పాటించడం. వాటిని ఆయా ప్రభుత్వాలు తమ అవసరాలకు అనుగుణంగా మార్చకుండా చూడాలి.
కాంగ్రెస్ అధ్యక్షురాలు చేసిన నాల్గవ ప్రతిపాదన కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రులు, ముఖ్యమంత్రులు ఎడాపెడా భూముల్ని, ఇతర వనరులను అస్మదీయులకు కేటాయించే తమ విచక్షణాధికారాల్ని వదులుకోవడం. వైఎస్ఆర్ హయాంలో సహజవనరులను కేటాయించడం ద్వారా కొత్త సంపన్నులు తలెత్తారు. రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసి అధిష్ఠానాన్ని ధిక్కరించే స్థాయికి ఎదగడం గుణపాఠంగా నిలిచింది.
సహజ వనరులను ఉపయోగించడంలో, కేటాయించడంలో పారదర్శకమైన వ్యవస్థ ఉండాలని, గిరిజనులను, ఇతర సామాన్యుల జీవితాలతో చెలగాటమాటకూడదని సోనియా చెప్పడంలో కూడా ఆంతర్యం ఇదే. నిజానికి రాహుల్ చేసిన ప్రసంగంలో కూడా వ్యవస్థకూ, సామాన్యుడికీ మధ్య తెగిపోయిన సంబంధాన్ని ప్రస్తావించారు.
ఈ దేశంలో కష్టించి చెమటోడ్చేవారికి, దళితులకు, గిరిజనులకు, విద్యావంతులకు, ప్రతిభ కలవారికి, నిజాయితీ కల వ్యాపారులకు సరైన అవకాశాలు లభించకపోవడం, ధనబలం, రాజకీయ బలం, కండబలం కలవారికే వ్యవస్థలో ఆదరణ లభించడం గురించి రాహుల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రతిభ గలవారు వెనుకబడకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సాధారణ ప్రమాణాలతో చూస్తే ఈ ప్రసంగాలతో సోనియా, రాహుల్, మన్మోహన్‌ల పట్ల సదభిప్రాయం కలిగే అవకాశం ఉన్నది. కాని కాంగ్రెస్ పార్టీలో నేతలు చేస్తున్న వ్యవహారాలకూ, జరుగుతున్న పరిణామాలకూ వారి మాటలకూ పొంతనే లేదు. సోనియా ప్రసంగించిన ఏఐసిీసీ ప్లీనరీలోనే బీహార్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ ముసుగును బట్టబయలు చేశారు.
ప్లీనరీ దృశ్యాలు ప్రదర్శించిన స్క్రీన్‌పైనే బీహార్‌లో టిక్కెట్లు అమ్ముకున్న పార్టీ కేంద్ర నేతలు ముకుల్ వాస్నిక్, సాగర్ రాయికా, ఇమ్రాన్ కిద్వాయ్‌లపై చర్య తీసుకోవాలని, వారి ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసే పోస్టర్‌లను ప్రదర్శించారు. సోనియా, మన్మోహన్ సింగ్‌ల ముందే వారు తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ నేతలపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇది తొలిసారి కాదు. ప్రతి స్థాయిలోనూ, ప్రతి ఎన్నికల్లోనూ, ప్రతి నియామకంలోనూ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అవినీతి సాగుతూనే ఉంటుంది. తాను మంత్రి పదవి కోసం ఢిల్లీలో నేతలకు కొన్ని కోట్లు ఇచ్చేందుకు వచ్చానని తెలిసిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ తనను పిలిచి తిట్టారని ఒక మంత్రి స్వయంగా ఒక పత్రికలో రాసుకున్నారు.
ఢిల్లీలో ఎప్పుడూ కేంద్ర నేతలతో వివిధ రాష్ట్రాలకు చెందిన నేతల పదవుల బేరసారాలు సాగుతూనే ఉంటాయి. ఫలానా వ్యక్తి ఫలానా కేంద్ర మంత్రి కుమారుడికో, ఫలానా సలహాదారు కుమార్తెకో, ఫలానా ప్రధాన కార్యదర్శికో ఢిల్లీలోనో, లండన్‌లోనో నజరానాలు ఇచ్చినందు వల్లనే ఫలానా వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి దక్కిందన్న ప్రచారాలు వినపడుతూనే ఉంటాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో నరనరాల్లో పేరుకుపోయిన అవినీతిని నిర్మూలించకుండా సోనియా తమ ప్రభుత్వాల్లో మార్పు తేలేరు.
రెండవది... పార్టీలో ఉన్న మంత్రులు, ప్రజా ప్రతినిధుల్లో అత్యధికులు వ్యాపారాల్లో ఉన్నవారో, లేక బడా వ్యాపార సంస్థల తరఫున పనిచేసిన వారే కావడం. పార్లమెంట్‌లో ఏ ప్రశ్న వేయించాలో, ఏ ప్రశ్న వేయకుండా చూడాలో, ఏ చర్చను ఎవరు ప్రారంభించాలో కూడా కార్పొరేట్ సంస్థలు నిర్ణయిస్తున్నాయని నీరా రాడియా వంటి పిఆర్ సంస్థల అధిపతుల సంభాషణల్లో వ్యక్తమైంది.
ఇంతకూ సోనియా, మన్మోహన్, రాహుల్‌లు కార్పొరేట్ అవినీతిని ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి