23, డిసెంబర్ 2010, గురువారం

ఇది ప్రసిద్ధ రాజకవి అయిన శ్రీకృష్ణదేవరాయలు రచించిన ‘ఆముక్తమాల్యద’ అనే కావ్యంలోని పద్యం.

చ. కలమపుటెండుగు ల్ద్రవిడకన్యలు ముంగిటఁ గాచుచుండి, త
     జ్జలరుహనాభగేహ రురుశాబము సారెకు బొక్కులాడఁ, గొం
     డెలపయి కమ్మ, గ్రామ్యతరుణీతతి డించిన వేఁప గంపలం
     దల మగుచున్న చెంగలువ దండలఁ దోలుదు రప్పురంబున్
ఇది ప్రసిద్ధ రాజకవి అయిన శ్రీకృష్ణదేవరాయలు రచించిన ‘ఆముక్తమాల్యద’ అనే కావ్యంలోని పద్యం. శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్ది ప్రారంభంలో, దక్షిణ భారతదేశంలోని ఎక్కువ భూభాగాన్ని ఏకచ్ఛత్రంగా పరిపాలించిన చక్రవర్తి. యుద్ధాలు చేసి, శతృరాజులను జయించి రాజకీయంగా ఎంత పేరు తెచ్చుకున్నాడో, అంతకన్నా గొప్ప పేరు వివిధ భాషల కవి పండితులను ఆదరించి, కళలని పోషించి సంపాదించాడు. తాను స్వయంగా మంచి కవీ, పండితుడు. ఆయన వ్రాసిన ఆముక్తమాల్యద ఒక గొప్ప కావ్యం. తెలుగుకు సంబంధించినంతవరకూ తన ఆస్థానంలో అష్ట దిగ్గజాలనే గొప్పకవులకు స్థానమిచ్చి వారి చేత గొప్ప గొప్ప కావ్యాలు వ్రాయించి, కొన్నింటిని కృతి అందుకొన్నాడు. తెలుగు సాహిత్యంలోని గొప్ప కావ్యాలైన మను చరిత్రము, పారిజాతాపహరణము, కాళహస్తి మహత్మ్యము, పాండురంగ మహత్మ్యము, మొదలైనవి ఆయన కాలంలో వెలువడినవే.
తన జైత్రయాత్రల సందర్భంగా కృష్ణా తీరంలోని శ్రీకాకుళం అనే వూరిలో ఒక రాత్రి ఉండగా, ఆ వూరి గుడి లోని శ్రీ ఆంధ్రమహావిష్ణువు కలలో కనిపించి ఆముక్తమాల్యద వ్రాయమని ఆదేశించినట్లు ఆయనే ఆ కావ్యంలో చెప్పుకున్నాడు. చెప్పినది తెలుగుదేశం లోని గుళ్ళో దేవుడు. వ్రాసినది కర్నాటక చక్రవర్తి. కథ జరిగినది తమిళ దేశంలో - ఎంత మంచి సన్నివేశమో గమనించండి.
ఆముక్తమాల్యద చాలా ప్రౌఢమైన కావ్యం. అందమైన భావాలూ, వర్ణనలూ పుష్కలంగా వున్న కావ్యం. శ్రీవిల్లిపుత్తూరు దేవాలయ పూజారి కూతురు శ్రీరంగం లోని రంగనాధ స్వామిని పెండ్లి చేసుకోవడం -”అప్పిన్నది రంగమందైన పెండిలి” గురించి చెప్పుకోవడం ప్రధానమైన కథ. దానితో పాటు మాల దాసరి కథా, ఖాండిక్య కేశిధ్వజులనే వారి కథా, యమునాచార్యుని కథా లాంటి ప్రక్క కథలూ ఉన్నాయి. కథ కన్నా ముఖ్యంగా రాయలవారు చేసిన వర్ణనలూ, రూపు కట్టించిన దృశ్యాలూ, రోజువారీ కనిపించే సామాన్యమైన దృశ్యాలను స్వభావరమ్యంగా రూపు కట్టించి వాటికి కావ్యగౌరవం కల్పించిన తీరూ, అపురూపమైన ఉత్ప్రేక్షలూ - ఇవన్నీ ఎంతో అందంగా, ఆలోచించే కొద్దీ మరీ ఎక్కువ అందంగా కనిపిస్తాయి. ఆయన మహారాజు అయినా, అంతఃపురంలోనూ, రాజభవనాల్లోనూ మాత్రమే తన జీవితాన్ని ఇరికించుకున్నట్లు లేదు. దేశమంతా పర్యటించే వాడు కాబోలు, సామాజిక జీవనం లోని అతి సాధారణ సన్నివేశాలను బాగా దగ్గరగా గమనించేవాడు. చూసినదాన్ని చూసినట్లు వర్ణించాడు. ఆ కాలపు జన జీవితం ఆముక్తమాల్యదలో ప్రతిఫలించినట్లుగా బాగా పేరున్న ఆ కాలపు ఇతర కావ్యాలు వేటిలోనూ కనిపించదు.
రాయలవారి ఊహలు చాలా అపురూపంగా ఉంటాయి. ప్రొద్దున్నే బ్రాహ్మణులు ఊరి బయట కాల్వల్లో స్నానం చేసి పైగుడ్డలు తడిపి పిండి ఒడ్డున పెట్టుకోవడమూ, కాలువల పక్కన బాతులు రెక్కల్లో తల జొనుపుకొని కదలకుండా కూర్చోడమూ, గ్రామ్య వనితలు పొయ్యి రాజేసుకొనే నిప్పు కోసం ఇల్లిల్లూ తిరగడమూ, కొబ్బరి బొండాలని చల్లదనం కోసం నదీ తీరాన ఇసుకలో నిక్షేపించడమూ, చేపల కూర తిన్నందున వచ్చే కనరు త్రేపులు తగ్గడానికి ఆ కొబ్బరి బొండాల నీళ్ళు త్రాగడమూ, అరవ బ్రాహ్మణ కన్యలు దేవుడి అభిషేకానికి బిందెల్లో నీళ్ళు నింపుకుని, ఒకటీ రెండు తామర పూలను ఆ బిందెలో వేసుకొని, చంకలో బిందెతో - ద్రవిడ ప్రబంధాలను గొణుక్కుంటూ కోనేటినుంచి రావడమూ, మంచి నీటి నడ బావుల్లో కనిపించే చేపల కోసం ఉండుండి లకుముకి పిట్టలు నీళ్ళల్లో మూతి పెట్టడమూ - ఇలాంటి సహజ సన్నివేశాలను ఎంతో అపురూపంగా ఛందోబద్ధం కావించాడు రాయలు. పైన చెప్పుకున్న పద్యం అలాంటిదే.
కళ్ళంలోనో, వాన పడటం వల్లనో వడ్లు తడిశాయి. ఇంటి ముందు చాప వేసి ఆ వడ్లను ఎండబెట్టారు. ఆ ఇంటి కన్య ఆ వడ్లను గొడ్లు తినిపోకుండా కాపలాగా బయట కూర్చున్నది. గొడ్లు రావడంలేదు కానీ ఒక జింక పిల్ల వచ్చి సారె సారెకూ వడ్లు బొక్కిపోతున్నది. “జలరుహనాభగేహ రురుశాబము” దేవాలయపు జింక పిల్ల. ఎద్దులో, గేదెలో అయితే కర్రతో ఒక దెబ్బ వేయవచ్చు. కానీ అది సున్నితమైన జింక పిల్లాయె, పైగా దేవాలయపు జింక పిల్లాయె, ఊరి మీద పడి గింజలు తినే హక్కు దానికున్నదాయె! కర్రతో దానిని కొట్టడానికి చేయి రాదు. సరిగ్గా ఆ సమయానికి చెంగల్వ దండలను వేపగంపలో పెట్టుకొని, అమ్ముకోడానికి పల్లెటూరినుంచి వచ్చిన స్త్రీలు గంపను ఆ ఇంటి ముందు దించారు. ఆ అమ్మాయి, గంపలోని చెంగల్వ పూదండను తీసుకొని దానితో ఆ జింక పిల్లను అదిలిస్తున్నదట - అదీ ఈ పద్య భావం.
తడి వడ్లు ఇంటి బయట ఎండబోసుకోవడమూ, ఆడపిల్లలు గొడ్లు రాకుండా కాచి వుండటమూ, పల్లెటూరి స్త్రీలు పూదండలు అమ్మరావడమూ, దేవాలయపు జింక పిల్ల వడ్లు బొక్కడమూ - ఇవన్నీ ఎంతో సాధారణమైన విషయాలు. ఇవన్నీ ఎప్పుడు చూశాడో ఆ మహారాజు, ఎంతో చక్కగా బొమ్మ కట్టాడు. సున్నితమైన పదాలు వేసి పద్యంలో ఒక ధార సాధించడం కన్నా, చెప్పే విషయం యొక్క అపురూపత మీదనే ఎక్కువ దృష్టి, రాయలకు. ఆయన వ్రాసిన చాలా పద్యాలు అలానే వుంటాయి. ఈ పద్యమూ అంతే. పదాలను కొత్తగా వాడటం ఆయనకు బాగా ఇష్టం. ‘కలమపుటెండుగల్’ అలాంటి ఓ పదం. పదిహేనో శతాబ్దం ఆఖరిభాగంలోనూ, పదహారో శతాబ్దపు ప్రారంభంలోను ప్రవర్తిల్లిన పాండ్యదేశపు సామాజిక జీవితం ఇంత అందంగా తీర్చి దిద్దిన ఈ పద్యం ఎవరికి నచ్చదు?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి