8, డిసెంబర్ 2010, బుధవారం

నిజాయితీతో అడుగేస్తే జగన్‌కు మంచి భవిష్యత్తుంది

జగన్‌ ఆలోచించి అడుగేస్తే మంచి భవిష్యత్తు ఉంది. మాఘలో పుట్టి పుబ్బలో అస్తమించిన పార్టీల మాదిరిగా కాకుండా విలువలతో కూడిన రాజకీయాలను ప్రవేశపెట్టాలి. అంటే మనరాష్ట్రంలో సాధ్యమా అంటే సాధ్యమవుతాయి. డబ్బు, దర్పం, అవినీతి, బంధుప్రీతి, స్వార్థం అనే వాటికి దూరంగా ఉండాలి. సాధ్యమా ? కాదా? నిర్ణయించుకోవాలి. కాంగ్రెస్‌ పార్టీని ఎదిరించి పార్టీ పెట్టిన వారంతా గొప్ప నాయకులే అయ్యారు. మహారాష్ట్రలో షరత్‌పవార్‌, పచ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జి లాంటి వారు వారి రాష్ట్రాల్లో ఎదిగారు. కాని వారంతా రాజకీయ విలువలకు కట్టుబడి లేనందున రాష్ట్ర రాజకీయాలను శాసించలేక పోయారు. అయితే గుర్తింపు పొందడానికి నేటివిటీ కూడా ఉపయోగపడుతుంది. వచ్చిన చిక్కంతా ఒకటే రాజకీయాలు డబ్బు, కులం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ రెండింటినీ ఎలా మేనేజ్‌ చేస్తారనేది చూడాలి. తెలంగాణా సాధన పేరుతో డాక్టర్‌ మర్రిచెన్నారెడ్డి స్థాపించిన తెలంగాణా ప్రజాసమితి నుంచి ఇటీవల సామాజిక న్యాయం పేరుతో వచ్చిన ప్రజారాజ్యం వరకు చూస్తే ఒక్క టిడిపి మాత్రమే సక్సెస్‌ అయ్యింది. తెలుగు వారి ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్‌ను గడగడలాండించారు ఎన్‌టి రామారావు. కాని ప్రస్తుతం రాష్ట్రంలో ఆపరిస్థితి లేదు. ఎన్‌టిరామారావుకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీలకతీతంగా సినిమా అభిమానులున్నారు. జగన్‌కు తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు, ఆయన సంపాదించిన డబ్బు తండ్రి పేరు కాంగ్రెస్‌వల్ల వచ్చింది. కాంగ్రెస్‌కు జగన్‌కు రాజీనామా చేయడం వల్ల సగానికి పైగా కాంగ్రెస్‌లోనే రాజశేఖర్‌రెడ్డికి ఉన్న కీర్తి పోయింది. ఇప్పుడు జగన్‌కు కొద్దిపాటి సానుభూతి మాత్రమే ఉంది. ఆసానుభూతికి కాంగ్రెస్‌, టిడిపి ఇతర పార్టీలనుంచి వచ్చే వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలి. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళనలు చేస్తున్నారు. తెలంగాణాలో జగన్‌కు వ్యతిరేకతనే ఎక్కువ. నూతన ఆర్థిక విధానాల పుణ్యమాని రాష్ట్రంలో సంపన్నులు మరింత సంపన్నులయ్యారు. పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడ్డారు. చెప్పాలంటే ఇంకా అనేక సమస్యలున్నాయి. కులాల వారీగా ప్రజల ఐక్యత దెబ్బతిన్నది. మతోన్మాదుల సంగతి చెప్పనవసరం లేదు. వేర్పాటు వాద ఉద్యమాలున్నాయి. ఐక్యంగా ఉందామని ఒక్క సిపిఎం మాత్రమే ధైర్యంగా చెబుతుంది. మిగతా పార్టీలన్నీ గోడమీది పిల్లి వాటంగా ఉన్నాయి. వీటన్నింటినీ భేరీజు వేసుకునే శక్తి సామర్థ్యాలు కావాలి. పార్టీకి కొన్ని కొన్ని సిద్ధాంతాలుండాలి. వాటిని అమలు చేయగల మొక్కవోని ధైర్యముండాలి. ఈ దేశానికి సైనికుల్లాంటి సేవాభావం ఉన్న నాయకత్వం కావాలి. ఒకరినొకరు దోచుకునే వ్యవస్థను ప్రశ్నించాలి. అప్పుడే జగన్‌ పెట్టే కొత్త పార్టీ హిట్టు అవుతుంది.లేదంటే ఫట్టే...!