18, నవంబర్ 2010, గురువారం

కార్పొరేట్ ఆ(కా)సుపత్రి!


కార్పొరేట్ ఆ(కా)సుపత్రి!

మేలిమి రంగు తో మిడిసిపడే కార్పొరేటు ఆసుపత్రుల పొట్టవిప్పి చూస్తే..
 
ఆగండి! ఈ ఆవరణలో జాగ్రత్తగా అడుగులు వేయండి.

భళ్ళుమని మృత్యు ఘోషలన్నీ అసరిగమల్తో మీ మీద దాడి చేస్తాయి.

ఎవరెవరో ఈ గోడల్లోంచి గుండెలు బాదుకుంటున్నారు.

ముక్కు మూసుకోండి. ఈ తెల్లని గోడల్లోంచి చావు కంపు కొడుతోంది.

డాక్టర్లు చావు కబుర్లని మెళ్ళో వేసుకుని అటూ ఇటూ పరిగెడుతున్నారు.

యిటు జరగండి.

స్ట్రెచర్లోంచి యెవరో బిగ్గరగా అరుస్తూ చేతులు చాస్తున్నారు.

సెలైన్ బాటిల్లోంచి రాలే వొక్కో బొట్టూ

చావు లోకాలకి ఒక్కో మెట్టూ కడుతోంది.

రిసెప్షన్ లో క్యాష్ కౌంటర్ రాకాసి నాలుకల్ని చాస్తోంది.

పరుపులపై పరచిన దుప్పట్ల మీద జీవితాలు

మరకలుగా మారుతున్నాయ్.

మీరు యేమీ అడక్కండి.

కన్సల్టెంట్ డాక్టర్ ఖర్మ యోగం అప్పచెబుతాడు.మీరు మాట్లాడరాదంటాడు.

రౌండ్స్ కొచ్చిన ప్రతీ ట్రెయినీ డాక్టరూ పెదవి విరుస్తున్నాడు.

నర్సులు ఒకరికొకరు ఎదురుపడినప్పుడల్లా నవ్వుల్ని అతికించుకుంటున్నారు.

కౌంటర్లో నిలబెట్టి ఒంట్లోని ఒక్కో కండనీ కోసి బిల్లులుగా చెల్లేసి ముఖాన కొడుతున్నారు.

పడక మంచాలన్నీ పాడెలాగ మూల్గుతున్నాయ్ .

ఇక్కడ దీనులు మూకుమ్మడిగా దాడి చేసే అపనమ్మకాల్ని కన్నీటి ఆసిడ్లతో కడిగేసికుంటున్నారు.

ఆర్తనాదాలనన్నిటినీ కడుపులో దిగమింగుకుంటున్నారు..

పరామర్శకుల హృదయాలు బిక్కుమంటో నరాల్ని దారాలుగా ముడేసుకుంటున్నాయి.

పంటి బిగువున గట్టిగా బిగపట్టిన ఆనవాళ్లు యేవో అలలు అలలుగా తేలుతున్నాయ్.

యిప్పుడు ప్రార్థన చేయండి.

యిక్కడ మనిషికీ నమ్మకానికీ యెప్పుడూ యుద్దమే !

మహ్మదూ-యేసూ-రాముడూ-

మెయిన్ గేటు దగ్గిరే ఆగిపోయారు.

పిలవరేం!

అప్పుడప్పుడూ పరామర్శలు కొన్ని క్షణాల్ని బ్రతికిస్తున్నాయ్ .

అయ్యో! యేం చేస్తున్నారేం! ?

యెవరినీ కదపకండి.

యిక్కడి దుఖమంతా లుంగలు చుట్టుకుని

మీ నరాల్లోకి ఎగబాకి మీ నిద్రారాత్రులన్నీ అల్లకల్లోలమవుతాయ్.

వుండండి! ఎఱ్ఱబల్బు వెలిగింది.

హుష్ ! సైలెన్స్

. . .

. . .

స్కానింగ్ అయిపోయింది .

సారీ గుండె ఆగిపోయింది.

బిల్లులు కట్టండి.

బిచాణా ఎత్తేయండి.

పేషెంట్....నెక్స్ట్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి