29, అక్టోబర్ 2010, శుక్రవారం

ముదనష్టపు మంత్రులు … ముదురు మాటలు

ముదనష్టపు మంత్రులు … ముదురు మాటలు

గదర్‌ వీరుడు దర్శి చెంచయ్య తన ‘నేను – నా దేశం’ రచనలో అంటారూ, ”దరిద్ర దేశం, దరిద్ర ప్రజలూ” అని.
దానికి నన్ను కొంత జత చేర్చనీయండి- ”దరిద్రానికి కారణం, ముదనష్టపు మంత్రులూ, ముదురు మాటలూ”.
లేకపోతే హేమిటండీ, రాష్ట్ర మంత్రుల గోల. ”వొట్టి మాటలు కట్టిపెట్టవోయ్‌” అని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి వొట్టట్టి (క్షమించాలి… ఆయన ఇంటి పేరు వొట్టి మాత్రమే నండి) వసంతకుమార్‌నే మహాకవి గురజాడ మందలించి ఉంటాడని నా గట్టి నమ్మకం. 2004కు ముందు ప్రతిపక్షంలో ఉండగా… అవినీతి, అక్రమాలు అంటూ ఆనాటి పాలకపక్షాన్ని తూర్పారబట్టిన ఈ నిత్య వసంతుడు గద్దెనెక్కగానే, పాతంతా రోతన్నట్లుగా వ్యవహరిస్తున్న విషయం ఎవరికి తెలియదంట. తూర్పు గోదావరి జిల్లాలో అసైన్డు భూమిని అరవై ఎకరాలదాకా బొక్కి రొయ్యల్ని పెంచేస్తూ మీసాల్ని మేలేస్తోన్న వొట్టి అయినదానికీ కానిదానికీ ఇప్పుటికీ ఆనాటి పాలకులదే తప్పని తెలివిగా తప్పించుకోజూడటం ఆయన తెలివితక్కువతనానికి నిలువెత్తునిదర్శనం. సూక్ష్మ రుణ సంస్థల మహా దారుణాలను అడ్డుకోలేని ఈ మ(క)0త్రివర్యుడు తప్పంతా పేదోళ్లదేనని సిగ్గులేకుండా వాగేశాడు. సూక్ష్మ రుణ సంస్థల నుంచి పౌడర్ల కోసం, స్నోల కోసం మహిళలు అప్పులు తీసుకుంటున్నారని తేల్చేశాడు. అంటే 19 వేల కోట్ల సొమ్మిచ్చి వడ్డీ వ్యాపారం చేసుకోండని సూక్ష్మ రుణ సంస్థలను భారతదేశం మీదకు తోలిన ప్రపంచబ్యాంకు అసలు నేరస్తురాలు కాదన్నట్లు, అడ్డూఅదుపూ లేకుండా సూక్ష్మరుణ సంస్థలు జనంమీద పడి దోచుకునేందుకు అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానిది అసలు తప్పేలేదన్నట్లు, పేదల్ని మరింత దోచుకుతినేందుకుగాను సూక్ష్మరుణ సంస్థలకు నియమ నిబంధనల్లో వెసులుబాటు కల్పించిన గౌరవనీయ రిజర్వుబ్యాంకు నీతి-నిజాయితీకి మారు పేరన్నట్లుగా, కోటి మంది తెలుగు తల్లుల్ని లక్షాధికారుల్ని చేస్తామని గత ఎన్నికల సందర్భంగా హామీల ఎత్తిపోతల్ని తలకెక్కించిన తానూ, తన గురుతుల్యులు శ్రీమాన్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అసలు అసత్యమంటే తెలియని వారేనన్నట్లుగా విచిత్రాతి విచిత్రంగా వొట్టిగారు వొట్టి విస్తర్లేయటం క్షంతవ్యంగాని నేరం. పేదలు పౌడర్లు కొనుక్కోవటం నేరమయితే ముందు వాటిని దేశంలో అమ్మకుండా నిషేధించండి వొట్టిగారూ!. అన్నట్లు అమ్మల్ని లక్షాధికారుల్ని చేసేందుకుగాను మీరు పావలా రుణాలు ఇస్తామని చెప్పారుగదా, మీరు నిజంగా రుణాలు ఇచ్చి ఉంటే అప్పుడు పేదలు పౌడర్లు కొని ఉండేవారు కాదా? కాదంటే ఇప్పుడు ఆ పనిని మహిళల చేత ఎందుకు చేయించలేకపోయారు? అవునంటే పౌడర్లు, స్నోలు కొనే మహిళల్ని మీరు ఏ విధంగా లక్షాధికారులుగా చేసేవాళ్లు? నిజమేంటో కాస్త చెప్పి పేద్ద పుణ్యం కట్టుకోండి సార్‌.
సూక్ష్మరుణం పుణ్యమా అని అశువులుబాసిన ముప్పైమంది నేపథ్యాలను పరికించినా వొట్టి మాటలు వొట్టట్టి నోటి దూల మాత్రమేనని ఇట్టే తేలిపోతుంది. ఇందిరమ్మ ఇల్లని పేదోళ్లని మీరు వీధిలో పారేస్తే, మొండి గోడలకు కాసింత కప్పేసుకునేందుకుగాను మహిళలు సూక్ష్మరుణాల్ని తీసుకున్నారు. బియ్యం ముప్పై, నలభై అమ్ముతుంటే బతకలేనోళ్లు ఆటో ఏసుకుందామని సూక్ష్మ సంస్థల్ని నమ్మారు. కుంట, సెంటు భూమిలో నాట్లేసేందుకు సూక్ష్మరుణాలు తీసుకున్నారు. ఎక్కడో, ఎప్పుడో- ఒకరో, ఇద్దరో తప్పుదోవ పడితే పట్టి ఉండొచ్చుగాక, అదే విశ్వజనీన సత్యమంటూ దొడ్డిదారిన నడుస్తోన్న కంత్రీలు ముందూ వెనుకా చూడకుండా వాగేయటం వొట్టట్టిలకే సరిపోతుంది.
అయినా దొరికినంత దోచుకోవటం, పీక్కోవటం తప్ప ఈ ప్రభుత్యం చేస్తోంది ఏమీ లేదని తేలిపోయింది. దాన్లోనే పడి మంత్రులూ, కంత్రులు కొట్టుకు చావొచ్చు. మనందరికీ మండినప్పుడు ఆ మంటల్లో పడి శలభాల్లా మాడి మసవుతారు ఎటూ. కానీ ఊరుకుంటేగా, తగుదునమ్మా అంటూ ప్రతి దాంట్లోనూ వేలు పెట్టి చేతుల్నే కత్తెరేయించుకోవటం మంత్రగాళ్లకు మామూలయింది.
ఉత్తరాంధ్రను భోంచేస్తోన్న బొత్స, రాయలసీమను రసంలా లాగించేస్తోన్న రఘువీరా, తెలంగాణను తెగమేసేస్తోన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా అందరూ, ఒక్కొక్కడు మహా మోసగాళ్లు. అంతర్జాతీయ మోసగాళ్లు సైతం వీళ్ల ముందు ఎందుకూ కొరగారు. ఎవడన్నా పోటీలు పెడితే ఒకటి నుంచి వందదాకా బహుమతులన్నీ మన కంత్రీగాళ్లే కొట్టేస్తారంటే అతిశయోక్తి లేనేలేదు.
గిన్నీస్‌బుక్‌ నిర్వాహకులు తమ దృష్టిని ఒక్కసారి మహామోసగాళ్లపై సారిస్తే ఒకే రాష్ట్రానికి చెందిన ఇంత మంది పేర్లను ఒకేదఫా నమోదు చేయలేక సతమతం కావాల్సిందే.
పోనీలే పాపం, ఆ విదేశీ పుస్తక నిర్వాహకుల పట్ల ఒకింత జాలితో వదిలేద్దాం. మన లింకా బుక్‌ఆప్‌ రికార్డ్స్‌లోనన్నా మనోళ్ల పేర్లనీ, వాళ్ల దొంగ మొహాల్నీ కచ్చితంగా ఎక్కించాల్సిందేనని డిమాండు చేద్దాం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి