21, సెప్టెంబర్ 2010, మంగళవారం

బహుముఖ ప్రజ్ఞకు మరో పేరు భానుమతి!

నటనకు సారమతి భానుమతి

మనసున మల్లెల మాలలూగెనే పాట వినిపించగానే ఆ పాటకు భానుమతి ఆలాపన నటించిన తీరు ఇప్పటికి రసహృదయాలను పులకింప చేస్తుంది. మల్లీశ్వరి కోసం కృష్ణశాస్త్రి భానుమతిని దృష్టిలో పెట్టుకొని రాసారా, భానుమతిని కళ్లముందు నిలుపుకుని సాలూరి రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారా అని అనిపించక మానదు. చిన్నతనం నుండి తండ్రి గారాలపట్టిగా పెరిగిన భానుమతి సంస్కృతం భాగా నేర్పించడంవల్లను సాహిత్యం మీద ఆసక్తి పెంచుకోవడం వల్లను ఆమె మనస్సులో అవి చెరుగని మద్ర వేశాయి.

తను పోషించే పాత్రలకు ఆలపించే గానంకి ప్రాణం పోయగలిగే నేర్పు అలబడింది. ఇదే క్రమ క్రమంగా రచన, సంగీతం, చిత్రకళ, నాట్యకళ, ఇలా వివిధ కళలను ఔపోసన పట్టిన భహుముఖ ప్రజ్ఞాశాలిగా రూపొందడానికి ఆస్కారం ఏర్పడింది. తొలుత నటి కావడానికి ఆమెకు ఏ మాత్రం ఇష్టం లేదు. పాడడానికి మాత్రం ఎప్పుడు సిద్దమే. అయినా తొలిసారి పాటలేకపోవడం వల్ల సినిమా ఛాన్స్‌ గోడవల్లి రామబ్రహ్మం వద్ద మిస్‌ కావడం ఎంతో ఆనందం కలిగించింది ఆమెకు. కాలింది పాత్రకు భానుమతిని పుల్లయ్య గారు ఎంపిక చేసినప్పుడు బలిజెపల్లి గొప్ప రచయిత్రిగా, గాయనిగా , నటిగా కీర్తిప్రతిష్టలు గడించాలని ఆశ్వీర్వదించారు. ఆయన ఆశీర్వాద బలమో ఏమో గాని వర విక్రయం, మాలతి మాధవ , ధర్మపత్ని, భక్తిమాల ఇలా చిత్ర చిత్రానికి భానుమతి నటనకు గానానికి పేరు వచ్చింది. ఛండిరాణి, లైలామజ్ను, విప్రనారాయణ, బాటసారి ఇలా ప్రతి చిత్రంలోను ఆమె నటనకు గానానికి జోహారు అన్నారు ప్రేక్షకులు. తమిళ ప్రేక్షకులు భానుమతి, తమ ఆడపడుచు అని భావించేంత పేరు తెచ్చుకోవడం వలన తమిళనాడు నుండి ఎక్కువ అవార్డులు పొందే అవకాశం లభించింది భానుమతి రామకృష్ణ. 


1925 లో సెప్టెంబర్ 7 వ తేదీన, ప్రకాశం జిల్లాలోని దొడ్డవరం గ్రామంలో, బొమ్మరాజు వెంకట సుబ్బయ్య, సరస్వతమ్మ దపతులకు జన్మించిన ఆణిముత్యమే ఈ బహుముఖ ప్రతిభాశాలి భానుమతి. భానుమతి నటి, గాయని, రచయిత్రి, సంగీత దర్శకురాలు, దర్శకురాలు, నిర్మాత, స్టుడియో అధినేత్రి ఇలా అనేక రంగాల్లో సంచలనాలు స్రుష్టించిన తొలి తెలుగు మహిళ భానుమతి.తండ్రి వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత ప్రియుడు, రంగస్థల నటుడు కావటంతో భానుమతికి ఆయనే తొలి గురువు,నటనలో స్ఫూర్తి కూడా. ఆయనే ఆమెకు శాస్త్రీయ సంగీతాన్ని దగ్గరుండి నేర్పించారు. ఆ తర్వాత 1935 లో , పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన "వరవిక్రయం" చిత్రంలో భానుమతి తొలిసారిగా నటిగా తెలుగు సినీ రంగంలో ప్రవేశించారు. తర్వాత మాలతీ మాధవం, ధర్మపత్ని, భక్తిమాల, క్రిష్ణప్రేమ, స్వర్గసీమ, చక్రపాణి, లైలామజ్ఞు, విప్రనారాయణ, మల్లీశ్వరి, బాటసారి, పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, అగ్గిరాముడు, తెనాలి రామక్రిష్ణ, అంతస్తులు, మట్టిలో మాణిక్యం, అంతా మనమంచికే, అమ్మాయిపెళ్ళి, మంగమ్మగారి మనవడు వంటి రెండు వందల చిత్రాల్లో ఆమె నటించారు. భానుమతి నటించిన చివరి చిత్రం "పెళ్ళికానుక". .ఆమె సీన్ లో ఉంటే మరో నటి గానీ, నటుడు గానీ కనపడడనే వినికిడి సినీ పరిశ్రమలో ఉండేది. అందుకే ఆనాటి సినీ పరిశ్రమలో భానుమతికి "అష్టవర్థిని"అనే బిరుదుండేది. ఇక గాయనిగా ఆమె పాడిన పాటలు వందల్లో ప్రేక్షకులను అలరించాయి.
భానుమతి గారికి లభించిన గౌరవం కానీ, సన్మానాలు కానీ, అవార్డులూ, రివార్డులూ మరే తెలుగు నటికీ లభించలేదంటే అతిశయోక్తికాదు.పల్నాటి యుద్ధం చిత్రానికి గాను 1966 లో జాతీయ ఉత్తమనటిగా, అన్నై అనే తమిళ చిత్రానికి కూడా ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు, 1965 లో అంతస్తులు చిత్రానికి ఆమెకు జాతీయ ఉత్తమ నటిగా లభించగా, 1966లో భారత ప్రభుత్వం "పద్మశ్రీ" అవార్డుతో గౌరవించగా,1975 లో ఆంధ్రా యూనివర్సిటీ, 1984 లో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లు అందించి గౌరవించాయి. 1983 లో తమిళనాడు ప్రభుత్వం "కళాఈమామణి" బిరుదునిచ్చి గౌరవించింది. 1986 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "రఘుపతివెంకయ్య నాయుడు "అవార్డుని భానుమతి గారికిచ్చి గౌరవించింది. 2000 సంవత్సరంలో యన్.టి.ఆర్.నేషనల్ అవార్డునిచ్చి గౌరవించగా, 2003 లో ఆమెకు భారత ప్రభుత్వం "పద్మభూషణ్ "అవార్డునిచ్చి గౌరవించింది.అటువంటి బహుముఖ ప్రతిభాశాలి శ్రీమతి పద్మశ్రీ, పద్మభూషణ్, డాక్టర్ భానుమతీ రామక్రిష్ణ 2005లో డిసెంబర్ 24 వ తేదీన పరమపదించారు. ఒక బ్రుహత్తార నేలరాలి, ఆకాశంలో ధ్రువతారగా నిలిచిపోయింది. తెలుగు సినిమా బ్రతికున్నంత కాలం భానుమతికి చావులేదు. 

సినిమా ప్రేమ కాదు

రామకృష్ణతో భానుమతి పెళ్ళి కథ ఒక సినిమాకు తీసిపోదు.ఆమె నటించిన అయిదో చిత్రం కృష్ణప్రేమ కు రామకృష్ణ అసోసియేట్ డైరెక్టరుగా పనిచేసేవారు.అందరితోనూ మంచివాడనిపించుకున్న రామకృష్ణ,అప్పటికింకా పద్దెనిమిదేళ్ళు నిండని భానుమతి దృష్టిని ఇట్టే ఆకర్షించారు.స్టూడియోలో ఆయన ఎటు తిరిగితే అటే తిరిగేవి ఆమె చూపులు.ఇది గమనించిన అలనాటి నటులు శాంతకుమారి,హైమవతి ఆమెను ఆట పట్టించడానికి ఒక ప్లాను వేసారు. ఒకరోజు రామకృష్ణకోసం వెతుకుతూ అతను వెళ్ళిపోయి వుంటాడని తమలో తాము అనుకున్నారు.వెళ్ళలేదు భోజనం చేస్తున్నారు అని భానుమతి చెప్పింది. కాదు వెళ్ళిపోయారంది హైమవతి. ఇద్దరూ రెండు రూపాయలు పందెం వేసుకున్నారు. తీరా చూస్తే రామకృష్ణ నిజంగానే భోజనం చేస్తున్నారు.శాంతకుమారి,హైమవతి నర్మగర్భంగా నవ్వుకుని ఆ రెండు రూపాయలనీ రామకృష్ణతో ఇప్పించారు.

మరోసారి అదే సినిమా షూటింగులో భానుమతి వేలికి గులాబి ముళ్లు గుచ్చుకుంది.కట్టు కట్టడానికి తడిగుడ్డ దొరుకుతుందేమోనని చూస్తుండగా రామకృష్ణ ముందుకొచ్చి తన కర్చీప్ కట్టారు.కాలక్రమలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.భానుమతి తల్లితంద్రులకు ఇష్టం లేకపోవడంతో ఇద్దరూ వాళ్ళకు తెలియకుండా బంధువులు,స్నేహితుల సాయంతో పెళ్ళి చేసుకున్నారు.ప్రపంచానికి ఎంత తలబిరుసుగా కనిపించినా,కట్టుకున్న భర్తకు మాత్రం ఆమె ఎప్పుడూ అనుకూలవతిగానే వున్నారు.తమ ప్రేమకు చిహ్నాలుగా ఆయన తన వేలికి కట్టిన కర్చీఫ్,పందెపు సొమ్ము రెండు రూపాయలు కడదాకా భద్రంగా దాచుకున్నారామె.

స్త్రీ స్వేచ్ఛకు నిజమైన అర్థమిదేః

బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణను ఎరుగని తెలుగు లోగిలి లేదనడం అతిశయోక్తి కాదు. నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో యజమానురాలు, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు, గృహిణి... ఇలా నిజ జీవితంలో విభిన్న పాత్రలను పోషించి ఆయా రంగాల ప్రముఖులచే భేష్ అనిపించుకున్న ఘటికురాలు.

స్త్రీ స్వేచ్ఛపై తన అభిప్రాయాలను సుస్పష్టంగా చెప్పారామె. మహిళా స్వేచ్ఛ అంటూ చాలామంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారని డాక్టర్ భానుమతి పేర్కొంటూ, ఎవరినీ లెక్కచేయక విచ్చలవిడిగా తిరుగుతూ నిర్లక్ష్య ధోరణి గలవారు ఒకరైతే...

పురుషాధిక్యానికి గురై అమాయకత్వంతో కూడిన అజ్ఞానంతో కష్టాలు పడే మహిళలకు విముక్తినివ్వాలని సీరియస్‌గా వాదించేవారు ఇలా రెండు రకాల మహిళా స్వేచ్ఛావాదులు ఉన్నారంటారు. అయితే "మట్టిలో మాణిక్యం" చిత్రంలో తాను రూపొందించిన లలిత పాత్ర. స్త్రీ స్వేచ్ఛకు నిజమైన అర్ధం అంటారు డాక్టర్ భానుమతి.

మహిళ తనకంటూ స్వంత వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకొని, తన పరిమితులను తానెరిగి, జీవిత భాగస్వానిగా, అమ్మగా, పరిపూర్ణ స్త్రీగా బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆత్మాభిమానాన్ని కోల్పోకుండా ముందడుగు వేయాలని, తీవ్ర పరిస్థితులు ఎదురైనప్పటికీ తల ఒగ్గక సమాజంలోని దుష్టశక్తులను దునుమాడే ఆదిశక్తిలా ఉండాలనేది తన ఆకాంక్షగా భానుమతి స్పష్టం చేశారు.

అయితే, మహిళలందరికీ ఇలాంటి ఆదర్శ లక్షణాలు ఉండవని తనకూ తెలుసనీ, కొందరికి పుట్టుకతోనే భయం, పిరికితనం ఉన్నా అడుగడుగునా జీవితం నేర్పే పాఠాలు, పరిస్థితుల ఒత్తిడితో ఆత్మస్థైర్యం, ధైర్యం అలవడతాయని ఆమె అన్నారు.

డాక్టర్ భానుమతి జీవితాన్ని పరికిస్తే పై విషయాలు ఆమె స్వానుభవంతో చెప్పినవేనని అనిపిస్తుంది. ఈ కోణంలోనే "మట్టిలో మాణిక్యం"లో లలిత పాత్రను రూపొందించి, తరువాత అదే ప్రేరణతో "అంతా మన మంచికే" చిత్రంలోని సావిత్రి పాత్రకు ఊపిరి పోసినట్లు భానుమతి చెప్పారు.

ఈ సినిమాలు రెండూ ఎంతో ప్రజాదరణ పొందాయి. అదే రీతిలో తాను "అసాధ్యురాలు"లో భారతి పాత్రను ఒకింత ఎక్కువ స్థాయిలోనే మలిచానని వివరించారు.

అసాధ్యురాలు సినిమాలో హీరోకు పెద్దమ్మ అయిన భారతి ఐశ్వర్యవంతులమనే అహంకారంతో పేదలను నీచంగా చూసే వ్యక్తులను దారికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రేమకు ఆటంకాలు కల్పించే శక్తులను ఎదుర్కొంటూ, చేయూతను ఆశించిన వారిని అండగా నిలిచి, ఒక్కో సన్నివేశలోనూ సమయస్పూర్తితో సమర్థవంతంగా వ్యవహరించేలా ఈ పాత్రను రూపొందించానన్నారు.

మొన్న లలిత, నిన్న సావిత్రి, తర్వాత భారతి పాత్రల ద్వారా స్త్రీ స్వేచ్ఛకు నిజమైన అర్థాన్నిచ్చిన డాక్టర్ భానుమతి నిజజీవితంలోనూ అదే వ్యక్తిత్వంతో స్త్రీ లోకానికి ఆదర్శప్రాయంగా నిలిచారు.

భానుమతిగారి సంతాపసభ ఫోటోలు


















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి