21, సెప్టెంబర్ 2010, మంగళవారం

ABOUT COMPUTER

జీ ఎన్ యూ/లినక్స్ పరిచయం

జీ ఎన్ యూ/ లినక్స్ గురించి :(ఇందులో చాలా సాంకేతిక పదాలను తెలుగులోనే వాడాను వాటిని కింద వాటి మూల పదాలతో సహా జాబితా ఒకటి కింద ఇచ్చాను ఏమైనా మార్పులు ఉంటే దయచేసి కామెంట్ గా ఇవ్వండి)

మనం ప్రస్తుతం విస్తృతంగా వాడుతున్న సంగణక యంత్రం గురించి చాలా తక్కువ తెలుసు మనకి.
ఈ యంత్రం కనిపెట్ట బడిన తొలినాళ్ళలో దీని ఆకారం చాలా పెద్దదిగా ఉండెడిది. ఎంత పెద్దది అంటే ఒక మొత్తం గదిని నింపేంత.
ఈ సంగణక యంత్రం లో మనకు బాహ్యంగా కనిపించే కఠినాంత్రం మరియు దానిని సక్రమంగా పని చేయించే కోమలాంత్రమూ ఉంటాయి.
కోమలాంత్రము అనేది మనకు కనబడదు.
అయితే తొలి రోజుల్లో సంగణకాన్ని నడిపే కోమలాంత్రంయొక్క మూలశాసనపదాలు బాహ్యంగా ఉండేవి.
కోమలాంత్రాన్ని అందరూ తమకు నచ్చినట్టుగా అనుసంధానం చేస్కునే వారు(మూలశాసనపదాలను మార్పిడి చెయ్యటం ద్వారా).
కానీ ౬౦ వ దశకం రాగానే , సార్థవాహక (స్వార్థవాహక???) కంపెనీలు కొన్ని, కోమలాంత్రం యొక్క మూలశాసనపదాలను వాడుకరికి గోప్యంగా ఉంచటం మొదలెట్టాయి. దీని వల్ల సార్థవాహక కంపెనీలకు బోల్లెడు ప్రయోజనాలు కానీ, ఎటొచ్చీ ఒక వాడుకరి ఆ కోమలాంత్రపు లోలోపల గల మూలశాసనపదాల్ని పరిశీలించడం, మార్చడం కుదురేవి కావు.
అందువల్ల వాడుకరులు స్వేచ్ఛ కోల్పోయారనమాట.
అయితే ఇది ఒక ఇరవయ్యేళ్ళు అలాగే కొనసాగింది, సార్థవాహక కంపెనీలు మరీ మితిమీరిపోయి అన్ని కోమలాంత్రాల్ని వాడుకరులకు, నిపుణులకు దూరం చేసాయి.
అయితే ౮౦వ దశకం లో రిచార్డ్ మ్యాథ్యూ స్టాల్మాన్ అనే ఒక నిపుణుడు ఈ అరాచకత్వాన్ని ఎదిరిస్తూ
స్వేచ్ఛాపూరితకోమలాంత్ర ఉద్యమాన్ని మొదలెట్టారు.
తద్వారా అప్పట్లో పేరొందిన అత్యంత జనాదరణ పొందిన యూనిక్స్ కు వికల్పముగా కొన్ని కోమలాంత్రాలను తయారు చేసి వాటిని ఉచితంగా వాటి మూలశాసనపదాల తో సహా పంచిపెట్టటం మొదలయింది - ఇది స్వేచ్ఛాపూరితకోమలాంత్రోద్యమానికి తొలి మెట్టు. అలా పుట్టిందే జీ ఎన్ యూ(ఆంగ్ల అక్షరాలైన G-N-U లతో తయరయింది, దాని విస్తార పదం - GNU=GNU Not Unix, ఇది ఒక ముహుర్పదము ఇందులో GNU పదే పదే పునరావృతమౌతుంది).
అలా జీ ఎన్ యూ కై చాలానే కోమలాంత్రాలు తయారు చేయబడ్డాయి, వాటిలో ముఖ్యమైనవి జీ ఎన్ యూ సి కంపైలర్(GCC), జీ ఎన్ యూ డిబగ్గర్(GDB), మొదలగునవి.
ఇక ౯౦వ దశకం మొదల్లో లినస్ టొర్వాల్డ్స్ అనే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి యూనిక్స్ యొక్క నుంగు ను అనుకరించి లినక్స్ అనే కొత్త నుంగును కనిపెట్టారు.
ఈ నుంగుపై జీ ఎన్ యూ ద్వారా ఉత్పత్తి చేసిన కోమలాంత్రాల్ని పేర్చి తయారైనదే మన జీ ఎన్ యూ లినక్స్ నిర్వహణా వ్యవస్థ.
అందుకనే మనం ఈ నిర్వహణావ్యవస్థను జీ ఎన్ యూ/లినక్స్ నిర్వహణా వ్యవస్థ అనాలి. చాలా మంది లినక్స్ అని మాత్రమే సంబోధిస్తారు, ఇది చాలా తప్పు , లినక్స్ అనేది నుంగు మాత్రమే.
ఇక ఆ పై మొదలు ఇది అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండటంవలన(మూలశాసనపదాలతో సహా), ఎవరికి నచ్చినట్టూ వారు దీనిని మార్చుకోవచ్చు.
అందువలననే జీ ఎన్ యూ/లినక్స్ కు ఇన్ని రకాల మాదిరిలు ఉన్నాయి. రెడ్ హ్యాట్, ఫెడోరా, మాండ్రివా, ఉబుంటూ, ఓపెన్ సూసీ, డెబియన్, అచ్చంగా మన తెలుగులో తయారైన మాదిరి-స్వేచ్ఛ. మున్నగువి ఇంకా చాలా చాలా ఉన్నయి.
ఈఎక్స్టీ౨, ఈక్ష్టీ౩ మరియు ఈ ఎక్స్టీ ౪ అను విశిష్టమైన దస్త్ర వ్యవస్థ ను వాడటం వల్ల జీ ఎన్ యూ/లినక్స్ వాడుకర్లకు అసలు చాలా ఉపయోగాలున్నాయి.
ఇంకా ఇదే కాకుండా జీ ఎన్ యూ/లినక్స్ వాడుకర్లు, వారిలోనిపుణులు, కలిసి ఈ జీ ఎన్ యూ/లినక్స్ వ్యవస్థ కోసం చాలా కోమలాంత్రాలను రాసారు, రాస్తున్నారు, రాస్తారు కూడా.
మూలశాసనాపదాలు (ఉచితంగా) అందుబాటులో ఉన్నందున స్థానికీకరణ కూడా చాలా సులువైంది.
తెలుగులోనే పూర్తి స్థాయి నిర్వహణా వ్యవస్థలు ఉన్నాయి.
ఉదాహరణకు: స్వేచ్ఛ, ఉబుంటు-తెలుగు, డెబియన్-తెలుగు మున్నగునవి.
మీరూ మీ వంతు సహాయాన్నీ అందిచవచ్చు. లాంచ్ప్యాడ్ వంటి ప్రదేశాలలో మీరు ఏ మూలశాసనపదవిద్య తెలియకపోయినా స్థానికీకరణకు సహాయం చెయ్యొచ్చు, తద్వారా చాలా మేలు చేసిన వారవుతారు మన భాషకు.
అయితే ఈ టపా లో అర్జున్ గారు చెప్పినట్టు ఇంకా చాలా చెయ్యవలిసి ఉంది నిపుణులు, వాడుకర్లు ముందుకు వచ్చి మీ ప్రోత్సాహాన్ని అందిస్తే చాలా చెయ్యవచ్చు మనం.

'తెలుగుదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగువల్లభుండ, తెలుగొకండ, ఎల్లనృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స'

list of tech jargons in telugu:

  • సంగణక యంత్రం : Computer
  • కఠినాంత్రం : hardware
  • కోమలాంత్రము: Software
  • మూలశాసనపదం : source code
  • శాసనపదం : command
  • సార్థవాహిక కంపెనీలు (స్వార్థవాహక????): corporate companies
  • వాడుకరి : user
  • నిపుణుడు : developer
  • స్వేచ్ఛాపూరితకోమలాంత్ర ఉద్యమాన్ని : Free Software Movement
  • నుంగు : kernel
  • నిర్వహణా వ్యవస్థ : Operating System
  • మాదిరి(used as a noun here) : Distro (Distribution)
  • దస్త్ర వ్యవస్థ : file సిస్టం
  • మూలశాసనపదవిద్య : programming

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి