21, సెప్టెంబర్ 2010, మంగళవారం

కాశ్మీర్ సమస్య

కాశ్మీర్ సమస్య

మనం మన తెలంగాణా, జగన్ ఓదార్పు యాత్ర, వినాయక నిమజ్జనం అంటూ మన చుట్టుపక్కల జరిగే విషయాలనే గమనిస్తున్నాం గానీ మన దేశానికే అత్యంత జటిలంగా మారిన కాశ్మీర్ సమస్య గురించి చర్చించుకోవడం మరిచాము.

గత రెండున్నర నెలలుగా అయితే మొత్తం జమ్మూ&కాశ్మీర్ అస్తవ్యస్తం గా మరీ అధ్వానంగా తయారయింది.
ఒక పక్క ఆవేదన వ్యక్తంచేస్తూ ఆందోళనకు దిగిన నిరసనకారులు, మరో పక్క ఎప్పటికప్పుడు కర్ఫ్యూలంటూ కాల్పులంటూ దిగ్బందిస్తున్న పోలీసులతో, అక్కడి జనజీవనం, వ్యాపారం, మరియు విద్యాసంస్థలన్నీ మూతబడ్డాయి.

జూన్ ౧౧ నుండి ఆగస్ట్ ౨౨ వరకూ, మొత్తం మీద ౬౨ మంది కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు - వీరు ఏ ఉగ్రవాదులూ కాదు. వీరందరూ కూడా ౮ నుండి ౨౫ మధ్యన వయస్సు కలిగిన మన దేశపౌరులు. వీళ్ళు సీఆర్పీఎఫ్ వారిపై రాళ్ళు రువ్వటం , వాళ్ళు లాఠీ చార్జీకి లేదా భాష్పవాయువు లేద ఈ మధ్య అత్యంత సర్వసాధారణంగా కాల్పులకో పాల్పడుతున్నారు. అవి ఈ ఆందోళనలను నిరోధించక పైపెచ్చు వాటిని రెట్టింపు చేస్తున్నాయి. ప్రతి కాశ్మీరిలోనూ ఒక రకమైన అభద్రతా భావం మరియు అసహనం నిండిపోయింది.
ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఆలోచించవలసిన విషయమేమిటంటే, ఈ ఫైరింగ్ వల్ల చనిపోదుంది మన భారత యువతే.
ఈ కాల్పులు, లాఠీ చార్జీ, భాష్ప వాయు ప్రయోగం, సమస్యను ఇంకా ఎక్కువ జటిలంగా, క్లిష్టంగా, పెద్దదిగా మారుస్తున్నాయి.
వెనువెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పౌరుని సమస్యల్ని తీర్చకపోతే ఇదో పెద్ద సమస్యగా, అసాధ్యమైనదిగా మారిపోతుంది.
మనకి తెలుసు ఈ పౌరుల్ని రెచ్చగొడుతుంది ఎవరో, ఎవరికి ఇప్పుడు జరుగుతున్న తర్వాత జరుగబోయే పరిణామాల వల్ల లాభం చేకూరుతుందో.
కానీ అలాని ఎప్పటికీ దీన్ని వాళ్ళే ప్రేరేపిస్తున్నారు అనలేము కదా, అలాంటప్పుడు ఆడవాళ్ళు, పిల్లలు కూడా వచ్చి ఆందోళనలు చెయ్యరు కదా.
ముదుసలి వాళ్ళు కూడా వచ్చి ఆందోళన లో పాలుపంచుకుంటున్నారు, తూటాల భయం కూడా వాళ్ళు ఖాతరు చేయటం లేదు, ఇలాంటి పరిస్థితులలో కూడా మనం ఇవన్నీ ప్రేరేపించబడినవని నమ్మలేం. ఇది దగాచెయ్యబడ్డా కాశ్మీరి ప్రజల తిరుగుబాటు.
అయితే మనం ప్రేరేపకులు అనుకుంటున్న ఉగ్రవాదులు ఇక్కడి ప్రజల్లో ఎప్పుడో విషబీజాలు నాటిపోయారు, వాటి మహావృక్షస్వరూపాలే ఇవాళ మనం చూస్తున్నాం. మనం అక్కడి ప్రజల ఆలోచనల్లోకి ఒకసారి తొంగి చూడాలి. వారి కోపానికి కారణాల పై మన ప్రభుత్వాలు ఆత్మ విమర్శన చేస్కోవాలి.
౯౦ ల దశకంలో జరిగే పోరులో కూడా చాలా మంది యువకులు ఆడవాళ్ళూ పాల్గొన్నారు , కానీ ఈ తరంలో పసిపిల్లలు కూడా మేము సైతం అంటున్నారు. సరిగ్గ మనం పరిశీలిస్తే తెలుస్తుంది, ఎంత అన్యాయానికి గురయ్యారో కాశ్మీరీలని. వారికి చెప్పబడ్డా ఏ హామీ పూర్తికాలేదు. వారిని ప్రత్యేకంగా చూస్తూ వారిని నిజంగానే ప్రత్యేకంగా భారతీయత నుండి వేరు చేసేసాం. తప్పుడు పాలిసీలతో వారి జీవితాలను నరకం చేసారు మన ప్రభుత్వాలు.
ఎంతో నమ్మకంతో మొన్న వోట్లేసిన ప్రజలే ఇవాళ దుమ్మెత్తిపోస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం పరిస్థితి ఇలా లేదు. పాకిస్తాన్ కు భారత్ కు మధ్య జరుగుతున్న శాంతి చర్చల వల్ల కొన్ని నెలల పాటు శాంతి చేకూరింది, అధీన రేఖకు ఇరువైపులా వ్యాపారం పుంజుకుంది. ఏదో ఒక పరిష్కారం రాబోతోంది అని ఇక్కడి ప్రజలు చాలా నమాకంతో ఉన్న తరుణం లో, ముంబైలో దాడులు, ఉగ్రవాదుల చర్యలు మొత్తం సన్నివేశాన్ని మార్చేసాయి. పాకిస్తాన్ కావాలనే కుట్రలు నడుపుతూ ఇలా చేసింది.
దీంతో ఒక్కసారే మళ్ళీ కథ మొదటికి వచ్చింది. సంబంధాలు బలహీన పడటంతో ఇక్కడి ప్రజల జనజీవనం కొంచెం ప్రభావితమైంది.
ఆర్థిక స్థితి కుదేలించటం, నిరుద్యోగం వల్ల పరిస్థితి ఇంకా దిగజారింది.
కాశ్మీర్ లో ఎటువంటి పరిశ్రమలూ లేవు, వారికి అక్కడికొచ్చే పర్యాటకులే ఒక జీవనాధారం కానీ, భారత్-పాకిస్తాన్ ల మధ్య గల సమస్యలతో, ఈ పర్యాటక రంగం చాలా వరకూ నష్టపోయింది. మిగతా ఉద్యోగ మార్గాల కల్పనలో మన దేశ ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది.
గణాంకాల ప్రకారం కాశ్మీర్ లో చదువుకుని నిరుద్యోగంలో మగ్గుతున్న యువత సంఖ్య ౫ లక్షల పైమాటే, ప్రస్తుత ముఖ్యమంత్రి ౫ ఏళ్ళలో లక్ష ఉద్యోగాల రూపకల్పన చేస్తానంటూ గద్దెనెక్కాడు, కానీ ప్రతి సంవత్సరం ఆ నిరుద్యోగుల ఖాతాలోకి కొత్తగా మరో లక్షన్నర వచ్చి చేరుతున్నారు.
ఇవన్నీ కలుపుకొని, ఇక్కడి ప్రజల్లో పూర్తి అబద్రతను నెలకొల్పాయి. జీవనోపాధి దొరుకుతుంది, జీవితాలు మెరుగుపడతాయి అన్న భావన ఒక్క పౌరునిలో కూడా లేదు.
ఇవన్నీ వెరసి ఇప్పటి పరిస్థితులకు దారితీసాయి.
ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులలో గల లోటుపాట్లు ఈ అగ్నికి ఆర్జ్యం పోస్తున్నవి. ఇప్పటికిప్పుడు ఈ సమస్యలన్నిటికీ సమాధానం దొరక్కపోతే మున్ముందు చాలా ఘోరమైన పరిస్థితులను మనం ఎదుర్కోబోతున్నాం.
భారతదేశ ప్రతీ పౌరుడూ ఈ విషయాల్ని మననం చేస్కొని ఆలోచించాలి. ఆ రాష్ట్ర పరిస్థితిని మెరుగు పరిచేందుకు మనం చెయ్యగలిగినంత చెయ్యాలి. మన ప్రభుత్వాల పై ఒత్తిడి తెచ్చి వారిని సమస్య యొక్క అసలు కారణాల వైపుకి మళ్ళించాలి. ఇది నేనో లేక మీరో మాత్రమే అనుకుంటే సరిపోదు, ప్రతి ఒక్కళం అలాగే ఆలోచించాలి.
ఆర్టికల్ ౩౭౦ ని వెనువెంటనే రద్దు చేసి ప్రభుత్వం ఇక్కడ సరిపడా పరిశ్రమలను నెలకొల్పాలి.
నా దృష్టిలో ఆర్టికల్ ౩౭౦ వల్ల కాశ్మీరీలకు గానీ భారతావనికి గానీ ఎటువంటి ఉపయోగమూ లేదు. అది కాష్మీరును మన దేశం నుండి విడదీయటానికి మాత్రమే సహాయ పడుతుంది. ఈ సమస్య మన దేశాన్ని పట్టిపీడిస్తున్న సెక్యులర్ భూతాలకు మంచి ఆహారం గా మారనుంది, అదే విధంగా ఇది మతపరమైన అల్లర్లకు తావివ్వవచ్చు.
౬౦ శాతం వోటింగ్ జరగడం తో మొత్తం కథే మారిపోతొంది అని అనుకున్నాం ఏడాదిన్నర క్రితం కానీ ఎంత ఉత్సాహంతో అయితే ఓటు వేసారో అంతే ఉత్సాహంతో ఈనాడు రాళ్ళు పట్టారు కాశ్మీరీ యువత. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యులే.
ఏదో ఒక చిన్న ఘటన(కాశ్మీర్ వంటి స్థూల సమస్యతో పోలిస్తే) అయిన ఉగ్రవాద ప్రేరేపిత సమస్యవల్ల ఎన్నాళ్ళిలా మన పొరుగు దేశాలను శత్రువులుగా మార్చుకుంటూ పోవాలి?
ఇవాళ సైన్యాన్ని ఉపయోగించి ఇక్కడి ప్రజలను నొక్కి పారెయ్యొచ్చు మన అప్రజాస్వామ్య-పరాధీన ప్రభుత్వం కానీ అది ప్రజలలో విద్వేషాన్ని పెంచటం తప్ప మరెందుకూ పనికి రాదు. పైగా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉద్రిక్తతతో ప్రజలనుండి ప్రతిఘటన ఎదుర్కోవలసి ఉంటుంది.
ఇక్కడ పోలీసుల పాత్ర చాలా హేయంగా ఉంది, ఇప్పటికి మరెక్కడా లేనన్ని లాకప్ డెత్స్ ఇక్కడ జరిగాయి. తనిఖీ అంటూ ఇళ్ళలోకి చొరబడి ఆడవారితో చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు.
శాంతియుతంగా చేసే ప్రదర్శనల మీద కూడా చాలా సార్లు దాడులు చేసారు మన ఖాకీలు, మరి వాళ్ళ చేత అలా చేయిస్తుంది ఎవరో???
బాధ్యతల్ని మర్చిపోయి దేశ పౌరుల్ని పొట్టన పెట్టుకుంటున్న మన సైనికులు రక్షకులా లేక భక్షకులా?
ఒకటీ రెండు సందర్భాలు కాదు చాలా సందర్భాలు ఉన్నాయి. వీరంతా మేకవన్నె పులులు. మన సైన్యం లో కూడా పాక్ తీవ్రవాదులు చేరారా అన్నట్టుగా అనిపిస్తుంది ఒక్కొసారి, ఇదే రకమైన నిరసన దేశంలో మరెక్కడ జరిగినా పొలీసులు దానికి సెక్యూరిటీ గా వ్యవహరిస్తారుకూడా , కానీ కాశ్మీర్ లో మాత్రమే యమకింకరులుగా వ్యవహరిస్తారు. (ఇక్కడ నేను మన దేశ సరిహద్దుని కాపాడే సైనికుల గురించి అనడం లేదు,మా నాన్న గారు కూడా ఆ దేశసరిహద్దురక్షకబలగంలో భాగమే, మళ్ళీ ఏ తార గారో విసుర్లు విసురుతారు, J&K లో అంతర్గత పోలీసుల గురించి)
ఉగ్రవాదులని పట్టుబడెడి వాళ్ళలో చాలా మంది అమాయకులే, కానీ ఆ నిజం తెలిసే సమయానికి, వాళ్ళు పోలీసుల చేతుల్లో బలవుతున్నారు లేదా నిజంగా ఉగ్రవాదులౌతున్నారు.
సెక్యులర్ గా వ్యవహరించాలంటూ మన ప్రభుత్వాలు చాలా తప్పిదాలే చేస్తున్నాయి. మత గురువుల, మత పెద్దల , కుహనా మేధావుల చొరవతో మళ్ళీ కాశ్మీరాన్ని రక్తపు మడుగు చెయ్యాలన్నది దుష్టశతృవుల దూర దృష్టి. మరి దానికి తందానా అంటూ ఆ దూరదృష్టిని కాస్తా దగ్గరిదృష్టి చేస్తుంది మన ప్రభుత్వం.
వెనువెంటనే మన ప్రధానమంత్రి తన ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఒప్పుకొని వాటిని సరిదిద్దుకోవాలి. అమాయకుల చావులకు పరిహారం ఇవ్వాలి. మరియు పై చెప్పబడిన విధంగా ౩౭౦ రద్దుకై నడుం బిగించి పరిశ్రమలను నెలకొల్పి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాలి. జీవనాధారం ఉన్నంత వరకూ ఎవరూ పక్క దార్లు పట్టరు. తద్వారా మెల్లిమెల్లిగా సమస్య తీరిపోతుంది.
మీకు తెలుసో లేదో, ఒక కాశ్మీరి మరో కాశ్మీరితో ఫోన్లో మాట్లాడాలంటే రాష్ట్రం బయటకు వచ్చి మాట్లాడాలి, ఇంకమింగ్ ఉంటుంది కానీ ఔట్గోఇంగ్ ఉండదన్నమాట. ఇదా మన దేశంలో ఉన్న స్వాతంత్ర్యం, మనకొక న్యాయం వారికొక న్యాయమా?

(NDTV 24X7 లో బర్ఖా దత్ గారి కథనం విన్నాక అక్కడి పరిస్థితి తెలిసి నా మనస్సుకి ఎంతో బాధ కలిగింది, ఆ కార్యక్రమం యొక్క సారం, పైన ఇచ్చిన టపా. మీమీ దృష్టిలో ఈ సమస్యకు పరిష్కార మార్గాలు ఏంటో కామెంట్లుగా రాయండి) 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి