21, సెప్టెంబర్ 2010, మంగళవారం

జగన్ ఓదార్పు యాత్ర

ముందుగా ఓ పోలికతో నా విశ్లేషణని ప్రారంభిస్తాను.

ఒక తరగతి గదిలో విద్యార్ధులు, రెండు జట్లుగా విడిపోయి, గోలగోలగా తిట్టుకుంటున్నారు. ‘నువ్వెంతంటే నువ్వెంత?’ అనుకుంటున్నారు, అరుచుకుంటున్నారు. అందులో ఓ జట్టు... టీచర్‌నీ తమ గొడవలోకి లాగింది. ‘ఎదురు జట్టు లీడర్ ని చితక బాదుతానని’ టీచర్ తనకు చెప్పిందంటే, తనకు చెప్పిందనీ... ఈ జట్టులోని కొందరంటున్నారు. సాక్షాత్తూ టీచరే ‘తనకి చెప్పిందంటే తనకి చెప్పిందని’ మరికొందరంటున్నారు. అదేం లేదనీ, టీచర్ తమకే సపోర్ట్ అనీ రెండో జట్టు అంటున్నది.

ఏతావాతా.... తరగతి గది కాస్తా, చేపల మార్కెట్టయి కూర్చుంది.

అప్పుడు ఏం జరుగుతుంది?

టీచర్ గనక నికార్సైనదీ, నిజాయితీ గలదీ అయితే....

రెండు జట్లనీ దండించి, (అవసరమైతే నాలుగు పీకైనా సరే) తరగతి మొత్తాన్ని క్రమశిక్షణలో పెడుతుంది. ఎవరిది తప్పో, ఎంత తప్పో, ఎవరిది ఒప్పో విచారించి, మొత్తం గొడవనీ పరిష్కరిస్తుంది. అంతేనా!? తననీ వివాదంలోకి లాగినందుకు, వాళ్ళని ప్రత్యేకంగా విచారించి, మొత్తం విషయాన్ని స్పష్టపరుస్తుంది.

అలాగ్గాక... ఒకవేళ టీచర్‌కి గనుక, ఆ గొడవలో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు, ప్రమేయాలూ ఉంటే...?

అప్పుడేం జరుగుతుంది?

టీచర్ చూస్తూ కూర్చుంటుంది. అవసరమైనప్పుడు, అవసరమైన వాళ్ళని... లోతట్టునో, బాహాటంగానో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రోత్సహిస్తుంది.

ఈ పోలికని మన రాష్ట్ర కాంగ్రెస్‌‍కి అన్వయిస్తే.... సీనియర్లు, తెలంగాణా కాంగ్రెస్ వాదుల్లో కొందరు, వై.యస్. వ్యతిరేకులు గట్రా... అంతా కలిసి ఒక జట్టు, జగన్ వర్గం రెండో జట్టు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా... టీచర్ స్థానంలో ఉండి, ఏం చేస్తోంది? మొదటి తరహా టీచర్ అయి ఉంటే, నిజాయితీగా, ఈపాటికి తరగతిని(అంటే రాష్ట్ర కాంగ్రెస్ ని) క్రమశిక్షణలో పెట్టేది. రాష్ట్రంలో పార్టీ పలచన అవకుండా ఉండటం కోసమైనా చేసుండేది! అలాంటిదేం జరగక పోగా, రెండో తరహా టీచర్‌లాగే... తరగతిని చేపల మార్కెట్టులా ఎందుకు అనుమతిస్తోంది? అందునా అధిష్టానానికి అన్నీ తెలిసీ!

ఈ ప్రశ్నకి లోతుగా సమాధానం వెదకాల్సిందే!

జగన్ వ్యతిరేకులు.... ... మధు యాష్కీ, కాకా, వీ.హెచ్, కేకే, పురంధేశ్వరి, డీఎల్, జేసీ, సర్వేసత్యనారాయణ,... గట్రా నాయకులూ, నాయకురాండ్రు... ఒక్కొక్కరూ ఒకోసారి, హల్ చల్ (విడివిడిగా, గ్రూపులుగా) నిర్వహిస్తూనే ఉన్నారు.

"ఓదార్పు యాత్ర చేపట్ట వద్దని, అధినేత్రి సోనియా నాకు స్పష్టంగా చెప్పింది" అని ఒకరంటే...
"వై.యస్. డబ్బు సంపాదించుకుంటున్నాడని తెలిసినా ఊరుకున్నా! అతడు పార్టీకి చేసిన సేవలు చూసే రెండోసారీ ముఖ్యమంత్రిని చేశా"నన్నదని మరొకరన్నారని వార్తలు వచ్చాయి.

దాని మీదట జగన్ వర్గం నుండి బాజిరెడ్డిలు, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, అమరనాధ్ రెడ్డిలు, తరచుగా అంబటి రాంబాబులు, కొండా సురేఖలూ, మురళిలు "అధినేత్రి సోనియాని అంటారా?" అంటూ రెడ్ టేపిస్టిక్ ఒబీడియన్స్ చూపెట్టారు. డీఎల్ రవీంద్రారెడ్డి "దేవుడు విధించే ఏ శిక్షకైనా జగన్ అర్హుడే అని అధ్యక్షురాలన్నది" అంటూ ప్రెస్ మీటిచ్చాడని వార్తాపత్రికల కథనం. "ఆ విధంగా తెదేపా నేత చంద్రబాబు నాయుడికి అస్త్రాన్నిచ్చినట్లయ్యింది. అధ్యక్షురాలుకి స్వయంగా/బహిరంగ లేఖ రాస్తాం" అని జగన్ వర్గీయులన్నారు.

"పది జన్‌పథ్‌లో దోశ తిన్నా, ఇడ్లీ తిన్నా, అని చెప్పుకునే సీనియర్ ఒకరు, బయటికొచ్చి ప్రెస్ ఎదుట, అవాకులూ చవాకులూ చెబుతున్నాడు" అంటూ మరొకరు విరుచుకు పడ్డారు.

ఇన్ని జరుగుతున్నా... అధ్యక్షురాలి ప్రమేయం గురించి డీఎల్, కేకే, పురంధేశ్వరి వంటి దాస దాసీలు, ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నా... అధినేత్రి ఎందుకు కిమ్మనటం లేదు?

తరగతిలో టీచర్ గనక... గల్లంతు చేస్తున్న పిల్లల్ని ఉద్దేశించి "ఛస్! నోరు ముయ్యండి. బుద్ధిగా పనిచేసుకోండి" అని అందరికీ బుద్ధి గరిపినట్లుగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు పార్టీని ఎందుకు పద్దతిలో పెట్టుకోవటం లేదు?

మరోప్రక్క... బయ్యారం గనులని ఓ రోజు, సండూరు, సరస్వతి అని ఒకరోజు, ఎరువుల మిక్సర్ ప్లాంట్ అని ఒకరోజు, పదుల ఎకరాలలో విలాసవంతమైన నివాస భవనాలకి వందల సంఖ్యలో సెక్యూరిటీ గార్డులంటూ ఒకరోజు... విపరీతంగా అక్రమార్జన చేసారు వై.యస్., అతడి కుమారుడు జగన్ అంటూ, అతడి శతృ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, రోజుకో సంచలనం బయటికి తీస్తున్నాయి. బదులుగా జగన్ పత్రికా, ఎదురు దాడి చేస్తోంది!

అసలింతకీ ఏం జరుగుతోంది?

ఓ సారి, గత ఏడాది ఇవే రోజులు గుర్తుకు తెచ్చుకుంటే....

వై.యస్. ఆకస్మిక మరణం తర్వాత, నానా మెలికలు తిరిగిన, జగన్ శిబిరం Vs అధిష్టానాల మధ్య అంతర్లీన పోరు కు.. పర్యవసానాలే ఇప్పటి పరిస్థితులు.

నాలుగు గోడల మధ్య... అధిష్టానం జగన్ కి దాసోహం అంటే, బహిరంగంగా... జగన్ అధిష్టానానికి మాటలలో నాటకీయ విధేయతని, చేతలలో ఓదార్పు యాత్ర పేరిట తతంగాన్ని సా....గ తీస్తూ అవిధేయతను చూపిస్తున్నాడు. దానినే తనకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంగా... అధిష్టానం... వై.యస్. వ్యతిరేక వర్గీయులని, హాల్‌చల్‌లకి ఉపయోగించుకుంటోంది.

ఎందుకంటే...

ఇక్కడ మరో పోలిక చెబుతాను.

ఇద్దరు ప్రత్యర్ధులున్నారనుకొండి. ఇద్దరూ హోరాహోరీగా, ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. ఇద్దరి దగ్గరా తుపాకులున్నాయి. అయితే మొదటి వాడి దగ్గర నాలుగైదు తూటాలే ఉంటే, రెండోవాడి దగ్గర నాలుగొందల తూటాలున్నాయి. అప్పుడు మొదటి వాడేం చేస్తాడు?

అవగాహనా, అనుభవం లేనివాడైతే... బండగా పోరాడి, ఉన్న నాలుగు గుళ్ళు కూడా ఖర్చుపెట్టుకుని, ఆనక తానూ ఖర్చయిపోతాడు.

అదే అనుభవమూ, అవగాహనా ఉన్నవాడైతే? రెండో వాడి దగ్గర తన కన్నా ఎక్కువ గుళ్ళే ఉన్నా, తనకున్నంత అనుభవమూ అవగాహనా లేవని తెలిసిన వాడైతే...?

అప్పుడు తాత్కాలికంగా ప్రత్యర్దితో సంధి చేసుకుంటాడు. (గత ఏడాది అక్టోబరు మాసాంతంలో అచ్చంగా అధిష్టానం జగన్ తో నాలుగ్గోడల మధ్య మాట్లాడుకున్నట్లు!) కొంత కాలం ఓపికగా ఎదురు చూస్తాడు. ఏదో నెపాన... ఎదుటి వాడి దగ్గరున్న తుపాకీ తూటాలు వృధా అయ్యే విధంగా, ప్రణాళికలు వేసి అమలు చేస్తాడు. ఎదుటి వాడి దగ్గర తూటాలు ఎంతగా తగ్గితే, తమకంతగా రక్షణ, ప్రయోజనం ఉంటాయి.

సరిగ్గా ఇదే... జగన్ కీ, సోనియా+రామోజీరావులకీ మధ్య జరుగుతోంది.

వై.యస్. పదవిలో ఉండగా, అపారంగా ఆస్థులు కూడబెట్టాడు. గూఢచర్యపు వ్యవహారాలు నడిపేందుకు తగినంత అనుపానులు తెలుసుకుని, గారెల వంటా వండాడు. తమ అవసరాల కొద్దీ, తమ కారణాల రీత్యా కొంతా, తము దాన్ని మరో దృష్టితో చూసి కొంతా... నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియాలు... దీన్నంతా నడవనిచ్చారు.

ఆ వ్యవహారం తాలూకూ గుట్టుమట్లు+ఆర్దిక లావాదేవీలు, ఇప్పుడు జగన్ చేతిలో గుళ్ళయి కూర్చున్నాయి. కాబట్టి - జగన్ దగ్గరున్న గుళ్ళు ఖర్చయ్యే వరకూ ఇది ఇలా సా...గుతుందన్న మాట!

తండ్రి సంపాదించిన లక్ష(?) కోట్లలో ఓదార్పు యాత్రకెంత ఖర్చవుతుంది? మృతుల ఒకో కుటుంబాన్ని తలా లక్షపెట్టి ఓదార్చినా... 600 మందికి 6 కోట్లు. యాత్రల నిర్వహణకి ఖర్చయిందన్నా తిప్పికొడితే పదుల కోట్లే! కానీ ఎంఎల్ఏలనీ, ఎంపీలనీ వెంట నిలబెట్టుకోవాలన్నా... బయటి కొస్తున్న సరస్వతి, భారతి ల వంటి కంతలు పూడ్చుకోవాలన్నా... గనుల మీదో, ప్రాజెక్టుల మీదో ఐటీ దాడులని నియంత్రించుకోవాలన్నా... డబ్బు ధారాపాతంగా ఖర్చుపెట్టక తప్పదు. అధికారం ఉంటే ఇవన్నీ ఆదా అవుతాయి + అదనపు దోపిడీ చేసుకోవచ్చు!

ఎవరికైనా అది "నీవు నేర్పిన విద్యయే గదా నీరాజాక్ష" వంటిదే మరి!


ఈ గూఢచర్య క్రీడ ఎంత జటిలమైనదంటే... ఇందులో అవగాహన, అనుభవం ఉన్నవాడు... రెండోవాడు తన మీద జరుగుతున్న వ్యవహారంలో తనకి నష్టమేమిటో గ్రహించే లోగానే.... పరిస్థితిని తనకి అనుకూలంగా చక్కపెట్టేసుకుంటాడు.

అదే స్థితి అధిష్టానానిదీ, జగన్‌దీ!

కాకపోతే జగన్‌కి తండ్రి ఇచ్చిపోయిన అపార సంపదలో, వేల కోట్లలో... ప్రస్తుతం ఖర్చువుతున్న పదులు లేదా వందల కోట్లు ఎంత? ఇప్పుడు పెడుతున్న ఖర్చు పెద్దగా కంటికి ఆనక పోతుండవచ్చుగాక....!

అయితే, ఇది ఇలాగే కొనసా...గితే, ఏదో ఒక నాటికి భారం కాక తప్పదు.

ఈ లోపున అధిష్టానానికి మాత్రం... వై.యస్. వర్ధంతికి పార్టీ తరుపున లక్ష రూపాయలిచ్చి ఓదార్చ నున్నట్లుగా, మరికొన్ని మెట్లు క్రిందికి దిగి, బహిరంగంగా ‘వ్యక్తిగత ఇమేజ్‌కి డామేజ్ తెచ్చుకునే ప్రమాదం’ మరో ప్రక్క సిద్ధంగా ఉంది. కాకపోతే గ్రిప్ సంపాదించిన తరువాత మీడియా ఊదరతో అవన్నీ తుడిచేయొచ్చు అన్నది వాళ్ళ ధీమా!

ఇంతకీ జగన్ ఓదార్పు యాత్ర ఈటీవీ సీరియల్ లాగా సా...గుతోంది ఎందుకంటే......



ఓ ప్రక్క ఈ సాగుడు నడుస్తుండగా, మరో ప్రక్క... అసలు వై.యస్. ఏయే సాక్ష్యాలు సేకరించి పెట్టుకున్నాడు, తమ గుట్టుమట్ల గురించి ఏయే వివరాలు తీసి పెట్టుకున్నాడు, మొత్తంగా జగన్ దగ్గర ఉన్న తమ రహస్యాలు, వాటికి సంబంధించిన సమాచారాలు ఏమేమిటి? ఇవన్నీ కూపీల్లాగ బడతాయి.

అందుకే తడవకో వివాదం సృష్టించబడుతోంది. గతంలో, అంటే వై.యస్. బ్రతికి ఉన్నప్పుడు, బయటపెట్టిన అవకతవకలకే మరికొన్ని కొత్త వాటిని కలిపి... ఈనాడు, ఆంధ్రజ్యోతి (జగన్ భాషలో అయితే ఎల్లో పత్రికలు) వార్తలు వ్రాస్తున్నాయి.(ఆ విధంగా కాంగ్రెస్ అధిష్టానానికి చక్కగా సహకరిస్తున్నాయి. లేకపోతే మొత్తంగా కాంగ్రెస్‌నే దుయ్యబట్టి, పరిస్థితిని తెదేపాకు అనుకూలపరిచేవి.) దాన్నే ఉటంకిస్తూ సాక్షి "పాడిందే పాటరా పాచిపళ్ళ ఈనాడు.." అంటూ సెటైర్లు వేస్తోంది.

అయితే... పత్రికా యుద్ధం... తెలంగాణా సీనియర్లు+జూనియర్లు Vs. జగన్ వర్గం, ఇంకా వై.యస్.వ్యతిరేక కాంగ్రెస్ వర్గం Vs. జగన్ వర్గం, తెదేపా+ఈనాడు, ఆంధ్రజ్యోతి Vs. జగన్ వర్గీయుల మధ్య మాటల యుద్ధం పేరిట నడుస్తున సాగుడులో... కొందరు జగన్‌కి ‘శ్రేయోభిలాషులం’ అంటూ... సానుభూతి+మిత్రవచనాలు పలుకుతూ సమాచారం సేకరించే ప్రయత్నాలు చేస్తుంటారు.

మరి కొందరు అతణ్ణి రెచ్చగొడుతూ ప్రకటనలిస్తారు. పత్రికలు యధాశక్తి ప్రచారం గావిస్తాయి. వాటి గురించి చర్చిస్తూ జగన్‌తో చర్చలు సాగిస్తారు కొందరు. దానా దీనా... ఆ ప్రయత్నాల ద్వారా అసలతడి దగ్గర ఉన్నదేమిటో తెలుసుకుంటే... ఆపైన తదనుగుణంగా, పరిస్థితులని తమకి అనుకూలంగా మార్చుకోవచ్చు. అతడి దగ్గరున్న వాదనలకి ప్రతివాదనలు నిర్మించుకోవచ్చు.

సాగదీసి, కాలం గడిచిన తర్వాత కాబట్టి... ‘తండ్రి చనిపోయి, కెరీర్ కనబడక, నిరాశ చెంది, జగన్... ఫ్రస్టేషన్ కొద్దీ ఏవేవో బనాయిస్తున్నాడన’వచ్చు. అతడికి మతి స్థిమితం తప్పిందన్నా అనవచ్చు. మనిషిని ఎక్కువగా అసహనాన్ని గురి చేసేది ఈ మాటే. ఈ విధంగా పరిస్థితులని తమకి అనుకూలంగా మలుచుకోవచ్చు.

ఇదొక ప్రధాన ప్రయోజనం! మరో ప్రక్క... ఎటూ ‘ఖర్చులు పెంచటం, ఆదాయానికి గండి కొట్టటం’ వంటి వ్యూహాలతో జగన్ కోరలు పీకవచ్చు. (ఎటూ తండ్రి కట్టబెట్టిన అక్రమాస్తులతో వచ్చిన కోరలే కదా అవి?) కోరలు పీకిం తర్వాత పాముతో ఎన్ని ఆటలైనా ఆడించవచ్చు.

అందుకే... ఓదార్పు యాత్ర, అంతూ దరీ దొరకని ‘ఈటీవీ సీరియల్‌ ’ లాగా... అలా సాగిపోతూనే ఉంది!

ఇప్పుడు జగన్ ఎదుట రెండు అవకాశాలున్నాయి. ఈ పరిస్థితిని ఇలా సాగదీస్తూ అధిష్టానపు గుట్టు బయట పెట్టకుండానే, బయటపెడతానని బెదిరిస్తూ, తన కోర్కెలు నెరవేర్చుకోవటం లేదా అధిష్టానపు గుట్టు బయటపెట్టటం!

ఓసారి తెదేపా నేతలు ఆరోపించారు... "వై.యస్., గులాంనబీ ఆజాద్‌ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పుడు, అతడికి అందమైన అమ్మాయిలని ఎరగా వేసి, పరిస్థితులని తనకి సానుకూలం చేసుకున్నాడు" అని! ఆ మధ్య, రాజ్‌భవన్‌లో రసిక క్రీడలు సవరించి వీడియో సాక్ష్యాలతో సహా దొరికిపోయిన అప్పటి గవర్నర్, నారాయణ్‌దత్ తివారీ ఉదంతం రచ్చకెక్కింది. అదే మాదిరిగా... వై.యస్. ఎవరికి ఏ అవసరాలు(డబ్బు+గట్రా) తీర్చినప్పుడు, ఏ సాక్ష్యాలు సేకరించి ఉంచుకున్నాడో! అసలుకే ’సాక్షి’ అంటూ మీడియా సంస్థ పెట్టుకున్న, గారెల వంట మాస్టార్ మరి! అలాంటివి ఏవి బయట పెట్టినా... అది అధిష్టానానికి ప్రమాదమే.

అయితే... అది, అధిష్టానంతో పాటు, జగన్‌కూ ప్రమాదమే! ఎందుకంటే - అధిష్టానపు గుట్టు బయటపెట్టటం అంటే, అందులో తండ్రి నిర్వాకమూ ఉంది. కాబట్టి, అది ‘తండ్రి చేసింది చెప్పటం, తిన్నది కక్కటం’ అవుతుంది. కనుక, ఇది తక్షణ ప్రమాదం. ఇది ‘కన్ను’ పోగొట్టు కోవటం వంటిది.

లేదంటే... గండిపడిన చెఱువు లోంచి నీళ్ళు జారిపోయినట్లు, డబ్బు జారిపోతుంది. ఆనక అధిష్టానపు జుట్టు చేతిలో ఉన్నా, చెయ్యగలిగిందేమీ ఉండదు. ఇది దీర్ఘకాల ప్రమాదం. కనుక ఇది ‘కాలు’ పోగొట్టుకోవటం వంటిది. ఏదో ఒకటి కోల్పోక తప్పదు.

అదే విధంగా... అధిష్టానం ఎదుటా రెండు అవకాశాలున్నాయి. ఒకటి జగన్ మీద వేటు వేసేసి, ముఖాముఖి పోరుకి సిద్ధపడటం. అప్పుడతడు తమ గుట్లు బయట పెట్టక మానడు. అది ‘కన్ను’ పోగొట్టుకోవటం వంటిది.

లేదంటే... పరిస్థితిని సాగదీసి, క్రమంగా జగన్‌ని లొంగదీసుకోవటం లేదా నిర్వీర్యం చేయటం. ఈ లోపు తన వ్యక్తిగత ప్రతిష్ఠ మంట గలవటం, ఒకో మెట్టు క్రిందికి దిగి చులకన కావటం తప్పదు. ఇది ‘కాలు’ పోగొట్టుకోవటం వంటిది.

ఇద్దరిలో... ఎవరు, ఏ కాలు లేదా కన్ను ఎంచుకుంటారో... వేచి చూడాల్సిందే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి