5, అక్టోబర్ 2010, మంగళవారం

శ్రీశ్రీ -మహాప్రస్థానం


మహాప్రస్థానం


మరో ప్రపంచం ,
మరో ప్రపంచం ,
మరో ప్రపంచం పిలిచింది !
పదండి ముందుకు ,
పదండి త్రోసుకు !
పోదాం , పోదాం పైపైకి !

కదం తొక్కుతూ ,
పదం పాడుతూ,
హృదంత రాళం గర్జిస్తూ __
పదండి పోదాం
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం ?

దారి పొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు !
బాటలు నడచీ ,
పేటలు కడచీ ,
కోటలన్నిటినీ దాటండి !
నదీ నదాలూ ,
అడవులు  , కొండలు ,
ఎడారులు మన కడ్డంకి ?
పదండి ముందుకు !
పదండి త్రోసుకు !
పోదాం పోదాం పైపైకి !

ఎముకలు క్రుళ్లిన ,
వయస్సు మళ్లిన
సోమరులారా ! చావండి !
నెత్తురు మండే ,
శక్తులు నిండే
సైనికులారా ! రారండి !
“ హరోం ! హరోం హర !
హర ! హర ! హర! హర !
హరోం హరా ! “ అని కదలండి !

మరో ప్రపంచం ,
మహా ప్రపంచం
ధరిత్రి నిండా నిండింది !
పదండి ముందుకు ,
పదండి త్రోసుకు !
ప్రభంజనంవలె హొరెత్తండీ !
భావ వేగమున ప్రసరించండీ !
వర్షుకా భ్రముల ప్రళయగోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పదండి !
పదండి ,
పదండి ,
పదండి ముందుకు !
కనబడ లేదా మరో ప్రపంచపు
కణకణ మండే త్రేతాగ్ని ?

ఎగిరి , ఎగిరి , ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మేరువులు !
తిరిగి , తిరిగి , తిరిగి సముద్రాల్
జల ప్రళయ నాట్యం చేస్తున్నవి !
సలసల క్రాగే చమురా ? కాదిది ,
ఉష్ణరక్త కాసారం !
శివసముద్రమూ ,
నయాగరా వలె ,
ఉరకండీ ! ఉరకండీ ముందుకు !
పదండి ముందుకు ,
పదండి త్రోసుకు !
మరో ప్రపంచపు కంచు నగారా
విరామ మెరుగక మ్రోగింది !

త్రాచుల వలెనూ ,
రేచులవలెనూ ,
ధనంజయునిలా సాగండి !
కనబడ లేదా
మరో ప్రపంచపు
అగ్ని కిరీటపు ధగధగలు ,
ఎర్రబావుటా నిగనిగలు ,
హొమ జ్వాలాల భుగ భుగలు ?

video




జగన్నాథుని రథచక్రాలు -2




మీ బాధలు , మీ గాథలు
అవగాహన నాకవుతాయి
పతితులార !
బ్రష్టులార !
దగాపడిన తమ్ములార !
మీ కోసం కలం పట్టి ,
ఆకాసపు దారులంట
అడావుడిగా వెళిపోయే ,
అరుచుకొంటు వెళిపోయే
జగన్నాథుని రథచక్రాల్ ,
రథచక్ర ప్రళయ ఘోష
భూమార్గం పట్టిస్తాను !
భూకంపం పుట్టిస్తాను !
నట ధూర్ఝటి
నిటాలాక్షి పగిలిందట !
నిటాలాగ్ని రగిలిందట !
నిటాలాగ్ని !
నిటాలార్చి !
నిటాలాక్షి పటాలుమని
ప్రపంచాన్ని భయపెట్టింది !
అరె ఝూ ! ఝూ !
ఝటక్ , ఫటక్ ......

హింసనణచ
ధ్వంసరచన
ధ్వంసనణచ
హింసరచన !
విష వాయువు , మర ఫిరంగి ,
టార్పీడో , టోర్నాడో !
అది విలయం ,
అది సమరం ,
ఆటో ఇటో తెగిపోతుంది ?

సంరంభం ,
సంక్షోభం ,
సమ్మర్ధన , సంఘర్షణ !
హాలాహలం పొగ చూరింది !
కోలాహలం చెలరేగింది !
పతితులార ! బ్రష్టులార !
ఇది సవనం ,
ఇది సమరం !
ఈ యెరిగిన ఇనుప డేగ ,
ఈ పండిన మంట పంట ,
ద్రోహాలను తూలగొట్టి ,
దోషాలను తుడిచి పెట్టి ,
స్వాతంత్ర్యం ,
సమభావం ,
సౌభ్రాత్రం
సౌహార్ధం
పునాదులై ఇళ్లు లేచి ,
జనావళికి శుభం పూచి ____
శాంతి , శాంతి , శాంతి , శాంతి
జగమంతా జయిస్తుంది ,
ఈ స్వప్నం నిజమవుతుంది !
ఈ స్వర్గం ఋజు వవుతుంది !

పతితులార !
బ్రష్టులార ! 
బాధాసర్ప దష్టలార !
దగాపడిన తమ్ములార !
ఏడవకం డేడవకండి.
వచ్చేశాయ్ విచ్చేశాయ్
జగన్నాథ ,
జగన్నాథ ,
జగన్నాథ రథచక్రాల్ !
జగన్నాథుని రథచక్రాల్ !
రథచక్రాల్ ,
రథచక్రాల్ ,
రథచక్రాల్ , రథచక్రాల్ ,
రారండో ! రండో ! రండి !
ఈ లోకం మీదేనండి !
మీ రాజ్యం మీ రేలండి


శ్రీశ్రీ - మహాప్రస్థానం


video


జగన్నాథుని రథచక్రాలు-1


పతితులార !
బ్రష్టులార !
బాధాసర్ప దష్టలార !

బ్రదుకు కాలి ,
పనికి మాలి ,
శని దేవత రథచక్రపు
టిరుసులలో పడి నలిగిన
ధీనులార !
హీనులార !
కూడు లేని , గూడు లేని
పక్షులార ! భిక్షులార !
సఖుల వలన పరిచ్యుతులు ,
జనుల వలన తిరస్కృతులు ,
సంఘానికి బహిష్కృతులు
జితాసువులు ,

చ్యుతాశయులు .
హృతాశ్రయులు ,
హతాశులై
ఏడవకం డేడవకండి !
మీ రక్తం , కలగి కలగి
మీ నాడులు కదలి కదలి
మీ ప్రేవులు కనలి కనలి
ఏడవకం డేడవకండి.

ఓ వ్యథానివిష్తులార !
ఓ కథావశిష్టులార !
పతితులార !
బ్రష్టులార !
బాధాసర్ప దష్టులార !
ఏడవకం డేడవకండి.

వస్తున్నా యొస్తున్నాయి ...
జగన్నాథ ,
జగన్నాథ ,
జగన్నాథ రథచక్రాల్ !
జగన్నాథుని రథచక్రాల్ !
రథచక్రాల్
రథచక్రాల్ ,
రథచక్రాల్ , రథచక్రా
లొస్తున్నా యొస్తున్నాయ్ !

పతితులార !
బ్రష్టులార !
మొయిల్దారిని
బయల్దేరిన
రథచక్రాల్ , రథచక్రా
లొస్తున్నా యొస్తున్నాయ్ !

సింహాచలం కదిలింది !
హిమాలయం కరిగింది ,
వింధ్యాచలం పగిలింది ___
సింహాచలం
హిమాచలం ,

వింధ్యాచలం , సంధ్యాచలం .....
మహానగా లెగురుతున్నాయి !
మహారథం కదులుతున్నాది !
చూర్ణమాన
ఘూర్ణమాన
దీర్ఘమాన గిరిశిఖరాల్
గిరగిరగిర తిరుగుతున్నాయి !
పతితులార !
బ్రష్టులార !
బాధాసర్పదష్టలార !
రారండో ! రండో ! రండి !

ఊరవతల నీరింకిన
చెరువుపక్క , చెట్టు నీడ ____
గోనెలతో , కుండలతో ,
ఎటుచూస్తే అటు చీకటి ,
అటు ధుఃఖం , పటు నిరాశ ___
చెరసాలలు , ఉరికొయ్యలు ,
కాలువలో ఆత్మహత్య !


దగాపడిన తమ్ములారా !
మీ భాధలు నే నెరుగుదును ....
వడలో , కడు
జడిలో , పెను
చలిలో తెగనవసి కుములు
మీ బాధలు , మీ గాథలు
అవగాహన నాకవుతాయి

                                                                                   continued.....


ఒక క్షణంలో


ఒక క్షణంలో
మనసులో ఏదో స్మృతి
తటిన్మణి
మణీఘృణి
ఏదో మతి వికాసించి

క్షణంలో
అదే పరుగు
మరేడకో ....
ఆకులలో చీకటిలో
ఇరుల ఇరుకులలో
చినుకులలో
ఏడనో మరపులలో
మరుపుల మడతలలో
కనబడక ! 

ఒక క్షణంలో
పూర్వపు సుఖుని ముఖం
నవ్వులతో
రంగుల పువ్వులతో
కలకలమని  కళలు  కురిసి
హర్షంతో
ఆశావర్షంతో
కలవెనుక తెరముందర
కనిపించి ,

మరుక్షణం
విడివడి మరేడకో .........
వడి వడి మరేడకో :

ఒక క్షణంలో
సకల జగం
సరభసగమనంతో.....

పిమ్మట నిశ్శబ్ధం .

ఆ క్షణమందే
గుండెల కొండలలో
మ్రోగును మార్మ్రోగును
హుటా హుటి పరుగెత్తే
యుగాల రథనాదం .


 శ్రీశ్రీ -మహాప్రస్థానం
SriSri Kavitalu - Mahaaprasthaanam