5, అక్టోబర్ 2010, మంగళవారం

శ్రీ శ్రీ - మహాప్రస్థానం , ఖడ్గసృష్టి , సిప్రాలి, మరోప్రస్థానం

ఆశాదూతలు


స్వర్గాలు కరిగించి ,
స్వప్నాలు పగిలించి ,
రగిలించి రక్తాలు , రాజ్యాలు కదిపి ____
            ఒకడు తూరుపు దిక్కునకు !

పాపాలు పండించి ,
భావాలు మండించి ,
కొలిమి నిప్పులు రువ్వి , విలయలయ నవ్వి ___
               ఒకడు దక్షిణ దిక్కు !

ప్రాకారములు దాటి,
ఆకాశములు తాకి ,
లోకాలు ఘూకాల బాకాలతో నించి ,
                          ఒకడు దీచికి !

సింధూర భస్మాలు ,
మందార హారాలు ,
సాంధ్రచందన చర్చ సవరించి
                   ఒకడు పడమటికీ !

మానవకోటి సామ్రాజ్యదూతలు , కళా
యజ్ఞాశ్వముల్ గాలులై , తరగలై , తావులై ,
పుప్పోళ్లు , కుంకుమల్ , పొగలి సాగిరి !

శ్రీశ్రీ -మహాప్రస్థానం

దేశ చరిత్రలు -2


చిరకాలం జరిగిన మోసం ,
బలవంతుల దౌర్జన్యాలూ ,
ధనవంతుల పన్నాగాలు
ఇంకానా ! ఇకపై చెల్లవు .

ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ ,
ఒక జాతిని వేరొక జాతీ ,
పీడించే సాంఘిక ధర్మం
ఇంకానా ? ఇకపై సాగదు .

చీనాలో రిక్షావాలా ,
చెక్ దేశపు గని పనిమనిషీ ,
ఐర్లాండున ఓడ కళాసీ ,
అణగారిన ఆర్తులందరూ ____

హటెన్ టాట్ , జూలూ , నీగ్రో ,
ఖండాంతర నానా జాతులు
చారిత్రక యథార్థ తత్వం
చాటిస్తా రొక గొంతుకతో .

ఏ యుద్ధం ఎందుకు జరిగెనో ?
ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో ?
తారీఖులు , దస్తావేజులు
ఇవి కావోయి చరిత్రకర్థం .

ఈ రాణి ప్రేమ పురాణం ,
ఆ ముట్టడికైన ఖర్చులూ ,
మతలబులూ , కైఫీయతులూ
ఇవి కావొయ్ చరిత్రసారం

ఇతిహాసపు చీకటి కోణం
అట్టడుగున పడి కాన్పించని
కథలన్నీ కావాలిప్పుడు !
దాచేస్తే దాగని సత్యం .

నైలునది నాగరికతలో
సామాన్యుని జీవన మెట్టిది ?
తాజ్ మహల్ నిర్మాణానికి
రాల్లెత్తిన కూలీలెవ్వరు ?

సామ్రాజ్యపు దండయాత్రలో
సామాన్యుల సాహస మెట్టిది ?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ ,
అది మోసిన బోయీ లెవ్వరు ?

తక్షశిలా , పాటలీపుత్రం ,
మధ్యదరా సముద్రతీరం ,
హరప్పా , మొహెంజొదారో
క్రో – మాన్యాన్ గుహముఖాల్లో __

చారిత్రక విభాతసంధ్యల
మానవకథ వికాసమెట్టిది ?
ఏ దేశం ఏ కాలంలో
సాధించిన దే పరమార్థం ?

ఏ శిల్పం ? ఏ సాహిత్యం ?
ఏ శాస్త్రం ? ఏ గాంధర్వం ?
ఏ వెల్గుల కీ ప్రస్థానం ?
ఏ స్వప్నం ?  ఏ దిగ్విజయం ?


శ్రీశ్రీ - మహా ప్రస్థానం
Sreerangam Sreenivasa Rao - Mahaa Prasthaanam

దేశ చరిత్రలు -1


ఏ దేశ చరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం ?
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం .

నరజాతి చరిత్ర సమస్తం
పరస్పరాహరణోద్యోగం :
నరజాతి చరిత్ర సమస్తం
రణరక్త ప్రవాహసిక్తం.

భీభత్సరస ప్రధానం ,
పిశాచగణ సమవాకారం :
నరజాతి చరిత్ర సమస్తం
దరిద్రులను కాల్చుకుతినడం .

బలవంతులు దుర్భల జాతిని
బానిసలను కావించారు ;
నరహంతలు ధరాధిపతులై
చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి .

రణరంగం కానీ చోటు భూ
స్తలమంతా వెదకిన దొరకదు :
గతమంతా తడిసె రక్తమున ,
కాకుంటే కన్నీళ్లతో .

చల్లారిన సంసారాలూ ,
మరణించిన జన సందోహం ,
అసహాయుల హాహాకారం
చరిత్రలో మూలుగుతున్నవి .

వైషమ్యం , స్వార్థపరత్వం ,
కౌటిల్యం , ఈర్షలు , స్పర్థలు.
మాయాలతో మారుపేర్లతో
చరిత్రగతి నిరూపించినవి .

చెంగిజ్ ఖాన్ , తామర్లేనూ ,
నాదిర్షా , ఘజ్నీ , ఘోరీ ,
సికిందరో ఎవడైతేనేం ?
ఒక్కక్కుడూ మహాహంతకుడు .

వైకింగులు , శ్వేత హూణులూ ,
సింధియన్లూ , పారశీకులు ,
పిండారులు , థగ్గులు కట్టిరి
కాలానికి కత్తుల వంతెన .

అజ్ఞానపు టంధయుగంలో
ఆకలిలో , ఆవేశంలో ___
తెలియని ఏ తీవ్రశక్తులో
నడిపిస్తే నడిచి మనుష్యులు

అంతా తమ ప్రయోజకత్వం
తామే భువి కధినాధులమని,
స్థాపించిన సామ్రాజ్యాలూ ,
నిర్మించిన కృత్తిమ చట్టాల్

ఇతరేతర శక్తులు లేస్తే
పడిపోయెను పేక మేడలై :
పరస్పరం సంఘర్షించిన
శక్తులలో చరిత్ర పుట్టెను .

                                 
శ్రీశ్రీ -మహాప్రస్థానం
Mahaa kavi  Sri Sri - Mahaa Prasthaanam

జయభేరి



నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను :

నేను సైతం
విశ్వవృష్టికి
ఆశ్రువొక్కటి ధార పోశాను :

నేను సైతం
భువన ఘోషకు
వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను :
*  *  *  *  *
ఎండాకాలం మండినప్పుడు
గబ్బిలంవలె
క్రాగిపోలేదా :
వానాకాలం ముసరి రాగా
నిలువు నిలువున
నీరు కాలేదా ?
శీతకాలం కోత పెట్టగ
కొరడు కట్టీ ,
ఆకలేసి కేకలేశానే :

*  *  *  *  *
నే నొక్కణ్ణే
నిల్చిపోతే __
చండ్ర గాడ్పులు , వాన మబ్బులు ,
మంచు సోనలు
భూమి మీదా
భుగ్న మౌతాయి :
నింగి నుండి తొంగి చూసే
రంగు రంగుల చుక్కలన్నీ
రాలి , నెత్తురు క్రక్కుకుంటూ
పేలి పోతాయి :
పగళ్ళన్నీ పగిలిపోయీ ,
నిశీథాలూ విశీర్ణిల్లీ ,
మహా ప్రళయం జగం నిండా
ప్రగల్భిస్తుంది :

*  *  *  *  *
నే నొక్కణ్ణీ ధాత్రి నిండా
నిండిపోయీ
నా కుహూరుత శీకరాలే
లోకమంతా జల్లులాడే
ఆ ముహూర్తా లాగమిస్తాయి :

*  *  *  *  *
నేను సైతం
ప్రపంచాబ్జపు
తెల్లరేకై పల్లవిస్తాను :

నేను సైతం
విశ్వ వీణకు
తంత్రినై మూర్చనలు పోతాను :

నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను :

శ్రీశ్రీ -మహాప్రస్థానం  

అద్వైతం


ఆనందం ఆర్ణవమైతే ,
అనురాగం అంబరమైతే _

అనురాగపు టంచులు చూస్తాం ,
ఆనందపు లోతులు తీస్తాం .

నీ కంకణ నిక్వాణంలో,
నా జీవన నిర్వాణంలో ___
నీ మదిలో డోలలు తూగీ ,
నా హృదిలో జ్వాలలు రేగి ____
నీ తలపున రేకులు పూస్తే ,
నా వలపున బాకులు దూస్తే ____

మరణానికి ప్రాణం పోస్తాం ,
స్వర్గానికి నిచ్చెన వేస్తాం .

హసనానికి రాణివి నీవై ,
వ్యసనానికి బానిస నేనై _____
విషమించిన మదీయ ఖేదం ,
కుసుమించిన త్వదీయ మోదం ____
విషవాయువులై ప్రసరిస్తే ,
విరితేనియలై ప్రవహిస్తే ____
ప్రపంచమును పరిహసిస్తాం ,
భవిష్యమును పరిపాలిస్తాం
వాసంత సమీరం నీవై ,
హేమంత తుషారమ్ నేనై ____
నీ ఎగిరిన జీవవిహంగం
నా పగిలిన మరణమృదంగం _____
చిగురించిన తొటలలోనో
చితులుంచిన చోటులలోనో ____
వలయములై చలించినపుడే,
విలయములై జ్వలించినపుడే _____


కాలానికి కళ్లెం వేస్తాం ,
ప్రేమానికి గోళ్లెం తీస్తాం .
నీ మోవికి కావిని నేనై ,
నా భావికి దేవిని నీవై ____
నీ కంకణ నిక్వాణంలో,
నా జీవన నిర్వాణంలో ___
ఆనందం ఆర్ణవమైతే ,
అనురాగం అంబరమైతే ____
ప్రపంచమును పరిహసిస్తాం ,
భవిష్యమును పరిపాలిస్తామ్ .
శ్రీశ్రీ -మహాప్రస్థానం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి