5, అక్టోబర్ 2010, మంగళవారం

శ్రీశ్రీ - మహాప్రస్థానం

బాటసారి


కూటికోసం , కూలికోసం
పట్టణంలో బ్రతుకుదామని ____
తల్లిమాటలు చెవిని పెట్టక
బయలుదేరిన బాటసారికి,
మూడురోజులు ఒక్కతీరుగ
నడుస్తున్నా దిక్కు తెలియక ____

నడిసముద్రపు నావ రీతిగ
సంచరిస్తూ , సంచలిస్తూ ,
దిగులు పడుతూ , దీనుడౌతూ
తిరుగుతుంటే ____

చండ చడం , తీవ్ర తీవ్రం
జ్వరం కాస్తే ,
భయం వేస్తే ,
ప్రలాపిస్తే ____
మబ్బుపట్టీ , గాలికొట్టీ ,
వానవస్తే , వరదవస్తే ,
చిమ్మ చీకటి క్రమ్ముకొస్తే
దారితప్పిన బాటసారికి
ఎంత కష్టం !

కళ్ళు వాకిట నిలిపిచూచే
పల్లెటూళ్ళో తల్లి ఏమని
పలవరిస్తొందో ..... ?
చింతనిప్పులలాగు కన్నుల
చెరిగిపోసే మంటలెత్తగ ,
గుండుసూదులు గృచ్చినట్లే
శిరోవేదన అతిశయించగ,
రాత్రి , నల్లని రాతి పోలిక
గుండె మీదనే కూరుచుండగ ,
తల్లిపీల్చే కల్లదృశ్యం
కళ్ళ ముందట గంతులేయగ
చెవులుసోకని పిలుపులేవో
తలుచుకుంటూ, కలతకంటూ ____
తల్లడిల్లే ,
కెళ్లగిల్లే
పల్లటిల్లే బాటసారికి
ఎంత కష్టం !

అతని బ్రతుకున కదే ఆఖరు !
గ్రుడ్డి చీకటిలోనూ గూబలు
ఘూంకరించాయి ;
వానవెలసీ మబ్బులో
ఒక మెరుపు మెరిసింది ;
వేగు జామును తెలియజేస్తూ
కోడి కూసింది ;
విడిన మబ్బుల నడుమనుండీ
వేగు జుక్కా వెక్కిరించింది ;
బాటసారి కళేబరంతో
శీతవాయువు ఆడుకుంటోంది ;
పల్లెటూళ్ళో తల్లి కేదో
పాడుకలలో పేగు కదిలింది !

శ్రీశ్రీ -మహాప్రస్థానం

ప్రతిజ్ఞ


పొలాలనన్నీ ,
హలాల దున్నీ ,
ఇలాతలంలో హేమం పిండగ -----
జగానికంతా సౌఖ్యం నిండగ -----
విరామ మెరుగక పరిశ్రమించే ,బలం ధరిత్రికి బలికావించే ,
కర్షక వీరుల కాయం నిండా
కాలవ కట్టే ఘర్మ జలానికి ,
ఘర్మ జలానికి ,
ధర్మ జలానికి ,
ఘర్మ జలానికి ఖరీదు లేదోయ్ !నరాల బిగువూ ,
కరాల సత్తువ
వరాల వర్షం కురిపించాలని ,
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని ------
గనిలో , వనిలో , కార్ఖానాలో
పరిక్లమిస్తూ ,
పరిప్లవిస్తూ ,
ధనిక స్వామికి దాస్యం చేసే ,
యంత్రభూతముల కొరలు తోమే,
కార్మిక వీరుల కన్నుల నిండా
కణ కణ మండే ,
గలగల తొణకే
విలాపాగ్నులకు , విషాదాశ్రులకు
ఖరీదు కట్టే షరాబు లేడోయ్ !నిరపరాధులై దురదృష్టంచే
చెరసాలలో చిక్కే వాళ్ళు ______
లోహ రాక్షసుల పదఘట్టనచ్చే
కొనప్రాణంతో కనలేవాళ్లు _______
కష్టంచాలక కడుపుమంటలే
తెగించి సమ్మెలు కట్టేవాళ్లు ______
శ్రమ నిష్పలమై ,
జని నిష్టురమై ,
నూతిని గోతిని వెదికే వాళ్ళు ____
అనేకులింకా అభాగ్యులంతా ,
అనాథలంతా ,
అశాంతులంతా
ధీర్ఘశ్రుతిలో , తీవ్ర ధ్వనితో
విప్లవ శంఖం వినిపిస్తారోయ్ !కావున – లోకపుటన్యాయాలూ ,
కాల్చే ఆకలి , కూల్చే వేదన ,
దారిద్ర్యాలు , దౌర్జన్యాలూ
పరిష్కరించే , బహిష్కరించే
బాటలు తీస్తూ ,
పాటలు వ్రాస్తూ ,
నాలో కదలే నవ్య కవిత్వం
కార్మికలోకపు కళ్యాణానికి ,
శ్రామిక లోకపు సౌభాగ్యానికి,
సమర్పణంగా
సమర్చనంగా ______

త్రికాలాలలో ,
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది
లేనేలేదని
కష్టజీవులకు ,
కర్మ వీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ ,
స్వస్తివాక్యములు సంధానిస్తూ ,
స్వర్ణవాద్యములు సంరావిస్తూ _____
వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం
పునాదిగా ఇక జనించబోయే
భావివేదముల జీవనాదములు
జగత్తుకంతా చవులిస్తానోయ్ !కమ్మరి కొలిమీ , కుమ్మరి చక్రం ,
జాలరి పగ్గం ,
సాలెల మగ్గం ,
శరీర కష్టం స్పురింపజేసే
గొడ్డలి , రంపం , కొడవలి , నాగలి ,
సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు _______
నా వినుతించే ,
నా విరుతించే ,
నా వినిపించే నవీన గీతికి ,
నా విరచించే నవీనరీతికి ,
భావం !
భాగ్యం !
ప్రాణం !
ప్రణవం !

శ్రీశ్రీ – మహా ప్రస్థాన

వాడు


అందరం కలిసి చేసిన

ఈ అందమైన వస్తుసముదాయం అంతా

ఎక్కడో ఒక్కడే వచ్చి

ఎత్తుకు పోతూ వుంటే చూసి,

అన్యాయం , అన్యాయం “ అని మేమంటే ------

అనుభవించాలి మీ కర్మం “ అంటాడు .


పొద్దుపొడిచి పొద్దు గడిచేదాకా

ఎద్దుల్లాగా పనిచేసే మమ్మల్ని
మొద్దుల్నీ మొరటల్నీ చేసి
ముద్దకి కూడా దూరం చేశాడు .

ఘోరం ఇది , దారుణం ఇ “ దంటే ------

ఆచారం : అడుగు దాటరా “ దంటాడు .

భరించడం కష్టమైపోయి

పనిముట్లు మేము క్రిందను పడవైచి -------
చెయ్యలేం , చస్తున్నాం మేము ,

జీవనానికి ఆసరా చూపించ “ మంటే --------
నోరుమూసి , జోడుతీసి కొట్టి

దౌర్జన్యానికి దౌర్జన్యం మం “ దంటాడు


శ్రీశ్రీ - మహాప్రస్థానం

వ్యత్యాసం


అదృష్టవంతులు మీరు ,
వెలుగును ప్రేమిస్తారు,
ఇరులను ద్వేషిస్తారు .
మంచికీ చెడ్డకీ నడుమ
కంచుగోడలున్నాయి మీకు .
మంచి గదిలోనే
సంచరిస్తాయి మీ ఊహలు.
ఇదివరకే ఏర్పడిందా గది .
అందుకే వడ్డించిన విస్తరి మీ జీవితం .
నిశ్చల నిశ్చితాలు మీవి .
మంచిని గురించి,
మర్యాద ,మప్పితం గురించి,
నడతా , నాణ్యం, విలువల విషయం
నిశ్చల నిశ్చితాలు మీవి .
మీ కన్నుల చూపులు సరళ రేఖలో !
రేఖ చెదిరితే గొల్లుమని పోతారు .
రేఖ కవతలి వారంతా నేరగాళ్ళు .
రేఖను రక్షించడానికే
న్యాయస్థానాలు , రక్షకభట వర్గాలు ,
చెరసాలలు , ఉరికొయ్యలు ,
రేఖను కాపాడక తీరదు .

అభాగ్యులం మేము ,
సరిహద్దులు దొరకని
సంధ్యలలో మా సంచారం .
అన్నీ సమస్యలే సందేహాలే మాకు .
వెలుగులేని చీకట్లే ,
ఇరులలోని మిణుగురులే చూస్తాం .
నూరు దోషాలలోని ఒక సుగుణం ,
నూరు పుణ్యాలలోని ఒక ఘోరం !
వ్యత్యాసాలూ , వ్యాఘాతాలే
అడుగడుగునా మాకు .
మా వంట మే మే వండుకోవాలి .
ఒక్కొక్కమారు విస్తరే దొరకదు ,
జీవితపు సన్నని సందులకే
ఆకర్షణ మాకు .
మా దృష్టిది వర్తుల మార్గం
ఆద్యంత రహితం ,
సంద్యా జీవులం , సందేహాల భావులం
ప్రశ్నలే , ప్రశ్నలే .
జవాబులు సంతృప్తిపరచవు .
మాకు గోడలు లేవు .
గోడలను పగులగొట్టడమే మా పని .
అలజడి మా జీవితం ,
ఆందోళన మా ఊపిరి .
తిరుగుబాటు మా వేదాంతం .
ముళ్లూ , రాళ్లూ , అవాంతరాలెన్ని ఉన్నా
ముందు దారి మాది
ఉన్నచోటు చాలును మీకు .
ఇంకా వెనక్కి పోతామంటారు కూడా
మీలో కొందరు .
ముందుకు పోతాం మేము .
ప్రపంచం మా వెంట వస్తుంది .
తృప్తిగా చచ్చిపోతారు మీరు .
ప్రపంచం మిమ్మల్ని మరిచి పోతుంది .
అబిప్రాయాల కోసం
భాధలు లక్ష్య పెట్టని వాళ్లు
మా లోకి వస్తారు .
అబిప్రాయాలు మార్చుకొని
సుఖాలు కామించే భళ్ళు
మీలోకి పోతారు .
శ్రీశ్రీ - మహాప్రస్థానం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి