2, ఆగస్టు 2011, మంగళవారం

సినిమానే సర్వస్వమా?


ఆలోచించగా, ఈమధ్య కాలంలో అంతా సినిమామయంగానే కనబడ్తోంది నాకు. ఏ టీవీ ఛానెల్ను తీసుకున్నా
నూటికి తొంభైశాతం సినిమా బేస్డ్ ప్రోగ్రాములే. ప్రాయోజిత కార్యక్రమాలు (sponsored programs)తీసుకోండి. నూటికి నూరుశాతం సినిమాలపై ఆధారపడినవే. రియాలిటీ షోలు అనబడే emotional humbug కార్యక్రమాల్లో కూడా తొంభైశాతం సినిమా బేస్డ్. వ్యక్తిగతమైన ప్రతిభ యొక్క వికాసానికి ఇవి ఏమాత్రం దోహదం చేస్తాయన్నది ఓ పెద్ద అనుమానమే!


ఇవి కాక సినీ అవార్డుల ఫంక్షన్ల లైవ్ ప్రసారాలు వస్తున్నాయి. ఆపైన రిటైర్మెంట్ దగ్గర పడ్తోన్న హీరోలు తమ కుమారుల్ని తారాపధంలోకి ప్రవేశపెట్టేందుకు నిర్వహించే "లాంచింగ్ ప్రోగ్రాములు" అడపదడపా వస్తూనే ఉంటాయి. ఇంటర్వ్యూలు, స్పెషల్ కవరేజులు, ప్రమోషనల్ యాడ్స్ వగైరా వగైరాలు కూడా వస్తుంటాయి. వెరసి "సర్వం శివమయం" అన్నట్టుగా వినోదమంటే సినిమాయే అన్నట్టు ప్రచారం జరిగిపోతోంది.

ఈ సినిమా మాయ పండుగల్ని కూడా వదలదు. భక్తితో ఆచరించుకోవాల్సిన పండుగపూట ఇంటిల్లిపాదీ హింసానందంలో మునిగిపోవాల్సిందే. "ఒక్కడు" లేక "ఆ నలుగురు"తో సర్దుకుపోవాల్సిందే.

ఇంతకీ ఈ సినిమా మానియా మనకు ఇస్తున్నటువంటి అదనపు మౌల్యాధారిత ప్రయోజనం (value-added usage) ఏమైనా ఉందా అని చూస్తే నా వరకూ సున్నా అనే అనిపిస్తుంది. 

సినిమా అంటే కొన్ని వందలమంది కష్టఫలితమే. ఇందులో అనుమానం లేదు. కానీ అంత డబ్బు ఖర్చుపెట్టి, అంతమంది శ్రమదానంతో సాధిస్తున్నదేమిటి? నా పరిధిలో చూస్తే చిల్లర వినోదం, జుగుప్సాకరమైన బూతు విన్యాసాలు, మితిమీరిన హింస, నిరుపయోగమైన సెంటిమెంట్ల జోరు తప్ప వ్యక్తిగత వికాసానికి తోడుపడే ఒక్క అంశం కూడా ఇప్పటి సినిమాల్లో కనబడడంలేదు.
**********
Slumdog Millionaire సినిమా చర్చల దుమారాన్ని రేపింది. ఈమధ్య కాలంలో ఏ తెలుగు సినిమా కూడా ఇలాంటి చర్చలను లేవదీయలేదు. అద్భుతమైన గ్రాస్ కలెక్షన్స్ తో ఆడుతున్నట్టుగానో, మంచి ఓపెనింగ్ టాక్ వచ్చినట్టుగానో పత్రికల్లో రాసుకోవడమే తప్ప తెలుగు సినిమాలు మెదడుకు మేత వేసిన సందర్భాలు చాలా తక్కువ. 

నా వరకూ, గూడవల్లి రామబ్రహ్మం గారి "మాలపిల్ల", అక్కినేని నాగేశ్వర రావు నిర్మాతగా వచ్చిన "సుడిగుండాలు", సి.హెచ్.ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన "అంకురం" మెయిన్ స్ట్రీమ్ లో వచ్చిన మంచి చిత్రాలు. ఇవి నిజంగా మన మెదడుకు పని కల్పించే చిత్రాలే. ఈమధ్యలో సమకాలీన సమస్యల్ని ప్రతిబింబించే సినిమాలు వచ్చి ఉండవచ్చు. కానీ అవేవీ కమర్షియల్ చట్రంనుంచి బైటపడలేదు.

రౌడీయిజం గురించి చూపించే సినిమాలు కూడ సమకాలీన సమస్యల్నే ప్రతిబింబిస్తాయి. కానీ రౌడీయిజంను గ్లోరిఫై చేయడం ద్వారా సమస్యల్ని పెంచుతున్నాయి. అలాగే టీనేజ్ ప్రేమచిత్రాలు కూడా. విజయవాడలో ఓ అమ్మాయిని కిరాతకంగా హత్య చేసిన యువకుడు ఆ అమ్మాయి దేహం పై "చిరుత" అని రాయడం ఒక ఉదాహరణ. నిత్యకృత్యమైపోయిన యాసిడ్ దాడుల్లో ముప్పాతిక భాగం సినిమా ప్రేరితాలే కదా!

ఐతే సినిమాల వల్ల (ముఖ్యంగా గేయ సాహిత్యం వల్ల) సమాజంలో కొన్ని మంచి మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఓ ఇంటర్నెట్ డిస్కషన్ ఫోరమ్ లో చదివాను ఘంటసాల పాడిన "కల కానిది విలువైనది" అలాగే కిషోర్ కుమార్ పాడిన "సంఝౌతా గమోంసే కర్ లో" పాటలు అప్పటి యువతరంలో ఆత్మహత్యా ధోరణిని తగ్గించగలిగాయట. అలానే 1970ల్లో వచ్చిన "కోరికలే గుర్రాలైతే", "మరో చరిత్రలు" కూడా కొద్దిపాటి మంచి ప్రభావాన్ని చూపగలిగాయి. విశ్వనాథ్ తీసిన "శంకరాభరణం", "సాగరసంగమం" సంగీత, నృత్యాల పట్ల ప్రజల్లో అభిరుచిని పెంచగలిగాయి. కానీ ఈ ప్రభావాల పరిధి చాలా తక్కువ.
**********
సమాజంపై నిజమైన ప్రభావం చూపగలిగిన సినిమాలు తెలుగులో చాలా తక్కువ. ప్రేక్షకులు కోరినదని, ట్రెండ్ సెట్టింగ్ , కీర్తి కండూతి , డబ్బులు సంపాదన వంటి విషవలయాలలోనే మన సినిమాలు తిరుగుతున్నాయి.

బాపు, విశ్వనాథ్, బాలచందర్ వంటి సీరియస్ దర్శకుల ఒరవడిని కొనసాగించేవాళ్ళు కనుచూపు మేరలో ఎవరూ కనబడడంలేదనేది నావంటి వారి ఆవేదన.

నాయక, నాయికల భాష మారిపోయింది. వేషభూషలూ మారిపోయాయి. ఎంత రోతగా ఉంటే అంత అప్ టు డేట్ అన్న ఫీలింగ్ పెరిగిపోయింది. మర్యాదలు మాయమైపోయాయి. ఒరే, ఒసే అని పిలుచుకునే విధానం అమలులోకి వచ్చేసింది. ప్రేమ కోసమై తల్లిదండ్రుల్ని మోసం చేయడమన్నది, అబద్ధాలు ఆడడమన్నది హీరోయిజమైపోయింది. ఆ అబద్ధాల్ని నిలుపుకోవడానికి ఎంతటి అఘాయిత్యానికైనా తెగబడడమన్నది రొటీన్ ఐపోయింది.


ఇప్పటి వెకిలి పాటలకు (మరీ ముఖ్యంగా డ్యూయెట్లకు)అనుగుణంగా టీవీల్లో వచ్చే పిల్లల డాన్స్ ప్రోగ్రాముల్లో చిన్న చిన్న పిల్లలు ఆ కవాతులు చేస్తుంటే చప్పట్లు కొట్టే వాళ్ళని, ముఖ్యంగా పిల్లల్ని అక్కడిదాకా లాక్కువచ్చిన తల్లిదండ్రుల్నీ ఛీకొట్టాలనిపిస్తుంది.

ఇదేనా మనం మన భావితరాలకు చేస్తున్న వాల్యూ అడిషన్? ఈరోజు టీవీలో గెంతులేసిన పిల్లలే యాసిడ్ పోయరని, ప్రేమ పేరుతో జీవితాల్నే అంతం చేసుకోరని గ్యారంటీ ఆ తల్లిదండ్రుల్లో ఉందనే అనుకోవాలా? సినిమాల్లోని హీరో హీరోయిన్లకు మల్లేనే వీళ్ళు అబద్ధాలు చెప్పి మోసగించడమే మన ఆశయమా?

స్లమ్ డాగ్ మిలియనీర్ వంటి సినిమాలు భారతీయుల్ని వెకిలిగా చూపించాయి అన్నది వ్యర్ధమైన వాదన అనే అనిపిస్తోంది. మన హీరో హీరోయిన్లు చేస్తున్న వెకిలి చేష్టలే "కళ"గా ప్రచారం పొంది డబ్బులు రాలుస్తున్నపుడు మన దేశంలోని దరిద్ర్యం కూడా కళనే. కళాకారులకు ఎల్లల్లేవు కదా! అందువల్ల హాలీవుడ్ వాళ్ళు కూడ మన దారిద్ర్యాన్ని "కళ"గా చూపించి సొమ్ము చేసుకోవచ్చు. వాటికి అవార్డులు రావడమన్నది ఒక అదనపు మెరుపు మాత్రమే.

వాదాల్ని లేవదీసే ఉద్దేశ్యంతో కాక ఒక నా అభిప్రాయాల్ని వినిపించేందుకే ఈ ఆర్టికల్ ను రాసాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి