13, డిసెంబర్ 2010, సోమవారం

మేడిపండు చూడ మేలిమై ఉండు 
పొట్ట విప్పిచూడ పురుగులుండు అన్నట్లుగా… 
అమెరికాస్వామ్య భావన చెవులకు వినసొంపు 
పాలకుల చేతలు చూడ ఒట్టి నియంతృత్వపు కంపు 
వికీలీక్స్‌ వెబ్‌ నిర్వాహకుడు జూలియన్‌ అసాంజేను ఎట్టకేలకు సామ్రాజ్యవాదులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను లండన్‌ పోలీసులు మంగళవారంనాడే అరెస్టు చేసినట్లు సమాచారం. ఆయనే లొంగిపోయినట్లు కొన్ని వార్తల సారాంశం. అమెరికా రహస్యాల్ని పత్రాల సహా బట్టబయలు చేయగానే ఆ దేశ పాలకులు మున్నెన్నడూ లేనంతగా గడబిడకు గురయ్యారు. అప్పటి నుంచే అసాంజేను ఈ లోకం నుంచి పంపించేందుకు చీకటి ప్రయత్నాలూ చేసినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. అసాంజేను పట్టి మట్టుబెట్టాలని తన అనుంగు దేశాలకు అనధికారికంగా ఆదేశాల్నీ జారీ చేశారు. అమెరికా ఆదేశాలకు అనుగుణంగానే బ్రిటీష్‌ ప్రభుత్వం ఆసాంజేను అదుపులోకి తీసుకుంది. అయితే ఆయన అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఫిర్యాదు కారణంగానే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పటమే అమెరికా తరహా ప్రజాస్వామ్యం తీరుతెన్నులను పట్టిచూపుతోంది.
అసాంజే తన వికీలీక్స్‌ వెబ్‌సైట్‌లో ఏమయినా తప్పుడు పత్రాలు పెట్టిఉంటే వాటికి వివరణ ఇవ్వొచ్చు. వాస్తవ పత్రాలను లోకానికి చూపి అసాంజే తప్పును ఎరుకపరచవచ్చు. అయితే అదేమీ చేయకుండా ప్రజాస్వామ్యానికే పెద్దన్ననని నిత్యం చెప్పుకునే అమెరికా పాలకులు ఆసాంజేనే శాశ్వతంగా తొలగించే పనికి పూనుకోవటంక్షంతవ్యంకాని నేరం.  ఇది మీడియా స్వేచ్ఛపై కత్తికట్టటమే. మీడియాను బహిరంగంగా ఉరితీయటమే.
అమెరికాకు ఇది ఎంత మాత్రమూ తగదు.
జూలియన్‌ అసాంజేను వెంటనే విడుదల చేయాలి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి