18, డిసెంబర్ 2010, శనివారం

ఆరేళ్లలో అందనంత ఎత్తుకు జగన్

2004లో...
జగన్ వార్షిక ఆదాయం రూ.10 లక్షలు
స్థిరాస్తుల విలువ రూ.36 లక్షలు
వివిధ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు రూ. 19 కోట్లు
2006లో...
జగన్ ఆదాయం రూ.40 కోట్లు
2010లో...
జగన్ కట్టిన అడ్వాన్స్ ట్యాక్స్: రూ.84 కోట్లు

2003-04 సంవత్సరంలో వైఎస్ జగన్ చెల్లించిన ఆదాయపు పన్ను కేవలం రూ.60 వేలు. 2009-10 సంవత్సరంలో ఆయన చెల్లించిన అడ్వాన్స్ ట్యాక్స్ ఏకంగా రూ.84 కోట్లు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయన ఎలా ఎదిగిపోయారో, ఎంతగా చెలరేగిపోయారో చెప్పడానికి ఇంతకంటే మరో నిదర్శనం అవసరం లేదు. అధికారంలోకి రాక మునుపు ఇంటిని సైతం అమ్మకానికి పెట్టాల్సినంత ఆర్థిక దుస్థితి వైఎస్‌ది. పీఠం ఎక్కిన తర్వాత ఆయన ఓ మహా ప్రబల ధన శక్తిగా ఎదిగిపోయారు. అంతేకాదు... సీఎం అయిన తొలినాళ్ల నుంచే తన అధికార సోపానాల మీదుగా సుపుత్రుడి ఎదుగుదలకు యథా శక్తి శ్రమించారు. సండూర్ పవర్ అనే అతి చిన్న కంపెనీతో ప్రారంభమైన జగన్ వ్యాపారం... వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక శాఖోపశాఖలుగా విస్తరించింది. కార్మెల్ ఆసియా, జనని ఇన్‌ఫ్రా, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, క్లాసిక్ రియాల్టీ, షలోమ్ ఇన్‌ఫ్రా, ఇన్‌స్పైర్ హోటల్స్, సిలికాన్ బిల్డర్స్ ఇలా అనేక కంపెనీలు పుట్టుకొచ్చాయి.
ఈ కంపెనీల పుట్టు పూర్వోత్తరాలపై 'ఆంధ్రజ్యోతి' పక్కా ఆధారాలతో సహా అనేక ప్రత్యేక కథనాలు ప్రచురించింది. అప్పట్లో వైఎస్ చెప్పిందే వేదంగా భావించిన కాంగ్రెస్ నేతలంతా ఈ కథనాలను దునుమాడిన వారే. ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతలు జగన్ కంపెనీల పుట్టుక వెనుక రహస్యం తమకు తెలుసంటూ విమర్శిస్తున్నారు. 'అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి?' అంటూ ప్రశ్నిస్తున్నారు.

సండూర్ పవర్‌తో మొదలుపెట్టి... దానికి అనుబంధంగా కొన్ని కంపెనీలు, మరిన్ని పిల్ల కంపెనీలను పుట్టించి, వాణిజ్య నిపుణులకు సైతం అంతుపట్టని రీతిలో జగతి పబ్లికేషన్స్‌లోకి పెట్టుబడులు ప్రవహింప చేశారు. ఈ క్రమంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితులను అడ్డగోలుగా ఉల్లంఘించి... జగతి పబ్లికేషన్స్‌కు మారిషస్ నుంచి అక్రమమార్గంలో డబ్బులు తెప్పించారు. 'మా కంపెనీలో విదేశీ పెట్టుబడులు లేవు' అంటూ ఆర్ఎన్ఐకి తప్పుడు సమాచారం అందించారు. సెబీ నిషేధించిన కంపెనీలకూ జగతి పబ్లికేషన్స్ షేర్లు కేటాయించడం మరో అక్రమార్కం. అంతేకాదు... చరిత్ర మొత్తం అనుమానాస్పదమే అయిన 12 పశ్చిమ బెంగాల్ కంపెనీలు కూడా జగతిలో పెట్టుబడులు పెట్టాయి. అందులోనూ, రూ.9.31 లక్షల సంచిత నష్టం మూటగట్టుకుని, 2007-08లో కేవలం 77,855 రూపాయల లాభం ఆర్జించిన కంపెనీలు... జగతిలో ఏకంగా 41.57 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు చూపించారు. ఇదంతా 'జగన్ మాయ'లో భాగమే! ఇలాంటి అక్రమాల పుత్రికకు ముఖ్యమంత్రి వైఎస్ 'అధికారికంగా' ఆర్థిక పరిపుష్టి కలిగించారు. నిబంధనలు సడలించి మరీ కోట్ల విలువైన ప్రభుత్వ ప్రకటనలను గుప్పించారు.

అంతా అడ్డగోలు...
వైఎస్ తనయుడు జగన్ ఏర్పాటు చేసిన భారతి సిమెంట్స్ (అప్పట్లో రఘురాం సిమెంట్స్) ఆవిర్భావమే ఒక 'అద్భుతం!' ఈ సంస్థలో ప్రమోటర్ల (జగన్ కుటుంబం) వాటా ఒక్క ఏడాదిలోనే రూ.45 కోట్ల నుంచి రూ.6500 కోట్లకు పెరిగింది. ఇది భారత సిమెంట్ రంగం చరిత్రలోనే ఒక రికార్డు. ఇక జగన్ కంపెనీలకు 'తల్లి లాంటిదైన' సండూర్ పవర్‌ది మరో చరిత్ర! 22 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న ఈ విద్యుత్తు ప్లాంటు విలువ రూ.1300 కోట్లుగా చూపారు. పది రూపాయల షేరును రూ.675కు విక్రయించారు. అందులో 21 లక్షల షేర్లను నిమ్మగడ్డ ప్రసాద్ (మ్యాటిక్స్) కొన్నారు. మరో 82 లక్షల షేర్లను బినామీ కంపెనీలకు విక్రయించి రూ.702 కోట్లు అక్రమంగా సమీకరించారు.
ఆ సొమ్ముతోనే జగన్ బంతాట ఆడటం మొదలుపెట్టారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించడం, అలా పెట్టుబడులు పెట్టిన వారికి ప్రభుత్వపరంగా లబ్ధి చేకూర్చడం వైఎస్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి