13, డిసెంబర్ 2010, సోమవారం

మనోహరుకు ఉరిశిక్ష వద్దన్న ఉన్నత న్యాయస్థానం


అన్నట్లు మనోహర్‌ గుర్తున్నాడా? అదేనండి, ఒంగోలు మనోహర్‌ (వీడు మా ఊరి వాడయినందుకు సిగ్గు పడుతూ).
అది 2004 జూన్‌ 20. ఉదయం వేళ.
టీవీల్లో ప్రసారమయిన ఆ వార్తతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
యువతులు, ప్రత్యేకించి చదువుకుంటున్నవారు వెక్కివెక్కి ఏడ్చారు.
నిమిషానికి 72సార్లు లబ్‌డబ్‌లాడాల్సిన అమ్మాయిలున్న తల్లిదండ్రుల గుండెల వేగం ఎన్నోరెట్లు పెరిగి డబడబలాడాయి.
దేశం పాడయిపోతోందని నిన్నటి తరం వాళ్లంతా గుండెలు బాదుకున్నారు.
ఏదో ఒకటి చేయాలని అభ్యుదయవాదులు ఎవరికివారే ఆలోచనలు చేశారు.
ప్రభుత్వం తనదైన పాత పద్దతిలోనే అమ్మాయిలపై జరిగే అకృత్యాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని హామీలతో సరిపెట్టింది.
ఆనాడు, ఆ సమయంలో అసలేమి జరిగింతో గుర్తుచేసుకుందాం.
విజయవాడలోని శారదా పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ కళాశాల. అది ఎంసిఏ రెండో ఏడాది తరగతి గది. ఆ రోజు తరగతులు ప్రారంభమయిన కాసేపటికే వై మనోహర్‌ వచ్చి తన బెంచీలో కూర్చున్నాడు. అతని ముందు వరుసలో ఎప్పటి మాదిరిగానే శ్రీలక్ష్మి కూర్చుని తదేక దృష్టితో అధ్యాపకుడు చెప్పే పాఠం వింటోంది.
ఆ సమయంలో ఒక్కసారిగా మనోహర్‌ తన వీపు భాగంలో దాచి ఉంచిన పొడవాటి (వెదురు) కత్తిని బయటకు లాగుతూనే ఎదురుగా ఉన్న శ్రీలక్ష్మి మెడపై నరికాడు. వెంటవెంటనే మరో రెండుసార్లు తలపైనా, మెడపైనా నరికాడు. శ్రీలక్ష్మి అక్కడికక్కడే కూలిపోయింది. మరుక్షణం ప్రాణం విడిచింది. మనోహర్‌ నెమ్మదిగా నడుచుకుంటూ తరగతి గదినీ, కళాశాలనూ వీడి వెళ్లిపోయాడు.
భయం… భయం. అందరూ భయం గుప్పిట్లో చిక్కి అయోమయంలో పడ్డారు.
తరగతి గది నుంచి అధ్యాపకుడు సహా విద్యార్థులు పారిపోయారు. విద్యార్థినుల హాహాకారాలతో కళాశాల దద్దరిల్లింది. ఇంకేముంది… పోలీసుల బూట్ల చప్పుడు. మీడియా గొట్టాల హడావుడి సరేసరి. టీవీల్లో స్క్రోలింగులు, వార్తలు, లైవులు, అభిప్రాయాలు, ఖండనలు, ఉద్రేకాలు.
మనోహర్‌ తొలుత తన బంధువుల ఇంటికి వెళ్లాడు. బట్టలు మార్చుకుని చెన్నయి చెక్కేశాడు.
రెండో రోజు నుంచీ రాష్ట్రవ్యాపితంగా విద్యార్థి, మహిళా సంఘాల ఆందోళన ప్రారంభమయింది. పోలీసుల వేట ఎందుకూ కొరగాకుండా పోయింది.
మనోహర్‌ను పట్టుకుని తామే చంపేస్తామంటూ కొందరు ఆవేశపరులు ప్రతినబూనారు.
పది రోజులు గడచింది.
సమయం అర్ధరాత్రి దాటింది. వీధుల్లో మనుషుల సంచారం పూర్తిగా ఆగిపోయింది. అప్పుడొకటి అప్పుడొకటి వాహనాలు మాత్రం అటూ తిగుగుతున్నాయి. పోలీసులు తమ రోజూవారీ విధుల్లో భాగంగా చెన్నయి వీధుల్లో గస్తీ తిరుగుతుండగా అనుమానాస్పదంగా ఓ యువకుడు కన్పించటం, వాడిని స్టేషనుకు తరలించటం వెంటవెంటనే జరిగాయి. అక్కడ వాడికి పోలీసు ఆతిథ్యం లభించగానే తానెవరో అంతా వివరించాడా యువకుడు. తాను విజయవాడలో శ్రీలక్ష్మిని హత్యచేసిన మనోహర్‌నని నింపాదిగా చెప్పుకున్నాడు.
అదీ అప్పటి విషాధ సంఘటన సంక్షిప్త సమాచారం.
మనోహర్‌కు స్థానిక న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. ఎందరెందరో సంతోషం ప్రకటించారు ఒక్క నక్సలైట్లు, వారి సానుభూతి పరులు తప్ప.
అయితే ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. అక్కడ మనోహరుకు మరణశిక్ష తప్పింది. జీవిత ఖైదు ఖాయమయింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానినికెక్కింది.
07 డిసెంబరు 2010న సుప్రీం కూడా మనోహరుకు జీవితఖైదు చాలంటూ హైకోర్టు తీర్పునే ఖరారు చేసేసింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి