26, జూన్ 2011, ఆదివారం

అన్నమో


లేక..,, ఏసూ, అల్లా, యాహ్వే,గాడ్...ఎవరైనా...

ప్రపంచవ్యాప్తంగా ఆకలి బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. 2015 నాటికి ఆకలిబారిన పడుతున్న వారి సంఖ్యని సగానికి తగ్గించాలని 1996 ప్రపంచ ఆహార శిఖరాగ్ర సమావేశం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, ఐక్య రాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఫూడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ - ఎఫ్.ఎ.ఒ) ప్రపంచంలో ఆకలి బారిన పడుతున్న వారి సంఖ్య 2007లో 92.3 కోట్లు నుండి 2008లో 96.30 కోట్లకి పెరిగిందనీ, 2009 ఆర్ధిక సంక్షోభం దీనిని మరో 4 కోట్లు పెంచొచ్చని అంచనా వేసింది.అంటే ప్రపంచమంతటా ఆకలిబారిన పడేవారి సంఖ్య 100 కోట్ల వరకు చేరిందని అర్ధం (ప్రపంచ జనాభా సుమారు 600కోట్లు!).

ఇంకా ఉండొచ్చు!

ఆహార ధాన్యాల ధరలు పెరిగితే పేదలకు ఆహార లభ్యత తగ్గుతుందన్న సూత్రీకరణ ఆధారంగా ఈగణాంకాలు రూపొందుతాయి.ధరల ప్రాతిపధికగాగణించే ఈ లెక్కలు పరిస్థితి తీవ్రతను తక్కువగా చేసి చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్టులో గత మూడేళ్ళుగా మూడు రెట్లు పెరిగిన గోధుమ, బియ్యం ధరలు ఈ సంవత్సరం (2009) కొద్దిగా తగ్గాయి. అయితే ఆసియా దేశాలలో వీటి ధరలు పెరిగాయి. అందువల్ల దారిద్ర్యంలోకి నెట్టబడిన లక్షలాది మంది పై నివేదికల గణాంకాల్లో చేరరు.
2007గాను రికార్డు స్థాయిలో 230 కోట్ల టన్నుల ఆహర ధాన్యాలు పండాయి. అంతకు ముందు ఏడాది కంటే ఇది 4 శాతం అధికం. 2008లో ఇది మరో 2 శాతం పెరిగింది. ఈ ఏడాది ఆహారధ్యాన్యాల దిగుబడి కనీసం గత ఏడాది స్థాయిలో ఉండగలదని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా, 1961 నుంచి నేటి వరకు ఆహారధాన్యాల దిగుబడి మూడు రెట్లు పెరగ్గా, జనాభా మాత్రం రెట్టింపు మాత్రమే పెరిగింది. దీన్నిబట్టి తెలిసేదేమిటంటే ప్రపంచ ప్రజలందరి కడుపు నింపగల ఆహార ధాన్యాలున్నాయి. అయితే ఇవి అందాల్సిన వారికిఅందకపోవడం వల్లే సమస్యంతా.

కారణాలు - కథలు, కాకరకాయలు

ప్రపంచంలో ఆకలి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంపై కల్లబొల్లి కారణాలు చెబుతున్నారు - కరువు, వరదలు వంటి సమస్యలతో పంటలు దెబ్బతినటం, భారత్, చైనాలలోని ప్రజలు ఇదివరకటి కంటే ఎక్కువ తినటం వగైరా; సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఫలితంగా వెనుకబడిన దేశాల ప్రజల ఆధాయాలు పెరిగినందున, వారెక్కువ ఆహారధన్యాలు వినియోగించుకుంటున్నారన్నదివాదన (2008 చివర్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ చేసినమోసపూరిత వాదన ఇది. దీనికి విరుద్ధంగా ఊబకాయ పీడితులవుతున్న అమెరికన్లు తిండిపోతులన్న అసలు కారణాన్ని విస్మరించారు.) ఈ గణాంకాలునిజమే అయినా ఆకలి, ఆహార ధరలనువివరించే కారణాలు కావని గ్రహించాలి.ధనిక వర్గాల ఆహార వినియోగం పెరిగిందన్నది వాస్తవమే. అయితే రోజురోజుకు పెరిగిపోతున్న ధరల కారణంగా పేదలు తగినంత ఆహారం పొందలేక పోతున్నారన్నది కూడా యధార్థమే. ప్రపంచంలోనే సంపన్న దేశంగా అలరారుతున్న అమెరికాలో సయితం 10శాతం జనాభా అర్ధాకలితో అలమటిస్తున్నారన్నది కూడా వాస్తవమే.

అసలు విషయాలు

ఆహార ధాన్యాల ధరలను, ఆహారభద్రతను ప్రభావితం చేస్తున్న ఒక అంశం జీవ ఇంధన ఉత్పత్తి కొరకు సారవంతమైన భూములను వినియోగించడం. మొక్కజొన్న నుండి తయారు చేసేబయో డీజిల్ వాడకం ద్వారా బొగ్గు, పెట్రోలు వంటి భూగర్భ వనరుల వినియోగాన్ని తగ్గించాలనిఅమెరికా, మరియు ముఖ్యంగా యురోపియన్ యూనియన్ దేశాలు తీసుకున్న నిర్ణయంతో సారవంతమైన భూములు ప్రజల ఆహార అవసరాలకు కాక కార్లు నడపడానికి డీజిల్ పండించే భూములుగా మారిపోయాయి. దీనితో ఆహార ధాన్యాల దిగుమతి తగ్గి, ధరలు పెరుగుతున్నాయి.
డెబ్బయవ దశకంలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి రుద్దిన వాణిజ్య సరళీకరణ, వ్యవస్థాగత సర్దుబాట్ల కార్యక్రమాలు పెరిగి పెద్దవయ్యాయి. 90వ దశకంలో వాణిజ్య సంస్థల విధానాలతో, జన్యుమార్పిడి పంటలతో ప్రపంచమంతా ఆకలి సంక్షోభం తీవ్రమయింది.
ఒకమారు హైతీ ఉదంతాన్ని పరిశీలిస్తే పరిస్థితి అర్ధమవుతుంది. దశాబ్దాల క్రిందట వరి పంట సమృద్ధిగా ఉన్న దేశం హైతీ. దిగుమతులపై ఆంక్షలను 1994లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సహాయం అందించి తొలగింప చేసింది. అమెరికా ప్రభుత్వం విపరీతంగా సబ్సిడీ ఇచ్చి చౌక ధరల వరి ఎగుమతులతో హైతీని నింపేసింది. దాంతో లాటిన్ అమెరికాలో అతి చిన్న దేశమైన హైతీలో వరిపంట అదృశ్యమైపోయింది. ఆ తరువాత అక్కడ వరి ధరలు పెరిగిపోయాయి. ప్రజలు కొనలేక విధుల్లోకొచ్చి పోరాటాలకు దిగారు.
ఇదే విధంగా పశ్చిమాఫ్రికాలోని మారిటానియా నుండి బుర్కినాఫాసో వరకు ఉన్న దేశాలలో వరిపంట నాశానమైపోయి ప్రజలు వీధుల్లోకొచ్చి ఆందోళనలు చేపడుతున్నారు.
అన్నమో రామచంద్రా! అన్నది ప్రపంచంలో వందకోట్ల మంది ఆకలి కేకలు! ఆహారం - ఆకలి అనే ఈ సంక్షోభ స్వభావాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి