23, మార్చి 2011, బుధవారం

అప్పటి జీవితాదర్శాలు నేడు దూరపు స్వప్నాలయ్యాయి


చిన్నప్పుడు నేను లెనిన్ గురించి, సోషలిజం గురించి కథలుగా చదివేవాడిని. అప్పట్లో ఆస్తి సంబంధాల గురించి నాకు ఏమీ తెలియకపోయినా లెనిన్‌లో నాకు హీరో కళ కనిపించేది. 1991లో సోవియట్ యూనియన్ రద్దు చెయ్యబడింది. అప్పట్లో నా వయసు 8 ఏళ్లు. గోర్బచేవ్ ఏమి చేశాడో, సోవియట్ యూనియన్ ఎందుకు రద్దు అయ్యిందో నాకు ఏమీ అర్థం కాలేదు. 1991 తరువాత ప్రైవేట్ ఆస్తి సంపాదించడమే జీవితానికి పరమార్థం అనే భావన ఎగువ తరగతివారిలో బలపడింది. మా అమ్మానాన్నలూ అలాగే అనుకుని నన్ను స్కూల్ చదువులు మీద తప్ప దేని మీదా దృష్టి పెట్టొద్దని చెప్పేవాళ్లు. స్కూల్ పుస్తకాలలో చదివే చదువుల వల్ల సమాజంలో ఏ రకమైన మార్పులూ రావు. అంటరానితనం పాపం అని స్కూల్ పుస్తకాలలో వ్రాస్తారు. ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో చదువుకునే అగ్రకులస్తుల అబ్బాయి దుంపల బడిలో చదివే దళిత విద్యార్థి భుజం మీద చెయ్యి వేసి కలిసి తిరిగితే అతని తల్లితండ్రులు తిడతారు. మన స్టేటస్ ఎక్కడ, వాడి స్టేటస్ ఎక్కడ? అని అడుగుతారు. అంటరానితనంపై ఆర్థిక అసమానతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కులం సెకండరీ విషయం. కేవలం కుల ఆధారిత అంటరానితనం తప్పు అని చెప్పి ఆర్థిక సంబంధాలలో మార్పు తీసుకురాకపోతే అంటరానితనం పోదు అనే విషయం చాలా మంది అగ్రకులస్తులకి తెలుసు. 1970ల టైమ్‌లో అభ్యుదయ సాహిత్యం చదివి చాలా మంది కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవడానికి ముందుకి వచ్చారు. భర్త చనిపోయిన స్త్రీలని పెళ్లి చేసుకోవడానికి కూడా అనేక మంది ముందుకి వచ్చారు. 1990 తరువాత కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునేవాళ సంఖ్య బాగా తగ్గింది. వరకట్నం హత్యలు కూడా పెరిగాయి. డబ్బు, వ్యక్తిగత ఆస్తి సంపాదించడమే పరమార్థం అనుకుని ఆదర్శాలని గాలికి విడిచారు. ఇప్పుడు టివి చానెళ్లన్నీ ప్రజలలో మూఢ నమ్మకాల మత్తు ఎక్కించే భక్తి రస ప్రధాన కార్యక్రమాలు టిలీకాస్ట్ చేస్తున్నాయి. కొన్ని చానెళ్లు కేవలం భక్తి కార్యక్రమాల కోసమే స్థాపించబడ్డాయి. వీటి వల్ల కూడా మతాంతర వివాహాలు చేసుకునేవాళ్ల సంఖ్య తగ్గింది. మొన్న నేను మా మామయ్యతో మాట్లాడుతూ నేను ఒక సైన్స్ చానెల్ పెట్టాలనుకుంటున్నానని చెప్పాను. సైన్స్ చానెల్ ఎంత మంది చూస్తారురా? నువ్వు జాయింట్ వెంచర్‌లో పెట్టాలనుకున్నా అందులో పెట్టుబడులు ఎవరు పెడతారు? సినిమాలూ, ఫామిలీ బ్రాండ్ సీరియళ్లూ టెలీకాస్ట్ చేసే చానెళ్లైతేనే జనం చూస్తారు అని మా మామయ్య అన్నాడు. సైన్స్ చానెల్ పెడితే ఆదాయం ఎక్కువ రాదు. నిజమే. కానీ మనిషికి డబ్బు సంపాదించడమే ప్రధానమా? సామాజిక బాధ్యత అవసరం లేదా? అని అడిగాను. మనవాళ్లకి రొమాంటిక్ సినిమాలు, మూఢనమ్మకాలు మీద ఉన్న ఇంటరెస్ట్ సామాజిక ప్రగతి మీద లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి