21, జనవరి 2011, శుక్రవారం

అపురూపమైన కల....



నడిరాతిరి నిదురలో ఎన్నెన్నో కలలు....
కలలు అలలై చెలియలిగట్టు దాటుతుంటే...
ఉలిక్కిపడిన రెప్పలమాటున ...
నిద్రాదేవి వీడ్కోలు తీసుకుంటే....
అరమోడ్పున విచ్చుకున్న ఆ నేత్రద్వయం,
స్వప్నలోకం విడిచి రాలేమంటే....
వాస్తవంలో కాలం  కలై కరిగిపోతుంటే...
అసంపూర్తి స్వప్నం వెలవెలబోతుంటే....
అది చూసి చలించిన మనసు,
అపురూపమైన ఆ కలను తనలో నిక్షిప్తంచేసి..
చీకటి అంచులకి మెరుపుల జిలుగులు అద్ది...
రంగుల కుంచెతో దాన్ని పరిపూర్ణం చేస్తుంటే...
తన స్థానంలో కలకి ప్రాణం పోస్తున్న మనసుని చూసి
మురిసిపోయిన నిద్రాదేవి......
ఆప్యాయంగా కళ్ళను ముద్దిడుతున్నవేళ...
తొలి తూరుపు కిరణం నేల తాకిన వేళ....
మాగన్నుగా నిద్ర పట్టింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి